Home » Yandamuri veerendranath » Rakshasudu
అతడు చెరసాల నుంచి బయటకు అడుగు పెట్టేసరికి కనబడిన దృశ్యం అది. వాళ్ళు ఇటే రావటం చూసి అతడు మెరుపులా చీకట్లో మళ్ళీ చెట్ల వెనక్కి పరుగెత్తాడు. మనుష్యులు గమనించలేదు గానీ, అతడు అంత వేగంగా వెళ్ళినా కూడా కుక్క పసిగట్టి వెంటపడింది. దాంతో అనుమానం వచ్చి ఒక గార్డు వెనుదిరిగి కుక్క వెళ్ళిన వైపుకి పరుగెత్తాడు. రెండోవాడు రాజన్ మీద బోయినెట్ తో పొడుస్తూ "ఇంకా ఎందరున్నారు బే- మీలో" అంటూ ముందుకు తోశాడు.
"ఇంకెవరూ లేరు" అన్నాడు రాజన్ వగరుస్తూ. అతడి శరీరం రక్తంతో తడిసిన మాంసపు ముద్దలా వుంది. పక్కనే నడుస్తూన్న సింహం వెనక్కి తిరిగి చూశాడు.
ఈ లోపులో చెట్ల మధ్యకి చేరుకున్న జాగిలం ముందుకాళ్ళు ఎత్తి అతడి మీదకు దూకబోయింది. దాంతో పోరాడే ప్రయత్నం చేయటం ఎంత నిష్ప్రయోజనమో అతడికి తెలుసు. కేవలం దాని గోళ్ళు గుచ్చుకున్నా, ఒక్క పన్ను దిగినా చాలు అంతా విషం వ్యాపించడానికి.
ఆ క్షణంలో తన ప్రాణాలు పోయాయనే అనుకున్నాడు. శిలాప్రతిమలా నిలబడ్డాడు. ఒక క్షణం గడిచినా ముందు నుంచి ఏ అలికిడీ లేకపోయేసరికి అతడు అమితాశ్చర్యంతో కళ్ళు విప్పాడు.
ఎదురుగా ఆ జాగిలం అతడినే చూస్తూంది... కదలకుండా.
అతడిని గుర్తుపట్టినట్టు!!
రాత్రిళ్ళు అడవిలో తిరిగే అతడికి కొన్ని కుక్కలు తెలుసు. అదృష్టవశాత్తూ వాటిలో ఇదొకటి. అతడిని గుర్తుపట్టింది.
అతడు చెయ్యి ముందుకు సాచాడు. తనవేళ్ళు వణకటం స్పష్టంగా అతడికి తెలుస్తూంది. ఆ జాగిలం ఏ మాత్రం అపార్థం చేసుకున్నా కష్టం.... అతడు చెయ్యసాచి దాని కళ్ళపైన మృదువుగా నిమిరాడు. అది తలవంచింది. ఇక దాని నుంచి ప్రమాదం లేదు.
అంతలో గార్డు వెతుక్కుంటూ వస్తూన్న చప్పుడు వినపడింది. ముందు కుక్క వెళ్ళటం వల్ల అతడు కాస్త అజాగ్రత్తగా వస్తున్నాడు. చెట్టు వరకూ రానిచ్చి చాటునుంచి అతడు గార్డుమెడ మీద బలంగా కొట్టాడు. గార్డు ముందుకు తూలిపడ్డాడు. ఈ ఆకస్మిక సంఘటన ఏమిటో గార్డు గ్రహించేలోపులోనే "అతడి" కాలు గార్డు మెడని నొక్కిపట్టింది. చిన్న ఆర్తనాదంతో గార్డు అచేతనుడయ్యాడు.
కుక్క దీన్నంతా మామూలుగా, ఏ ఉద్రేకమూ లేకుండా చూస్తుంది. అతడు మరి ఆలస్యం చేయలేదు. ఆ అడవిలో పై బట్ట లేకుండా ప్రయాణించటం ఎంత కష్టమో అతడికి తెలుసు. క్షణాల్లో గార్డు చొక్కా అతడి నుంచి వేరుచేసి తను వేసుకున్నాడు. అతడి చేతిలోని రైఫిల్ తీసుకుని చెట్ల చివరకొచ్చాడు.
కుక్క అతడిని అనుసరించింది.
ఈ లోపులో రాజన్ నీ, సింహాన్నీ నిలబెట్టిన గార్డు, మొదటివాడు వెళ్ళిన వైపుకి చూస్తూ "ఏం? ఇంకెవరైనా వున్నారా" అని అరిచాడు. అతడు గొంతు మార్చి "లేరు" అన్నాడు.
ఇక దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయింది. చొక్కా గార్డుదే కాబట్టి పర్వాలేదు. పాంటు గుర్తుపడితే కష్టం. అయినా దైర్యం చేశాడు.
వెనక రైఫిల్ తో గార్డు వున్నాడు. ముందు రాజన్, సింహాలు ఉన్నారు. అతడు చెట్ల తాలూకు చీకట్లోంచి వెలుగులోకి ప్రవేశించాడు. రైఫిల్ చుట్టూ చెయ్యి అప్రయత్నంగా బిగుసుకుంది. తనని ముందు సింహం కనిపెట్టి గుర్తుపడితే, అదృష్టం తనవైపు వున్నట్టే. అలా కానిపక్షంలో, ఇంకొద్ది క్షణాల్లో గార్డుతో జరగబోయే ఘర్షణలో అన్నిటికన్నా ప్రమాదకరమైనది "జాగిలం".
అతడు ఓరకంటితో తన వెంటే నడుస్తూ వస్తూన్న కుక్కవైపు చూశాడు. నాలుగు నిమిషాల క్రితం తనతో సహకరించిన ఈ జాగిలాన్ని చంపటానికి మనసొప్పలేదు అయినా తప్పదు.
అతడు సింహం వాళ్ళున్న చోటుకి పది గజాల దూరంలోకి వచ్చాడు.
"ఎవరైనా వున్నారా అక్కడ?" గార్డు అడుగుతున్నాడు.
అతడు ఊపిరి బిగపట్టాడు. మరో రెండు అడుగులు వేసి, తగినంత దగ్గిరికి వచ్చానని అనుకున్నాక, ఒక్క గెంతు పక్కకి వేసి జాగిలాన్ని బోయినెట్ తో గుచ్చబోతూ "సింహం! వాడి సంగతి చూడు" అని అరిచాడు.
రైఫిల్ ప్రేలిన చప్పుడు వినబడకుండా తాము పారిపోవాలని అతడి ఉద్దేశ్యం. అయితే అతను గార్డు కాదనీ 'అతడనీ' అన్న విషయం జీర్ణం చేసుకోవటానికి సింహానికి లిప్తకంటే ఎక్కువ కాలం పట్టింది. సింహం కన్నా గార్డు ఆ విషయాన్ని ముందు గ్రహించాడు. బోయినెట్ తో కుక్కవైపు వంగుతున్న అతడి చేతిమీద రైఫిల్ తో కాల్చాడు. అతడి చేతిలో ఆయుధం ఎగిరిపోయింది. సింహం చప్పున వెనుదిరగబోయాడు గానీ, అప్పటికే ఆలస్యం అయింది. గార్డు రైఫిల్ వెనక్కి తిప్పి సింహం తల మీద బలంగా మోదాడు.
తాగివున్నా, గార్డు అంతవేగంగా కదలటాన్ని అతడు విస్మయంతో చూశాడు. రాజన్ అయితే దిక్కు తోచనట్టు నిలబడిపోయాడు. ఈ లోపులో గార్డు రైఫిల్ తో ముందుకొచ్చాడు. నిరాయుధుడిగా వున్న అతడిని తమ తాలూకు గార్డు చొక్కాలో చూసి జరిగింది గ్రహించి ఆవేశంతో రైఫిల్ పేల్చబోయాడు.
అప్పుడు జరిగింది ఒక అనూహ్యమైన సంఘటన.
అప్పటివరకూ అతడి పక్కనే నిలబడి వున్న జాగిలం ఒక్క ఉదుటున గార్డు మీదికి గెంతింది. రైఫిల్ తో సహా గార్డు వెనక్కిపడ్డాడు. అనుకోకుండా జరిగిన దానికి అతడోక్షణం తబ్బిబ్బయ్యాడు. అయితే అది క్షణకాలం మాత్రమే. జాగిలం పళ్ళు గార్డు గొంతులోకి దిగినయ్. అతడు దాన్ని చూడటంలేదు. ముందు జరగవలసింది గుర్తొచ్చి, చెట్ల వైపుకి పరుగెడుతూ "తొందరగా" అన్నాడు. వెనుకే రాజన్, సింహాలు అతడిని అనుసరించారు.
అతడి అనుమానం నిజమైంది. వాళ్ళు చెట్ల వెనక్కి పరుగెత్తటం ప్రారంభించిన రెండు నిముషాలకల్లా యార్డులో కలకలం వినిపించింది. రైఫిల్ పేలిన శబ్దానికి చుట్టుపక్కలున్నవాళ్ళూ, నిద్రలోవున్నగార్డులూ మొత్తం అంతా లేచి, బిలబిలమంటూ అక్కడికి వచ్చారు. మరణించిన గార్డుని చూసి పెట్రేగిపోయారు. అయితే "రాబిస్" వచ్చి అకస్మాత్తుగా జాగిలం తిరగబడటం వల్ల జరిగిన సంఘటన అనుకున్నారు. ఖైదీలు పారిపోయిన విషయం ఇంకా వారికి తెలీలేదు. రెండోగార్డు శరీరం కూడా బయటపడితే తప్ప తెలీదు. ఈ లోపులో వీలయినంత దూరం పారిపోవాలి.
ఆ విధంగా, అన్ని సంవత్సరాల తరువాత మొదటిసారి ఆ దీవి నుంచి తప్పించుకునే ప్రయత్నం జరిగింది.
వాళ్ళ ఆగలేదు. పరుగెడుతూనే ఉన్నారు. వెనుక మృత్యువు అంచెలంచెలుగా దగ్గరపడటానికి సమాయత్తమవుతూంది.
అంతలో ఒక్కసారిగా సైరన్ లాంటి ధ్వని వినబడింది. అంటే రెండో గార్డు శరీరం బయటపడటం, ఖైదీలు తప్పించుకున్న విషయం బయటపడటం జరిగిందన్న మాట.
వాళ్ళ పరుగువేగం హెచ్చింది.
దూరంగా వేటకుక్కలు మొరగటం వినిపిస్తూంది. అతడు తనలో తనని తిట్టుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగి వుంటే- గార్డులకీ విషయం తెలిసేలోగా తాము అయిదారు కిలోమీటర్ల దూరంలో వుండేవారు.



