భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు.  కొందరు బెడ్ టీని ఇష్టపడితే, మరికొందరు రోజంతా చాలా కప్పులు తాగుతారు.  వయసుకు తగ్గట్టు ఎంత టీ తాగాలి? దీని గురించి చాలామందికి తెలియదు.  అధికంగా టీ తాగడం వల్ల క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి.

టీ ఆరోగ్య ప్రయోజనాలు..

టీలోని కెఫీన్ , ఇతర సమ్మేళనాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే టీని  అధికంగా తీసుకున్నప్పుడు హానికరంగా కూడా మారుతుందని వైద్యులు అంటున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా మారింది. చాలామంది పాలతో కాఫీలు, టీలు మానేసి గ్రీన్ టీ ఇష్టపడుతున్నారు.  ఈ సమ్మేళనాలకు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

పరిశోధనల ప్రకారం  గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు  బరువు   విషయంలో పర్పెక్ట్ గా,  మొత్తం ఆరోగ్యం విషయంలో ఎంతో నిలకడగా   ఉంటారని పరిశోధనలో తేలింది.

 రోజులో ఎంత టీ తాగాలి?

ఎంత పరిమాణంలో టీ తాగడం సరైనది అనే విషయం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వయస్సు, ఆరోగ్య పరిస్థితి , జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా టీనేజర్లు , యువకులు రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు.

ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం మంచిదని  చెబుతున్నారు.  అంతకంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.

టీ ఎక్కువగా తాగితే..

ఎక్కువగా టీ తాగడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చంచలత్వం, నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి , ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీ లవర్స్ ఇవి గుర్తుంచుకోవాలి..

టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం, టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

                                *రూపశ్రీ.