Home » Yandamuri veerendranath » మరణ మృదంగం


    అనూష విప్పారిన నేత్రాలతో అతడినే విస్మయంగా చూస్తూవుంది. అతడేం మాట్లాడుతున్నాడో ఆమెకి కొద్దిసేపు అర్థం కాలేదు. కట్టిన ఇంటిని దూరంగా నిలబడి చూసుకునే తాపీ మేస్త్రిలా అతడు సమీక్షించుకుంటున్నాడు.

    "......మొత్తానికి దాదా మెడచుట్టూ వల బాగానే బిగించావమ్మాయ్. ఈ కేసుని మొదటినుంచీ డీల్ చేస్తున్న నాకు ఏమాత్రం అనుమానం రాకుండా! కానీ జానీ పిస్తోలు కాల్చటంతో నీ ప్లానంతా పాడయింది".

    మళ్ళీ నిశ్శబ్దం.... అనూష ఎలాగో శక్తి కూడగట్టుకుని అడిగింది. "బిల్లూయే ఆ మనిషని మీకెవరు చెప్పారు?"

    సుగ్రీవ్ నవ్వేడు- "...జానీ."

    ఆమెకి జానీ మీద బాగా  కోపం వచ్చింది. తనకున్న పాటి ధైర్యం కూడా లేకుండా ఎవరో పోలీసాఫీసర్ వచ్చి నాలుగు ప్రశ్నలడగగానే అంతా చెప్పేసాడు.

    ఈ లోపులో జాని లోపలికి వచ్చాడు.

    "రా జానీ!" అన్నాడు సుగ్రీవ్. "......నువ్వు చెప్పినదంతా ఈ అమ్మాయికి చెప్పేసేను."

    "నేనేం చెప్పాను?"

    "దాదాతో వెళ్ళింది బిల్లూ అని- శంకర్ ని చంపింది నువ్వేననీ".

    "నేనేం చెప్పలేదే. ఇప్పుడు నువ్వే చెప్పావు."

    అనూష షాక్ తగిలిదాన్లా ఇద్దరివైపూ చూసింది. తన పొరపాటు అర్థమైంది. సుగ్రీవ్ చీకట్లో వేసిన బాణం సరిగ్గా తగిలింది. అతడు కళ్ళతో చూసినట్టే ఒక్కో విషయమూ చెప్పేసరికి తను బుట్టలో పడిపోయింది.

     చివరి క్షణంలో అంతా నాశనం అయింది. సర్వనాశనం..... ఇక జానీ నెవరు రక్షించగలరు?

    సుగ్రీవ్ పచార్లు చేయసాగాడు. అతడి నిర్ణయానికి కట్టుబడి వుండబోతున్నట్టు జానీ మౌనంగా నిలబడి వున్నాడు. అనూషకి ప్రతిక్షణమూ ఒక యుగంలా టెన్షన్ తో గడుస్తూంది. పచార్లవేగపు తీవ్రతని బట్టి సుగ్రీవ్ దీర్ఘమైన ఆలోచన్లలో వున్నాడని అర్థమవుతూంది.

    అతడు నడక ఆపి, "ఏం చేద్దాం జానీ?" అని అడిగాడు.

    జానీ సమాధానం చెప్పలేదు.

    అనూషకిదంతా అగమ్యగోచరంగా తోచింది. "ఇందులో జానీ తప్పేం లేదు. తప్పంతా నాదే. కేవలం బిల్లూని రక్షించటానికి అతడీ పనిచేసాడు. శిక్ష నాకే పడాలి" అంది ఆవేశంగా.

    "ఒక పోలీసాఫీసరు ఎవర్నన్నా రక్షించవలసి వస్తే అయిదు గుళ్లు శరీరంలోకి దూర్చకూడదు. కాళ్ళమీద కాల్చాలి".

    "పో.....పోలీసాఫీసరా?"

    "జానీ ఎవరనుకుంటున్నావ్ అనూష? అతడు మా డిపార్ట్ మెంట్ మనిషి!"

    అనూష తెల్లబోయింది. సుగ్రీవ్ చెప్పుకుపోతున్నాడు. "మా డిపార్ట్ మెంట్ లో ఒక ప్రత్యేక విభాగం వుంది. దాన్ని "సెంటర్" అంటారు. సెంటర్  క్రింద  కొంతమంది "కంట్రోల్స్" వుంటారు. నేనొక కంట్రోల్ ని! చాలామంది అనుకుంటూ వుంటారు. దేశంలో ఇంతమంది నేరస్తులు చెలరేగుతున్నా డిపార్ట్ మెంట్ ఏమీ  చెయ్యదని...... ఎందుకు చెయ్యం? కనీసం యాభైశాంత నిజాయితీ పరులూ, సమర్థులూ 'సెంటర్' లో వున్నారని చెపుతే ఎవరూ నమ్మరు. పొతే నేరస్తులు చట్టం ద్వారా తప్పించుకుంటారు. దానికి మేమేం చెయ్యగలము? ప్రతీ కంట్రోల్ కీ దేశంలో వివిధ భాగాల్నుంచి రిపోర్టులు అందచెయ్యటానికి కొంతమంది ఆఫీసర్లు వుంటారు. వీరిని "స్లీపర్స్" అంటారు. ఈ స్లీపర్స్ నగరంలో కొన్ని ఏళ్ళతరబడి స్థిర నివాసం  ఏర్పరచుకుని, తమ తమ మామూలు వృత్తులలో నిమగ్నమై ఎవరికీ అనుమానం రాకుండా సామాన్య పౌరులుగా చెలామణి అవుతూ వుంటారు. జానీ సామర్థ్యం చూసి అతడికి ముఖ్యమైన మాఫియా విభాగాన్ని అప్పచెప్పాం. అందుకే అతడు ఒక క్లబ్  ని నిర్వహిస్తున్నాడు. అతడో స్లీపరు. అతడిపై కంట్రోల్ ని నేను. నేను ఢిల్లీలో దాదా మీద కంట్రోల్ ని! మొన్న మొన్నటి వరకూ జానీ పోలీస్ ఇన్ఫార్మర్ మాత్రమే. నీవల్ల అతడు సలీంశంకర్ ని ముఖాముఖి ఎదుర్కొన్నాడు. ఏ స్లీపరూ చెయ్యకూడని పని అది. చివరికీ సలీంని చంపేసాడు. పది సంవత్సరాలుగా ప్రభుత్వం చేయలేని పనిని ఒక అధికారి చేసాడు. ఇది న్యాయబద్దమే. కానీ చట్టబద్దం కాదు. కానీ దాదా చరిత్రకి ముగింపు పలకాలంటే చట్టాన్ని ఆశ్రయిస్తే సరిపోదు. కొన్ని సందర్భాల్లో న్యాయల్ని ఆశ్రయించాలి! జానీ చేసింది కరెక్టే అని నేను నమ్ముతున్నానందుకే...."

    అనూషకి అతడి మాటలు జీర్ణం చేసుకోవటానికే చాలాసేపు పట్టింది. 'కంట్రోల్స్' గురించీ, స్లీపర్స్' గురించి, రష్యన్ కె.జి.బి.లో ఆమె చదివింది. కానీ జానీయే స్లీపర్ అంటే నమ్మలేక పోతూంది. తన ముందు రఫ్ గా, అల్లరిగా, ఒకోసారి జడుడిగా వున్న (నటించిన) జానీ, ఎంతో ప్రతిష్టాకరమైన డిపార్ట్ మెంట్ లో స్లీపర్..... గొప్ప సామర్థ్యం వున్న వాళ్ళని తప్ప మామూలు వాళ్ళని నియమించరని ఆమెకి తెలుసు. తనని కూడా బోల్తా కొట్టించగలిగాడు జానీ!

    "ఏం చేద్దామంటావ్ జానీ?" అడిగాడు సుగ్రీవ్.

    "మీరేం చెప్పినా దానికి సిద్ధంగా వున్నాను సర్".

    "దాదా బయట పడటానికి ఇంకే మార్గాలు లేవుగా".

    "లేవనే నేను అనుకుంటున్నాను సార్".

    "చివరి వరకూ అన్ని రిపోర్టులూ నాకు పంపి, చివర్లో అనూష ప్లాన్ సంగతి మాత్రం దాచిపెట్టి నువ్వే స్వయంగా సమస్యా పరిష్కారానికి పూనుకుని చిన్మయానంద పేరుతో బయల్దేరినందుకు మాత్రం నిన్ను శిక్షించాలి".

    "దానికీ సిద్ధంగా వున్నాను సర్".

    "కానీ అది నేను సెంటర్ కి రిపోర్ట్ చేయకపోతే దాన్నించి కూడా నువ్వు బయట పడతావు".

    "అవును సర్. థాంక్యూ సర్".

    అంతా వింటూన్న అనూషకి చప్పున ఏదో అర్థమైనదాన్లా- "మరి బిల్లూ?" అని అడిగింది.

    "నేను రిపోర్టివ్వకపొతే అతడూ ఇరుక్కోడు" నవ్వేడు సుగ్రీవ్. "అతడిని కూడా నేను ఇరికించబోవటం లేదు. చూద్దాం దాదా కోర్టులో ఏం వాదిస్తాడో...."

    ఆమె క్షణంసేపు ఆలోచించింది. అతడు చెప్పింది ఒక్కటొక్కటే అర్థమై దాదా బయట పడటానికి వీల్లేకుండా ఒక్కొక్కదారే మూసేసుకుంటూ ఎందుకు వచ్చాడో బోధపడింది. అయినా ఏదో అనుమానం.....

    సందిగ్దంగా, "మీరు..... మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?" అని అడిగింది.

    "నిజమే! ఈ డిపార్ట్ మెంట్ లో  వుంటూ యదార్థాలే ప్రభుత్వానికీ, కోర్టుకీ చెప్పాలి. కానీ.....కానీ యదార్థం ఎన్నో సంవత్సరాలుగా వసంత దాదాని ఏమీ  చెయ్యలేక పోయింది. వాలిని చంపటానికి రాముడే చెట్టు చాటుకి వెళ్ళాడు. దాదాని నాశనం చేయటానికి సుగ్రీవుడు చిన్న అబద్ధం చెపితే తప్పేమిటి?"

    ఆమె అతడివైపు మౌనంగా చూస్తూ వుండిపోయింది. అతడు జానీ వైపు తిరిగి "వెళ్ళొస్తాను. నే చెప్పినదంతా గుర్తుందిగా?" అన్నాడు. జానీ తలూపాడు.

    అతడు అనూషని చూసాడు. "నేనీ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నీకు  ఇంకా పూర్తి సంతృప్తికరంగా వున్నట్టు లేదు కదూ....." అంటూ నవ్వబోయేడు. నవ్వు రాలేదు. ఏవో ఆలోచన్లతో ఆ మధ్య వయస్కుడికి మరో పదేళ్ళ వృద్ధాప్యం మీద పడినట్టు అయింది. ఒక విషాదపు తెర అతడి మొహం మీద  కదలాడింది. "నా ఒక్కగానొక్కకొడుకు" అన్నాడు. "జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదివేవాడు. బ్రిలియెంట్ కుర్రవాడు. హెరాయిన్ కి అలవాటుపడి మొత్తం భవిష్యత్తునే  పాడుచేసుకున్నాడు. మాకు కడుపు శోకం మిగిల్చి ఆ మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు". అతడి కంఠం విషాదంగా  పలికింది. ".....కారణం ఎవరు? ఎందరో దాదాలు!! దీనికి పుల్ స్టాప్ పెట్టలేను. కనీసం 'కామా' అన్నా పెట్టగలిగాను!!!! చట్టాన్ని పరిరక్షించే ఒక ప్రభుత్వాధికారిగా మీరు చేసింది నేను హర్షించలేకపోవచ్చు. కానీ ఒక పౌరుడిగా మీకు కంగ్రాచ్యులేషన్స్ చెపుతున్నాను. విష్ యు ఆల్ తే బెస్ట్".

    అతడు వెళ్ళిపోయాడు తలుపు దగ్గిరగావేసి.

    జానీ దగ్గిరగా వచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు. ఆమె సుతారంగా విడిపించుకుంటూ "మీరు సి.బి.ఐ. స్లీపర్ అని నాకెందుకు చెప్పలేదు?" అని అడిగింది.

    "అదేమిటి? 'నువ్వు' లోంచి 'మీరు' లోకి ఎప్పుడు దిగావు?"

    "నా ప్రశ్నకి సమాధానం అదికాదు".

    "ఏ స్లీపరు తనో ఏజెంటునని ఎవరికీ చెప్పడు".

    "మీరు స్లీపర్ అని  బిల్లూకి తెలుసా?"

    "లేదు. అతడు నా క్లబ్ మానేజర్. అంతే" అంటూ అతడు చెప్పటం ప్రారంభించాడు. "సలీంని ఎప్పుడూ కనిపెట్టి వుండటమే నాపని. ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో నిన్ను తీసుకు వెళ్తూంటే చూసాను. మా మధ్య గొడవ మొదలైంది. స్లీపర్స్ సాధారణంగా బయట పడకూడదు. కానీ తప్పలేదు. నీ గురించి సలీం వేస్తున్న పథకాలన్నీ 'కంట్రోల్' కి రిపోర్ట్ గా పంపిస్తూ వుండేవాడిని. నిన్ను దగ్గిరగా  ఫాలో అవమని ఆర్డర్లు వచ్చాయి. ఈలోపులో నీ చొరవా పట్టుదలా నన్ను ఆకట్టుకొనసాగాయి. ప్రభుత్వం పట్లకన్నా జనంపట్ల ఉద్యోగికి ఎక్కువ బాధ్యత వుందని నీవల్ల నేను ప్రభావితుడినయ్యాను. దానికి నువ్వే కారణం! ఈ లోపులో ఉత్పల వృత్తాంతం తెలిసింది. ఉత్పలని వలగా వేసి దాదాని పట్టుకోవాలనుకున్నాం. అమలాపురం ప్రయాణం అని చెప్పి బిల్హణుడిని బయల్దేర తీసాను. ఇద్దరం ఆమెని అనుసరించాం. మేము ఊహించినట్టే మార్గమాధ్యంలో అటాక్ జరిగింది. ఆమె మా రక్షణలోకి వచ్చింది. ఉత్పల మా దగ్గిర వున్నంత కాలం సలీం, దాదాలు పెనం మీద గింజల్లా గింజుకుంటారని మేము అనుకున్నాం. అలాగే జరిగింది. దాదా రంగంలోకి దిగాడు. అతడిని ఏ విధంగా ఉచ్చులో బిగించాలా అని చూస్తూ వుంటే నువ్వు నాకో అద్భుతంగా కనిపించసాగావు. ఇక్కడనుంచీ ఇక 'కంట్రోల్' కి రిపోర్ట్ ఇవ్వటం మానేసాను. నీ జపాను ప్రయాణం సుగ్రీవ్ చెప్పే వరకు నాకు తెలియనే లేదు. ఈ లోపులో నువ్వు ఈ ఆఖరి ప్లాన్  గురించి చెప్పి బాంబు పేల్చావు. ఎవరికీ చెప్పకుండా నేనే ఈ కేసు డీల్ చేయదల్చుకున్నాను. బిల్లూకి ఏమాత్రం ప్రమాదం వాటిల్లినా మొత్తం ఆ గాంగ్ నంతా చంపెద్దామనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. శంకర్ ని మాత్రం బలిచేయవలసి వచ్చింది".

    ఈసారి ఆమే అతడిచేతిమీద చెయ్యివేసింది. "ఇదంతా చేసినందుకు నీకో మంచి బహుమతి వస్తుందిలే".

    జానీ విచారంగా "లాభంలేదు. ఇదేమీ ప్రభుత్వానికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More