ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..


హైడ్రేట్..


మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది.


ఉదర సమస్యలు..


ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

 
రోగనిరోధక శక్తి..


చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.


జీవక్రియను..  


జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది.


డయాబెటిస్‌..

తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.  

                                                                *రూపశ్రీ.