Home » kommanapalli ganapathi rao » Grand Mastar


    నిజానికి సరాసరి ఆమె రాకని బ్లూ ఫిలింకే ఉపయోగించుకోవాలను కున్నాడుగాని మనసు అంగీకరించలేదు. తొలిరాత్రి తనే ఉపయోగించుకోవాలనుకున్నాడు.

 

    రేష్మి ఇంట నిన్నటినుంచీ అడుగుపెట్టింది ఒకే ఒక్క వ్యక్తిగా తన అనుచరులు తెలియజేసినా అతడే శ్రీహర్షగా అతడుగాని, రాజీవ్ మనుషులుగాని అనుమానించలేదు.

 

    వేట ఉధృతమౌతున్న క్షణాలలో రూపాన్ని మార్చుకుని తిరగడంలో శ్రీహర్షకున్న ప్రతిభ అతడి ఊహ కందనిది.

 

    కాబట్టి శ్రీహర్ష విషయంలో పొరపాటు పడ్డాడు.

 

    అలా అని తన రక్షణ విషయంలో అజాగ్రత్త చూపించలేదు రాజీవ్.

 

    పటిష్టంగానే ఏర్పాట్లు చేసుకున్నాడు.

 

    ఒకవేళ శ్రీహర్ష వచ్చినా ఎదుర్కోగలిగేంత సెక్యూరిటీవుంది అతడితో బాటు.

 

    రెండు పెగ్గులు సేవించి ఆపేసి రాజీవ్ మరో పెగ్గుకు తొందరపడలేదు. రేష్మి లాంటి అసాధారణమైన అందగత్తెతో తన తొలి అనుభవానికి రెండు పెగ్గుల దూకుడు చాలు.

 

    అతడలా ఆలోచిస్తుండగానే ఆవరణలో కారాగిన చప్పుడైంది.

 

    అలర్టయ్యాడు.

 

    నియమం ప్రకారం రేష్మీ కోసం తనే కారు పంపిన రాజీవ్ యూనిఫాంలో వున్న డ్రయివర్ లోపలికి రాగానే ఆలస్యాన్ని తాళలేనట్టు అసహనంగా అడిగాడు "రేష్మి ఎక్కడ?"

 

    ముందు జవాబులేదు.

 

    "రానందా?"

 

    డ్రయివరు ద్వారంకేసి నడుస్తుంటే కోపంగా అరిచాడు "నిన్నే..."

 

    గడియపెట్టిన డ్రయివర్ వెనక్కి తిరిగాడు నిశ్శబ్దంగా.

 

    "నువువ్..." కంపించిపోయాడు రాజీవ్.

 

    "షా" మృదువుగా నవ్వుతున్నాడు శ్రీహర్ష "నువ్వు కారుతోబాటు పంపిన డ్రయివర్ స్పృహతప్పించి రేష్మి ఇంటినుంచి ఒంటరిగా వచ్చిన శ్రీహర్ష... కదలకు మర్యాదగా డబ్బున్న ఆ సూట్ కేస్ ను యిలా అందించు."

 

    చేష్టలుడిగిన రాజీవ్ సూట్ కేస్ అందిస్తూ చేసిన పొరపాటు గట్టిగా గావుకేక పెట్టడం.

 

    అది తన అనుచరులకు సూచనగా మారుతుందనుకున్నాడుగాని 'షా'ని అంతగా రెచ్చగొడుతుందని భావించలేకపోయాడు.

 

    చంపడం శ్రీహర్ష ఉద్దేశ్యం కాదు.

 

    కాని మరోసారి కేకపెట్టకుండా పిడికిలితో రాజీవ్ గెడ్డంపై గుద్దాడు.

 

    మెదడు నరాలు చిట్లిపోయేటంత బాధగా మాత్రమేకాదు గభాలున గోడకు గుద్దుకున్నాడు.

 

    తల చిట్లిపోయిందేమో రక్తం చిమ్ముతూంది ధారాపాతంగా...

 

    "కిల దిస్ బాస్టర్డ్!"

 

    రాజీవ్ అరిచాడు ఆ స్థితిలోకూడా.

 

    అంతటితో సరిపెట్టుకున్నా బావుండేది.

 

    జేబులోనుంచి రివాల్వర్ తీశాడు.

 

    తలుపులు దబదబా బాదుతున్న అనుచరులందించిన ధైర్యం రాజీవ్ ని బలవంతుడ్ని చేసిందేమో ఉద్విగ్నంగా ట్రిగ్గర్ నొక్కబోయాడు.

 

    రాజీవ్ లాంటి వ్యక్తిపై అంతటి సాహసం ప్రదర్శించాల్సిన అగత్యం లేదుగాని తప్పనిసరయింది.

 

    పగిలిన శిలాజ్ఞాపకాలు గుండెల్లో కదం తొక్కుతుంటే నేలకి నాలుగడుగుల పైకిలేచిన శ్రీహర్ష కుడిపాదంతో రివాల్వర్ ని తన్నుతూ అదే క్షణాన ఎడమపాదాన్నీ ఉపయోగించాడు.

 

    గురితప్పిన రివాల్వర్ చప్పుడు...

 

    మరోసారి తల గోడకు గుద్దుకున్న రాజీవ్ చావలేదుగానీ కొనవూపిరితో రక్తపుమడుగులో పడిపోయాడు.

 

    వేగంగా బయటికి వచ్చిన శ్రీహర్ష ఎక్కువశక్తిని ఖర్చు చేయలేదు.

 

    మెరుపులా కదిలిందిగాని, ప్రభంజనంలా విజృంభించిందిగాని మూడే నిమిషాలు.

 

    రాజీవ్ అనుచరులు ఆరుగురూ స్పృహతప్పి పడిపోయారు.

 

    మరో వ్యక్తి భయంతో పరుగెత్తబోతుంటే హెచ్చరించాడు శ్రీహర్ష "ఆగు..."

 

    భయంతో కాళ్ళను చుట్టేసిన ఆ వ్యక్తితో అన్నాడు "రాజీవ్ చచ్చిపోకూడదు. రక్తం చాలా పోయినట్టుంది. వెంటనే హాస్పటల్ కి తరలించు."

 

    ఇంత చేసిన అతను యిలా ఉపదేశించడమేమిటో అర్థంకాని రాజీవ్ అనుచరుడు "అలాగే" వింటూ వినయంగా తలపంకించి రాజీవ్ వున్న గదిలోకి పరుగెత్తాడు.

 

    ఆ తర్వాత నగరంలోని అతి ప్రముఖులయిన వ్యక్తులంతా నిద్రలేస్తారని, రాజీవ్ ని రక్షించే ప్రయత్నంలో మొత్తం వైద్య విజ్ఞానమంతా అతడికి, మృత్యువుకి మధ్య వారధిగా నిలుస్తుందని శ్రీహర్షకి తెలుసు.

 

    నిస్సహాయతకు అర్థాన్ని, చావులాంటి జీవితంలో వధనీ తెలియచెప్పాలనుకున్న అతను ఆ తర్వాత అక్కడ నిలబడలేదు.

 

    మరో అరగంటలో నగరంలోని ఓ మారుమూల మురికివాడలో అడుగుపెట్టాడు డబ్బుతోసహా.

 

    ద్వారం తెరిచిన సుజాత అవాక్కయి చూసింది "మీరు..."

 

    "నేనిచ్చిన మాట ప్రకారం డబ్బు తీసుకొచ్చాను."

 

    "దోపిడీ చేసారా?"

 

    "లేదు. నీ జీవితాన్ని నాశనం చేసిన రాజీవ్ కి జరిమానా విధించాను."

 

    ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.

 

    "నిజం సుజాతా!"

 

    "అది మాత్రమే సరిపోదు. నాలాంటి మరో అమ్మాయి బలికాకూడదూ అంటే వాడ్ని... వాడ్ని..."

 

    ఉక్రోషంగా మెలితిరిగిపోతున్న సుజాతని వారిస్తూ అన్నాడు "చంపటం నా అభిమతం కాలేకపోయింది సుజాతా. అందుకే దారుణంగా గాయపరచి వదిలిపెట్టాను. బహుశా ఈ పాటికి బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ కి ఏర్పాట్లు జరుగుతూ వుండొచ్చు."

 

    "వాడో రక్తం మరిగిన పులి. రక్తానికేం కొదవ."

 

    "వెళతాను."

 

    "ఒక్క క్షణం..."


Related Novels


The Cine Star

Sathadinosthavam

Agnishwasa

Nestham Neepere Nishshabdham

More