Home » Sree Sree » Srisri Kathalu


                                                    అనామిక
    
    కథ వండుదామని కలం పట్టుకుని కాగితాలు పెట్టుకుని
    కూచున్నాను. ఇతివృత్తాన్ని ఎసరు మీది కెక్కించాను.
    కథానాయకుణ్ణి ముక్కలుగా తరిగి కారప్పొడి జల్లి పచ్చడి
    చెయ్యాలనుకున్నాను. ఇందుకు ఎవరు అనుమతిస్తారా
    అని జ్ఞాపకం ఉన్నంతమట్టుకు సాహిత్యాన్ని గాలిస్తున్నాను.
    కథానాయకులందరినీ ఇదివరకే సినిమావాళ్ళు పచ్చడిచేసి
    నంచేసుకున్నారు నాకొక్కడికీ మిగల్చకుండా. సరే. కథా
    నాయకుడి మాట తర్వాత ఆలోచించుకోవచ్చునని కథాకాలం
    గురించి మొదట నిర్ణయించుకుందా మనుకున్నాను. కథ
    చదివితే నాలిక మండేటంత ఘాటైనకాలం ఏది? నేటికాలం
    మాత్రం కాదు. ఇది కథలకి కాలమేకాదు. రుచీ పచీ
    లేనివి తప్ప కమ్మగా కారంగా ఉండే కథలు ఈకాలంలో
    కనబడవు. అంతే కాదు. పూర్వకాలం సత్యకాలం కాబట్టి
    అప్పుడు మనుష్యులతో జంతువులు మాట్లాడేవి దేవతలు
    ప్రత్యక్షమయేవారు. కథకి కాళ్ళూ చేతులూ ఉండేవి కావు.
    ఇప్పుడు కథ నడిస్తేనేగాని ఎవరూ చదవరు. తలా తోకా
    లేని కథలు ఎవరికీ అక్కర లేదు.
    
    అదొహటిన్నీ, ఈ రోజుల్లో ఎవరి కథలు వాళ్ళే రాసుకుంటున్నారు. వాళ్ళకి మనం వండిపెట్టే కథలు సయించవు. నీ కథ ఎవడికి కావాలి? మా యింటికిరా? అటకమీద ఆవకాయ గూనల్లో అనేకమైన కథలున్నాయంటారు. బాగా ఊరిన కథలు అన్నట్టు పత్రికల్లో పడే వార్తల్ని కూడా కథలే అంటున్నారిప్పుడు. "ఇందులో ఏమీ స్టోరీ లే" దంటాడు సంపాదకుడు రిపోర్టరు తెచ్చిన వార్తను చదివి జరిగింది జరిగినట్టుగా రాశానంటాడు రిపోర్టరు. అందుకే యింత అధ్వాన్నంగా ఉందని సంపాదకుడు దాన్ని చి.కా.బు. లో పారేస్తాడు.
    చి.కా.బు. అంటే జ్ఞాపకం వచ్చింది. చిత్తు కాగితాల బుట్టల్లో వెదికితే ఎన్నో కథలకి బీజాలు దొరుకుతాయి. చాలా కథల్ని సంపాదకుడు చంపేస్తూ ఉంటాడు. దానికి చాలా కారణాలుండొచ్చును. రాజకీయ, నైతిక, సాంసారిక, లౌకిక, పౌరలౌకిక కారణాలు. వీరేశలింగం పంతులూ, చిత్తుకాగితాల బుట్ట కథ మీరు వినే ఉంటారు.
    "ఆ కథ చెప్పవూ?" అంది నా ఆకలి. ఆకలి అడిగినప్పుడల్లా కథ చెప్పకూడదు. ఆకలి రుచి యెరుగదు నేను వండుతున్న కథ పాఠకుల ఆకలి తీర్చడానికి ఇది సరైన పాకంలో పడుతుందో లేదో కొందరు పాఠకులు చాలా అదృష్టవంతులు. వాళ్ళేదిచ్చినా మింగేస్తారు. గాలిపేని కథ అల్లెయ్యగలరు వాళ్ళు ఆ విద్య అందరికి పట్టుబడుతుందా? అదృష్టవంతులనా అన్నాను? సిద్దహస్తులు వాళ్ళు చేతి చలన అంటామే - అదేదో ఆ చెప్పలేనిది వాళ్ళలో ఉంటుంది. అదో ప్రజ్ఞ. అంతే దాని సరిహద్దులు వెదకడం ప్రయోజనం లేని పని. సరిహద్దులలో ఇమడకపోవడంలోనే ప్రజ్ఞ అనేది ఇమిడి ఉంటుంది.
    ఎవరు మీద పెట్టిన ఇతివృత్తం మాట మరచిపోయాను. ఈపాటి కప్పుడే అది ఇగిరిపోయి ఉంటుంది. కథానాయకుడు అసలే కనబడలేదు. కాలం ఒక్కటి మాత్రమే నిశ్చయమైంది. అదీ మిథ్యే అనేవాళ్ళు లేకపోలేదు. కాలం అనేదే కనపడకుండా ఉండాలంటే బోర్లాపడుకొని కుడికాలి బొటనవేలితో ఎడమ చెవినీ, ఎడంచెయ్యి ఉంగరం వేలితో కొండనాలికనీ ముట్టుకునీ రెండు కళ్ళనీ ముక్కుకొనకి తెచ్చి చూడాలనుకుంటాను ఈ వ్యాయామాన్ని నేనిప్పుడు సిఫారసు చెయ్యదలచుకోలేదు. ఇలా చేసినా చెయ్యకపోయినా కాలం అనేది ఎప్పుడూ కనపడదు.
    కథని ఒక కాలానికి బంధించడం నాకిష్టం లేదు. కాలమూ లేక, వస్తువూ లేక, కథానాయకుడూ లేకపోతే కథని కంచికి పంపించడం ఎలాగ? అన్ని కథలూ కంచికే ఎందుకు వెళ్ళిపోతాయో నాకు తెలియదు. మా నాయనమ్మ బతికున్నంతకాలం ఈ సందేహం నాకు కలగలేదు. ఇప్పుడు బతికున్న నాయనమ్మ లెవరూ ఈ సందేహం తీర్చలేరు. అసలు మా నాయనమ్మ కథ చెబుతూవుంటే ఆ కథ యెలా కంచికి వెళ్ళుతుందో అని తప్ప ఎందుకు వెళ్ళుతుందనే ప్రశ్న వచ్చేదికాదు. నా కొక్కొక్కప్పుడనిపిస్తూ ఉంటుంది అన్ని కథలు కంచికే వెళ్ళిపోతాయి కదా! కంచిలో కథలెన్ని ఉండాలో అని. తెనుగు కథలకి మాత్రమే కంచి గమ్యస్థాన మనుకుంటాను. బంగాళీ కథలు ఎక్కడికి వెళతాయో! ఇతర భాషల్లోకి కాబోలు? లేకపోతే బంగాళాఖాతం ఉంది కాదూ? ఎన్ని కథలనైనా ఇముడ్చుకో గలదు నాయనమ్మలు ప్ర్రారంభించే కథలు కంచిలో అంతమైతే, కంచిలో ప్ర్రారంభమయ్యే కథలు నాయనమ్మల్లో అంతమవుతాయా? ఇదేమిటి మళ్ళీ ప్ర్రారంభాని కొచ్చాను? ఇంతకీ ఏదీ కథ! ఈసారి ఒక కథానాయకుణ్ణి చూసుకుని మరీ బయలుదేరాలి. ఎంత కలికాలమైనా ఎక్కడో ఒక నాయకుడు దొరక్కపోడు. ఆంద్రదేశంలో నాయకులకే కొదవా? అయితే ఒక చిక్కుంది. వాళ్ళు తమ మీద పద్యాలు రాయమంటారు. పువ్వుల దండలు వెయ్యమంటారు. స్వాగత పత్రాలు సమర్పించమంటారు. ప్రతిఫలంగా ఏవో పెర్మిట్లు సంపాదించి పెడతామంటారు. ఇదివరకైతే ఏదో కథకి నాయకుడుగా ఉంటామని అంగీకరించేవారు. పత్రికల్లో తమ పేరుపడితే చాలుననుకునేవారు. ఇదివరకు ఏం చేస్తున్నారు తమరంటే స్వరాజ్యం తేవడానికి ప్రయత్నిస్తున్నా మనేవారు. ఇప్పుడు మాత్రం "ఇంగ్లీషువాడు మనకిచ్చిన స్వరాజ్యం ఏమీ బాగులేదు. దీన్నిపట్టికెళ్ళి వాడికే యిచ్చేద్దాం" అంటున్నారు. ఈ నాయకుల్ని ఎంత చెయ్యి తిరిగినవాడైనా పచ్చడి చెయ్యలేడు. ఇలాంటి వాళ్ళతో కథ వండాలంటే అదిమాటలతో పని కాదు. కోతలు వాళ్ళ ప్రత్యేకత కాబట్టి ఆ క్షేత్రంలో మనం అడుగుపెట్టడానికే వీల్లేదు.
    అక్కడికీ ఉండబట్టక ఒక నాయకుణ్ణి ఈ మధ్య ఆశ్రయించాను ఏదో ఉద్యోగాని కొచ్చాననుకుని ప్రధానమంత్రికి ఉత్తరం ఇస్తానన్నాడు. "ఏ ప్రధానమంత్రికైనా సరే రాష్ట్ర, కేంద్ర, సామ్రాజ్య" అంటూండగా అదికాదు నాది వేరే కథ అన్నాను. నీ కథ వినడానికి నాకు తీరుబాటు లేదన్నాడు. కాదు మీ కథే అన్నాను. అతడు తికమకలో పడిపోయాడు. "వీడికి గాని వెర్రెత్తిందేమిటి చెప్మా?" అన్నట్టు నావేపు చూశాడు. "స్తిమితంగా ఆలోచించుకుని నీకేమిటి కావాలో నిర్ధారణ చేసుకో వెంటనే చెప్పక్కర్లేదులే నేనిప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారంరోజుల్లో వస్తాను. ఈలోపున ఒక నిర్ణయానికి రా!" అన్నాడు. వచ్చా నన్నాను. "నిన్నేమీ అడక్కూడదనే నిర్ణయానికి వచ్చా" నని చెప్పి అక్కన్నుంచి కదిలిపోయాను. నా కథ కదలకుండా ఉంది. నాయకుడు లేందే ఎలా కదులుతుంది? బజారులో దొరికే సరుకు కాదు కథా నాయకుడంటే! అయినా ఒక నాయకుడి ఖరీదెంత ఉంటుందో? ఎవరో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు తప్ప సామాన్యులెవరూ నాయకులను కొనలేరనుకుంటాను. నాయకులూ కూడా మనలాంటి వాళ్ళకి తమ నిజమైన విలువ చెప్పరు. తమ అమూల్యత్వాన్నే అడుగడుగునా మనకి జ్ఞాపకం చేస్తారు. నాయకాన్వేషణం తాత్కాలికంగా నిలుపుదల చేసి కథావస్తువు కోసం వెదకడం ప్ర్రారంభించాను. వస్తువు గుణం వాస్తవికత్వం. ఇది అంతటా ఉన్నదే! నా కథకి సరిపోయేటంత సరుకుమాత్రం తీసుకుందా మనుకున్నాను. కొంత మంది ఒక చిటికెడు కథావస్తువు తీసుకుని గంగాళాల కొద్దీ కషాయాన్ని కలుపుతారు. మరికొంతమంది చవగ్గా దొరికింది కదా అని గంగాళమంతా కథావస్తువు తీసుకుని చెమ్చాలో ఇమిడిపోయేటంత చిన్నకథ రాస్తారు. తేనె కలుపుకుని ఔషధ ప్రాయంగా దాన్ని దిగమింగాలి. కథ అయిపోతుంది కథా వస్తువు మిగిలిపోతుంది. సమపాళంగా కథా వస్తువు వుండాలంటే కథ తాలూకు కొలతలు తీసుకుని దానికి  సరిపోయినంత వస్తువు కూరడం ఒక పద్దతి దొరికిన కథావస్తువుకే కొలతలు కట్టి కథ కట్టడం ఇంకో పద్దతి అయితే. తయారయిన కథలో ఇంత వస్తువుందని ఎవరూ తూనికవేసి చెప్పలేరు.
    ఎలాగయితేనేం కథావస్తువు దొరికింది. సర్వత్రా ఉన్నదే కాబట్టి శ్రమపడి వెతకడం తప్పింది. పాళ్ళు కుదరక బాధపడుతున్నానంతే! కథానాయకుడిది ఒక రకం బాధయితే కధావస్తువుతో ఇంకొకరకం బాధ. చిత్రమేమిటంటే మా నాయనమ్మని ఈ చిక్కులేవీ బాధించేవి కావు. అయినా ఆ రోజులు వేరు. ఆ మనుష్యులు వేరు.
    
                                       ---౦౦౦---


Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More