|
|
.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాలేదు. నోటీసుల మేరకు ఆయన నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో శనివారం (జులై 26) ఉదయం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే విచారించారు. అంతే కాదు ఇదే కేసులో వైసీపీ నాయకులు అనురూప రెడ్డి, హరిప్రసాద్, పచ్చిపాల రాధాకృష్ణ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఏ1గా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు కానీ అరెస్టు చేయలేదు. విచారణ తరువాత కూడా ప్రసన్నకుమార్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ మీడియా ముందు చెప్పారు. ఏ1నే విచారించి వదిలేశారు కనుక.. అనిల్ కుమార్ యాదవ్ ను విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.
మరి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా ఎందుకు కొట్టినట్లు. అంతే కాదు పోలీసులకే కాదు, ఎవరికీ అందు బాటులో లేకుండా అజ్ణాతంలోకి ఎందుకు వెళ్లిపోయారు? అసలెందుకు అంతగా భయపడుతున్నారు? అక్రమమైనింగ్ కేసులో తనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న భయంతోనే అనీల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారా? ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో మరో మాజీ మంత్రి కాకాణి అరెస్టయ్యారు. అంతే కాదు.. అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో అనిల్ కుమార్ యాదవ్ పేరు బయటపెట్టారు. శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో ఆయన ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు భయం లేకున్నా విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లిపోయారని పరిశీలకులు అంటున్నారు.
జగన్ హయాంలోముందు వెనుకలు ఆలోచించకుండా ఇష్టారీతిన మాట్లాడి, తొడకొట్టి, మీసం మెలేసి మరీ సవాళ్లు చేసిన అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్థులను దూషించడమే రాజకీయం అన్నట్లుగా వ్యవహరించారు. అయితే వైసీపీ పరాజయం తరువాత నోరెత్తి మాట్లాడటానికే భయపడుతున్నట్లుగా వ్యవహరించారు. జగన్ హయాంలో ఇదే అనిల్ కుమార్ యాదవ్ స్థాయి, సభ్యత కూడా మరిచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.
అంతేనా నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీకి కూడా యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసిందంటే ఆయన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉండేవో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు అవే అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ కేసులలో అరెస్టు భయంతో మరోసారి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు పరిశీలకులు.