Home » Yandamuri veerendranath » మరణ మృదంగం
మంగళవాక్యం (ద్యం):
ఆ మరుసటిరోజు అన్ని పత్రికల్లోనూ ఈ వార్త మొదటి పేజీలో వచ్చింది. వార, మాస, పక్ష పత్రికలు అప్పుడే వ్యాసాలు వ్రాయటానికి నోట్సు తయారు చేసుకోసాగాయి. అంతా సంచలనమే!
అనూషకి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తన దగ్గిర్నుంచి స్వయంగా వ్యాసాలు అందుకున్న ఎడిటర్లు కూడా, ఆ వ్యాసాన్ని 'సలీంశంకర్' వ్రాయటంవల్ల కక్షగట్టి దాదా ఈ పని చేసాడని ప్రచారంలో వున్న రూమర్ నే బలపర్చారు. ఒక్క పత్రిక మాత్రం ఎన్నడూ బురద తన చేతికి అంటుకోనివ్వని దాదా ఈ ఒక్క విషయంలోనూ,.... అందులోనూ స్వయంగా హత్య చేసేటంతగా ఎందుకు పూనుకుంటాడని వ్రాసింది. కానీ ఆ వ్యాసానికి అంత ప్రాముఖ్యత లభించలేదు. ప్రాముఖ్యత లేని వ్యాసాల్నీ, వార్తల్నీ పత్రికలు ప్రచురించవు కదా.
సలీంశంకర్ హత్య, దానిలో దాదా ప్రవేశం వుండటం మాఫియాని కలవరపర్చింది. శంకర్ ని డిట్విమ్ ప్రధాన సభ్యుడుగా నియమించాలనుకున్న మాఫియాకి ఇది పెద్ద దెబ్బ! దాదా జైలుకి వెళ్ళటం కూడా వూహించని పరిణామమే!
దాదాకి సహాయం చేసిన విమానాశ్రయపు అధికారులు నలుగురూ భయంతో వణికిపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. దాదా అక్కడికి అలా ఎలా వచ్చాడన్నది మిగతా అందరికీ అర్థం కాని ప్రశ్నగానే వుండిపోయింది. దాదాకి గోడౌను తలుపు తాళం తీసి సహాయం చేసిన ఆఫీసర్ మాత్రం ఈ సంఘటన జరిగిన ఒక గంటకి, ఎప్పటికయినా తన విషయం బయట పడుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
సలీంశంకర్ హత్యతో విమానాల పోకడ గంట ఆలస్యం అయింది. ఈ లోపులో ఎవరో ఆగంతకుడు ఫోన్ చేసి, జపాను వెళ్ళే విమానంలో బాంబు వుందన్న వార్త అందించటంతో ఆ విమానం మరో గంట ఆలస్యం అయింది. అయితే, మిగతా అన్ని ఫోన్స్ లా కాకుండా, ఈ సమాచారం నిజమై- విమానంలో బాంబు దొరికింది. ఇది టెర్రరిస్టుల చర్య అనుకున్నారందరూ! దాదా అరెస్ట్ కాగానే, నలుగురు అధికారులూ భయంతో వణికిపోయిన మాట నిజమేగానీ, అందులో ఒకరికి ఏ మూలో కాస్త మానవత్వం, ధైర్యం మిగిలి వున్నాయి. ఆగంతకుడి పేర్న ఫోన్ చేసి బాంబు సంగతి చెప్పింది అతడే!
వసంత్ దాదాని అరెస్ట్ చేసిన రోజు సాయంత్రం- జానీ, బిల్లూ, అనూషలు విమానంలో తిరిగి వచ్చేసారు.
* * *
"తలుపేసెయ్యానా?" అని అడిగాడు జాని.
అన్యమనస్కంగా వున్న అనూష అర్థంకాక "ఏమిటి?" అంది.
"తలుపేసెయ్యగానే నువ్వు నా కాళ్ళమీదకు వంగి "నన్ను క్షమించండి. మిమ్మల్ని అర్థం చేసుకొనలేక పోయాను" అంటావు. నేను నీ భుజాలు పట్టి పైకెత్తి "అంత మాటనకు అనూషా" అంటూ మంచం దగ్గిరకు తీసుకు వెళతానన్న మాట" అన్నాడు చివరి నుంచి అయిదో మాట వత్తి పలుకుతూ.
"షటప్" అంది అనూష కోపంగా.
అంతలో తలుపు దగ్గిర చప్పుడయింది.
"లోపలికి రావొచ్చా?"
ఇద్దరూ చప్పున అటు చూసారు.
సి.బి.ఐ. ఆఫీసర్ సుగ్రీవ్ గుమ్మానికి అనుకుని నిలబడివున్నాడు.
అనూష నిశ్చేష్టురాలైంది!
ఆ క్షణం ఆమె అతడిని అక్కడ వూహించ;లేదు. పొద్దున్నే బొంబాయిలో అతడిని చూసింది. ఇప్పుడు తమతోపాటు ఇక్కడ.....
తమలాగే వేగంగా!
ఆమె ఎందుకో భయపడింది. ఏదో జరగబోతూంది. ఏ...దో....
"ఏమిటి? అలా శిలాప్రతిమలా వుండిపోయారు?" సుగ్రీవ్ అడిగాడు.
"ఇక్కడికి మీరెప్పుడొచ్చారు?" అంది విస్మయం నుంచి తేరుకోకుండా! ఎంత నొక్కి పెట్టినా ఆమె మొహంలో రాబోయే ప్రమాదాన్ని సూచించే భావం తొంగిచూస్తూనే వుంది.
"మీరొచ్చిన విమానంలోనే....." అని జానీవైపు తిరిగి, "జానీ, నీతో కొద్దిగా మాట్లాడాలి" అన్నాడు.
ఇద్దరూ వేరే గదిలోకి వెళ్ళారు. అనూష ఒక్కతే మిగిలింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూంది. ఇతడు జానీని ఏం ప్రశ్నిస్తున్నాడు?... అంతా అయి పోయిందనుకున్న తరువాత ఇతడు రావటం ఆమెలో అనుమానాన్ని రేకెత్తిస్తూంది. సుగ్రీవ్ మొహం చూస్తే పైకి కనపడే దానికన్నా ఎన్నో రెట్లు తెలివైనవాడిలా కనపడుతున్నాడు.
అయిదు నిముషాలు భారంగా గడిచాయి.
జానీ బయటకొచ్చాడు. "నిన్ను పిలుస్తున్నాడు" అన్నాడు క్లుప్తంగా. ఆమె ఏదో అడగబోయి మనసు మార్చుకుని లోపలికి నడిచింది.
సుగ్రీవ్ ఆమెని చూసి పలకరింపుగా నవ్వేడు. ఆమె నవ్వలేదు.
"కూర్చోండి మాడమ్" ఆమె కూర్చుంది. అతడు ఉపోద్ఘాతంగా అన్నాడు-
"వసంత్ దాదా కేసు ఈ విధంగా మలుపుతిరుగుతుందనుకోలేదు మేమెవ్వరం. సలీంశంకర్ పేరుమీద మీరు దాదాకి వ్యతిరేకంగా వ్రాసిన వ్యాసాలు ఈ హత్యకీ, పగకీ కారణం అనుకుంటే కేసు సులభంగా తెలిపోతుంది. కానీ ఆ వ్యాసాలు మీరే వ్రాసారని దాదాకి తెలుసు కదా! శంకర్ ని ఎందుకు చంపుతాడు?"
"దాదా శంకర్ ని ఎందుకు చంపాడో నాకు తెలీదు".
"కానీ ప్రపంచం అతడు ఈ వ్యాసాలవల్లే పగపట్టి చంపాడని అనుకొంటోంది".
"ఆమె మాట్లాడలేదు.
"ఇక్కడికొచ్చే ముందే వసంత్ దాదాని కలుసుకున్నాను. తనీహత్య చేయలేదన్నాడు. లాయర్ ని కలుసుకోకుండా ఏ ప్రశ్నకీ జవాబు ఇవ్వటానికి అతడిష్టపడటంలేదు".
ఆమె సమాధానం ఏమీ చెప్పలేదు.
"జపాను వెళ్ళవలసిన విమానంలో ఒక వ్యక్తి లోపలి లాంజ్ వరకూ ప్రవేశించి అక్కణ్నుంచి మాయమయ్యాడు. పాస్ పోర్ట్ టిక్కెట్లమీద 'చిన్మయానంద' అని వుంది. అతడెవరో, ఇట్నుంచి బయటకు వచ్చేసాడో మీకేమైనా తెలుసా?"
"చిన్మయానందా? తెలీదే. బహుశా బాంబు పెట్టిన టెర్రరిస్ట్ అయి వుంటాడు".
"ఈ సమాధానం బాగానే వుంది కానీ మీరా సమయంలో విమానాశ్రయంలో ఎందుకున్నారు?"
"అదేమిటి సర్. శంకర్ వెళ్ళిపోవటం చివరి వరకూ చూడకపొతే నా ప్రాణాలకు భద్రత లేదు కదా".
"అయితే 'చివరి వరకూ' వెళ్ళటం చూసాకే మీరు తృప్తి చెందానంటారు" నొక్కి పలికాడు.
ఆమె జవాబు చెప్పలేదు.
"వసంత్ దాదా అక్కడివరకూ ఎలా ప్రవేశించాడో మీకేమైనా ఐడియా వుందా?"
"అదేమిటి? నా కెలా తెలుస్తుంది?"
"బయటే కార్లో కూర్చుని అంతా చూస్తున్నారు కదా. మీరేమైనా చూసారేమో అని".
"నేను అతడిని చూడలేదు. మా అన్నయ్యతో మాట్లాడుతూ వున్నాను". సుగ్రీవ్ గడ్డం గోక్కున్నాడు. అతడి పెదవుల మీద చిరునవ్వు ఇపుడు లేదు. సాలోచనగా అన్నాడు.
"శంకర్ శరీరంలో అయిదు గుళ్ళున్నాయి. ఆరో గుండు గోడలోకి దూసుకుపోయింది. నేలమీద రక్తం వుంది. అది శంకర్ ది కాదు. దాదాకి గాయాలు లేవు. మరెవరిదై వుంటుంది?"
అనూష గుండె ఒక క్షణం కొట్టుకోవటం ఆగిపోయింది. బి...ల్హ...ణు...డు.... చేతి మీద కట్టున్న బిల్హణుడు....
ఒక ప్రశ్నలా కాకుండా అదేదో, తనలో తనే ఆలోచించుకుంటూన్నట్టు సుగ్రీవ్ అన్నాడు- "యుమిన్ సున్ అంతా చెప్పేసేడు..... మీరెందుకు తనని కలుసుకున్నారో- వగైరా".
అనూష నుదుట చెమట పట్టింది. ఆ గదిలో గాఢమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఆమె కొద్ది సేపటికి తేరుకుని "యుమిన్ సున్ ని ఆ పనికి నేనే అభ్యర్థించాను. అలా చెపుతే తప్ప శంకర్ ప్రయాణానికి వప్పుకోడని" అంది.
"ఊ చెప్పండి" ప్రోత్సహిస్తున్నట్టు అడిగాడు.
"ఇంక చెప్పేదేమీ లేదు".
"మీరు యు మిన్ సున్ ని ఆ పని ఒక్కదానికే అభ్యర్థించిన పక్షంలో దాదా తనతోపాటు తీసుకొచ్చిన వ్యక్తి ఎలా మాయమయ్యాడు? అదీ చేతికి గాయంతో? అతడలా మాయమవుతూవుంటే దాదా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోకుండా చూస్తూ నిలబడ్డాడా?
"అది తెలుసుకోవలసింది మీరు"
"రేపు దాదా చెప్పేదేమిటంటే ఈ చిన్మయానంద పేరుతో జపాను వెళ్లవలసిన ప్రయాణీకుడూ- తను తీసుకొచ్చిన మనిషి కలిసి శంకర్ ని చంపి, పారిపోయారని".
"కానీ ఆ సాక్ష్యం నిలవదు కోర్టులో."
"అయినా ఆ గదిలో మరొకరి రక్తం వుంది...... బిల్లూ ఎక్కడ?"
వాదించటంలో ఒక్కోక్క మెట్టే తను క్రిందికి జారిపోతూవుందని ఆమెకి తెలుసు. ఈ చివరి ప్రశ్న 'బిల్లూ ఎక్కడ' అని అడగటంలో ఇక ఆమెకి తనేం చెయ్యలేనని అర్థమైంది. తను వేసిన ఈ ప్లాన్ వల్ల తన అత్యంత ప్రియమైన స్నేహితులిద్దరూ ఉరికంబానికి అతి చేరువలోకి చేరుకున్నారు. ఎంతో తెలివి తేటల్తో చేసింది అనుకున్నది ఈ విధంగా ఇద్దర్ని బలికోరుతోంది. ఆమె పిడికిలి బిగించి పెదవుల మీద కొట్టుకోసాగింది- 'ఏం చెయ్యాలా' అని ఆలోచిస్తూ.
ఈ లోపులో సుగ్రీవ్ కుర్చీలోంచి లేచాడు. అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆలోచించసాగాడు. ప్రక్కనున్న అనూషని కూడా మార్చిపోయినట్టున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు.
"వసంత్ దాదా అంత సులభంగా వదిలిపెట్టడు. చివరి వరకూ అతడి లాయర్లు పోరాడతారు. అతడికి సహాయం చేసిన అధికారి అదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా అధికార్లు ఈ రోజు సహాయం చేసినా రేపు కోర్టులో చచ్చినా ఆ విషయం వప్పుకోరు. అసలు దాదాయే ఎవరో తమకి తెలీదంటారు. ఇకపోతే చిన్మయానంద అనేవాడు నువ్వన్నట్టు టెర్రరిస్టు అనుకుందాం. బాంబు పెట్టి అతడు మాయమయ్యాడు. యు మిన్ సున్ కి అసలేం తెలీదు అనుకుందాం. తన పేర్న స్విస్ బ్యాంకులో డబ్బు జమ అయినట్టే అతడికి తెలీదు. ఒకవేళ అలాంటి అగ్రిమెంటు మామధ్య ఏదైనా వుంటే, శంకర్ నా చేతికి మత్తుసూది గుచ్చి స్పృహ తప్పించి వెళ్ళవలసిన అవసరం ఏముంది- అని అతడు కావలిస్తే కోర్టులో చెపుతాడు. అనూష ఎవరో తనకి తెలీదంటాడు. చూస్తూ చూస్తూ ఏ పోలీసు ఆఫీసరూ అనూష అనే ప్రైవేట్ వ్యక్తి తనకి సలహా ఇచ్చిందనీ, ఆ ప్రకారం లంచం తీసుకున్నట్టు నటించాననీ చెప్పడు కదా! అందులోనూ ఆ ముసలాడికి అతని సామర్థ్యం మీద అతనికి నమ్మకం ఎక్కువ..... ఇక నా విషయం. నేను వెళ్ళేసరికి అప్పుడే చివరి బుల్లెట్ పేల్చి పిస్తోలు మీద వేలిముద్రలు తుడుచుకుంటున్నాడు దాదా. గదిలో ఇంకెవరూ లేరు. బయటికి వెళ్ళిన శబ్దం కూడా ఏదీ వినిపించలేదు....."



