Home » Sree Sree » Srisri Kathalu
ఒక్కల
ఒక్కల, ఒక కల, ఓ కల నిన్న రాత్రి నేను కన్న ఒక
కల మొగాళ్ళు కలలు మాత్రమే కంటారు. ఆడవాళ్ళు
కలల్నీ పిల్లల్నీ కవలపిల్లల్ని కనగలరు. ఇది ప్రారంభం.
విష్కంభం.
అసలు కల కథ....ఎక్కడికో పోతున్నాను. కలకి కాలం
లేదు. స్థలం కూడా లేదు. కలని కధగా రాయాలన్నా
ఫిల్ముగా తీయాలన్నా ఎక్కడ ప్ర్రారంభించాలో ఎక్కడ
ముగించాలో తెలియదు.
ఎక్కడ జరిగిందో తెలియదు. ఏం జరిగిందో తెలియదు. అయినా ఎక్కడో ఏమిటో చెప్పడానికి ప్రయత్నిస్తాను.
మీరు వెలుగులోనో చీకట్లోనో మేడమెట్లు ఎన్నోసార్లు ఎక్కే వుంటారు. ఎన్నోకొన్నిసార్లు దిగే వుంటారు. నా కలలో నేను చేసిన పనికూడా అదే కాని - అదుగో అక్కడే వుంది. ఈ మెట్లు ఎక్కుతున్నానో, దిగుతున్నానో తెలియదు. వెలుగో చీకటో తెలియదు. నా కలని మాటల్లో మళ్ళా చెప్పటానికి ఎందుకు కష్టపడుతున్నానో ఇప్పుడు మీకు తెలిసిందనుకుంటాను.
ఇంకో చిక్కుకూడా వుంది ఇందులో ఈ యెక్కడం దిగడం నే నొక్కన్నే కాదు. నాతోబాటు మరో మనిషి కూడా నాకన్నా ముందుగా నాకు దారి చూపిస్తూ కాదుకాదు. నా వెనకాతల నేను తీసిన దారినే నేను దిగిపోతూవుంటే నాతోపాటు దిగిపోతూ, నేను మెట్లు యెక్కుతూ వుంటే నాతోబాటు ఎక్కుతూ!
కథ చెప్పలేక నేను పడుతున్న చిక్కులు గమనిస్తున్నారా? నేను ఒకటి వెంటపడ్డానా? నా వెనక ఒకరు పడ్డారా? అధోలోకాలకి దిగిపోతున్నానా? ఊర్ధ్వలోకాలెక్కుతున్నానా?
నా చిక్కు యిక్కడితో తీరిపోలేదు. నాతోపాటు వస్తున్న లేదా పోతున్న నా కామ్రేడ్ మొగాడా? ఆడదా?
సామాన్యంగా మనం పత్రికల్లో చదివే కథల్లో ఈ యిబ్బందులుండవు. మాట వరసకి చలంగారి కథలో యెవడు మొగాడో ఎవతె ఆడదో స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు మేడమెట్లు దిగితే దిగినట్టు తెలుస్తుంది. యెక్కితే ఎక్కినట్లు తెలుస్తుంది. అక్కడ స్పష్టత తప్ప సందేహము లేదు. చిన్న చిన్న కథకులు కూడా ఎంతో ముద్దుగా స్పష్టంగా కథ అల్లుకుపోతారు. ఏవో పాత్రల్ని సృష్టిస్తారు. ఏవో సన్నివేశాలు కల్పిస్తారు. మనకు నవ్వో, ఏడుపో, భయమో, అసహ్యమో ఏదో ఒకటి కలిగిస్తారు. వాళ్ళ కథలు కలలు లాగా వుండనే వుండవు.
నేను కథ రాయడం లేదు. కల రాస్తున్నాను. ఇది కలరా అని మీ రనుకుంటారు. కల సంగతి మాటల్లో చెప్పడం కష్టం. గొప్ప కళ గొప్ప కల! అది ఏకకాలంలో మనకునవ్వూ, ఏడుపూ, భయం, కోపమూ, అసహ్యమూ, ఆవేశమూ ఇంకా ఎన్ని ఉంటే అన్ని కలిగిస్తుంది. అటువంటి కల మానవజాతి కింకా లభ్యం కాలేదని చింతిస్తున్నాను.
నిన్న రాత్రి నేను కన్న కలని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో వున్న చిక్కులు కూడా మీకు దాపరికం లేకుండా విన్నవించుకుంటున్నాను.
కల ఎక్కడ జరిగిందంటే మెట్లమీద ఎక్కడం జరిగిందో దిగడం జరిగిందో తెలియదు మెట్లమీద నేనొక్కడినే లేను. నాతోబాటు ఇంకో వ్యక్తి బహుశా నేనే నేమో? లేక నా నీడ నా ప్రేమించిన మిత్రుడు. నే ప్రేమించిన ఆడది. ఎవరో ఏమో! కలలోనే అయితేనేం ఇంకొకళ్ళతో కలసిపోవడం అబ్బా! ఎంత యిబ్బంది.'
ఇద్దరం దిగిపోతున్నాం. గబగబా! గబగబా! మధ్య మధ్య రెండేసి మూడేసి నాలుగేసి మెట్లు వదిలేసి దిగిపోతున్నాం! ఎంత సుఖంగా దిగిపోతున్నాం! గబగబా! గభాగభా! భగభగా! గగభగగా! గాగా భాగాగా! గాభాగా! గాగా! గాభగాగా! బాగా!
అలాగే ఎక్కిపోవటం కూడా! మొదట్లో ఏమీ ఆయాసం తోచలేదు. అంతా బాగానే సహజంగానే జరిగిపోతోంది. ఎక్కడానికి దిగడానికి భేదం కనిపించలేదు. రానురాను మెట్లెక్కుతూవుంటే ఆయాసం ఎక్కువయింది. రెండో వ్యక్తి బరువు కూడా నా మీద పడింది. నన్ను దిగజార్చాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నట్టని పించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు నాలో వున్న రాక్షసత్వమేనని నా కిప్పుడు తోస్తూంది.
రాక్షసత్వం ప్రేరేపణ లోబడి దిగిపోతున్నాను. ఎంతో బాగుంది ఆ అనుభవం దాన్ని నేను వర్ణించలేను.
కాని నాలోనే ఇంకొక వ్యక్తి నేను దిగిపోతున్నానని హెచ్చరించినట్లయింది. వెంటనే నా గమనం ఊర్ధ్వ దిక్కు పట్టింది!
ఎక్కడం అనుభవం కూడా ఎంతో బాగుంది! ఎంత బాగుందంటే అంత బాగుంది. అంతకన్నా ఎక్కువ నేను వర్ణించలేను.
దేవత్వం ఊర్ధ్వగమనాన్ని రాక్షసత్వం అధోయాత్రని ప్రోత్సహించాయని ఇప్పుడు మేలుకున్న నేను విడివిడిగా విడదీసి చెప్పగలుగుతున్నానే గాని అప్పుడా స్వప్నంలో ఏది కిందో ఏది మీదో ఎరగనే ఎరగను.
ఇలాంటి కలలు ఎందుకొస్తాయో నాకు! ఇంతకూ దీని సారాంశం ఏమిటి? ఏమీ లేదు. దిగడం, దించడం సులభం, సుఖం! ఎక్కడం, ఎత్తడం (మనల్నీ మన సహచరులనీ) కష్టం దుఃఖం! కాదు సుఖం. ఔను సులభం! మనం ఎక్కడున్నామో ఎప్పుడున్నామో ఎక్కనున్నామో దిగనున్నామో ఎందుకున్నామో ఏం కన్నామో అప్పుడప్పుడు కలల్లో. అదీ అస్పష్టంగా తెలుస్తుంది. దాన్ని సాధ్యమైనంత స్పష్టంగా (నీకే కాక అందరికీ) మాటల్లోనో, రంగుల్లోనో, సంజ్ఞల్లోనో, ధ్వనుల్లోనో లేదా సినిమాలలో లాగా ఈ అన్నింట్లోనో తెలియజెయ్యగలగడం కళ!
---౦౦౦౦---



