
ఆహారం తినేటప్పుడు ఒక్కోసారి పొరపాటున నాలుక పంటికి తగిలి కొరుకుడు పడుతూ ఉంటుంది. సాధారణంగా ఇది తొందరపాటులో తినడం వల్ల జరుగుతుందని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది కేవలం అజాగ్రత్త వల్ల మాత్రమే కాకుండా, పంటి వరుస సరిగ్గా లేకపోవడం, నోటి ఆరోగ్యంలో సమస్యలు లేదా శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల కూడా జరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. అసలు ఇలా పదే పదే కొరుక్కోవడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే..
నాలుక మన నోటిలో ఎంతో సున్నితమైన భాగం. ఇది ఆహారాన్ని నమలడానికి, మింగడానికి , మాట్లాడడానికి చాలా ముఖ్యం. అందువల్ల తరచూ నాలుక కొరుక్కునే సమస్య ఎదురైతే, దాని వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. దీన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
పంటి అమరిక..
పంటి అమరిక సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు పన్ను సరిగ్గా లేకపోయినా, పంటి అంచు చాలా పదునుగా ఉన్నా, లేదా పంటికి చేసిన డెంటల్ ట్రీట్మెంట్ సరిగ్గా అమరకపోయినా భోజనం చేసేటప్పుడు నాలుక ఆ భాగంలో తగిలి గాయమవుతుంది. అలాగే దంతాల వరుస సరిగ్గా లేని సందర్భాలలో ఆహారం నమిలేటప్పుడు నాలుక పళ్ల మధ్యకు వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో దంత వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం మంచిది.
విటమిన్ల లోపం..
కొన్నిసార్లు శరీరంలో విటమిన్ల లోపం వల్ల కూడా నాలుకకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి 12, ఫోలెట్ లేదా ఐరన్ లోపించినప్పుడు నాలుక మీద మంట, నొప్పి లేదా వాపు రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సరైన పోషకాహారం తీసుకోవాలి.
తొందరగా తినడం..
భోజనం చేసేటప్పుడు తొందరపడటం, ఎక్కువ వేగంగా నమలడం, లేదా తినే సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడుతూ తినడం వల్ల కూడా నాలుక కొరుక్కునే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా, నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి.
ఒకవేళ అనుకోకుండా నాలుక కొరుడుపడి గాయమైతే వెంటనే శుభ్రమైన నీటితో నోటిని కడుక్కోవాలి. రక్తం వస్తుంటే మెత్తటి గుడ్డతో కొద్దిగా ఒత్తిపట్టాలి. గాయం పూర్తిగా తగ్గే వరకు కారంగా, పుల్లగా లేదా చాలా వేడిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ రక్తం ఆగకపోతే, గాయం పెద్దదిగా ఉంటే లేదా వాపు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.




