Home » Politics » జగన్ హస్తిన పర్యటన అందుకేనా?


వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు సమాయత్తమౌతున్నారు.  కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అవ్వాలని భావిస్తున్నారు. నేడో, రేపో ఆయన హస్తినయానం ఉంటుందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో ఆయన బీజేపీ పెద్దలతో కూడా భేటీ అవుతారని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీల నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. మధ్యం కుంభకోణం కేసు దర్యాప్తు జోరందుకుని తాడేపల్లి లింకులను బయటపెట్టే దిశగా సాగుతుండటంతో ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే హస్తిన పెద్దల మద్దతు అవసరమని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హఠాత్తుగా హస్తిన పర్యటన పెట్టుకుని అక్కడ వారి మద్దతు కూడగట్టాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  

ఔను ప్రస్తుతం మద్యం కుంభకోణం విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను సిట్ అరెస్టు చేసింది.  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీలో గాభరా కనిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటుందన్న ఆందోళనా ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. ఈ కేసులో జగన్ అరెస్టు ఖాయమన్న ప్రజారం కూడా జోరుగా సాగుతోంది. జగన్ కూడా తన అరెస్టు అనివార్యమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సందర్భం, సమయంతో సంబంధం లేకుండా తానేమీ పారిపోవడం లేదనీ, దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చనీ సవాళ్లు విసురుతున్నారు. ఇక మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ జగన్ అరెస్టు అవుతారన్న సంకేతాలు ఇచ్చారు.  అరెస్టు ఎటూ ఖాయమైనప్పుడు పొలిటికల్ మైలేజ్ వచ్చేలా దానిని మలచుకోవాలన్న వ్యూహంతోనే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన పెట్టుకున్నారని చెబుతున్నారు. 

ఇక అరెస్టు అయినా రాజకీయంగా తనకు, పార్టీకీ లబ్ధి చేకూరేలా ఏం చేయాలన్న విషయంలో జగన్, వైసీపీ నేతలూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలోనే హస్తినలో కేంద్ర పెద్దలు, బీజేపీ, కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలను కలిసి తనకు వ్యతిరేకంగా ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని చెప్పుకుని మద్దతు కూడగట్టే వ్యూహాన్ని జగన్ ఖారారు చేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.