జీర్ణవ్యవస్థ

ఆహరం ప్రయాణించే మార్గాన్నీ, శరీరం లోనికి విలీనమయ్యే విధానాన్నీ జీర్ణవ్యవస్థగా చెప్పవచ్చు, ఆయుర్వేదం ఈ మార్గాన్ని 'బృహదాంత్రం' అంటుంది. ఆహారాన్ని నోటిలో ఉంచుకున్న మరుక్షణం నుంచి జీర్ణక్రియ లేదా పచనక్రమం మొదలవుతుంది. మనం తినే ఆహారమూ, తాగే ద్రవపదార్ధాలు, అన్న నాళిక ద్వారా అమాశయం లోనికి, అక్కడ నుంచి చిన్న పేగు ద్వారా పెద్ద పేగు లోనికి, అక్కడ నుంచి మలాశయం ద్వారా బయటకు వివిధ రూపాల్లో ప్రయాణిస్తాయి. లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం తదితర అంతర్గత గ్రంథులు జఠర రసాలను విడుదల చేస్తాయి. ఇవి ఆహార పదార్ధాలతో కలిసిపోయి ఆహారం సూక్ష్మాంశాలుగా విభజన చెందదానికిం శరీరంలోనికి విలీనమావ్వడానికి దోహద పడతాయి. పేగుల్లో జనించే కదలికల (పెరిస్టాల్సిస్) వల్ల ఆహారమూ, వ్యర్థ పదార్థాలూ ముందుకు ప్రయాణించగలుగుతాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అంగ ప్రత్యంగాల్లో సమస్య తలెత్తినప్పుడు నొప్పి తదితర లక్షణాలు ఉత్పన్నమవుతాయి. ఈ లక్షణాలు ఆహార పచనంతో సంబంధం లేకుండానే కనిపించవచ్చు, లేదా, పచన క్రమాన్ని దెబ్బతీయవచ్చు. జీర్ణప్రక్రియ దెబ్బతింటే బరువు తగ్గటం, చర్మం పాలిపోవడం, బడలిక, విరేచనాల వంటిని కనిపిస్తాయి. ఈ విధంగా ఆహారం పచనక్రమానికి సంబంధించిన సమస్యలనూ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అంగప్రత్యంగాల సమస్యలనూ చర్చిస్తుంది.

 

ఒకరింతలూ, వాంతులు

1. భోజనం చేసిన తరువాత హఠాత్తుగా వాంతులు మొదలయ్యాయా?

ఆహారం విషతుల్యమవడం (ఫుడ్పాయిజనింగ్)

2. మీతో పాటు, మీ చుట్టూ ప్రక్కల వారిలో వాంతులు, విరేచనాలు కనిపిస్తున్నాయా?

కలరా (గ్యాస్ట్రోఎంటిరైటిస్)

3. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రమే వాంతులవుతాయా?

ప్రయాణంలో వాంతులు (ట్రావెల్ సిక్ నెస్)

4. మీరు స్త్రీ అయితే - ఇప్పుడు మీరు గర్భంతో ఉన్నారా? గర్భిణీవాంతులు

5. ఎక్కువగా సిగరెట్లు కాలుస్తారా?

ధూమాపాన దుష్పలితం

6. వాంతులతో పాటు తలను చీల్చుతున్నంత స్థాయిలో తలనొప్పి వస్తూ ఉంటుందా?

మైగ్రేన్ తలనొప్పి

7. ముక్కు దిబ్బడగా ఉంటుందా? దీని వలన శ్లేష్మాన్ని మింగుతూ ఉంటారా?

సైనాసైటిస్

8. వాంతులతో పాటు కడుపు నొప్పి వస్తూ ఉంటుందా?

జీర్ణశయ సమస్యలు

9. చెవులలో గుయ్ మనే శబ్దాలు వినిపిస్తాయా? లేక అసలు ఏ శబ్దమూ వినిపించదా?

కర్ణనాదం (టినిటన్)

10. మీకు ఈ మధ్య జలుబు చేసిందా?

చెవి అంతర్నిర్మాణాలు వ్యాధిగ్రస్తమవడం

11. ఏమన్నా ఆల్లోపతి మందులను వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

12. మీరు స్త్రీలైతే - గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా?

సంతాన నిరోధకాలతో ఇక్కట్లు

13. బరువు తగ్గటం, త్వరగా అలసిపోవటాలు ఉన్నాయా?

అంతః స్రావీగ్రంథుల సమస్యలు (హార్మోనల్ డిజార్డర్స్)

14. పాలిపోయినట్లు కనిపిస్తారు?

మూత్రపిండాలు, కాలేయపు వ్యాధులు

15. ఎప్పుడూ ఆందోళనగా, ఆరాటంగా అనిపిస్తుందా?

మానసిక దోషాలు

 

మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో కడుపులో వికారంగా ఉన్నట్లూ, నోట్లో నీరూరుతునట్లు, వాంతి రాబోతున్నట్లు అనిపిస్తూనే ఉంటుంది. కొన్ని అహితకరాలైన పదార్థాలు రక్తం ద్వారా మెదడును చేరి ఈ కేంద్రాన్ని ప్రభావితం చేస్తాయి. పర్యవసానంగా ఉదర కండరాలు, అన్ననాళికలు ముడుచుకుని వాంతిని కలిగిస్తాయి. అంతే కాకుండా, అన్నవాహికలో చేరిన పదార్థాలు సరిపోకపోవడం వలన కూడా స్వయం రక్షణ చర్యగా- వాటిని బైటకు నెట్టివేసే ప్రయత్నంలో వాంతి కావచ్చు. నోట్లో నీళ్ళూ రావడానికి, లేదా వాంతులవడానికి ఎన్నో రకాల కారణాలు దోహదపడతాయి. వాటిల్లో ముఖ్యమైనవి:

1. ఆహారం విషతుల్యమవడం (ఫుడ్ ఫాయిజనింగ్) కలుషితాహారం తీసుకోవటం వలన కొంతమందికి వాంతులవుతాయి. ఆహారం తీసుకున్న తరువాత ఎంత సేపటికి వాంతులు మొదలవుతాయనేది - ఆ పదార్ధం ఏ స్థాయిలో విషతుల్యమైందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వాంతులు భోజనం చేసిన తరువాత రెండు మూడు గంటలకు మొదలవుతాయి. ఒక్కొక్కసారి వాంతులు మొదలవడానికి ఇరవై నాలుగు గంటలు కూడా పట్టవచ్చు.

 

ఒకేసారి కుటుంబసభ్యులంతా అస్వస్థులైనప్పుడు, లేదా హాస్టళ్లలో పిల్లలందరికీ ఒకేసారి వాంతులు మొదలైనప్పుడు ఆహారం కలుషితమైనట్లుగా భావించాలి. ఇలాంటప్పుడు నోట్లో నీళ్ళు ఊరడం, వాంతులవడంతోపాటు కడుపులో నొప్పి కూడా ఉండే అవకాశం ఉంది.

ప్రమాదాన్ని కలిగించే సూక్ష్మక్రిములు, విషపదార్ధాల వంటివి అమాశయంలోనికి చేరుకున్నప్పుడు శరీరం వాటిని వాంతి రూపంలో బైటకు నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి, కలుషితాహార సేవన వలన వంతులవుతున్నప్పుడు వాటిని మందుల ద్వారా తొక్కిపట్టాలని చూడకూడదు. వాంతులతో పాటు బైటకు వెళ్ళిపోయే ద్రవాంశాలనూ, లవణాలనూ భర్తీ చేయడానికి ప్రయత్నించాలి. ఫుడ్ పాయిజనింగ్ లో సాధారణంగా వాంతులతో పాటు విరేచనాలు కూడా ఉంటాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే శుభ్రమైన నీటినే ఉపయోగించాలి. పండ్లను, కూరగాయలను తినేముందు బాగా కడగాలి. మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. నిల్వ ఉంచిన పదార్థాలను తినకూడదు. టీ, బియ్యం కడుగునీళ్ళు, చికెన్ సూప్, చిక్కుళ్ళ సూప్, తియ్యటి పానీయాలు తీసుకోవచ్చు, పిల్లల్లో తల్లిపాలు ఆపకూదు. మిగలపండిన అరటి, బొప్పాయిలను, మెత్తగా ఉడికించిన అన్నాన్ని తినవచ్చు.

 

గృహచికిత్సలు: ఒక లీటరు నీళ్లు (కూల్ డ్రింక్ పెట్ బాటిల్ తో కొలవండి. లేదా మూడు పెద్దగ్లాసులు తెసుకోండి). మరగ కాచి చల్లార్చండి. డానికి తేనె లేదా పంచదారను (2 పెద్ద చెంచాలు) ఉప్పునూ (చిన్న చెంచాలో పావుభాగం), వంట సోడాను (చిన్న చెంచాలో అరభాగం), నారింజ రసాన్ని (అరకప్పు), నిమ్మరసాన్ని (పెద్ద చెంచాడు) కలపండి. ఈ పానీయాన్ని ప్రతి ఐదు నిమిషాలకు కొన్ని గుక్కల చొప్పున మూత్రం వచ్చేంతవరకు తాగుతుండాలి. ఇది పెద్దవారికి రోజుకు 3 లీటర్లు అవసరమౌతుంది. చిన్న పిల్లలకు రోజుకు 1 లీటరు సరిపోతుంది.

ఔషధాలు: లశునాదివటి, బిల్వాది చూర్ణం, దాడిమావలేహ్యం, మహాగందక రసం.

2. కలరా (గ్యాస్ట్రోఎంటిరైటిస్) గ్యాస్ట్రో - ఎంటిరైటిస్ అనే వ్యాధి ఒక రకమైన వైరస్ వలన సంక్రమిస్తుంది. వాంతులు, విరేచనాలు ఈ వ్యాధిలో ప్రధాన లక్షణాలు, ఈ వ్యాధి మూకుమ్మడిగా వ్యాపిస్తుంది కాబట్టి ప్రజలు ప్రాంతాల వారీగా దీని బారిన పడుతుంటారు. ఈ వ్యాధిలో మందులు వాడటం కంటే కోల్పోయిన ద్రవాలను, లవణాలను భర్తీ చేయడం ముఖ్యం.

ఔషధాలు: కర్పూరాది వటి, సంజేవనీ వటి, కుటజఘటి వటి.

 

3. ప్రయాణంలో వాంతులు (ట్రావెల్ సిక్ నెస్) కొంతమంది ప్రయాణమంటే చాలు - దాంట్లో అవబోయే వాంతులను తలచుకుని డీలా పడిపోతారు. ప్రయాణంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసే యంత్రాంగంలో లోపం ఏర్పడటం దీనికి ప్రధాన కారణం.

 

దవడ ఎముకల లోపల, చెవినుంచి మెదడుకు శబ్ద సమాచారం చేరేచోట, రెండు వైపులా మూడు అర్ధ చంద్రాకారపు నిర్మాణాలుంటాయి. ఇవి ద్రవ పదార్థంతో నిండి ఉంటాయి. మనం తల త్రిప్పిన ప్రతిసారి ఈ నిర్మాణాలలో ఉండే సూక్ష్మరోమాలు ప్రేరేపితమవుతాయి. శరీరపు స్థితి, సమతూకాలు అదుపు తప్పినప్పుడల్లా ఇవి స్పందిస్తూ శరీరాన్ని సక్రమమైన స్థితిలో 'బ్యాలెన్స్ డ్ గా ఉంచుతాయి. ఈ సూక్ష్మ రోమాలు ఎక్కువగా ప్రేరేపితమైనప్పుడు కడుపులో వికారం మొదలై, వాంతి అవుతుంది. ఇలా ఎక్కువగా ప్రయాణాలలోనే జరుగుతుంది.

సూచనలు: ప్రయాణంలో వాంతులవుతున్నప్పుడు గాలిని బలంగా తీసుకుని వదలడం, అటూ ఇటూ తిరగడం, తలను వెనక్కు వాల్చి కూర్చోవడం చేయాలి. దూరంగా కనిపించే కొండలూ, చెట్లు వంటి స్థిర దృశ్యాలమీద చూపును నిలపాలి. ప్రయాణానికి ముందు ఘనాహారాన్నీ, నూనె పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. అవసరమనుకుంటే చల్లటి ద్రవాహారాలను తీసుకోవచ్చు.

గృహచికిత్సలు: ఈ సమస్యకు శొంఠిపొడి, చక్కని జవాబు. ప్రయాణానికి ముందు ఒక గ్రాము మొతాదుగా శొంఠిపొడిని తేనెతో గాని, కాషాయం రూపంలోగాని తీసుకోవాలి.

 

4. గర్భిణి వాంతులు: గర్భం ధరించిన మొదటి పదహారు వారాలలో నోటిలో నీళ్ళూరడం, వాంతులు కావడం, మామూలే. అయితే ఇవే వాంతులు ఒకోసారి తల్లికి, పిండానికి ప్రమాదాన్ని కలిగించేంత వరకు పోవచ్చు. గర్భం ధరించిన తొలినాళ్లలో పిండం రూపుదిద్దుకునే దశలో ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మందుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. అయితే కొన్ని మందులను గర్భధారణ సమయంలో కూడా నిరపాయకరమైనవిగా గుర్తించడం జరిగింది. అవసరమనుకుంటే ఆ మందులను డాక్టర్ల పర్యవేక్షణలోవాడవచ్చు. గర్భధారణ సమయంలో వాంతులవుతున్నప్పుడు ఆహారంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసుకుంటే సరిపోతుంది.

ఔషధాలు: మాదీఫల రసాయనం, గర్భపాలరసం.


5. ధూమపాన దుష్పలితం: ధూమపానం వలన రెండు రకాలుగా వాంతులయ్యే అవకాశం ఉంది. ఒకటి - సిగరెట్టు నేరుగా మెదడులో ఉండే వామక కేంద్రాన్ని ప్రేరేపించడం వలన, రెండు - జీర్ణాశయంలోపల పొరలు రేగడం వలన అంటే, ఆమాశయంలో ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా జరిగి వాంతులు అవుతాయన్న మాట.

స్మోకింగ్ అనేది వాంతులకూ, లాలాస్రావాధిక్యతకూ కారణమవుతున్నప్పుడు దానిని మానేయడం తప్ప వేరే మార్గం లేదు.

 

6. మైగ్రేన్ తలనొప్పి: మైగ్రేన్ తలనొప్పిలలో మొదటి ఒక ప్రక్క కన్ను మసక మసకగా అనిపించి, అదే వైపు తలనొప్పి ప్రారంభమవుతుంది. ఇది పెరిగిపోయి వాంతికి దారి తీస్తుంది.

మానసిక ఒత్తిడి, కోపం, ఉక్రోషం, డిప్రెషన్ వంటివి మైగ్రేన్ తలనొప్పిని ఎక్కువ చేస్తాయి. ఉద్వేగం, అతిగా విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా ఇది వస్తుంది. ఘాటు నాసనలు, పొగాకు పొగ, వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు, మిరుమిట్లుగొలిపే కాంతి, సముద్రమట్టాన్ని దాడి బాగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడం, ప్రయాణాలు, నిద్రలేకపోవడం, ఆకలివంటివి మైగ్రేన్ ని ఎక్కువ చేస్తాయి, ఆడవారిలో బహిష్టు స్రావాలు, గర్భనిరోధక మాత్రలు గర్భధారణ, రజోనివృత్తి (మొనోపాజ్) వంటివి మైగ్రేన్ ను తీవ్రతరం చేస్తాయి. ఆహారాలో బీర్, వైన్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వెన్న, పెరుగు, పులిసిన పదార్థాలు, చైనీస్ ఫుడ్, ఉల్లిపాయలు, చిక్కుళ్ళు, వేరుశెనగ, బ్రెడ్, (ఈస్ట్ ఉంటుంది కాబట్టి) వంటివి కూడా మైగ్రేన్ తలనొప్పిని పెరిగేలా చేస్తాయి. ఇవే కాకుండా రక్తనాళాలను వ్యాకోచపరిచే మందులు కూడా మైగ్రేన్ ను తీవ్రతరం చేస్తాయి.కనుక మైగ్రేన్ తో బాధపడేవారు ఈ కారణాలన్నింటిని తగ్గించుకోవాలి. దీనిని ఆయుర్వేదం నిదాన పరివర్జనం అంటుంది. మైగ్రేయిన్ తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు మందులతో పాటు శిరోవస్తి, శిరోధార, పంచకర్మ చికిత్సా పద్ధతులను ఆచరించవలసి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. పొద్దుతిరుగుడు గింజల పేస్టును నుదురుమీద రాసుకోవాలి.

2. సూర్యోదయానికి ముందు వెల్లుల్లి రసాన్ని, తుమ్మి మొక్క రసాన్ని రెండేసి చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాల్లో వేసుకోవాలి.

3. మునగాకు రసాన్ని రెండేసి చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్ గా వేసుకోవాలి.

ఔషధాలు: అశ్వగంధ చూర్ణం, ధన్వంతర గుటిక, గోరోచనాది గుటిక, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మహాసూర్యావర్తి రసం, సూర్యావర్తి రసం, క్షీరబాలా తైలం (101 అవర్తాలు), వామనామృతం బిళ్లలు, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు.

7. సైనసైటిస్ సైనసైటిస్ వ్యాధిలో వాంతులు కనిపించే అవకాశం ఉంది. ఈ వ్యాధి దీర్ఘకాలికమైనదిగా మారినప్పుడు, ముక్కులోపలి మార్గాలు అవరోధానికి గురికావడం వలన దోషపూరితమైన కషాన్ని కడుపులోనికి మింగవలసి వస్తుంది. ఇది అమాశయపు గోడలకు కల్లోలపరిచి వాంతిని పుట్టిస్తుంది.

గృహచికిత్సలు: 1. తులసి, అల్లం, ఎలక్కాయలు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకుని తాగాలి.

2. వావిలి రసం (పావు;లీటరు), నువ్వుల నూనె మాత్రం మిగులుతుంది. దీనిని రోజువారిగా తలకు రాసుకోవాలి.

3. తుమ్మి ఆకులను (గుప్పెడు), వెల్లుల్లి గర్భాలను (మూడు), ఉప్పును (చిటికెడు) కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ గా నాలుగైదు రోజులు వేసుకోవాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్ధీనీ వటి, చిత్రక హరీతకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహిరసాయనం, మహాయోగరాజు గుగ్గులు, నవక గుగ్గులు, నవాయస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజు గుగ్గులు. పైకి వాడాల్సినవి - అసన బిల్వాది తైలం, బలా గుడూచ్యాది తైలం, బలాశ్వగంధాదితైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం.


8. జీర్ణాశయ సమస్యలు: జీర్ణావయవాల్లో ఎక్కడ సమస్య ఉన్నా వాంతులతోపాటు కడుపునొప్పి వస్తుంది. అమాశయపు లోపల పొరలు ఇరిటేట్ కావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మద్యపానం ఈ కారణాలలో మొదటిది, కడుపులో అల్సర్ల వలన కూడా వాంతు కావచ్చు. అలాగే కాలేయం వ్యాధిగ్రస్తమయినప్పుడు కూడా. ఒకోసారి పిత్తాశయం (గాల్ బ్లాడర్) వ్యాధిగ్రస్తమైనప్పుడు, దానిలో రాళ్లు తయారైనప్పుడు వాంతులవుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో వాంతులతో పాటు, కుడి ప్రక్కటేముకల కింద భాగం నొప్పిగా అనిపించవచ్చు. కామెర్లు కూడా కనిపించే అవకాశం ఉంది, ఈ లక్షణాలున్నప్పుడు ఐస్ క్రీములు లేదా ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే, అవి తీసుకున్న రెండు మూడు గంటల తరువాత వాంతులవుతాయి. ఒకోసారి పేగులలోని మార్గం మూసుకుపోయినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది.

సూచనలు: కడుపు నొప్పికి కారణాలను జాగ్రత్తగా శోధించి, తదనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కడుపునొప్పి వస్తున్నప్పుడు కారణాన్ని తెలుసుకోకుండా ఎప్పుడు మందులు వాడకూడదు.

 

9. కర్ణనాదం (టినిటస్) అభ్యంతర కర్ణం వ్యాధి గ్రస్తమైనప్పుడు తల తిరిగినట్లుండటం, చెవిలో 'నాదం' వినిపించడం, వినికిడి శక్తి క్షీణించడం, వాంతులు కావడం ఇవన్నీ ఒక లక్షణ సమూహంగా బాధిస్తూ ఉంటాయి, వైద్య పరిభాషలో దీనిని 'మీనియర్స్ వ్యాధి' అంటారు. లక్షణ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ పొగ తాగే అలవాటుంటే మానేయాలి. కనీసం ఏడాదిపాటు నిల్వ ఉంచిన నెయ్యిని (పురాణ ఘృతం) వైద్య సలహా మేరకు తాగాలి.

ఔషధాలు: మహాలక్ష్మి విలాసరసం, శారిబాదివటి, వామనాఘృతం మాత్రలు.

 

10. చెవి అంతర్నిర్మాణాలు వ్యాధిగ్రస్తమవడం వైరస్ ఇన్ఫెక్షన్ వలన అభ్యంతర కర్ణం లోపల అర్థచంద్రాకారపు నిర్మాణాలు వ్యాధి ప్రభావానికి లోనై (లాబిరిన్ తైటిస్) వాంతులను కలుగచేస్తాయి. పీనసం, చెవి ఇన్ఫెక్షన్లు, మెదడుపొరలకు ఇన్ఫెక్షన్ సోకడం (మెనింజైటిస్) వల్ల ఈ సమస్య వస్తుంది. ఔషధాలు: హరిద్రాఖండయోగ (బృహత్), కస్తూరి భైరవ రసం, మయూరి పింఛ భస్మం.

 

11. మందుల దుష్పలితాలు: క్యాన్సర్ కు వాడే కొన్ని రకాల మందులకు, నొప్పులను తగ్గించుకోవడానికి వాడే కొన్ని రకాల మందులకు, ఇతర రకాలైన మందులు కొన్నింటికి వాంతులను కలిగించే లక్షణం ఉంది. అమాశయపు లోపలి పొరలు ఇరిటేట్ అవడం దీనికి కారణం. మందుల వల్ల వాంతులవుతున్నట్లయితే ఆ విషయం మీ డాక్టర్ తో చర్చించండి.

 

12. సంతాన నిరోధకాలతో ఇక్కట్లు: కొన్ని సార్లు సంతాన నిరోధక మాత్రలను ,మొదలెట్టినతొలి రోజులలో కొంత మందికి వాంతులు, వికారం కలుగవచ్చు, ఇలా జరుగుతుంటే వీటి వాడకం నిలిపేసి మరో ప్రత్యామ్నాయ ,మార్గం చూసుకోవాలి.

 

13. అంతః స్రావీగ్రంథుల సమస్యలు (హార్మోనల్ దిజార్డర్స్) ఈ సమస్యలున్నవారిలో తరచుగా వాంతులు కనిపిస్తుంటాయి. మీకు షుగర్ వ్యాధి వచ్చి ఉండాలి. లేదా మీ ఎడ్రినల్ గ్రంథి పని తీరు మందగించి ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు బక్కపలుచగా, బలహీనంగా కనిపించడమే కాకుండా, లోబీపీతో బాధపడుతూ ఉంటారు. చర్మం ముదురు రంగులోకి మారవచ్చు. వీటితోపాటు వాంతులవుతుండటం సాధారణ విషయం.

మధుమేహం వల్ల వాంతులవుతుంటే ముందు మధుమేహానికి చికిత్స తీసుకుంటే వాంతులనేవి వాటంతట అవే నెమ్మదిస్తాయి. ఇలాగే, మిగతా సమస్యలకు కూడా చికిత్సా చేయాల్సి ఉంటుంది.

 

14. మూత్రపిండాలు, కాలేయపు వ్యాధులు: ఈ వ్యాధుల్లో వాంతులు కనిపిస్తాయి, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులున్నప్పుడు (ముఖ్యంగా దీర్ఘకాలికమైన రీనల్ ఫెయిల్యూర్ లో) ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మీద ప్రభావం పడుతుంది. దీనితో పచన క్రియలో సహపదార్థంగా విడుదలయ్యే యూరియా రక్తంలో ఎక్కువగా సంచితమవుతుంది. చాలా రకాలైన ప్రమాదభరిత స్థితులలో వాంతులవడానికి కారణం - బ్లడ్ యూరియా అసాధారణంగా పెరిగిపోవడమే.

సూచనలు: మూత్ర పిండాలు వ్యాధిగ్రస్తమయినప్పుడు ఉలిమిరి చెట్టు (వరుణ పట్టను డికాక్షన కాచి తాగాలి. కొండపిండి చెట్టు (పాషాణ భేద) వలన కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఔషధాలు: మూత్రపిండాల వ్యాధులు - చంద్ర ప్రభావటి, శిలాజిత్తు, త్రైకాంతఘృతం; కాలేయపు వ్యాధులు - నేల ఉసిరిక, గుంటగలగరాకు, కటుక రోహిణి.

 

15. మానసిక దోషాలు: ఆందోళన, కంగారు వంటివి ఉన్నవారికి వాంతులవడం సర్వ సాధారణం. హఠాత్తుగా చెడు వార్త విన్నప్పుడు గాని, అలాంటి దృశ్యాలను చూసినప్పుడుగాని వీరికి వాంతి అవుతుంది. కలత చెందినప్పుడు ఊరడింపు, ధైర్యం అనేవి చాలా అవసరం. వ్యక్తిత్వ విశ్లేషణ వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వీటితో వాంతులను నిరోధించవచ్చు. ఔషధాలు: మానసమిత్ర వటకం, బ్రాహ్మీవటి, సరస్వతారిష్టం.

సలహాలు: 1. రావిపట్టను ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి. దీనికి ఒక లీటరు నీటిలో కలిపి వడపోసి అరగంటకోసారి తాగుతూ ఉండాలి.

2. కానుగ గింజల్లోని పప్పును కొద్దిగా వేయించి తినాలి.

3. ఎలక్కాయలోని గింజలను చేతిలో వేయించి పొడిచేయాలి. దీనిని చిటికెడంత మోతాదుగా, అరచెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి.

 

4. ఉసిరిపండ్ల రసం (1 కప్పు)లో మంచి గంధం పొడి (1 చెంచాడు) కలిపి తేనె చేర్చి తాగాలి.

5. వరిపేలాలను పిండిచేసి, నెయ్యి, తేనె, పంచదారలు కలిపి తినాలి.

6. మామిడి జీడి, మారేడు గుజ్జులను కషాయం కాచి, తేనె, పంచదారలు కలిపి తాగాలి.