Home » Balabhadrapatruni Ramani » అనూహ్య
"తిలకం అని ఓ పిల్ల వుండేది... ఎలా వుండేదనుకున్నావు? కండ పట్టిన జాంపండులా వుండేది! భలే సరుకులే....ఏం వింటున్నావా?" అన్నాడు.
'వినడంలేదు. విననుకూడా!' అనాలనుకున్నాను. కానీ బాగా తాగివున్నాడు. కోపం వచ్చి మధ్యలోనే దింపేస్తాడేమోనని ఊరుకున్నాను. ఆయన తిలకంతో తను జరిపిన శృంగారం గురించి నెమరేసుకోవడంలో మునిగిపోయాడు.
నాకు ఆ నిమిషంలో వివేక్ ని పట్టుకుని ఆ చెంపా, ఈ చెంపా వాయించెయ్యలనిపించింది. ఇలా చెప్పుకోలేని కష్టాలు ఎన్నో పెడ్తుంటాడు. అసలు బాధ్యతున్న మగాడు చేసే పనులేనా ఇవీ! ఈ పాటికి ఇంట్లో హాయిగా గురకపెట్టి నిద్రపోతుంటాడు. అలా అనుకోగానే రక్షగా అనిపించింది.
అలనాడు ఆ శ్రీ రామచంద్రుడు సీతమ్మని వదిలి పెట్టేటప్పుడుకూడా తోడిచ్చే పంపాడు పాపం! ఈనాడు వీళ్ళు కన్వీనియంట్ గా వదిలి పెట్టేయడం ఒక్కటే నేర్చుకున్నారు.
ఆటో మా ప్లాట్స్ ముందు ఆగగానే నాకు మళ్ళీ ప్రాణం వచ్చినట్లనించింది.
చెంగున దూకి 'అమ్మయ్యా దేవుడున్నాడు!' అనుకుంటూ పరుగు లాంటి నడకతో పైకి చేరాను. బెల్ కొట్టి, అది మోగేలోగానే దబదబా తలుపులు బాదాను. తలుపు తెరుచుకాకపోవడంతో పర్సులోంచి కీ తీశాను. ఇంతలో వివేక్ తలుపు తెరిచాడు.
నేను అతన్ని చూస్తూనే- "అసలు ఏవిటి మీ ఉద్దేశం ?" అని అరిచాను.
కానీ అతను అప్పటికే మళ్ళీ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయి ముసుగు పెట్టేశాడు.
వెనకే వెళ్ళి- "నన్ను విడిచిపెట్టేసి వచ్చారు ఎoదుకూ?" అని అరిచాను.
అతను కొద్దిగా రగ్గు తొలగించి-" విడిపోదాం అన్నావుగా !" అన్నాడు.
"ఇంకా మనం ఆ విషయంలో ఓ నిర్ణయానికి రాలేదుగా " అన్నాను.
"ఎవరూ? నువ్వా? నేనా?" అన్నాడు.
నాకు చాలా అవమానంగా అనిపించింది.
అతను లేచి నోట్లో సిగరెట్ పెట్టుకుని, అగ్గిపెట్టె కోసం వెదుక్కుంటూ వుండగా, నేను మంచంక్రింద నుండి తీసి అందించాను.
అతను సిగరెట్ వెలిగించుకుంటూ- "రావడానికి ఇబ్బందైందా?" అన్నాడు.
ఆ అడగడంలో హేళన కనిపెట్టి, "ఏం కాలేదు! హాయిగా వచ్చాను" అన్నాను.
"అహా!" అని వెనక్కి వాలి పడుకుని, రిలాక్స్ డ్ గా సిగరెట్ పీలుస్తూ-
"ఇంత ఆలస్యంయిందేం మరీ?" అన్నాడు.
ఆ ప్రశ్నలకి ఒళ్లుమండినా, సహనంగా-
"బస్ రాలేదు" అన్నాను.
"బస్ లో వచ్చావా?" అడిగాడు.
"ఉహూ! ఆటోలో వచ్చాను"
"ఒక్కదానివేనా?"
ఈ మాటతో నా కోపం నషాళానికి అంటింది.
"ఇందాకట్నించీ చూస్తున్నాను. ఏవిటా ప్రశ్నలూ? ఒక్కదానినీ క్షేమంగా రాలేననుకున్నారా? లేకపోతే చచ్చిపోతాననుకున్నారా? మీరు విడిచి పెడ్తే నేను బ్రతకలేననుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏవిటీ?" అంటూ విరుచుకుపడ్డాను.
అతను మాట్లాడలేదు.
వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు.
"నాకిదే మీలో నచ్చనది. మాట్లాడ్తుంటే వినిమిటీ? మాట్లాడ్తున్నదీ మనిషే!" అన్నాను.
అతను కళ్ళు తెరవకుండానే-
"ఆలోచిస్తున్నాను!" అన్నాడు.
"ఏవిటో అంత ఆలోచన?" వ్యంగ్యంగా అడిగాను.
"అదే... నేను బొంగరం మావయ్యని పంపించకపోతే ఇంటికి ఎప్పుడు చేరేదానివా అని?" అన్నాడు.
ఉలిక్కిపడ్డాను! ఆ నిమిషంలో భూమి రెండుగా చీలి నన్ను తన కడుపులో దాచేసుకుంటే బావుండ్ను అనిపించింది. చాలా సిగ్గేసింది. అరుస్తున్న నా నోరు టక్కున మూతపడిపోయింది!
గుడ్ నైట్ అని అతను ముసుగు పెట్టేసుకున్నాడు.
నేను నీరసంగా హాల్లోకి నడిచి సోఫాలో కూల బడ్డాను. 'నువ్వెందుకూ పనికిరావు' అని ఎంత చక్కగా నిరూపించాడూ! అసలు నేనెందుకిలా అన్నింటికి అతనిమీద ఆధారపడడం? చదువు తక్కువనా? దైర్యం తక్కువనా?
వెంటనే నా కాళ్లమీద నేను నిలబడాలి. ఓ ఉద్యోగ వెదుక్కోవాలి. నేను మో పెడ్ మీద ఆఫీసుకి వెళ్ళిపోతున్నట్లూ, వివేక్ విస్తుబోయి చూస్తూ నిలబడినట్లూ ఊహించుకుంటూ ఎప్పటికో నిద్రపోయాను.
తెల్లవారుజామున బాగా చలేసింది.
లేచి బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. వివేక్ గాఢనిద్రలో వున్నాడు. నేను ఓ పక్కగా పడుకుని అతనిమీదున్న బ్లాంకెట్ కొద్దిగా లాగాను.
బ్లాంకెట్ పాటుగా అతనూ వచ్చి మీద పడ్డాడు. ఒక్క విదిలింపు విదిలించాను.
అతను దూరంగా జరిగాడు
నిద్రలో అతనిముఖం చాలా ముద్దోస్తోంది. నుదుటి మీద అల్లరిగా పరుచుకున్న జుట్టుని వెనక్కి జరపాలనిపించినా, అతనిమీద కోపం ఆ పని చెయ్యొద్డంది. అతనికాలు నాకుడిపాదం మీద వుంది. నాకు తెలియకుండానే కొద్దిగా దగ్గరగా జరిగాను చాలారోజులైంది అతను నన్ను దగ్గరగా తీసుకుని ! ఆ స్పర్శ కావాలని నా శరీరం గారాలు పోసాగింది.
'ఛుప్ నోర్ముయ్' అని గదిమినా నా మాట వినడంలేదు!
ఇంకా దగ్గరగా జరిగాను.
వివేక్ నా వైపు తిరిగాడు.
హత్తుకుపోమంటున్న మనసుని జో కొట్టి, అసలు అతనేం చేస్తాడోనని ఎదురుచూశాను. అతని చెయ్యి నన్ను దగ్గరగా లాక్కుంది.
నేను కళ్లు గట్టిగా మూసుకున్నాను.
నా ముఖానికి అతని పెదవుల స్పర్శ తెలుస్తోంది. నా పెదవులు ఆహ్వానం పలుకుతున్నట్లుగా కొద్దిగా విడిపడ్డాయి సిగ్గూ, అభిమానం, అవి పూర్తిగా వదిలేశాయి. అతని పెదవులు నా పెదవులని హత్తుకున్నాయి.
అతని పన్ను నా క్రింద పెదవిలో దిగి నేను చిన్నగా మూలిగాను.
అతను గభాల్న కళ్ళు తెరచి-
"నువ్వా!" అన్నాడు.
అంతే, నా మత్తంతా వదిలిపోయింది. ఆ ఒక్క ఎక్స్ ప్రెషన్ చాలు!
అతని నుంచి విడిపోవడానికి!
"మరి ఎవరనుకున్నారూ?" ఉక్రోషంగా అడిగాను.
అతను మాట్లాడలేదు.
"మాట్లాడరేం?" రెట్టించాను.
"రేపు విదిపోయకా ఇలా చలేస్తే ఎవరి పక్కలో దూర్తావు?" అన్నాడు.
"మీరూ?" అడిగాను.
"నా సంగతి సరే! అతను అదోలా నవ్వి "బోయ్ ఫ్రెండ్స్ వున్నారా నీకూ!" అని అడిగాడు.
"ఇప్పటిదాకా లేరు. చూసుకుంటాను" వంతంగా అన్నాను కళ్లు వర్షించడం మొదలెట్టేశాయి.
"అయితే చివరిసారిగా ఒకసారి...." నామీద చెయ్యేసి తన దగ్గరగా లాక్కుంటూ అన్నాడు.
"ఆఖ్ఖర్లేదు" విదిలించుకుని మళ్ళీ సోఫాలో వచ్చి పడుకున్నాను.
శరీరం, మనస్సూ రెండూ బాధ తట్టుకోలేక కొంకర్లుపోతున్నాయి.
'ఇటువంటి మొగుడు పగ వాళ్ళకి కూడా వద్దు' అని గట్టిగా అనుకున్నాను.
గతస్మృతులు కరిగి వేకువఝామై నన్ను లేపాయి.
* * *



