Home » Balabhadrapatruni Ramani » అనూహ్య
తెల్లవారింది...
సెకెండ్ బెడ్ రూమ్ లో ఆటకమీదున్న పెట్టె దించడానికి నేను స్టూల్ వేసుకుని తాపత్రయపడసాగాను.
వివేక్ హల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. నా ప్రయత్నం గమనించినా పట్టించుకోలేదు.
అటకమీద చెయ్యిపెట్టగానే , చేతిమీద ఏదో పాకినట్లయింది. మెత్తగా అనిపించి చెయ్యి తీసి చూసేసరికి, బల్లి!
ఒక్కసారిగా కెవ్వుమంటూ స్టూల్ దిగి పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళాను.
అతను తల ఎత్తేలోపే, అతన్ని కరుచుకుని, చెయ్యి విదిలిస్తూ-
"బల్లి...బల్లి" అని అరిచాను.
"లేదు! నీ అరుపులకి హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చుంటుంది" అన్నాడు.
గబుక్కున ళ్ళు తెరచాను అతని భుజం మీద నా తల వుంది. అతను తన మీద ఓ దోమ వాలినట్లుగా , మామూలుగా పేపర్ చదువుకుంటున్నాడు.
వెంటనే లేచి వచ్చేస్తుంటే-
"తల వాల్చడానికి ఓ భుజం కోసం వెదికేవాళ్ళు ఎప్పుడూ స్వతంత్రంగా బ్రతకలేరు" అన్నాడు.
రోషంగా చూశాను.
అతను నా వైపు చూడలేదు.
"హూ!" అని మళ్ళీ స్టూలెక్కి నా ప్రయత్నం మొదలెట్టాను. పెట్టె చాలా బరువుగా వుంది దించడం నా ఒక్క దానివల్లా అయ్యేపనిలా లేదు. అలా అని అతని మీద ఆధారపదాలనీ లేదు. "ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా-
"ఏం కావాలమ్మా?" అంటూ వరాలిచ్చే దేవతలా పనిమనిషి వరాలు ప్రత్యక్షమైంది.
నా ప్రయత్నానికి దైవం అనుకూలించినట్లుగా, ఎంతో శుభంగా అనిపించింది
"వరాలు... ఈ పెట్టె దింపి పెట్టు, ఇందులో నా సర్టిఫికెట్స్ వున్నాయి" అన్నాను.
వరాలు నొసలు చిట్లించి-
"సత్తుగిన్నెలా?" అంది.
నేను గబుక్కున హాల్లోకి తొంగిచూశాను. అతను లీలగా నవ్వడం కనిపించింది.
నాకు ఒళ్లు మండిపోయి- "సర్టిఫికెట్లు అంటే నా డిగ్రీ అన్నమాట!" అన్నాను.
"డిగ్రీ అంటే?" వరాలు కుతూహలంగా అడిగింది.
ఏదో ఒకటి నీకెందుకు వరాలూ?' అని అలవాటుగా విసుక్కోబోయి, అంతలోనే అతను వింటున్నాడని గుర్తొచ్చి "ఆ కాయితంలో నా చదువు సంగతి రానుంటుంది. అది చూపిస్తే నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తారు" అన్నాను.
వరాలు విడ్డూరంగా నోటిమీద వేలేసుకుని-
"ఆ కాయితంసూపితే కానీ మీరు సదువుకున్నారని ఆళ్లు నమ్మరా?" అంది.
నేను విసుగ్గా "ఉహూ!" అన్నాను.
"మీ నోటిమాటమీద నమ్మిక లేనోడికాడ మీరేటికమ్మా ఉద్యోగం సెయ్యడం? ఊరుకోండి! నేను అంట్లు తోమగాలనూ, బట్టలుతకగలనూ...అంటే నమ్మి నన్ను మీరు పనిలో ఎట్టుకున్నారాలేదా? అట్టాగే మీరు సబితే ఆడు నమ్మాలికదా!" అని లా పాయింట్ లేవదీసింది.
"వరాలూ! వాగుడు ఆపి ముందు చెప్పిన పని చెయ్యి" అని అరిచాను.
"అట్టాగే! అంత అరుపు ఏటికమ్మా?" అని అది స్టూలెక్కి పెట్టె క్రిందకి దించంది.
"ఈ మాత్రం బరువు మొయ్యలేరు మీరేం ఉగ్యోగాలు సేస్తారమ్మా?" అని నవ్వింది.
ఆ నిమిషంలో అదీ, వివేక్ అందరూ నా పాలిట విలన్ లలా కనిపించారు.
"నేనేం పెట్టెలు మోసే ఉద్యోగం చెయ్యబోవడం లేదు" కోపంగా అన్నాను.
"రైల్వే పోర్టర్లుగా పట్టభద్రులైననిరుద్యోగ యువకులు" వివేక్ పేపర్ చదువుతున్నట్లుగా పెద్దగా అంటున్నాడు.
నేను కోపంగా పెట్టె తెరిచాను లోపలంతా దుమ్ముగా వుంది. అందులోంచి వెదికి ఓ ఆకుపచ్చ రంగు ఫైలు బయటికి తీశాను.
మూడేళ్ళక్రితం అటకెక్కిన నా డిగ్రీ నా చేతుల్లోకి వచ్చి కళకళలాడినట్లుగా కనిపిస్తోంది.
"వరాలూ!" అంటూ తల పక్కకి తిప్పాను.
వరాలు అక్కడ లేదు!
నేను పైలుని అపురూపంగా గుండెలకి హత్తుకుని, వంటింట్లోకి వెళ్ళాను.
వరాలు ఏదో కొత్త సినిమా పాట పాడుకుంటూ, సింక్ లో అంట్లు తోముతోంది.
నేను ఆనందంగా వరాలూ ఇదిగో నా డిగ్రీ!" అన్నాను నాతో కలిసి ఈ ఆనందం పంచుకోవడానికి దానికన్నా నా కెవరూ కనిపించలేదు.
అది నా చేతిలోని గోధుమరంగు కాయితాన్ని ఓసారి తేరిపారజాసింది.
"పాతగిల్లిపోయింది. గానీ ఓ మారు అయ్యగోరితో చెప్పి కొత్తది కొనిపించుకోండి. మా వోడు నా పాత పట్టా గోలసులకి ఎట్టా మెరుగెట్టించుకొచ్చినాడో నూడండి!" అంటూ చీర మోకాళ్ళవరకూ లేవనేత్తీ' చూపించింది.
పట్టాకీ కాలి పట్టా గొలుసులకీ తేడా తెలీని దాని అజ్ఞానానికి బాధపడుతూ నేను ఇవతలకి వచ్చేశాను.
ఫోన్ రింగ్ అయింది.
అతను తీసి-" ఆఁ...హలో ...గుడ్ మార్నింగ్ ఏంజిల్...ఉంది... ఇస్తాను. వన్ మినిట్!" అని ఫోన్ టేబుల్ మీద పెట్టి-
"విజయ దగ్గర్నించి" అన్నాడు.
'అందరూ ఏంజిల్సే! కట్టుకున్న పెళ్ళాం తప్ప!' అనుకుంటూ వెళ్ళి ఫోన్ తీశాను.
"నేను ఎడ్రెస్ చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకో! ఓ అరగంటలో నువ్వు అక్కడుండాలి! పెన్ తీసుకో....ఆ! వ్రాస్తున్నావా...గాంధీనగర్ ... రెండోలైను..." విజయ గడగడా ఊపిరి తీసుకునే వ్యవధి లేకుండా చెప్పేస్తోంది.



