తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా ఉన్న ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నేటికాలంలో బాగా కారంగా ఉన్న ఆహారం తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.  ఎండు మిరపకాయల చట్నీ మొదలుకొని,  ఆహారంలో కారం బాగా ఎక్కువ వేసుకుని తిడం చాలా మందికి ఇష్టంగా ఉంటోంది దాని రుచి వారికి బాగా నచ్చిందని చెబుతూ ఉంటారు. కారం తినడం చాలా గొప్ప అని చెప్పుకుంటూ కూడా ఉంటారు. కానీ నిజానికి కారం ఎక్కువ తినడం గొప్ప అనడానికి బదులుగా.. దాని వల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించమంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో సమస్యలు మాత్రమే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాల పై కూడా చాలా ప్రబావం చూపిస్తుందని అంటున్నారు.

గుండెల్లో మంట, ఎసిడిటీ..

కారం ఎక్కువ తినడం అంటే కేవలం కారం ఎక్కువ తినడం కాదు.. అందులో మసాలాలు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదమే.. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు,  కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, త్రేనుపులు , గ్యాస్ రావచ్చు. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తినడం  వల్ల ఎసిడిటీ ఒక దీర్ఘకాలిక సమస్యగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

జీర్ణవ్యవస్థ..

అతిగా మసాలా, కారం  ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. దీనివల్ల పేగుల్లో చికాకు, అజీర్ణం, కడుపు నొప్పి, కొన్నిసార్లు విరేచనాలు కూడా కలగవచ్చు. ఇప్పటికే బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు.

నోరు, గొంతు సమస్యలు..

అతిగా మసాలా ఉండే ఆహారాలు నాలుక, చిగుళ్ళు , గొంతు లోపలి పొరను చికాకు పెడతాయి. దీనివల్ల చికాకు, బొబ్బలు , పుండ్లు, వాపు రావచ్చు. ఈ ఆహారాలను ఎప్పుడూ తీసుకోవడం వల్ల  టేస్ట్ బడ్స్ బలహీనపడతాయి.

అల్సర్ల ప్రమాదం..

క్రమం తప్పకుండా మసాలా,  ఘాటైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర దెబ్బతిని, గ్యాస్ట్రిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని లక్షణాలలో తీవ్రమైన నొప్పి, వాంతులు, , కొన్నిసార్లు రక్తస్రావం కూడా ఉండవచ్చు, ఇది ఒక తీవ్రమైన పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది.

చర్మ సమస్యలు..

మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర వేడి పెరిగి, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు ఎరుపుదనం ఏర్పడవచ్చు. ఈ సమస్య ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సర్వసాధారణం.

పైల్స్..

మసాలా పదార్థాలు తినడం వల్ల మలవిసర్జన సమయంలో మంట ,  నొప్పి పెరగవచ్చు. దీనివల్ల పాయువులో వాపు వచ్చి, మొలలు మరింత తీవ్రమవుతాయి. ముందు నుంచే మొలలు ఉన్న రోగులు ముఖ్యంగా మసాలా, కారం  పదార్థాలకు దూరంగా ఉండాలి.

నిద్ర..

రాత్రిపూట మసాలాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి, చికాకు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. తరచుగా మెలకువలు రావచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడం  మానసిక , శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది.

మసాలా ఆహారాలు తినకూడదా?

మసాలా ఆహారం మంచిదే, కానీ దాని పరిమాణం పరిమితంగా ఉండాలి. సమతుల్య ఆహారం పాటించడం ద్వారా మాత్రమే  కడుపు, చర్మం ,  మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

                             *రూపశ్రీ.