Home » Yandamuri veerendranath » Prarthana
"నేనా ఆసుపత్రి నుండే వస్తున్నాను".
"మీకెవరో రాంగ్ ఇన్ఫర్ మేషన్ ఇచ్చి వుంటారు" అని అక్కడ నుండి కదిలిపోయాడు డాక్టర్.
వసుమతి హతాశురాలై ఏమీ పాలుపోక ఒక్కక్షణం అలాగే నిలబడి వెనక్కి తిరిగింది. ఆమె తన గది చేరుకోబోతూ తనకి చెప్పిన నర్సుకోసం చూసింది. కానీ ఆమె కనబడలేదు. ఆమె గదిలోకి వెళ్ళి సగం వలచిన బత్తాయిపండును చేతిలోకి తీసుకోబోతూంటే గదిలో ఏదో వెలితిగా కనబడింది, ఏదో లేక-పోయినట్టు...
అరక్షణం తరువాత అర్ధమయింది. ఆ లేనిది పక్కమీద పేషెంటు- అని.
నోట మాటరాక అయోమయంగా ఆ ఖాళీ పక్కవైపే కొంచెంసేపటి వరకూ చూస్తూ వుండిపోయింది వసుమతి. తరువాత చప్పున స్పృహ లోనికి వచ్చినదానిలా గాలిలా గదిలోంచి బయటకు వచ్చింది.
అదే సమయానికి మెట్లెక్కి పైకి వస్తున్నాడు డాక్టర్ మహేంద్ర. తడారిన గొంతుతో "ప్రా... ప్రార్థన కనిపించటంలేదు" అంది. ఆమె చెప్తున్నది అతడికి అర్థంకాలేదు. భృకుటి ముడిపడింది- "నర్స్" అని బిగ్గరగా పిలుస్తూ లోపలికి అడుగుపెట్టాడు.
"మీరు నా కోసం కబురు పంపారని తెలిసి నేనటు రాగానే..." అంటూ ఏదో చెప్పబోతూ వుంటే అతడు మధ్యలో కట్ చేసి "నేను కబురు పంపటం ఏమిటి?" అన్నాడు.
ఆమె జవాబు చెప్పబోయి ఏదో స్ఫురించినట్లు చప్పున ఆగిపోయింది.
* * *
మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ ఆవరణలోకి భార్గవ కారు ప్రవేశించింది. ఎవరూ దానిని ఆపుచేయలేదు. అప్పటికి బాగా చీకటి పడటంవల్ల స్టాఫ్ కూడా లేరు. భార్గవ సరాసరి కారుని తన లాబ్ వరకూ తీసుకుని వెళ్ళి ఆపుచేసాడు. పాపని ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. తిరిగివచ్చి కారులోంచి ఎక్స్ ప్లోజివ్స్ ఒకటి తర్వాత ఒకటి తీసుకువెళ్ళి లోపల పెట్టుకున్నాడు. తర్వాత కారు తీసుకువెళ్ళి దూరంగా వదిలి వెనక్కు వచ్చాడు. ముందు తలుపులు బిగించి వేశాడు. కిటికీ తలుపులన్నీ సరిగ్గా లాక్ చేసి వున్నాయో లేదో పరీక్షించాడు. బయటనుండి ఎవరు ఆటంకపరిచినా విసరటానికి అనువుగా హాండ్ బాంబ్ చేతికి అందేదూరంలో పెట్టుకుని అమినో ఆసిడ్స్ వున్న బీకరువైపు నడిచాడు. నడుస్తూ వుంటే అతడి ఫాలభాగం ఎడమవైపు అదిరింది.
దక్షిణ కేరళ ప్రాంతంలో అలా ఫలభాగం అదిర్తే అతి తొందరలో తన మరణంగానీ తన దగ్గిర వాళ్ళ మరణంగానీ సంభవిస్తుందని ఇప్పటికీ నమ్ముతారు. భార్గవ కలాంటి నమ్మకాలు లేవు.
* * *
సరిగ్గా అదే సమయాన మోగుతున్న ఫోన్ రిసీవర్ యెత్తి "హల్లో" అన్నాడు రవూఫ్.
"నేను మహేంద్రని. డాక్టర్ మహేంద్ర జైన్ ని మాట్లాడుతున్నాను".
"చెప్పండి సర్."
అవతల్నించి చెపుతున్నది వింటూ రవూఫ్ ముఖ కవళికలు మారిపోసాగాయి. అయితే తనేమీ మాట్లాడకుండా మధ్యలో "అచ్చా-అచ్చా" అంటూ కాగితంమీద నోట్ చేసుకోసాగాడు.
జైన్ చెప్పటం పూర్తవగానే ఫోన్ పెట్టేశాడు. అతడి పెదాలమీద కర్కశమైన నవ్వు వెలిసింది.
పేషెంటుని ఎత్తుకుపోయింది భార్గవే! అందుకు సందేహంలేదు. అతడు ముల్లోకాల్లో ఎక్కడవున్నా గంటా, రెండు గంటల్లో పట్టుకోగలడు. ఆ తరువాత...
రవూఫ్ నవ్వు మరింత విశాలమైనది. డ్రాయర్ తెరిచాడు. నిగ నిగ లాడుతున్న రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు.
తన డొక్కల్లో భార్గవ కొట్టిన దెబ్బని అతడింకా మర్చిపోలేదు. లాకప్ నుండి వదిలిపెడుతూ తనన్న మాటలు కూడా మర్చిపోలేదు.
కనపడగానే ఎఫ్.ఐ.ఆర్., అరెస్టు అలాంటివేమీ లేవు. షూట్ చేసెయ్యడమే.
అతడు లేచి నిలబడ్డాడు.
5
"నాయుడూ, కదలకు!"
"నాయుడూ, కదలకు"
"నీ చుట్టూ బిగుసుకున్న క్లాంప్స్ కి సైనేడ్ పూయబడింది".
....
"కొంచెం టైమివ్వు" అన్నట్టు సైగ చేశాడు శేఖరం. ప్రియ టేప్ రికార్డర్ బటన్ ముందుకు నొక్కింది.
.............
"చెదరకు! నేనే శేఖరాన్ని. నీ దయవల్ల మాట్లాడలేను కాబట్టి కంఠం అరువు తెచ్చుకున్నాను".
అతడు బ్రెయిలీలో వ్రాసుకుపోతుంటే ఆమె మాటల్ని టేప్ చేస్తూంది.
ఆ రోజు రాత్రి నాయుడు ఇంట్లో జరగబోయే దృశ్యం అంతా వూహించుకుంటూ, అతడు తన వంతు సంభాషణని రన్నింగ్ కామెంటరీలా వ్రాస్తున్నాడు. ఆమె దాన్ని టేప్ లోకి ఎక్కిస్తూంది. అలా దాదాపు అరగంట గడిచింది.
అంతకుముందే అతడు తనేం చెయ్యదల్చుకున్నాడో వివరంగా ప్లాన్ వేసి, దానికి కావాల్సిన సామాన్లు కొనుక్కున్నాడు. కొద్దిగా చీకటి పడుతూ వుండగా, ఇద్దరూ నాయుడింటికి బయల్దేరారు. శేఖరం మొహం గంభీరంగా వుంది తను చెయ్యటానికి పూనుకున్న పని కష్టసాధ్యమైనదనీ, ముఖ్యంగా తను గుడ్డివాడు అవటంవల్ల అది మరింత కష్టం అవుతుందనీ, అతడికి తెలుసు. పొరపాటున తను పట్టుబడితే, తనొక్కడే శిక్ష అనుభవించాలి తప్ప దీనిలో ఆ అమ్మాయి ఇరుక్కోకూడదు అని అతడి ఉద్దేశ్యం.
వాళ్ళు నాయుడు ఇంటికి చేరుకునేసరికి మసకచీకటి పడింది. అతడి ఇల్లు మిగతా వాటినుంచి దూరంగా విసిరేసినట్లు వుంటుంది. ముందున్న వాచ్ మెన్ కి వెనుక జరుగుతున్నది ఏదీ తెలీదు. యిల్లు తాళం వేసి వుంది. నాయుడు కుటుంబంతో సహా గుజరాత్, భార్య పుట్టింటికి వెళ్ళాడు. ఆ రోజు ఫ్లయిట్ లో రావాలి. అదృష్టవశాత్తు అదో మూడు గంటలు లేటు. ఈ విషయాలన్నీ ప్రియ కనుక్కుంది.
అతడు ఆ ఇంటిలోకి ప్రవేశించిన తరువాత ఆమెని వెళ్ళిపొమ్మని చెప్పాడు. నాయుడు ఇంటిలో ప్రవేశించిన అరగంటకి వెనుకవైపు వీధి చివర్లో నిలబడితే, తను వస్తాడు. ఒకవేళ ప్లాను ఫెయిల్ అయ్యి, తను పట్టుబడితే, ప్రియ అట్నుంచి అటే వెళ్ళిపోవాలి.



