Home » Yandamuri veerendranath » Rakshasudu
జరిగిందంతా తెలియగానే రాజన్ దుఃఖించటం ప్రారంభించాడు. మిగతా ఇద్దరూ అతడిని ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. ముప్పై అయిదు సంవత్సరాలుగా ఆ అడవితాలూకు అంధకారంలో మునిగిపోయి, బయటపడే క్షణంలో చివరి క్షణంలో ఎదురుగా మృత్యువు మందహాసం చేస్తూంటే దుఃఖం రాకేమి చేస్తుంది?
తరువాత ఏం చెయ్యాలన్నది ప్రశ్న.
అతడు సింహం వైపుతిరిగి, "కాలువ అంచునే వెళ్ళాలి. అదృష్టం బావుంటే పడవ దొరకవచ్చు" అన్నాడు. "ఏదైనా పొదల్లో చిక్కుకుంటే".
"ఈ ప్రవాహంలో పడవ ఎక్కడ ఆగి వుంటుంది?"
"ఇంకో దారి లేదు"
"కానీ గార్డులు ఇక్కడే ఎక్కువ నిఘా వేస్తారు".
"చెప్పానుగా. ఇంకో దారిలేదు. వెనక్కి వెళ్ళితే అడవిలో చిక్కుబడిపోతాం. అస్థిపంజరాలుగా మారిపోతాం. కాలవనే పట్టుకుంటే, కనీసం మరణం అన్నా సుఖంగా వస్తుంది".
సింహం కొంచెం ఆలోచించి "సరే" అన్నాడు. అతడికీ ఆలోచన మనస్పూర్తిగా ఇష్టం లేదన్నది తెలుస్తూనేవుంది. అదీ నిజమే. ఇంకో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గార్డు కాంపు వుంది. అదీగాక గార్డులు కుక్కల్ని "అలర్ట్" చేసి వుంటారు. అవి నది దగ్గర వేచివుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రాత్రిళ్ళు కాలువ "అంచునే" వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. రాత్రిళ్ళే జంతువులు మనుష్యులకన్నా బాగా గమనించగలవు. కాలువ ఒడ్డుకి అవి రాత్రిళ్ళే వస్తాయి. తమ మధ్యకి పరాయి జీవి ఏదొచ్చినా సహించవు.
"మనం కాలువ దాటి అటు వెళదాం" అన్నాడు అతడు.
"ఎందుకు?"
"వేటకుక్కలు ఇక్కడివరకూ ఎలాగూ వస్తాయి. కాలువలో అటువెళ్ళటం ద్వారా మన "వాసన" కాస్త పోగొట్టుకోవచ్చు".
గొప్ప ఆలోచన కాదు. కానీ ఆ పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకూడదు. వాళ్ళు నీళ్ళలోకి దిగారు. ఆ చిన్న కాలువని అటువైపుకి ఈదటానికి అరగంట పట్టింది. దాన్నిబట్టి అంతర్వాహిని ఎంత బలంగా వుందో తెలుస్తోంది. ఈ లెక్కన పడవ ఎక్కడా ఆగి వుండదు.
ముగ్గురూ అవతలి వడ్డుకి చేరుకున్నారు. ఆశా నిరాశల మధ్య కొట్టుకుంటూ వాళ్ళు నడక కొనసాగించారు.
"మనం గార్డ్ పోస్టులకి దూరంగా దట్టమైన అడవి మధ్యలో వున్నాం. గార్డ్ లు పగలే వెతుకుతారు. మిట్టమధ్యాహానికి ఇంత దూరం వస్తారు. కాబట్టి ఈ నాల్గయిదు గంటలూ మనం కదలకుండా వుండటం మంచిది. ప్రస్తుతం నిద్రపోదాం. గార్డ్ కాంపు దగ్గిర పడేకొద్దీ ప్రొద్దున- సాయంత్రాలు జాగ్రత్తగా వుండాలి."
అతడి ఊహాశక్తికి అబ్బురపడి, సింహం అతడి చెయ్యి మీద చెయ్యి వేసి, "ఇంతకాలం నాకు మనం తప్పించుకోగలం అన్న నమ్మకం లేదు. పడవ పోవటంతో అది పూర్తిగా పోయింది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎందుకో ఆశ కలుగుతోంది" అన్నాడు.
కానీ, ఆ ఆశకి సరీగ్గా మూడు గంటల తరువాత అనూహ్యమైన రీతిలో, ఊహించని కోణం నుంచి ప్రమాదం వచ్చి పడింది....
మొదట సన్నని మూలుగు వినిపించింది. అతడు కళ్ళు చిట్లించి చుట్టూ చూశాడు. మళ్ళీ వినిపించింది. అది రాజన్ వద్ద నుంచి వస్తున్నట్టు కనుగొని అతడు దగ్గరికి వెళ్ళి నుదుటిమీద చెయ్యివేసి చూశాడు.
...ఆ సమయానికి 'అతడు' కాపలా కాస్తున్నాడు. సింహం, రాజన్ లు నిద్రపోతున్నారు. నుదురు చల్లగా వుంది. గురకని మూలుగనుకుని భ్రమపడినందుకు సిగ్గుపడి మళ్ళా అతడు తన యధాస్థానానికి వెళ్ళాడు. చుట్టూ అడవి, దూరంగా కాలువ. అంతా ప్రశాంతంగా వుంది.
ఒక్కసారిగా తూర్పు దిక్కునుంచి చల్లటిగాలి వీచటంతో అటు చూశాడు. ఆకాశం అంతా మేఘావృతమై వుంది. అట్నుంచి వర్షం కమ్ముకొస్తూంది. అతడు సంతోషించాడు. వర్షంలో వేటకుక్కలు వేగంగా వాసన పసిగడుతూ పరిగెత్తలేవు.
అతడు ఆలోచనల్లో వుండగానే మొదటి వర్షపు చుక్క టప్ మని మీద పడింది. నిముషం గడిచేసరికల్లా జల్లు మొదలైంది.
అప్పుడు వినిపించింది రాజన్ కేక! వర్షంకేసి చూస్తూన్న అతడూ, గాఢనిద్రలో వున్న సింహం ఒక్కసారిగా ఆ కేకకి అదిరిపడి అటు చూశారు. రాజన్ మొహం వికృతంగా వుంది. పడే ఒక్కొక్క వర్షపు చుక్కకి అతడు పాములా మెలికలుతిరిగిపోతున్నాడు. నాలుకబయటపెట్టి అరుస్తున్నాడు. భూమిలోకి వేళ్ళు దింపి, గోళ్ళతో మట్టి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎర్రటి కమ్మీతో వాతలు పెట్టినట్టు ఒక్కొక్క వర్షపు చుక్కకి అతడు భూమ్మీద నుంచి పైకి ఎగురుతున్నాడు. రాజన్ లో ఈ ఆకస్మిక మార్పు, భయంకరమైన చేష్టలుచూసి క్షణంపాటు నిర్విణ్ణుడయ్యాడు. వెంటనే తేరుకుని అటు పరుగెత్తాడు. ఈ లోపులో సింహం లేచి రెండు చేతుల్తోనూ రాజన్ ని గట్టిగా పట్టుకున్నాడు. రాజన్ అతడిని విడిపించుకోవటానికి ప్రయత్నించసాగాడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అతడు దగ్గరగా వెళ్ళి రాజన్ ని చూసి అచేతనుడయినట్టు నిలబడి పోయాడు.
రాజన్ సింహం మెడ కొరకడానికి ప్రయత్నిస్తున్నాడు. గోళ్ళతో గుచ్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతడి ఎర్రకళ్ళమీద రెప్పలు క్రిందికి వాలిపోయి వున్నాయి. నాలుక బయటికీ, లోపలికీ కదులుతోంది.
హై... డ్రో... ఫో... బి... యా...!
ఇంగ్లీషు పేరు తెలీదుగానీ, కుక్క కరవటంపట్ల వచ్చే వ్యాధి ఆ అడవిలో వారికి కొత్తకాదు. ఇప్పుడిప్పుడే దానికి మందు కూడా వచ్చింది. కానీ అది గార్డ్ ల క్యాంపులో వుంటుంది.
అతడు సింహానికి సాయం చేశాడు. ఎలాగయితేనేం రాజన్ కి స్పృహ తప్పించి తిరిగి పడుకోబెట్టగలిగారు. దాదాపు గంట గడిచిన తరువాత వర్షం తగ్గింది. "ఇక బయలు దేరాలి" అన్నాడు.
"ఇతడినేం చేద్దాం?"
"తీసుకు వెళదాం."
సింహం విస్మయంగా చూశాడు అతడివైపు.
"మనసుకి సంతృప్తి కలిగించే ప్రతి విషయానికీ తర్కం అవసరం లేదు సింహం! పాతికసంవత్సరాలుగా ఈ జైలునుంచి బయటపడదామని ప్రయత్నించి, చివరి క్షణంలో ఈ దురదృష్టకరమైన అవస్థలో ఓ అభాగ్యుడి ప్రాణాలు రక్షించటం కోసం మనం ఆఖరి వరకూ పోరాడామన్న సంతృప్తి ముందు- ఇతడి ప్రాణాలు ఎలాగూ మనం కాపాడలేమన్న తర్కం నిలవదు. అదృష్టవశాత్తూ మనం యీ దీవినుంచి బయటపడితే ఇప్పుడితడిని వదిలేసిన అసంతృప్తి మనవి జీవితాంతం వేధిస్తుంది. ఏ తర్కమూ ఆ అసంతృప్తిని పోగొట్టలేదు".
రాజన్ ని ఇద్దరూ చెరోవైపూ పాడెలా భుజాలమీద వేసుకున్నారు. తోటకూర కాడలా వేలాడే ఆ శరీరంతో తిరిగి ప్రయాణం సాగించారు. ఆ నిముషం నుంచీ వారికి నరకం ప్రారంభమయింది. ఇద్దరూ చెరో భుజం పైనా ఒక మనిషి శరీరంతో నడవటం కష్టమయింది. గంట తిరిగేసరికల్లా అలిసిపోయారు.



