Home » Sree Sree » Srisri Kathalu
చరమరాత్రి
(నరకం, భూమి, స్వర్గం అనే మూడు కాలాలలో ఆలాపన)
నరకం
రాత్రి పదకొండు గంటలయింది. ఇంకొక గంట. ఇంకొక్క
అరవై నిమిషాలు సరిగ్గా పన్నెండు కాగానే చచ్చి
పోదలచుకున్నాను అన్నీ ఆలోచించుకున్నాను. ఇప్పుడా?
ఆరు నెలలనుంచీ నా కిదే ఆలోచన ఆరునెలలనుంచీ
సిద్దమవుతున్నాను. ఇప్పటిదా యీ నిశ్చయం, ఆరు నెలల
కిందటే తెగించాను. అప్పటినుంచీ నాకిదే ఆలోచన.
నిశ్చయాన్ని మార్చుకుందామనికాదు. ఆరునెలలు అహో
రాత్రాలు జాగ్రత్సుషుప్తులలో ఎడతెగని యోచనా తరంగా
లలో నా నిశ్చయాన్ని స్నానం చేయించాను. ఆరునెలల
అవభృధ స్నానంలో పవిత్రీకృతమైన నా అందమైన, నా
ఆడుకునే నా తిరుగులేని, భయంకరమైన సంకల్పాన్ని
ఈ రాత్రి ఆచరణలో పెడుతున్నాను.
ఈ రాత్రి నా ఆత్మహత్యా మహోత్సవం. ఇది ఆహ్వాన పత్రికకాదు. ఈ ప్రదర్శనకి ప్రేక్షకులు అనవసరం. ఇది నా సొంత వ్యవహారం. ఇతరులు లోనికి రాకూడదు.
మరణించాలని నిశ్చయించుకున్నాను సరిగ్గా ఈ రాత్రి పన్నెండుగంటలకి చచ్చిపోవాలని సంకల్పించుకున్నాను. "ఈ రాత్రి పన్నెండు కాగానే ఈ రాత్రే ఎంచేత? పన్నెండుకే ఎందువల్ల? అసలు చచ్చిపోవడం ఎందుకు? చచ్చిపోతూన్న ఓ వ్యక్తీ! నువ్వెవరు?"
నేనెవరు? అనవసరం అయితే ఈ రాతకూడా అనవసరమే? పోనీ నే నెవరో చెప్పనా? ఎవరికీ చెప్పను? ఎందుకీ రాత? అదే ఈ రచన ఎందుకో ఎవరికో తేల్చుకుందామని చచ్చిపోతున్నాను. ఆరు నెలలుగా చచ్చిపోతున్నాను. ప్రతీదినం అధ్యాత్మికంగా చచ్చిపోయాను. ఈ రాత్రి భౌతికంగా త్వరలో నేను చెయ్యబోయే ఆఖరు అభినయం నా వాక్యానికి ఫుల్ స్టాప్ నా కావ్యానికి పరిసమాప్తి.
జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి జీవించటమే అవసరం అనే సునాయాసపు సూత్రం నిరాకరించి మరణం ఇందుకు నా మార్గంగా ఎంచుకున్నాను. ఇది ఎవరికీ బోధపడదు. ఎవరికీ బోధపరచలేననికూడా నే నెరుగుదును. అయినా నా ఈక్వేషన్ కిదే సొల్యూషన్.
అదే పొరపాటు నేనొక రచయితననీ రాతలో ప్రకాశించలేక చచ్చిపోతున్నాననీ అనుకోవద్దు. ఈ చేతులతో నా ఎనిమిది వందల పేజీల నవలని దగ్ధం చేశాను. నాకు రాత చేతకాదని ఎవరూ అనరు. నేనసలే అనుకోలేదు కీర్తిదాహం తీరకపోవడం నా ఆత్మహత్యకి కారణం కాదు. ప్రేమలో పరాజయం కారణం కాదు. ధనాభావం అంతకన్నా కారణం కాదు.
ఎంచేతనంటే! మా నాన్నకి బోలెడంత ఆస్తి ఉంది. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు! రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. (లంచాలంటావా? అనుకో) నేను ప్రేమించిన స్త్రీ నన్ను అంగీకరించింది. మా వివాహం వషయంలో మా తల్లిదండ్రులు మాకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చారు. నన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి అందమూ, చదువూ, డబ్బూ, తెలివీ ఉన్నాయి. జీవించాలనుకుంటే రేపే ఆమెను పెళ్ళి చేసుకో గలను. నా వయస్సు 24 ఏళ్ళు నా బతుకంతా ముందే వుందని నాకెవరూ చెప్పనక్కరలేదు. నాకే కీర్తి కావలిస్తే నా నవల ప్రకటించి ఉందును. నేను రచయితనే కాదు. చిత్రకారుణ్ణి నా చిత్రాలు ప్రదర్శించి ఉందును. (వాటినికూడా నాశనం చేశాను కాని అంతకన్నా మంచివి చిత్రించగలను.) నేను చిత్రకారుణ్ణి మాత్రమే కాదు. నాకు సంగీతం కూడా వచ్చును. వయోలిన్ వాయిస్తాను. క్రికెట్, టెన్నిస్, ఫుట్ బాల్ ఆడతాను. నాకు మానవమాత్రుడు కోరుకోదగ్గవన్నీ ఉన్నాయి. నన్ను తెలిసిన వారంతా నాకేమీ లోపం లేదంటారు.
నేను మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నాను. ఈ వివరాలన్నీ అనవసరం సరదాగా చదువుకోవడానికి కథ రాయడం లేదు నేను. పన్నెండు గంటల కోసం కాచుక్కూచున్నాను ఈ లోపున ఏం చేయడానికి తోచక ఇది రాస్తున్నాను. ఆరునెలల నా ఆలోచనల సారాంశం. పదకొండుగంటల యాభైతొమ్మిది నిమిషాలకి ఈ రాసినదంతా ఈ వెలుగుతున్న కొవ్వొత్తికి అప్పగిస్తానేమో. ఈరోజే మా నాన్న పంపించిన రెండువందల రూపాయలు ఈ కొవ్వొత్తికే ఇచ్చివేసినవాణ్ణి కానూ నేను!
విధ్యుద్దీపాలున్న ఈ గదిలో ఒక కొవ్వొత్తిని మాత్రం వెలిగించి కూచున్నానంటే, నా టేబిలు,ముందు కాయితాలూ, కలం పెట్టుకొని కూచున్నానంటే, ఒక చేతురుమాలూ, ఒక సిగరెట్టుపెట్టె పెట్టుకొని కూచున్నానంటే చేతిగడియరాన్ని వెల్లకిలా పడుకోబెట్టి కూచున్నానంటే సీసా' ఒకటి ఎదురుగుండా ఉంచి....
బ్రాందీ? తప్పు విషం? తప్పు రైట్ అదే! క్లోరోఫారం! చూశావా మరి? నేనేమీ ఆలోచించకుండా చెయ్యను. నూతిలోపడి ఉక్కిరి బిక్కిరిగా ఉరి పోసుకుని నాలుక వేలాడుతూ, విషంతాగి కడుపు దహించుకునిపోయి, రైలుబండికింద ముక్కలైపోయి......ఈ చావులేవీ నాకు మనస్కరించవు.
నిద్రపోతూ, కలలుకంటూ, అపస్మారంలో హాయిగా, అందంగా కరిగిపోయి సురిగిపోతాను. చావుబదుకుల సరిహద్దును తుడిచివేస్తాను. హఠాత్తుగా అనాయాసంగా చచ్చిపోవడానికి కూడా వీళ్ళున్నాయి. ఎలెక్ట్రిక్ షాకుతో, ఎత్తునుంచి దుమికి కణత మీద రివాల్వర్ తో కొట్టుకుని పన్నెండు ఔన్సుల గాజుగ్లాసులో పది ఔన్సుల నీళ్ళుపోసి రెండు చిటికెల (అంత అనవసరం) సైనైడ్ కరిగించి చిటికెన వేలుమీద బ్లేడుతో గంటుపెట్టి. ఈ వేలు ద్రవంలో ఉంచితే చాలును. నా హైపొడెర్మిక్ సిరంజిని వాడినా చాలును. కాని ఇవేమీ నాకు తృప్తి కలిగించవు. నా సంగతే వేరు. నా సంగీతం వేరు. హాయిగా అందంగా స్వప్నాలతో.....అదీ నా రకం.
చిత్రంకాదూ? ఇదివరకు ఆరునెలల క్రితం, ఎప్పుడో ఆరునెలల కిందట క్రీస్తుపూర్వం ఆరునెలల వెనుక, భూమి పుట్టిన ఆరునెలలకు ముందు, అప్పుడు ఆ రోజుల్లో జీవితమంటే ఆప్యాయంగా ఊపిరి తియ్యడమే మహద్భాగ్యంగా, సుందరదృశ్యాలు చూస్తూ సుందర గ్రంథాలు చదువుతూ, రాస్తూ, గానం చేస్తూ, బొమ్మలు చిత్రిస్తూ, నేను ప్రేమించిన నన్ను ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తూ, జ్ఞానాన్ని మధిస్తూ, వెయ్యి చేతులతో వెయ్యి ఇంద్రియాలతో జీవిత మాధుర్యమంతా తనివి తీరా పీల్చిన విసుగు లేకుండా అనుభవించిన......లేదా పిల్చినట్లు. అనుభవించినట్లు భ్రమించిన నేను నేడు, ఈనాడు, నేటికి ఈనాటికి, అన్ని ఆశయాలూ అడుగంటి ఐహిక యాత్రలో ఆకర్షణపోయి, ఒకానొక క్రూరమైన క్రోధావేశం పుట్టుకొచ్చి ఎంత వేగం ఈ వికార నటనానికి పరిసమాప్తి చెబుదామా, ఎంత శీఘ్రం ఈ నికృష్ట దృశ్యాన్ని చెరిపివేద్దామా అని తహతహా, ఆవేదనా, ఆందోళనా పొందడం అమ్మయ్యో నాకే ఆశ్చర్యం! ఓహో ఆశ్చర్యం! ఆశ్చర్యం, నాలో నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది.
కాని నేనేం చెయ్యగలను? ఇంకేం చెయ్యను? ఏం చెయ్యమంటావ్? ఏం చేద్దాం అనుకున్నా ఎదురుగుండా ఏం లాభం! అనే ప్రశ్న అటకాయిస్తుంది. ఎన్ని విధాల యోచించినా మృత్యువు అవశ్యకమై, కౌగలించుకొనే స్నేహితుడిలాగ ఆదరంగా ఓదార్చే బంధువులాగ ఆహ్వానిస్తూ వివృత కవాటమై స్వాగత తోరణాలు ధరించిన దివ్యభవనంలాగ కనబడుతూ, జీవితం భయంకరమై, దుస్సహమై దుష్టమై, విహ్వలభావం సోకించి, శత్రువై, సర్పమై, శార్దూలమై, శాపమై రావద్దనే రాక్షసిలాగ, పోపో అనే పొగలాగ కనబడుతూవుంటే వినబడుతూవుంటే ఆహా! నా నిశ్చయం, ఔరా! నా నిర్ణయం ఇంకోలాగ ఎలా వుంటుంది?
చనిపోవాలని నిశ్చయించుకున్నాను. చిత్రం కాదూ? ఏడాది కిందట నా స్నేహితుడు, డబ్బు లేక చదువుమాని పనిలో ప్రవేశించి, సంసారంలో ప్రవేశపెట్టబడి, బదుకువల్ల లాఠీ చార్జి చెయ్యబడి కరువువల్ల నిలువుదోపిడీ చెయ్యబడిన నా స్నేహితుడు, ఏడాది కింద కనబడి నన్నొక మహోపకారం చిటికెడు పొటాసియం ఫెర్రోసైనైడ్, చిత్రం! స్పెల్లింగు తప్పుతో రాసినమాట సగం మూసిన కళ్ళతో ప్రార్ధిస్తూవున్న నా స్నేహితుడు, కాగితాన్ని నా చేతిలో పెట్టి (కోరిన వస్తువును నోటితో చెప్పలేక) ఒకే ఒక్క మహోపకారం చెయ్యమని, ఆఖరికోరిక చెల్లించమని ప్రాధేయపడితే, ససేమిరా అని నేను పట్టుబట్టి ఇవ్వనుగాక ఇవ్వనని భీష్మించుకొని, ప్రాణపు పావిత్ర్యం గురించి, జీవిత సౌభాగ్యం గురించి కవిత్వపు గమకాలతో ఉపన్యాసం ఇచ్చిన నేను అతని కథంతా విని, ఎన్నో మార్గాంతరాలు చూపించి, ఎన్నో దృష్టాంతాలు బోధించి, బదకవలసిన అవసరం రుజువు చేసిన నేను, పరాజయ మెరుగని జీవితపు పతాకాన్ని అతని మనస్సులో ప్రతిష్టించిన నేను (నాకు జ్ఞాపకం, బ్రౌనింగ్ కవి saul అనే గీతం నుంచి Oh, Our manhood's prime vigour!..... ......Oh' The wild joys of living! ఇత్యాది పాదాలు, బైరన్ రాసిన "To sit on rocks" మొదలైనవి - అదంతా ఇక్కడ ఉటంకించటం అనవసరం - నా వాదానికి వాటికి స్తంభాలుగా చేసిన నేను) - నేను (ఈ వాక్యాన్ని ఇంతటితో పూర్తి చెయ్యాలంటే) అతణ్ణి బతికించాను. అతని కిప్పుడు మళ్ళీ కొడుకు! అతని కిప్పుడెంతో మర్యాద! ఎంతో హాయిగా ఇప్పుడతడు జీవిస్తున్నాడు.
ఇక నేను! ఎప్పుడు ప్రవేశించిందో నా మనస్సులో ఈ కీటకం! (ఆరు నెలల కిందట కాబోలు) ఎలా ప్రవేశించిందో ఈ క్రిమి! నాకు తెలియకుండా కాబోలు, ఎన్ని పద్మవ్యూహాలు, ఎన్ని సాలీడు గూళ్ళు, ఎన్ని అంధకార గుహాంతరాలు చొరబడ్డానో, ఎన్ని ఇంద్రజాలాలు చేశానో, ఎన్నిమార్లు పునఃపునఃపునః పరీక్షలు చేసుకున్నానో నా హృదయ హృదయ హృదయాంత రాంత రాంత రాళాలలో! ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సంజాయిషీలు! ఎన్ని రాజీలు, చిరాకులు, కోపాలు, తాపాలు, సందేహాలు! ఓహో, ఆ సందిగ్ధాల సంధ్యాసమయంలో నన్ను నేనే ఎన్నో మార్లు చిత్రవధ చేసుకున్నాను. ఎంత యమయాతన పడ్డానని!
అడుగడుగునా ఎవరో వెనకనుండి తరుముకు వస్తున్నట్లుండేది. ఏదో కొండ చిలువ నన్ను చుట్టుకున్నట్లుండేది. కారు కమ్మిన పొగలు తుపాను పెట్టినట్లు ఉక్కిరి బిక్కిరి కలిగేది. ఇక నా మెదడులో హోరు చెప్పనక్కరలేదు. సంగీత విరుద్దమైన వివిధ శబ్ద సమ్మేళనలతో, వాటిలోనే వివిధ విచిత్రలయలతో, అవ్యక్త భీతావహంగా వినిపించే ధ్వనులు, కథలలో చెప్పుకునే, మనస్సులో ఊహించుకునే మానవుడి భయం నాటినుండీ నేటివరకూ ధరించే రకరకాల రూపాలూ, వికారపు కోరాలూ, కొమ్మల కొమ్మల కొమ్ములూ, అనేక వక్త్రాలూ ఒంటినిండా ముళ్ళూ, నాసారంధ్రాల నుండి అగ్నులు కక్కే జంతువులు నన్ను ముట్టడించేవి. అర్ధంలేని పైశాచిక మంత్రాలు నా నిద్రకి భంగం కలిగించేవి. నల్లని వర్షమేఘాలతో నా మానసిక వ్యోమమంతా చాందినీ కప్పేవి.



