స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..!

ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే..

నిర్ణయం, కట్టుబడి ఉండటం..

ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది.

కొత్త అలవాట్లు..

ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.

వైద్య సహాయం..

స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు.

4-డి సూత్రం..

"4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.  

స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.

 

                                    *రూపశ్రీ.