Home » Latest News » తిరుమలపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు


తిరుమల తిరుపతి దేవస్థానం సోషల్ మీడియాలో తిరుమలపై తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించకూడదని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిన టీటీడీ ఇప్పుడు ఇక యాక్షన్ లోకి దిగింది. టీటీడీ ఫిర్యాదు మేరకు తిరుమలపై విష ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ చానెళ్లపై శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పోలీసులు కేసు నమోదు చేశారు. 

ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయమర్యాదల మేరకు టీటీడీ శ్రీవారిదర్శనం చేయించింది. అయితే ఆయనకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో అలా అవాస్తవాలు ప్రచారం చేసి టీటీడీ ప్రతిష్ఠ మసకబార్చేందుకు ప్రయత్నించిన మూడు యూట్యూబ్ చానెళ్లపై టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విభీషన్ ఎస్వీయూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.