అతి దప్పిక

1. దాహంతోపాటు ఆకలి పెరిగిందా? బరువు కూడా తగ్గుతున్నారా?

మధుమేహం (డయాబెటిస్)

2. దాహం వేయడమనే లక్షణం క్రమక్రమంగా తీవ్రతరమవుతుందా?

అతిమూత్రవ్యాధి

3. దాహం వేయడమనేది హఠాత్తుగా మొదలయ్యిందా?

మానసిక దోషాలు

4. మూత్రపు పరిమాణం మరీ ఎక్కువగా ఉంటోందా?

అతి మూత్ర వ్యాధి, కిడ్నీ వ్యాధులు

5. నీళ్లు తక్కువ తాగుతున్నా, మూత్రం మాత్రం ఎక్కువ మోతాదులో వస్తుందా?

అతిమూత్రవ్యాధి

6. దాహంగా అనిపించడంతోపాటు చూపు మందగించడం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటున్నాయా?

పిట్యుటరీ గ్రంథి సమస్యలు

7. ఈ మధ్య మీకు పక్షవాతం వచ్చిందా? కాళ్లు, చేతులు, మొహం తిమ్మిర్లు పడుతుంటాయా?

మీ నడవడికలో కూడా మార్పు వచ్చిందా?

మెదడు వ్యాధిగ్రస్తమవడం

 

దప్పికను ఆయుర్వేదంలో 'తృష్ణ' అంటారు. అసాధారణ దప్పికను ఆయుర్వేదం ఓ లక్షణంగా కాకుండా, ఒక వ్యాధిగా భావిస్తుంది. మామూలు దప్పికకు, అతి దాహానికి తేడా వుంది. ఉక్కపోతగా ఉన్నప్పుడు, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరం నుంచి ద్రవాంశాలు ఆవిరైపోతాయి కాబట్టి, అలాంటి సందర్భాలలో దప్పిక అనిపించడం సహజం. అలాగే, ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు, ఆహార పదార్థాలు తిన్న తరువాత కూడా దాహం వేస్తుంది. ఇది సహజమే.

ఎప్పుడైనా దాహం అనిపించకపోయినా అలవాటు కొద్ది నీటిని తాగుతుంటారు. మరికొంతమంది వేడిచేసినప్పుడు మూత్రం పోసుకుంటుంటే మంటగా అనిపిస్తున్నప్పుడు మూత్రం గాఢతను బలహీనపరచడం కోసం ఎక్కువ నీళ్ళను తాగుతారు.

ఇక కొంతమంది బరువు తగ్గడానికి నీటిని తాగితే మరికొంత మంది తమ మూత్రాశం లోపల రాళ్ళు ఏర్పడకుండా వుండేందుకు తాగుతారు.

దాహం వేసి తాగుతున్నారా లేక దాహం వేయకుండానే తాగుతున్నారా అనేది ముఖ్యం కాదు; ఒక ఫలితాన్ని ఆశించి మాత్రమే తాగుతున్నారనేది ముఖ్యం. దాహానికి వెనుక, లేదా ఎక్కువగా నీటిని తాగడానికి వెనుక గల ఇలాంటి కారణాలను మనం తేలికగానే ఊహించవచ్చు, అయితే ఒకోసారి దాహానికి వెనుక స్పష్టమైన కారణం ఉన్నట్లుగా కనిపించదు. అలాంటప్పుడు దానిని లోతుగా పరిశీలించడం అవసరం.

శరీరంలో జలీయాంశాల సమతుల్యం

సాధారణంగా మనం కోల్పోయే జలీయాంశాలను (నీరు, తదితరాలను) శరీరం ఎప్పటికప్పుడు భార్తీచేసుకుంటుంది. అందుకే చమట ఎక్కువ పోసినప్పుడు, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసినప్పుడు పర్యవసాన చర్యగా దాహం వేస్తుంది. మనం ఎంత నీటిని కోల్పోతాయో ఇంచుమించుగా అంతే నీటిని తాగుతాము. ఇలా తాగటమనేది దప్పిక తాలూకు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. దీనిని నియంత్రించడానికి కొన్ని రకాల హార్మోన్లు తోడ్పడతాయి. వీటిల్లో లోపం ఏర్పడితే ఎంత నీటిని తాగాలనే దానిమీద నిర్ణయాత్మకమైన జ్ఞానం (జస్టిఫికేషన్) కలుగదు. ఫలితంగా మరీ ఎక్కువగా నీటిని తాగే ప్రమాదం ఉంది. అలాగే అసలేమి తాగాకపోయే అవకాశమూ ఉంది.

ఈ హార్మోన్లలో అతి ముఖ్యమైనదిమూత్రల కర్మను నియంత్రించే వేసోప్రేసిన్. ఇది కిడ్నిల ద్వారా బయటకు వెళ్లి పోయే ద్రవాంశాలను అదుపాజ్ఞల్లో పెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మూత్ర విసర్జకాల (డైయూరిటిక్స్) వల్ల అధికంగా మూత్రానికి వెళ్ళవలసి వస్తుందన్న సంగతి తెలిసిందే. వేసోప్రెసిన్ హార్మోన్ వీటికి సరిగ్గా వ్యతిరేకంగా పనిచేస్తుంది. నిజానికి, ఈ హార్మోను విపత్కర పరిస్థితుల్లో శరీరాన్ని నిర్జలీకరణం (డీహైడ్రేషన్) నుండి రక్షించడం కోసం ఉద్దేశించబడినది. వాతావరణపు ఉష్ణోగ్రత అసాధారణ స్థాయిలో పెరిగిపోయినప్పుడు మనకు తెలియకుండానే శరీరం నుంచి నీరు ఆవిరై పోతుంటుంది. పర్యవసానంగా నీటిని తాగాలనే కోరిక పుడుతుంది, సరిగ్గా, ఇదే సమయంలో కిడ్నీల ద్వారా, శరీరంలోని మిగిలిన నీరు బయటకు వెళ్లిపోకుండా చేసేందుకు వేపోప్రెసిన్ విడుదల అవుతుంది. ఇది మూత్రం తయారవడాన్ని అదుపులో పెడుతుంది. డయాబిటిస్ ఇన్సిపిడస్ అనే బహుమూత్రపు వ్యాధిలో ఈ హార్మోన్ తగ్గుతుంది. అందుకే ఈ వ్యాధిలో ఎక్కువ మోతాదులో మూత్రం తయారవుతుంది. అంతేకాకుండా, మోతాదు పెరిగినందువల్ల, ఎక్కువ మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉండటం సాధ్యం కాదు కాబట్టి చాలాసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మూత్రమార్గం వ్యాధిగ్రస్తమయినప్పుడుగాని, ప్రోస్టేట్ గ్రంథి (మగవాళ్లలో) వాచినప్పుడుగాని మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయవలసి రావచ్చు, అయితే, మూత్రానికి వెళ్లిన ప్రతిసారీ, డయాబిటిస్ ఇన్సిపిడస్ లో మాదిరిగా, హెచ్చు మోతాదులో మూత్ర విసర్జన చేయవలసిన స్థితి వుండకపోవచ్చు.

ఒకోసారి రక్తంలో వేసోప్రెసిన్ మాములుగానే ఉన్నప్పటికీ, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రం ఎక్కువ మోతాదులో వెళ్లిపోతుంటుంది.

మధుమేహ వ్యాధిలో దప్పికను మరో కోణం నుంచి చూడవలసి వుంటుంది. మధుమేహం రక్తంలో ఇన్సులిన్ హార్మోను లేక పోవడం వల్లనో, తగ్గటం వల్లనో వస్తుందన్న సంగతి తెలిసిందే. అలాగే, ఇన్సులిన్ రక్తంలోని చక్కెర మోతాదును నియంత్రిస్తుందన్న సంగతి కూడా తెలిసిందే. అంటే, రక్తంలో ఇన్సులిన్ తగ్గినప్పుడు చక్కర పెరిగిపోతుందన్న మాట. ఇలా చక్కెర పెరిగినప్పుడు రక్తంలో గాఢత పెరుగుతుంది. పర్యవసానంగా కణజాలాలు నీటికోసం పరితపించిపోతాయి. అదే దప్పిక...

ఇంతకీ చెప్పేదేమంటే, దప్పిక వేయడానికి చాలా రకాల కారణాలు ఉంటాయని. మీ విషయంలో, దప్పికకు వెనుక గల కారణం ఏమై వుంటుందనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ విషయాలు సహాయపడతాయి.

1. మధుమేహం (డయాబెటిస్):

దాహంతో పాటు ఆకలిపెరగడం అనే లక్షణాలు ప్రధానంగా మధుమేహానికి సంబంధించినవి. వీటితోపాటు చర్మం పైన తరచుగా గడ్డలు తయారవ్వడం, జననేంద్రియాల వద్ద దురదగా అనిపించడం, నీరసం వంటివి కూడా కనిపించవచ్చు. మధుమేహజనిత దప్పికలో ఆహారం ద్వారా, మందుల ద్వారా డయాబెటిస్ ని అదుపులో వుంచుకున్నంతకాలం దప్పికతో బాధపడవలసిన అవసరం రాదు.

గృహచికిత్సలు : 1. ఉసిరికాయరసం (అరకప్పు), పచ్చి పసుపు కొమ్ముల రసం (అరకప్పు) కలిపి రోజు మూడుపూటలా తాగాలి. తాజావి దొరకని కాలంలో ఎండినవి తెచ్చి పొడిచేసి అరచెంచాడు మోతాదుగ మూడుపూటలా నీళ్ళతో తీసుకోవాలి. 2. నేరేడు గింజల చూర్ణాన్ని (అరచెంచాడు) రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 3. పొడపత్రి ఆకు చూర్ణాన్ని చెంచాడు వంతున రోజు మూడుపూటలా నీళ్లతో తీసుకోవాలి. 4. శుద్ధిచేసిన శిలాజిత్తు (చిటికెడు), అశ్వగంధ చూర్ణం (అరచెంచాడు) రెండు కలిపి ఒక మోతాదుగా రోజుకు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి. 5. స్వర్ణ మాక్షిక భస్మం (వేరుశనగ గింజంత) అశ్వగంధ చూర్ణం (అరచెంచాడు) రెండు కలిపి నీళ్ళతో రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 6. నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరి కాయ పెచ్చులు, నేల వేము, మెంతులు వీటిని సమతూకంలో తీసుకొని పొడిచేసి అన్నిటినీ ఒకటిగా కలపాలి. ఈ పొడిని చెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు ఆహారానికి ముందు తీసుకోవాలి.

ఔషధాలు: తారకేశ్వరరసం, వసంత కుసుమాకర రసం, శిలాజిత్వాదివటి, మామేజ్జకఘనవటి, చంద్రప్రభావటి, త్రివంగ భస్మం.

2. అతిమూత్రం వ్యాధి:

దాహం వేయడమనే లక్షణం క్రమంగా పెరుగుతుంటే దానిని వేసోప్రేసిన్ హార్మోను లోపం మూలంగా వచ్చిన అతిమూత్ర వ్యాధిగా భావించాలి. వేసోప్రెసిన్ మెదడులోని ఒకానొక భాగం తయారుచేస్తుంది. ఈ భాగం మీద ట్యూమర్స్ వంటివి వత్తిడిని కలుజేస్తుంటే ఈ లక్షణాలు రానురాను తీవ్రతరమవుతుంటాయి. బహుమూత్ర వేసోప్రెసిన్ అల్పత్వానికి గల కారణాలను క్షుణ్ణంగా శోధించి తదనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

గృహచికిత్సలు: త్రిఫలాలైన కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలనూ, వెదురాకు, తుంగ గడ్డలు అన్నిటినీ సమతూకంలో తీసుకుని కషాయం కాచి, పూటకు అరకప్పు వంతున రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.

ఔషధాలు: తారకేశ్వరరసం, ఆనంద భైరవీరసం

3. మానసిక దోషాలు:
హఠాత్తుగా దాహం వేయడం మొదలైతే దాని వెనుక శారీరక కారణం కాకుండా ఏదన్నా బలమైన మానసిక కారణం వుండే అవకాశం ఉంది. అవసరం కోసం కాకుండా, అలవాటుగా నీటిని తాగే లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనబడుతుంది.

మానసిక కారణాల వల్ల పిల్లలుగాని పెద్దలుగాని నీళ్లేక్కువగా తగుతున్నట్లయితే వ్యక్తిత్వ విశ్లేషణతో సమస్యనుకనుగొని పరిష్కరించవలసి వుంటుంది.

చికిత్సలు: బ్రాహ్మీవటీ, మానసమిత్ర వటకం, సరస్వతీ లేహ్యం అనే మందులు, ధారాకల్పం, శిరోవస్తి అనే చికిత్సలు ఉపయోగపడతాయి.

4. అతిమూత్ర వ్యాధి, కిడ్నీ వ్యాధులు:

సాధారణ వ్యక్తుల్లో రోజుకు దాదాపు ఐదు లీటర్ల మూత్రం తయారవుతుంటుంది. ఇలాకాకుండా రోజుకుఆరు నుంచి పది లీటర్ల మూత్రాన్ని కనుక విసర్జిస్తున్నట్లయితే కిద్నీలకు సంబంధించిన వ్యాధుల గురించి ముఖ్యంగా డయాబెటిస్ ఇన్సిపిడస్ గా పిలువబడే బహుమూత్రపు వ్యాధి గురించి ఆలోచించవలసి వుంటుంది. అలహే, మధుమేహ వ్యాధి గురించి, కిడ్నీలు ఫేయిలవ్వడం గురించి సమీక్షించవలసి వుంటుంది. వీటిని గుర్తించిన తరువాత కారణానుగునంగా చికిత్స చేస్తే అతిదప్పిక తగ్గుతుంది.

5. అతిమూత్ర వ్యాధి:

నీళ్ళు తక్కువ తాగుతున్నప్పటికీ మూత్రం హెచ్చుమొత్తాల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఇంతకుముందు చెప్పుకున్న డయాబెటిస్ ఇన్సిపిడస్ లో (అతిమూత్ర వ్యాధి) వుంటుంది.

6. పిట్యూటరీ గ్రంథి సమస్యలు:

దాహంతోపాటు చూపు తగ్గటం, తలనొప్పి అనే లక్షణాలు సాధారణంగా పిట్యూటరీ గ్రంథిలో కంతులు ఏర్పడినప్పుడు కనిపించే అవకాశం వుంది. ఇలాంటి ట్యూమర్ల వల్ల మెదడులో మూత్రాన్ని నియంత్రించే భాగం మీద ఒత్తిడి పడి, శరీర క్రియలో మార్పు వస్తుంది. దీనికి కారణానుగుణమైన చికిత్సలు అవసరమవుతాయి.

7. మెదడు వ్యాధిగ్రస్తమవడం:

పక్షవాతం వల్ల, శరీరపు ఇతర భాగాల్లోని క్యాన్సర్ తలకు వ్యాపించడం వల్ల, ఇలాంటివే మరికొన్ని ఇతర కారణాలవల్ల అధికంగా నీటిని తీసుకోవాల్సి రావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ప్రధాన వ్యాధికి చికిత్స తీసుకోవాలి.

సలహాలు:

1. ఉష్ణోగ్రత, వాంతులూ, విరేచనాలు మొదలైణ వాటివల్ల శరీరం నుంచి నీరెక్కువగా వెళ్లిపోయినప్పుడు ముందుగా దానిని భర్తీ చేయాలి.

2. అతి దప్పికతో బాధపడేవారు నీటిని నాలుగోవంతు మిగిలేటట్లు మరగకాచి తాగుతూ వుండాలి.

3. అప్పుడే పితికిన పాలను ధారోష్టంగా వంద నుంచి అయిదు వందల మిల్లీలీటర్ల వరకు (ఆకలికి అనుగుణంగా) తాగాలి.

4. ధనియాల కషాయం, కొబ్బరినీళ్ళు, ఉసిరికాయ పొడి, మామిడి రసం, నేరేడాకుల రసం, తిప్పతీగ రసం మొదలైన 'తృష్ణా నిగ్రహాల'ను అవసరానుసారం వాడుకోవచ్చు. అలాగే వట్టివెళ్లు, రక్త చందనం, మర్రిచిగుళ్లు, దానిమ్మ, యష్టిమధుకం, శొంఠి మొదలైన వాటిని కూడా తీవ్రమయిన దప్పికలో ఉపశమనం కోసం వాడవచ్చు.

ఔషధాలు: జంబీర పానకం, గుడూచీ సత్వం, సూతశేఖరరసం, ప్రవాళ పిష్టి, ఆమలకీ.