Home » kommanapalli ganapathi rao » Grand Mastar


    అది ఆరాధనో లేక తన జీవితపు చివరి అధ్యాయంలో అడుగుపెట్టి కదిలించిన ఆ వ్యక్తిపై పూజ్యభావమో చేతులు జోడించి అంది "మీ స్ఫూర్తితో వ్యభిచారాన్ని మానేసిన నేను చివరసారి ఈరోజు ఒక వ్యక్తితో శారీరక సంపర్కానికి సిద్ధపడ్డాను."

 

    అతడి భృకుటి ముడిపడింది.

 

    "అతని పేరు మహేంద్ర."

 

    ఉలిక్కిపడ్డాడు శ్రీహర్ష.

 

    "నేను బలయింది ఆ వ్యస్థ మూలంగానే అయినప్పుడు మరెవర్నో బలి తీసుకుంటూ బ్రతకడంలో అర్థం లేదనిపించింది. ఆ ప్రేరణ అందించింది కూడా మీరేగా. అందుకే తెలివిగా వారి ట్రేప్ లోకి నడిచి నా ప్రతీకారం తీర్చుకున్నాను" క్షణం ఆగింది కళ్ళు తుడుచుకుంటూ "నేను సవ్యంగా ఆలోచిస్తున్నానో లేక మృత్యువుకి చేరువవుతూ బేలెన్స్ కోల్పోయి యిలాంటిపని చేసానో నాకు తెలీదు. కాని ఈరోజు నిజంగా నాకు ఆనందంగా వుంది. ఈ ఆనందానికి పరాకాష్టని అనుభవించి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి."

 

    రెప్పవాల్చకుండా చూస్తూ వుండిపోయాడు.

 

    ఏ దేవుడూ విధించని శిక్ష.

 

    ఏ చట్టమూ తీర్చుకోలేని కక్ష.

 

    ముగ్ధలా ఏ మెట్టినింటో అడుగుపెట్టాల్సిన యువతి కాష్టంలా కాలుతున్న జీవితానికి తిరుగులేని మలుపు అందిస్తూ అసాధారణమైన శక్తిని ప్రదర్శించింది.

 

    "చెప్పు." హామీ ఇచ్చాడు శ్రీహర్ష.

 

    "రాజీవ్ కూడా నా మూలంగానే కడతేరిపోవాలి."

 

    "మరణం అంటే ఒక్కసారి విధించిన శిక్ష అవుతుంది సుజాతా- రాజీవ్ లాంటి వ్యక్తులకి జీవితమే ఓ శిక్షకావాలి."

 

    "అదే నా ఆలోచనకూడా" చెప్పింది ఏం చేయాల్సిందీ.

 

    అదిరిపడ్డాడు అంతర్జాతీయ నేరస్థుడిగా అసాధారణమైన మేథస్సుని ప్రదర్శించగల శ్రీహర్ష.

 

    "ప్లీజ్" ప్రార్థనలా చూసింది "ఇది జరగాల్సింది ఇప్పుడే... ఈ రాత్రికే."

 

    ఆప్యాయంగా తల నిమిరాడు శ్రీహర్ష.

 

    అది అంగీకారంగా తెలిసిన సుజాత ఇప్పుడు అతడి పాదాల్ని అభిషేకించింది కన్నీటితో.

 

    అదే ఆమె జీవితంలోని చివరి అభ్యర్థన.


                                    *  *  *


    అదేరాత్రి...

 

    రాజీవ్ ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేయబడ్డాడు.

 

    నగరంలోని ముగ్గురు న్యూరో సర్జన్సుతోబాటు మరికొందరు డాక్టర్లు ప్రత్యేకంగా నర్సింగ్ హోమ్ కి రప్పించబడ్డారు ఆఘమేఘాలపై.

 

    సవ్యసాచి ధియేటరు బయట నిశ్శబ్దంగా కూర్చుని వున్నాడు.

 

    చాలా అరుదైన స్థితి అది.

 

    ప్రభుత్వంలోగాని, పోలీసుల పరంగాగాని చాలా పలుకుబడి వుండీ షా నుంచి తననుతాను కాపాడుకోలేకపోతున్నాడు.

 

    ఒక వ్యక్తి మూలంగా తన సామ్రాజ్యం మొత్తం పునాదులతో సహా కదిలిపోతుంటే ఏం చేయాలో పాలుపోవడంలేదు.

 

    ఏదో చేయాలి.

 

    ఏదో చేస్తే తప్ప షా నుంచి తన వ్యవస్థ రక్షింపబడదు.

 

    ఇంత శక్తివుండీ ఒక వ్యక్తితో తను ఓటమికి సిద్ధపడలేదు.

 

    నిముషాలు గడుస్తుంటే టెన్షన్ కి లోనవుతున్నాడు.

 

    డాక్టర్లు చెప్పిందాన్ని బట్టి రాజీవ్ కి ప్రాణాపాయంలేదు.

 

    కాకపోతే కొన్ని వారాలదాకా కోలుకోలేడు... అంతే.

 

    మరోగంట తర్వాత తెలిసింది.

 

    బ్లడ్ ఎక్కించడం పూర్తయింది.

 

    సరిపోయినంత బ్లడ్ ఆ నర్సింగ్ హోంలో దొరక్కపోవడంతో ఇతర నర్సింగ్ హోమ్ నుంచి రప్పించారు. లక్షలు విరజిమ్మి దేన్నయినా కొనగల శక్తివున్న సవ్యసాచిలాంటి కోటీశ్వరుడు తలచుకుంటే ఏ గ్రూపు బ్లడ్ నయినా సాధించడం కష్టంకాదు. నర్సింగ్ హోమ్ లో దొరకనినాడు బలవంతంగా మనుషుల శరీరాన్ని చీల్చి మరీ రక్తాన్ని సంపాదించగలడు.

 

    ఆ స్థాయికి చెందిన కేపిటలిస్టు సవ్యసాచి.

 

    అయితే ఒకమూల కూర్చుని కొడుకు ఆరోగ్యంకన్నా షా పోరాటం గురించి ఏకాగ్రతగా ఆలోచిస్తున్న సవ్యసాచి వూహించలేదు, ఆ చుట్టుపక్కల కనిపించని షా ఇక్కడ చదరంగంలో ఒక ముఖ్యమైన ఎత్తు వేసాడని.

 

    "యూనివర్సల్ బ్లడ్ డోనర్స్" అనబడే బ్లడ్ బేంకునుంచి అయిదు బాటిల్స్ దాకా రక్తం తెప్పించి రాజీవ్ కి ట్రాన్స్ ఫ్యూజ్ చేస్తే అందులో ఓ బాటిల్ ని షా జాగ్రత్తగా రీప్లేస్ చేశాడు.

 

    ఆ బాటిల్ మరో నర్సింగ్ హోంకి చెందింది.

 

    తనమూలంగా రాజీవ్ కూడా కడతేరిపోవాలని కోరుకున్న సుజాత శ్రీహర్షకి ఇందాక సలహా ఇచ్చింది ఇదే.

 

    రాజీవ్ కి ఉపయోగించిన అయిదు బాటిల్స్ బ్లడ్ లో ఓ బాటిల్లో వున్నది సుజాత రక్తం. ఇరవైనాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు ముఖ్యులకధ అలాంటి మలుపు తిరగటానికి కారణమైంది సుజాత. ఓ మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయి.


                                                             *  *  *


    "ప్రముఖులుతప్ప ప్రెస్ ముందు మాట్లాడటానికి సామాన్యులు అర్హులు కారా" మృదువుగా నవ్వింది సుజాత.

 

    ప్రెస్ క్లబ్బులో ఆమెముందు కూర్చున్న ప్రముఖ పత్రికల రిపోర్టర్సంతా ఒకరిమొహాలొకరు చూసుకున్నారు.

 

    అయినా రాణాలో చలనంలేదు.

 

    నిజానికి ఈ ప్రెస్ కాన్ ఫరెన్స్ ఏర్పాటుచేసింది రాణాయే.

 

    అందరికీ కాకపోయినా రాణాకి తెలుసు ఆమె ఎవరన్నదీ.

 

    కాబట్టే మరికొన్ని నిముషాలలో పత్రికాముఖంగా ఆమె పేల్చాలనుకుంటున్న బాంబుల వర్షాన్ని ఆమెద్వారానే వినిపింపచేయాలని నిశ్శబ్దంగా వుండిపోయాడు.


Related Novels


The Cine Star

Sathadinosthavam

Agnishwasa

Nestham Neepere Nishshabdham

More