మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహాన్ని సాధారణంగా టైప్ 1 , టైప్ 2 అనే రెండు ప్రధాన రకాలుగా చర్చిస్తారు, కానీ  టైప్ 1.5 డయాబెటిస్ గురించి చాలామందికి తెలియదు. లాడా డయాబెటిస్ అంటే.. latent autoimmune diabetes in adult అని అర్థం. ఇది నెమ్మదిగా అభివృద్ది చెందే ఆటోఇమ్యూన్ జబ్బు. 30 ఏళ్లు పైబడిన వారికి వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ తో పోలిస్తే.. 1.5 డయాబెటిస్ వల్ల కలిగే నష్టం నెమ్మదిగా ఉంటుంది. మొదట్లో దీన్ని టైప్ 2 అని పొరబడతారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

 టైప్ 1.5 డయాబెటిస్..

టైప్ 1.5 డయాబెటిస్  లక్షణాలు టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్  లక్షణాలను పోలి ఉంటాయి. ఇది  సాధారణంగా వయోజన దశలో నిర్ధారణ అవుతుంది.  టైప్ 2 డయాబెటిస్ లాగా ఇది కూడా నెమ్మదిగా డవలప్ చెందుతుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ లా కాకుండా, LADA అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి.  దీనిని ఆహార, జీవనశైలి మార్పులతో  నయం చేయలేము. ఎవరికైనా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే,  బరువు , జీవనశైలి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అది నిజానికి టైప్ 1.5 డయాబెటిస్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

టైప్ 1.5 డయాబెటిస్ కారణాలు, నిర్థారణ..

టైప్ 1.5 డయాబెటిస్‌ను అర్థం చేసుకోవాలంటే, అది ఇతర ప్రధాన రకాల డయాబెటిస్‌ల నుండి ఎలా భిన్నంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం.
టైప్ 1 డయాబెటిస్‌ను ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇన్సులిన్‌ను తయారు చేయడంలో శరీరానికి సహాయపడే ప్యాంక్రియాటిక్ బీటా కణాలను మీ  స్వయంగా నాశనం చేసుకోవడం వల్ల ఇది వస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రధానంగా ఇన్సులిన్‌కు శరీరం చూపే నిరోధకత వల్ల వచ్చే సమస్య. ఇలాంటప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు లేదా దానిని సరిగ్గా ఉపయోగించుకోదు.

ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఏర్పడటం వల్ల క్లోమగ్రంథి దెబ్బతినడంతో టైప్ 1.5 మధుమేహం వస్తుంది.  కుటుంబంలో ఎవరికైనా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉంటే, ఈ రకమైన మధుమేహం వచ్చే ప్రమాదం ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. టైప్ 1.5 డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఊబకాయంతో ఉంటే, అది ఇన్సులిన్ నిరోధకతకు కూడా దారితీయవచ్చు.

దీనిని ఎలా గుర్తించాలి?

టైప్ 1.5 మధుమేహం  లక్షణాలు మొదట్లో అంత స్పష్టంగా ఉండవు. దీని సమస్యలు ఇతర రకాల మధుమేహంలో ఉండే సమస్యల మాదిరిగానే ఉండవచ్చు. అయితే దీనిని ముందుగానే గుర్తించకపోయినా లేదా చికిత్స చేయకుండా వదిలేసినా, అది డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌కు దారితీయవచ్చు. టైప్ 1.5 మధుమేహం తరచుగా టైప్ 2 మధుమేహం మాదిరిగానే సమస్యలను కలిగిస్తుంది.
పదే పదే దాహం ఎక్కువ వేయడం, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, బరువు తగ్గడం.
దృష్టి మసకబారడం , జలదరింపు అనుభూతి వంటి లక్షణాలు ఉంటాయి.

టైప్ 1.5 డయాబెటిస్ ను ఎలా నివారించాలి?

టైప్ 1.5 డయాబెటిస్‌ను నిర్ధారించడానికి సమయం పట్టవచ్చు , దీనిని తరచుగా టైప్ 2 డయాబెటిస్‌గా పొరబడతారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారి మాదిరిగానే, టైప్ 1.5 డయాబెటిస్ ఉన్నవారిలో కూడా కనీసం ఒక యాంటీబాడీకి పాజిటివ్ అని తేలవచ్చు.  శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని నెమ్మదింపజేస్తుంది కాబట్టి, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఇన్సులిన్ లేకుండా పరిస్థితి అదుపులో ఉండని వారు శాశ్వతంగా ఇన్సులిన్ తీసుకోవలసి రావచ్చు.

ప్రస్తుతం, టైప్ 1.5 డయాబెటిస్‌ను నివారించడానికి మార్గం లేదు. టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే ఇందులో కూడా జన్యుపరమైన కారకాలు పాత్ర పోషిస్తాయి. టైప్ 1.5 డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి సరైన నిర్ధారణ , లక్షణాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.

                                     *రూపశ్రీ.