Home » Yandamuri veerendranath » Rakshasudu


    అంతలో దగ్గరగా కుక్క మొరిగిన శబ్దం వినిపించి ఉలిక్కిపడ్డాడు. అత్యంత సమీపంలో వినిపించింది. రైఫిల్ సర్దుకున్నాడు. బయటపడటం అంటూ వీలుకాకపోతే కనీసం నాలుగు జగిలాల్నీ, ఇద్దరు ముగ్గురు గార్డుల్ని చంపి చావటానికి నిశ్చయించుకున్నాడు. అంతలో చెట్లచాటునుంచి కుక్క బయటకొచ్చింది.

 

    గార్డ్ మీదికి దూకి, వాళ్ళని రక్షించిన కుక్క అది ! అతడు రైఫిల్ దాచేశాడు. సింహం చెయ్యి అప్రయత్నంగా దాని తలని నిమిరింది. "పదండి" అంటూ అతడు తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడు. అతడు ఎడమపక్కకి తిరగటం చూసి సింహం "అటెక్కడికి" అన్నాడు. పడవ కుడివైపున వుంది. అతడు సమాధానం చెప్పలేదు. అప్పటికే అతడు చాలాదూరం వెళ్ళిపోయాడు. అందరికన్నా వెనుక వున్నది రాజన్. అతడి గాయాలనుంచి రక్తం ఇంకా స్రవిస్తూనేవుంది. సింహం తల మీద నుంచి కూడా రక్తం కారుతూవుంది. వాళ్ళు ముగ్గురూ ఆ అడవి చీకట్లో కదులుతూన్న ప్రేతాల్లా వున్నారు. తరుముకు వచ్చే మృత్యువు ముందు తరలిపోతున్న మాంసపు ముద్దల్లా వున్నారు.

 

    కొద్దిసేపటికి వాళ్ళు కొలను దగ్గరకు చేరుకున్నారు. అతను అటెందుకు దారితీశాడో సింహానికి అర్థమైంది. జంతువుల్ని చంపే మత్తు వుండలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడివున్నాయి. వీలయినన్నింటిని గబగబా ఏరుకొని వారు నడక సాగించారు.

 

    వేటకుక్కల అలికిడి ఈసారి మరింత దగ్గరగా వినిపించింది. ముగ్గురూ ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. ఆ అరుపులు వాళ్ళ గుండెల్ని దూసుకుపోయే శూలాల్లా వున్నాయి. అతడు తను ఎప్పుడూ ఎక్కే చెట్టు మీదికి రాజన్ నీ, సింహాన్నీ ఎక్కించాడు.

 

    సింహం తలనుంచి కారి గడ్డకట్టిన రక్తాన్ని చూపుడు వేలుతో ముద్దగా తీసుకున్నాడు. హృదయాన్ని ద్రవించేదీ, ఏహ్యాన్ని కలిగించేదీ ఏదయినాసరే- ప్రాణం కన్నా ఎక్కువకాదు.

 

    మనిషి రక్తాన్ని మత్తు వుండలకి రాసి, కుక్కలు వచ్చేదారిలో వదిలి, తను మరో చెట్టు ఎక్కాడు. సరీగ్గా రెండు నిముషాల్లో, ఉప్పెన కెరటంలా దూసుకువచ్చాయి జాగిలాలు. మొత్తం నాలుగు... మనిషెత్తువున్నాయి ఒక్కొక్కటి! పారిపోయిన ఖైదీలజాడ అక్కడి వరకూ సరీగ్గానే పట్టుకున్నట్టు వాటి భంగిమ తెలుపుతోంది. ఒక జాగిలం సింహం వాళ్ళున్న చెట్టు మీదకు చూస్తూ కాలు పైకెత్తి మొరగసాగింది.

 

    అతడు వూపిరి బిగపట్టి చూడసాగాడు.

 

    ఇంకొంచెం సేపట్లో వెనుకే గార్డులు వస్తారు. చెట్టు మీద వున్న ఇద్దర్నీ క్రిందికి కూల్చటానికి రెండు తుపాకి గుళ్ళు చాలు.

 

    ఏం చెయ్యాలా అని అతడు ఆలోచనలో వుండగానే మొరగటం ఆగింది. అతడు చప్పున క్రిందికి చూశాడు.

 

    జాగిలం వుండని తింటూంది. మిగతా మూడు కుక్కలు కూడా వాటిని తినే ప్రయత్నం చేస్తున్నాయి. అతడి రక్తం వడివడిగా ప్రవహించసాగింది. ఇంకొక్క నాలుగు నిముషాలు... ఇంకొక్క నాలుగు నిముషాలు గార్డులు రాకుండావుంటే ఈ జాగిలాలు మత్తులోకి జారుకుంటాయి.

 

    ఒకటి... రెండు ... మూడు...

 

    అడ్డం వచ్చిన కొమ్మల్ని నరుక్కుంటూ గార్డులు ప్రవేశించారు.

 

    అప్పటికే జాగిలాలు ముందు కాళ్ళమీద వంగి పడిపోవటానికి ఉపక్రమిస్తున్నాయి. ఆ దృశ్యంచూసి గార్డ్ లు ఆవేశంతో చిందులుతొక్కారు.

 

    "వాడే...వాడే తప్పించుకున్నది. ఉండలు పెట్టడం వాడొక్కడికే తెలుసు... ఇటే వెళ్ళుంటాడు, వెతకండి.."

 

    నలుగురూ నాలుగు పక్కలకి బయల్దేరారు. అతడు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నాడు. అయిదు నిముషాలు ఆగి చెట్టు దిగి, సింహం వాళ్ళున్న చెట్టు దగ్గరికి వచ్చాడు.

 

    "ఈ రాత్రి ఇక్కడే వుందాం" అన్నాడు సింహం -రాజన్ పరిస్థితిని సూచిస్తూ.

 

    "కుదరదు. ఈ రాత్రి ఎంత దూరం వీలయితే అంతదూరం వెళ్ళిపోవాలి. పడవ వరకూ వెళితే మరీ మంచిది" అన్నాడతను. "ఈ కుక్కల మరణంతో మొత్తం పోస్టులలోవున్న జాగిలాలన్నీ ఈ రాత్రికిరాత్రి రప్పించబడతాయి. ముగ్గురు వ్యక్తుల బట్టలు, మిగతా వస్తువులూ వాటికి "పరిచయం" చేయబడతాయి. వెంటనే వేట ప్రారంభమవుతుంది. ఈసారి గార్డ్ లు కుక్కల్ని ముందులాగా వదిలిపెట్టరు. గొలుసుల్తో వెంబడిస్తారు. కాబట్టి ఈ వుండల టెక్నిక్ ఇక పనికిరాదు. అదీగాక ఈ పాటికే ఈ వార్త రెండు, మూడు పోస్టుల వాళ్ళకి తెలిసిపోయి వుంటుంది. అట్నుంచి వాళ్ళు వెతకటం మొదలుపెట్టి వుంటారు".

 

    శరీరాన్ని చీల్చే ముళ్ళ ఆకులు, కాళ్ళకి అడ్డు తగిలే దుంగలు, కళ్ళకి బాణాల్లా కొట్టుకునే పురుగులు, అలికిడికి నిద్రాభంగమయి బుస్సుమనే పాములు- భయం, బాధ, దుఃఖం, ఆతృత- అన్నీ మిళితమై నిస్సత్తువ పరుగు-పరుగు-పరుగు.

 

    నెమ్మదిగా సూర్యకిరణం బయటకొచ్చింది. పక్షుల కిలకిలా రావాలతో అడవి మేల్కొంటూంది. దూరంగా కాలువ. దాని మీద సూర్యరశ్మి పడి తెల్లగా పరావర్తనం చెందుతోంది. వాళ్ళు ఒకర్నొకరు సంతృప్తిగా చూసుకున్నారు. మొదటి అంశం నిర్విఘ్నంగా గడిచిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా రాజన్ ఇంక నడవ నవసరం లేదు.

 

    సింహం అయితే కాలువని చూడగానే ఆనందంతో చిన్న కేకపెట్టి అటువైపు పరుగు తీశాడు. క్షణాల్లో మిగతా ఇద్దరుకూడా అక్కడికి చేరుకున్నారు. కాలువ నిర్మలంగా ప్రవహిస్తూంది. భూమ్మీద మంచి నీళ్ళలోకి వంగిన రెల్లుగడ్డి, ప్రవాహపు తాకిడికి అటూఇటూ వూగుతోంది.

 

    పడవ మాత్రం లేదు.

 

                                 *    *    *

 

    అతడు కొంచెం సేపటివరకూ తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు.

 

    అతడి మొదటి అనుమానం ఆమె మీదకు వెళ్ళింది. ఆమె కోర్కెకాదన్నానని ఈవిధంగా 'కసి' తీర్చుకుందా? అలా తీర్చుకుంటే, అంతకన్నా రాక్షసత్వం మరొకటిలేదు. ఇంత ఆశపెట్టి చివరికి ఈ అపాయంలో చిక్కుకునేలా చేసి ప్రేక్షకురాలిలా చూస్తూ ఆనందించటం.... ఇప్పుడిక గార్డ్ లకి దొరికితే... ఆ పైన ఇక ఆలోచించలేక పోయాడు.

 

    మనుషుల్లో ఇంత కృతఘ్నులు వుంటారని అతడు అనుకోలేదు. నీళ్ళలో చేతివేళ్ళ కొసలకు తగిలిన ఆమె నగ్న శరీరం, టెంట్ లోపల్నుంచి వినబడిన చిరునవ్వు "ఈ" ఆకారంలో ఇచ్చిన మ్యాపు.... అన్నీ చివరికి తనని వెధవని చేయడానికేనా....  

 

    "ఏం జరిగిం" దన్నట్లు సింహం రాజన్ లు తనవైపు చూస్తూన్న చూపుల్ని తట్టుకుని అతడు కాలువవైపు నాలుగడుగులు వేశాడు.

 

    పొద అలాగే వుంది. పొదకి కట్టిన తాడు అలాగే వుంది. కానీ సగానికి తెగి వుంది. ఏదో అనుమానం వచ్చి పరీక్షగా చూశాడు. తాడు సగానికి తెగినట్టువుంది.

 

    ఏదో జంతువు కొరికినట్టు !

 

    అతడు మరింత జాగ్రత్తగా పరిశీలించాడు. అనుమానం నిజమని ధృవీకరించుకున్నాడు. నక్కో మరే జంతువో తాడుని కొరికేసింది... తను అనవసరంగా ఆమెను అనుమానించాడు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More