Home » Yandamuri veerendranath » Prarthana
వరండాలోంచి కాకుండా లాన్ ద్వారా అవతలి వార్డు చేరుకున్నాడు. అదృష్టవశాత్తూ అక్కడ జనసంచారం తక్కువగా వుంది.
మలుపు తిరిగి మెట్లెక్కి పైకి వెళ్ళాడు. వసుమతిగానీ, డాక్టర్ మహేంద్రగానీ కనబడతారేమోనని అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. చివరి మెట్టెక్కి వరండా మీదకి కాకుండా మలుపు దగ్గరే నిలబడి వరండాలోకి తొంగిచూశాడు.
ప్రార్థన వున్న వార్డు అది! మెట్ల దగ్గిర్నుండి వరుసగా మూడో గదిలో వుంది తన కూతురు.
ఈ లోపులో పైన వరండాలో ఇటునుండి అటు మరో నర్సు వెళ్తూ కనబడింది. ఏదో స్ఫురించి అతడు వెనుదిరిగి అప్పుడే పైకి వస్తున్నవాడిలా కొద్దిగా ఆయాసపడుతూ నర్సుతో ప్రార్థన ఉన్న గది చూపిస్తూ "ఆ గదిలో వసుమతి అనే ఆమె వుంటుంది. ఆమెను అర్జంటుగా డాక్టర్ జైన్ రమ్మంటున్నారు అని చెప్పు" అని ఇంగ్లీషులో అనేసి ఆమెకి తిరిగి ప్రశ్నించే ఛాన్స్ ఇవ్వకుండా ఎంత స్పీడుగా వచ్చాడో అంత స్పీడుగా మెట్లు దిగిపోతూ మలుపు దగ్గర ఆగి, "డాక్టర్ జైన్ ఈజ్ ఇన్ ఫిమేల్-బర్న్స్" అని దాదాపు అరిచి విసురుగా క్రిందికి వెళ్ళిపోయాడు.
నర్సుకి ఒక క్షణంపాటు ఏమీ అర్థంకాలేదు. అయోమయంగా మెట్లవైపు చూసి తర్వాత ప్రార్థన గదివైపు తలతిప్పింది. డాక్టర్ జైన్ నుండి వార్త తీసుకొని వచ్చినవాడు, ఆస్పత్రికి సంబంధించినవాడే అనుకోవడంలో ఆమె పొరపాటు లేదు. ప్రార్థన గది దగ్గరికి వెళ్ళి "మీరేనా వసుమతి?" అని అడిగింది. వసుమతి తల వూపగానే "డాక్టర్ జైన్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఫిమేల్-బర్న్స్ లో వున్నారు" అంది.
అంత అకస్మాత్తుగా డాక్టర్ తనను ఎందుకు పిలిపించాడో తెలియక వసుమతి కంగారు పడింది. అందోళనగా లేచి నిలబడి "ఎందుకు?" అని అడిగింది. కానీ అప్పటికే నర్సు వచ్చిన పని పూర్తయినట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
వసుమతి మెట్లు దిగి క్రిందకు వెళ్ళింది. జనరల్ హాస్పటల్ రోడ్ కి అటువైపున వుంది ఫిమేల్- బర్న్స్. ఎక్కడ వుందో ఆమెకు తెలీదు. వాకబు చేసుకుంటూ అటువైపు మళ్ళింది.
ఈ లోపులో భార్గవ స్తంభం చాటునుండి వడివడిగా ప్రార్థన గదిలోనికి ప్రవేశించాడు.
జననానికీ మరణానికీ మధ్య వూగిసలాడుతున్న కూతుర్ని కాదు అతను చూస్తున్నది. తనని గుర్తించే వాళ్ళెవరయినా కనబడకముందే అక్కడనుండి తప్పుకోవాలి. అతడు గదంతా కలయజూసాడు. గదిలో ఒక మూల స్టూలు, దానిమీద వసుమతి సగం వలచి పెట్టిన బత్తాయిపండు ఉన్నాయంతే.
ఏం చెయ్యటానికీ పాలుపోక అతడు గదిలోనుండి బయటకు వచ్చాడు. వరండాలో ఒకమూల నాలుగు గుమ్మాల అవతల కనబడింది- చక్రాల కుర్చీ.
వడివడిగా ఆ కుర్చీ దగ్గరకు వెళ్ళి దాన్ని తోసుకుంటూ ప్రార్థన దగ్గరికి రాసాగాడు. ఇంకోరెండు గుమ్మాల అవతల ప్రార్థన గది ఉందనగా లోపల గదిలో నుండి హఠాత్తుగా నర్సు బయటికి వచ్చింది. భార్గవ కూడా తొందరలో ఎడమవైపు నుండి వస్తుండడంతో ఆమె గుమ్మంనుండి బయట అడుగు పెట్టగానే కుర్చీతోసహా ఆమెను ఢీకొనబోయాడు.
కొద్దిసేపుంటే ఆమె చేతిలో సీసా నేలజారేదే. తూలి పడబోయి కుర్చీ కోడు పట్టుకొని నిలదొక్కుకుంది. భార్గవ గుండె కాసేపు ఆగిపోయింది. తల బాగా క్రిందకు వంచి క్షమాపణలు చెప్పుకుంటున్నట్లు గొణిగాడు. అదృష్టవశాత్తూ ఆమె అతడివేపు చూడకుండా "ఇట్సాల్ రైట్" అని మెట్లవైపు వెళ్ళిపోయింది.
భార్గవ గుండెలనిండుగా వూపిరి పీల్చుకుని ప్రార్థన గదిలో ప్రవేశించాడు. మంచం ప్రక్కగా కుర్చీ నిలబెట్టి అటువైపు వెళ్ళి కూతురిచేతికి వున్న ఐ.వి. ఫ్లూయిడ్ గొట్టాన్ని లాగేసాడు. ఆ నొప్పికి ప్రార్థన కళ్ళు విప్పింది.
ఆ స్థితిలో కూడా ఆ అమ్మాయి మొహం తండ్రిని చూడగానే గుప్పున వెలిగింది.
"పన్నూ! నాతో వచ్చేస్తావామ్మా? వచ్చేస్తావా?"
ప్రార్థన మాట్లాడలేదు. కానీ ఒక్కసారిగా కళ్ళలోకి సంభ్రమం తోసుకురావడాన్ని అతడు గమనించేడు. "తీసుకువెళ్ళిపో డాడీ! నన్ను తీసుకువెళ్ళిపో" అని ఆమె హృదయ విదారకంగా అన్న మాటలు గుర్తొచ్చినయ్! ఎంతో బాధపడితేగాని- వెళ్ళిపోవడానికి అంత ఆనందపడదు.
"పాపా, నువ్విక్కడెలానూ బతకవు, నాతో వచ్చెయ్యి. ఓ మహాయజ్ఞంలో సమిధవయ్యావన్న సంతృప్తితోనైనా మరణిద్దువుగాని" పైకనలేదు ఆ మాట. మనసులోనే అనుకున్నాడు. మెడక్రింద చెయ్యివేసి జాగ్రత్తగా ఆమెను కుర్చీలో కూర్చోబెట్టాడు. చుట్టూ దుప్పటి కప్పాడు.
తాపీగా కుర్చీ తోసుకుంటూ గదిలోనుండి బయటకువచ్చి వరండాలో నుండి క్రిందికి దిగిపోయాడు.
లాన్ ప్రక్కనే వున్న సన్నటి సిమెంట్ బాటవెంట నడుస్తూ వసుమతి కనబడుతుందేమోనని భయపడ్డాడు. కానీ ఆమె ఎదురు పడలేదు. కూతుర్ని మెయిన్ గేటుగుండా తీసుకువెళ్ళడం అతనికి యిష్టంలేదు. అతను కారుని ఓ.పి., వెనుకవేపు ఆపుచేసి వుంచాడు. అటువైపు తీసుకువెళుతూ సడన్ గా తను దారి తప్పానని గ్రహించాడు. వరండాలో నుండి క్రిందకి రెండు మెట్లున్నాయి తప్ప చక్రాల కుర్చీ వెళ్ళడానికి అనువుగాలేదు. మళ్ళీ వెనక్కు వెళ్ళడం ఇష్టంలేదు. అది రిస్కు. అతడు కుర్చీ ముందుభాగం పైకెత్తి కూతురు శరీరానికి ఏమాత్రం కుదుపు తగలకుండా ఆ రెండుమెట్లు క్రిందకి దించబోయాడు. ఇంతలో వెనుకనుండి "హేయ్" అని వినబడింది.
భార్గవ ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది.
శిలాప్రతిమలా నిలబడిపోయాడు.
ఇంతలో అతన్ని పిలిచిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అతడో డాక్టరు.
"వీల్ ఛైర్ తీసుకువెళ్ళే దారి ఇటుకాదు"
భార్గవకి ఏం చెయ్యాలో తోచలేదు. అతడు దయవున్న వాడిలా వున్నాడు. భార్గవ ఛైర్ ని ఆఖరిమెట్టు దింపడానికి సాయపడుతూ "ఏమిటి కంప్లయింట్?" అని అడిగాడు.
"మలేరియా" అని భార్గవ అతడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కుర్చీని బయట తోటవైపుకి తోసుకువచ్చాడు. ఒక్కసారి చల్లటి గాలి రివ్వున కొట్టింది. దూరంగా కారు కనిపిస్తోంది.
అతడు కారువరకూ కుర్చీ తీసుకువెళ్ళి పాపను రెండు చేతులతోను ఎత్తి అందులో పడుకోబెట్టి వచ్చి, ముందుసీట్ లో కూర్చుని కారుని స్టార్టు చేసాడు.
ఔట్ పేషెంట్ క్యూ నుండి కారు సున్నితంగా ముందుకు తాపీగా జారిపోయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు.
* * *
"ఫిమేల్-బర్న్స్ ఎక్కడా" అని వాకబు చేసుకుంటూ వసుమతి అక్కడకు చేరుకునేసరికి దాదాపు పది నిముషాలు పట్టింది. అక్కడి డాక్టర్ ని ప్రశ్నిస్తే "ఎవరూ? అన్ కాలజిస్ట్ మహేంద్రా! ఆయన యిక్కడెందుకుంటారు? కాన్సర్ లో వుంటాడు" అన్నాడు.



