Home » Balabhadrapatruni Ramani » అనూహ్య
8 వవారం సీరియల్
విజయ నన్ను వారిస్తున్నట్లుగా చెయ్యి చూపిస్తూ-
"అసలు వ్యక్తిత్వం అంటే తెలుసా నీకు? కెన్ యూ డిఫైన్ ఇట్ ?" అంది.
ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తోచనట్లు ఆలోచిస్తూ వుండిపోయాను.
విజయ నెమ్మదిగా అంది- "ఏడాది క్రితం అతను నిన్ను పెళ్ళాడతాననగానే ఇతని చేతుల్లో నా జీవితం నిశ్చింతగా గడిచిపోతుందన్న దైర్యంతో చెంగున ఎగిరి గెంతేసి పెళ్ళిచేసేసుకున్నావు! చదివిన చదువు ఉండ చుట్టి ఆటకమీద పారేశావు! అతనినుంచి ఈ క్షణందాకా నీకు కావలసిన రక్షణా, చీరలూ, నగలూ అన్నీ పొందుతూనేవున్నావు!
కనీసం ఒక్కరోజైనా నీ వ్యక్తిత్వం ఏవిటో అతనికి అర్ధమయ్యేట్లు స్వతంత్రంగా ఒక్క నిర్ణయం అన్నా తీసుకున్నావా? ఒక్కపనైనా నువ్వంటే అతనికి గౌరవం కలిగి 'అరె ఎంత బాగా చేసిందీ' అన్నట్లుగా చేసి చూపించావా?"
"నేనూ..." అని చెప్పబోయాను.
విజయ తల అడ్డంగా ఊపి-
"ముందు పూర్తిగా విని అప్పుడు మాట్లాడు. మీ హల్లో పైన వేళ్ళాడగట్టిన షాండ్లియర్ ఖరీదు ఎంతో నీకు తెలీదు! మీ బెడ్ రూమ్ కిటికీలకున్న కర్టెన్స్, అతను ఎక్కడినుండి తెచ్చాడో నువ్వు చెప్పలేవు! అంతెందుకూ... మీకు నెలకి ఎంత కరెంట్ బిల్ ఆవుతుందో, ఫోన్ బిల్ ఎంత కడ్తాడో నువ్వు చెప్పలేవు! యామ్ ఐ రైట్!" అని అడిగింది.
నేనేం మాట్లాడగలనూ? అవన్నీ నిజంగా నేనెప్పుడూ పట్టించుకోలేదు. అందుకు ఇలా సిగ్గుతో తలవంచుకునే రోజు వస్తుందని అసలు ఊహించలేదు!
"నువ్వే కాదు, చాలామంది ఆడవాళ్ళు ఇంతే! ప్యూజ్ పోతే వేసుకోవడం చేతకాక పక్క ఇళ్ళలోని మగవాళ్లకోసం పరుగులు పెడ్తారు. గ్యాస్ సిలిండర్ కనెక్ట్ చేసుకోలేనివాళ్ళనీ, మేకు వంకర పోకుండా కొట్టుకోలేనివాళ్ళనీ నేను చూశాను.
ఐదునిమిషాలు ఓర్పుగా ప్రయత్నిస్తే సాధించే విషయాలకోసం, జీవితాంతం మొగుడిమీద ఆధారపడే వాళ్ళు ఎందరో! పక్కింటావిడతో మార్నింగ్ షోకి మొగుడికి తెలీకుండా వెళ్ళిపోయే ఆడవాళ్లు, పిల్లవాడికి ప్రమాదంగా వుంటే 'ఆయనోచ్చాక హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి' అని ఏమీ చేతకానట్లు మాట్లాడడం నేను స్వయంగా విన్నాను!
'అమ్మో! ఆయనకి తేలిస్తే చంపేస్తారు... అంటూ ఆ జాతికి ఆదిపత్యం అలవాటుచేసి, ఇప్పుడొక్కసారిగా ఏదో సాహిత్యం చదివీ, సినిమాలు చూసీ 'మా వ్యక్తిత్వాలని గుర్తించడంలేదు' అంటూ గోలపెడ్తే తప్పెవరిది? మీరేం ప్రూవ్ చేసుకున్నారని మీ గొప్పతనం గుర్తించడానికి?" అని నవ్వి "అని వాళ్ళు ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్పగలం?" అంది.
నేను అసహనంగా పెదవిని మునిపంట బిగపట్టి మౌనంగా కూర్చున్నాను.
విజయ వాడిగా-" అతనితో విడిపోవాలనుకున్నాక గానీ ఉద్యోగంవిషయం తలపెట్టలేదు నువ్వు! చాప మీద తల వంచుకుని కూర్చుని అతనికి నచ్చానని మురిసిపోయి బుద్దిగా పెళ్ళాడేశావు. పోనీ తర్వాతైనా మంచంమీద అడ్డంగా పడుకుని సీలింగ్ కేసి చూస్తూ అతన్ని విశ్లేషించుకోవడం మాని ఏ ఉద్యోగప్రయత్నమో లేదా నీలోని ఏ కళనైనా పెంపొందించు కోవడమో చెయ్యాల్సింది!
ఇప్పుడు సడెన్ గా అతనితో పడక ఉన్నపాటున నీ కాళ్ళమీద నువ్వు నిలబడడానికి నీ కాళ్ళు సహకరించక ఎవరి ఆలంబనకోసమో, సానుభూతికోసమో అర్రులు చాస్తున్నావు! అతను సామాజికంగా అందరి భార్తలలాగే నిన్ను చూస్తున్నాడు. నిన్ను ఇంతకన్నా గొప్పగా చూడడానికి కారణాలు లేవు.
నువ్వు వచ్చినప్పటినుండీ నాతో చెప్పుకున్న కష్టాలన్నీ మరే గృహిణితో చెప్పుకున్నా నీ మానసిక స్ధితిని తప్పక అనుమానిస్తుంది!" అంది.



