Home » Yandamuri veerendranath » Prarthana
అసలిదంతా ఆమెకిష్టంలేదు. కానీ అతడి పట్టుదల ఆమెకు తెలుసు. కావలిస్తే ప్రియురాలినయినా వదులుకుంటాడేమో కానీ, పగ మర్చిపోలేడు. ఈ సంగతి తెలుసుకున్నాక ఆమె మరి ఎదురు చెప్పలేదు.
ఇద్దరూ ఇంటి వెనుకవైపు నిలబడ్డారు. నీటి గొట్టం మీదుగా అతడు లోపలికి ప్రవేశించటానికి దాదాపు ర్గంత పట్టింది. ఆమె వివరించిన ఆ ఇంటి టోపోగ్రఫీ జీర్ణించుకోవటానికి అతడికి మరో పది నిముషాలు పట్టింది. ఆమె వెళ్ళిపోవటానికి సిద్ధపడింది.
అతడు జేబులోంచి ఒక కాగితాన్ని తీసి యిచ్చి క్రిందకు వెళ్ళి చదువు కొమ్మన్నట్టు సైగ చేశాడు. అంతకుముందే వ్రాసి వుంచి, ఇప్పుడే ఆఖరి క్షణంలో ఇవ్వవలసినంత కాగితం ఏమిటా అని ఆశ్చర్యపోయింది. అయినా విస్మయాన్ని ప్రకటించకుండానే వెనుదిరిగింది. వెళ్ళబోతూ అతడిని చూసింది.
అతడు గది మధ్యలో నిశ్చలంగా నిలబడి వున్నాడు.
అతడి ప్లాన్ ఫెయిల్ అయ్యి, ఏ మాత్రం పట్టుబడినా యిదే ఆఖరిసారి యిలా కలుసుకోవటం.
ఆ ఊహ రాగానే ఆమె మనసులో ప్రేమా, ఆప్యాయతా, వీటన్నిటిని మించిన భావం ఏదో కదలాడింది. అతడి దగ్గిరకి వెళ్ళాలన్న కోర్కెని అతికష్టంమీద అణచుకుని బయటకు వెళ్ళిపోయింది. నడుస్తూ వుండగా అతడిచ్చిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. వీధిలైటు వెలుతురులో ఆగి, కాగితాన్ని విప్పి చదవనారంభించింది.
"ప్రియా!
నేను చేస్తున్న పని ఎంత ప్రమాదకరమైనదో నాకు తెలుసు. నాయుడు తప్పించుకుంటే ఇక్కడికక్కడే నేను అరెస్టు అవుతాను. ఒక వేళ నాయుడు మరణించినా పోలీసుల ఇన్వెస్టిగేషన్ బారినుండి నేను తప్పించుకోలేను. కనీసం చేతికి గ్లౌస్ కూడా వేసుకోలేదు. ఇవేమీ నన్ను రక్షించలేవని నా ఉద్దేశ్యం. ఇంతకీ నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే- ఎటు తిరిగి ఏమయినా నాకోసం శిక్ష కాసుకుని వుంది. ఇటువంటి వాడిని ప్రేమించవలసి రావటం నీ దురదృష్టం. నన్ను మర్చిపో- ఇదేదో మెలో డ్రమటిక్ డైలాగ్ కాదు. జీవితాన్ని ప్రాక్టికల్ గా చూసిన నేను నీకిస్తున్న సలహా!
-శేఖరం"
చదవటం పూర్తిచేసి ఆమె దూరంగా ఆ చీకట్లో వున్న ఆ భవనం కేసి చూసింది.
ఎందుకో ఆమె పెదవులమీద సన్నటి నవ్వు కదలాడింది.
* * *
మంచం క్రిందనుండి క్లాంప్స్ బిగించడానికి అతడు చాలా కష్టపడవలసి వచ్చింది. లివర్ లాగగానే అడుగునుండి క్లాంప్స్ పైకి వచ్చి మంచం మీద పడుకున్న మనిషిచుట్టూ బోనులా బిగుసుకుంటాయి. మొత్తం నాలుగు జతల క్లాంప్స్. మోకాళ్ళ దగ్గర ఒకటి, నడుము దగ్గర ఒకటి, తల దగ్గర, కాళ్ళ దగ్గిర చెరొకటి.
క్లాంప్స్ బిగించడానికి ముందే అతడు తనతోపాటు తీసుకువచ్చిన ద్రవాన్ని ప్రియ చూపించిన చోటునుండి ఒక్కొక్క చుక్కే మంచంవరకూ పోసుకుంటూ వచ్చాడు.
మంచంక్రింద రాడ్ బిగించడానికి అతడికి దాదాపు మూడు గంటలు పట్టింది. అతడి శరీరమంతా చెమటతో తడిసిపోయింది. నాయుడు రావడానికి ఇంకా చాలా టైం వుంది. అప్పటివరకూ చేసేదేమీ లేదు. ఈ పనంతా చెయ్యడానికి ఎంతసేపు పట్టిందో, నాయుడు ఇంకా ఎంతసేపటిలో వస్తాడో, తనింకా ఎంతసేపు ఇలా వేచి ఉండాలో శేఖరానికి తెలీదు. టైం చూసుకునే శక్తి అతనికి లేదు. అతడు అలాగే ఆ మంచం క్రిందే పడుకుని వున్నాడు. క్షణం ఓ యుగంలా గడుస్తూంది. అకస్మాత్తుగా చేతిమీద ఏదో కుట్టింది. అతడు చప్పున చెయ్యి వెనక్కి తీసుకోలేదు, ఆనందంగా నవ్వుకున్నాడు.
తన ప్లాన్ సగంవరకూ సక్సెస్ అయినట్లే.
* * *
పేరుకున్న నిశ్శబ్దంలో చిన్న కదలిక.
అతడు కొద్దిగా కదిలాడు.
గదిలోంచి ఎవరో వచ్చిన సవ్వడి. అంటే ఆ ధ్వని అతనికి వినిపించిందని కాదు. తలుపు తీసిన కదలికకి గచ్చుమీద కలిగిన కంపనం దానికితోడు నాసిక అందించిన బీరువాసన.
ఫ్లయిట్ దిగి, ఇంటికివచ్చి, బీరుతాగి ఇప్పటికి పడక గదిలోకి వచ్చాడన్నమాట! అందుకే ఇంత ఆలస్యం అయింది అనుకున్నాడు శేఖరం. అతడి ఊహ నిజమే అన్నట్టు నాయుడు వచ్చి మంచంమీద పడుకున్నాడు. అతడు దగ్గరకు వచ్చిన తర్వాత శేఖరానికి మొదట వచ్చింది బీరు వాసన. అదోరకం ఫారిన్ సెంటనీ, కేవలం సెంటనీ, కేవలం నాయుడే దానిని వాడతాడనీ గుర్తువచ్చింది. అతడు సంతృప్తి చెందాడు. అయినా ఏ విధమైన రిస్కు తీసుకోదలచుకోలేదు. ఒకవేళ అతడు ఇంకా మంచంమీద పడుకోకుండానే కూర్చుని ఉండగా క్లాంప్స్ షట్ చేస్తే అతడు తప్పించుకునే ప్రమాదం వుంది.
అందుకనే నాయుడు గదిలోకి ప్రవెశించాడని తెలియగానే క్రిందగచ్చుమీద వెల్లకిలా పడుకుని ఉన్న అతడు మంచంక్రింద స్ప్రింగుల దగ్గిర తల ఆనే చోట ఒకచెయ్యి, నడుమానేచోట మరోచెయ్యి, కాళ్ళు ఆనే చోట తన కాలు పెట్టి వుంచాడు.
శబ్దమూ, దృశ్యమూ గ్రహింపలేని ఆ అశక్తుడయిన యువకుని పట్టుదలనీ, తెలివితేటలనీ, దృఢ నిశ్చయాన్ని గమనిస్తున్నట్టు ఆ రాత్రి నిశ్శబ్దంగా వుంది.
మంచం దగ్గిరకు వచ్చి నాయుడు దానిమీద పడుకున్నట్లు శేఖరం స్ప్రింగుల కదలికవల్ల గ్రహించాడు, మరి ఇక ఆలస్యంలేదు. రెండు చేతులతో పట్టుకుని గట్టిగా లివర్ లాగాడు.
ఆదమరచి గడ్డిపరకలు తింటున్న లేడిపిల్ల మీదకు ఏమరుపాటున వెనుకనుండి పులిపంజా వచ్చినట్టూ మంచాని కిరువైపుల నుండి పెద్ద చప్పుడుతో క్లాంప్స్ వచ్చి బిగుసుకున్నాయి. వెంటనే శేఖరం టేపునొక్కాడు.
"నాయుడూ, కదలకు!"
ఇంత అకస్మాత్ పరిణామాన్ని నాయుడు వూహించలేడనీ కొంచెం గట్టిగా తోసేస్తే క్లాంప్స్ చెరోవైపుకీ పడిపోతాయనీ శేఖరానికి తెలుసు. అందుకే టేప్ రికార్డర్ లో రెండో వాక్యం వచ్చేవరకూ ఆగాడు.
"నీ చుట్టూ వున్న క్లాంప్స్ కి సైనేడ్ పూయబడి వుంది".
స్టీలు షాపువాడికి ఆర్డరు ఇచ్చి క్లాంప్స్ తయారు చేయించినప్పుడే చాప ముళ్ళలాంటి చిన్న చిన్న సూదిమొనలు వచ్చేటట్లు ఆ ఇనుపరాడ్స్ తయారుచేయించాడు శేఖరం. ఏ మాత్రం వాటిని తొలగించుకోవటానికి ప్రయత్నించినా ఎక్కడో ఒకచోట సూది గుచ్చుకోవడం ఖాయం. పక్కమీద బందీ అయిన నాయుడికి ఇదంతా అయోమయంగానే వుంటుందనీ, ఆ అయోమయంలో పొరపాటున క్లాంప్స్ తొలగించే ప్రయత్నం చేస్తే కష్టమనీ భావించి శేఖరం మంచం క్రిందనుండి బయటకి వచ్చాడు. అతడు వస్తూండగా టేప్ లో మూడో వాక్యం వినబడింది.



