ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది. అయితే నేటి కాలంలో ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా ఫ్రోజెన్ డెజర్ట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.  షాప్ కు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఏదో,  ప్రోజెన్ డెజర్ట్ ఏదో అర్థం కాకుండా చాలా మంది పొరపాటుగా ఐస్ క్రీమ్ కు బదులు ఫ్రోజెన్ డెజర్ట్ ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇది ఐస్ క్రీమ్ కాదని నాలుక కరుచుకుంటారు. అందుకే ఐస్ క్రీమ్ కు,  ఫ్రోజెన్ డెజర్ట్ కు మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటే..

ఫ్రోజెన్ డెజర్ట్‌లు ఐస్ క్రీమ్‌కు చాలా భిన్నంగా ఉంటాయి, కానీ  చాలామంది అవి  రెండూ ఒకటే అని పొరబడతారు. ఈ రెండూ చూడటానికి, రుచిలో ఒకేలా కనిపించినప్పటికీ, వాటి మధ్య చాలా తేడా ఉంటుంది.

పదార్థాలు..

ఐస్ క్రీమ్ , ఫ్రోజెన్ డెజర్ట్‌ల మధ్య ఉన్న అతిపెద్ద తేడా వాటి తయారీలో ఉపయోగించే కొవ్వు పదార్థం. ఐస్ క్రీమ్‌ను పాలు, క్రీమ్ , పాల ఫ్యాట్ తో తయారు చేస్తారు. అందువల్ల, ఐస్ క్రీమ్‌గా పరిగణించబడాలంటే, ఏ ఫ్రోజెన్ డెజర్ట్‌లోనైనా కనీసం 10% పాల కొవ్వు ఉండాలి. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లలో పాలకు బదులుగా పామాయిల్ లేదా పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వెజిటెబుల్ నూనె లేదా వెజిటెబుల్ ఫ్యాట్ ను ఉపయోగిస్తారు. పాల ఘనపదార్థాలను కలుపుతారు, కానీ పాల కొవ్వును ఉపయోగించరు.

రుచి, టెక్చర్..

పాల కొవ్వును ఉపయోగించడం వల్ల ఐస్ క్రీమ్ మరింత క్రీమీగా, రుచికరంగా , మృదువుగా తయారవుతుంది. ఐస్ క్రీమ్ నోటిలో సులభంగా కరిగిపోతుంది. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లు కొద్దిగా జిగటగా లేదా నూనెగా ఉంటాయి. అంతేకాకుండా, పాల కొవ్వుతో పోలిస్తే వెజిటబుల్  కొవ్వుకు కరికే గుణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

ప్యాకెట్ల పై లేబులింగ్..

చాలామంది ఐస్ క్రీమ్ అనుకుని  ఫ్రోజెన్ డెజర్ట్ లు కొనుగోలు చేసి తరువాత బాధపడుతూ ఉంటారు. అందుకే.. ఉత్పత్తి ఐస్ క్రీమా లేక ఫ్రోజెన్ డెజర్టా అనేది కంపెనీలు ప్యాకేజింగ్‌పై స్పష్టంగా పేర్కొనాలి. ఉత్పత్తిలో 0.5% కంటే ఎక్కువ వెజిటేబుల్ ఆయిల్  ఉంటే, దానిని ఐస్ క్రీమ్‌గా కాకుండా, కేవలం ఫ్రోజెన్ డెజర్ట్‌గా మాత్రమే అమ్మాలని FSSAI నిబంధనలు విధించింది.

ధర తేడా..

పాల కొవ్వు కంటే వెజిటేబుల్ ఆయిల్  చాలా చౌకగా ఉంటుంది. అందువల్ల ప్రోజెన్ డెజర్ట్‌లు కంపెనీలకు మరింత పొదుపుగా ఉంటాయి . తక్కువ ధరకే లభిస్తాయి. మరోవైపు, ఐస్ క్రీమ్‌లో పాల కొవ్వును ఉపయోగిస్తారు, అందుకే దీని ధర ప్రోజెన్  డెజర్ట్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది.

కొనుగోలు చేసేముందు ఇవి గుర్తుంచుకోవాలి..

 ప్యాక్ చేసిన డెజర్ట్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా, ప్యాకేజీ ముందు లేదా వెనుక ఉన్న పదార్థాల జాబితాను జాగ్రత్తగా చదవాలి. ఆ పదార్థాలలో పామాయిల్ లేదా కూరగాయల నూనె ఉంటే, అది ఫ్రోజెన్ డెజర్ట్,  అందులో పాల కొవ్వు ఉంటే, అది ఐస్ క్రీమ్. ఇవన్నీ ప్యాకెట్ పైన కూడా మెన్షన్ చేసి ఉండాలి.

                                   *రూపశ్రీ