
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది. సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది. నిజానికి ఆయుర్వేదం అనేది వైద్య విదానంలా కాకుండా అది మనిషి జీవన విదానంలా చక్కగా కలిసిపోతుంది. మనిసి శరీరం గురించి, ఆరోగ్యం గురించి ఆయుర్వేదం ఎంతో గొప్పగా, మరెంతో లోతుగా, అదే విదంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఆయుర్వేదంలో ఉన్న రెండు శ్లోకాలు అర్థం చేసుకుంటే శరీరం వ్యాధులకు దూరంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ శ్లోకాలు ఏంటో తెలుసుకుంటే..
శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలే అనేక వ్యాధులకు మూల కారణం. ఉపవాసం, పంచకర్మ వంటి ప్రక్రియలు శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేయడానికి సహాయపడతాయి. నియంత్రణలో ఉండేలా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, , ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని శాస్త్రీయ పరిశోధనలు కూడా చూపిస్తున్నాయి.
ప్రకృతి వైద్యం శరీరం సహజంగా వ్యాధులను తనకు తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది సమతుల్య ఆహారం, యోగా, ధ్యానం, , శరీరం శుద్ది చేసే పద్ధతులను ఉపయోగిస్తుంది. శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి నిజంగా ఆరోగ్యంగా ఉంటాడని ఆయుర్వేదం నమ్ముతుంది.
శ్లోకం..
"లంఘనం పరం ఔషధం" అంటే ఉపవాసమే ఉత్తమమైన ఔషధం.
శరీరాన్ని వ్యాధి రహితంగా ఉంచుకోవాలంటే జంతువుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. అవి అనారోగ్యానికి గురైనప్పుడు తినడం మానేస్తాయి, కానీ మనం అనారోగ్యానికి గురైనప్పుడు అన్నీ తినేస్తుంటాము. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు 2-3 రోజులు ఉపవాసం ఉండటం నేర్చుకుంటే, తీవ్రమైన అనారోగ్యం వచ్చే ప్రమాదాన్ని కూడా తొలగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటే కణితులు, గుండె సమస్యలు, ఫైబ్రాయిడ్ల వంటి సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావట.
ఆయుర్వేదంలో ఉపవాసాన్ని శరీరం, మనస్సును శుద్ధి చేసే సాధనంగా పరిగణిస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం కాదు, శరీరానికి విశ్రాంతినిచ్చి, జీర్ణవ్యవస్థ తిరిగి క్రియాశీలం కావడానికి సమయం ఇవ్వడం. ఉపవాసం జీర్ణాశయ అగ్నిని బలపరుస్తుంది.
శ్లోకం..
"సర్వేషాం రోగనాం నిదానం కూపిత మల" అంటే అన్ని వ్యాధులకు మూలం కూపిత మలం. శరీరంలోని వాత, పిత్త లేదా కఫ దోషాలు అసమతుల్యమై, కలుషితమైనప్పుడు వ్యాధులు వస్తాయి. దీన్ని తగ్గించడం కోసమే పంచకర్మ చేస్తారు. పంచకర్మ అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక శుద్ది ప్రక్రియ, దీని ముఖ్య ఉద్దేశ్యం శరీరం నుండి విషపదార్థాలను తొలగించి, శరీరాన్ని సమతుల్యం చేయడం. ఇందులో వామన, విరేచన, బస్తి, నస్య , రక్తమోక్షణ వంటి విధానాలు ఉంటాయి. శరీరం నుండి అసమతుల్య దోషాలను తొలగించడం, పేరుకుపోయిన విషపదార్థాలను తీసివేయడం , సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను అందించడం వీటి ప్రధాన లక్ష్యం.
పంచకర్మ విశిష్టత..
శరీరంలో పేరుకుపోయిన 'ఆమ' లేదా విష పదార్థాలు అనేక వ్యాధులకు కారణమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ విష పదార్థాలను తొలగించడంలో పంచకర్మ సహాయపడుతుందని భావిస్తారు. పంచకర్మ తర్వాత చాలా మంది మంచి నిద్ర, తేలికదనం , శక్తిని పొందినట్లు భావిస్తారు.
*రూపశ్రీ.




