శీతాకాలంలో ఉదయాన్నే వాకింగ్.. ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది!

వాకింగ్ ఆరోగ్యానికి చాలామంచిది. వేసవికాలంలో అయినా, శీతాకాలంలో అయినా వాకింగ్ చేయడానికి మంచి వాతావారణం ఉండాలని అనుకుంటాం.  అయితే ప్రతి ఏడాది ఎండలు అయినా,  చలి అయినా విపరీతంగా పెరుగుతూ వస్తోంది.  దీని కారణంగా చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి.  ఉదయాన్నే వాకింగ్ చేయడం మంచిదే అయినా చలికాలంలో విపరీతమైన చలి,  పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఉదయం పూట వాకింగ్ ప్రమాదాలు కూడా కలిగించే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.  చలికాలంలో ఉదయాన్నే వాకింగ్ చేయడం గురించి ఆరోగ్య  నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుంటే..

చలికాలంలో వాకింగ్.. మహిళకు మంచిదా?

ఎముకలు, కండరాల సాంద్రత, బలం వంటివి మగవారితో పోలిస్తే ఆడవారిలో చాలా తక్కువ.  మహిళలు చాలా వరకు పోషకాలు, ప్రోటీన్ లోపాన్ని,  కాల్షియం లోపాన్ని ఎదుర్కుంటూ ఉంటారు. చలికాలంలో చలి కారణంగా ఎముకలు, కండరాల పనితీరు మారుతుంది. చలికి ఎముకలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. దీని వల్ల కీళ్లు, కండరాల నొప్పులు వంటివి దారుణంగా ఎదుర్కుంటూ ఉంటారు.  మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా చలికాలంలో ఉదయం వాకింగ్ అంత సేప్ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో వాకింగ్ ఎందుకు వద్దు..

తీవ్రమైన చలిలో ఉదయాన్నే బయటకు వెళ్లడం వల్ల కోల్డ్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.  గుండె జబ్బులు ఉన్నవారు, మహిళలు,  వృద్దులు సూర్యోదయం తర్వాత మాత్రమే బయటకు వెళ్లడం మంచిది.  

శీతాకాలంలో సాధారణ రోజుల కంటే ఎక్కువగా కాలుష్యం ఉంటుంది. అది కూడా భూమికి దగ్గరగా ఉంటుంది. పొగమంచులో కాలుష్యం చిక్కుకుని ఉంటుంది. తెల్లవారుజామున వాకింగ్ వెళ్లడం వల్ల కలుషిత గాలి ఊపిరితిత్తులలోకి లోతుగా చేరే అవకాశం ఉంటుంది.  దీని వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి ఊపిరితిత్తుల, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

వాకింగ్ కు సరైన సమయం..

చలికాలంలో వాకింగ్ చేయాలంటే ఉదయం 5 లేదా 6 గంటలకు బయటకు వెళ్లడం సరికాదు. సూర్యుడి కిరణాలు బాగా ప్రసరించే సమయంలో వాకింగ్ కు వెళ్లడం ఉత్తమం.  ఉదయం పూట సుమారు 8 నుండి 9 గంటల మధ్య వాకింగ్ చేయడం మంచిది.  దీని వల్ల శరీరానికి విటమిన్-డి కూడా అందుతుంది. శరీర ఉష్టోగ్రత  బాలెన్స్డ్ గా ఉంటుంది.

వాకింగ్ కు ప్రత్యామ్నాయం..

సాధారణంగా మహిళలకు ఉదయం సమయంలో ఇంటి పనులు అంటూ చాలా ఉంటాయి.  ఈ కారణంగా వాకింగ్ అనేది కుదరదు. అలాంటి వారు యోగా,  స్ట్రెచింగ్,  ఇంట్లోనే స్పాట్ రన్నింగ్ వంటివి చేయవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగై శరీర ఉష్ణోగ్రత బాగుంటుంది.  పైగా మహిళలు వంట పనితో పాటు ఇంట్లో పనులన్నీ చేసుకోవడం కోసం నీటిలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కాబట్టి వారి ఉష్ణోగ్రత   బాలెన్స్డ్ గా ఉండటం చాలా ముఖ్యం.

                                  *రూపశ్రీ.