Home » Yandamuri veerendranath » మరణ మృదంగం
అనూష విమానాశ్రయానికి వెళ్ళిందని గుండప్పకి నాటకీయంగా తెలిసింది. ఆ విషయం చెప్పినవాడు. సి.బి.ఐ. ఆఫీసులో ఒక ఇన్ ఫార్మర్. సుగ్రీవ్ పంపిన ఒక వైర్ లెస్ వార్తని మాఫియా గాంగ్ కి అందించాడు.
మొత్తం సలీంశంకర్, దాదా, అనూష ప్రవర్తనలని సుగ్రీవ్ మొదటినుంచి జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అతడు అడిగిన ప్రశ్నలకి అనూష చెప్పిన సమాధానాలు అతడికి సంతృప్తికరంగా అనిపించలేదు. ముఖ్యంగా ఆమె యమిన్ సున్ ని ఎందుకు కలుసుకుందో అతడికి అర్థం కాలేదు. అందుకే సలీంశంకర్ జపాన్ బయల్దేరేవరకూ రహస్యంగా వెంబడించాడు. అయితే, అతడి ఆఫీసులోనే మాఫియా ఇన్ ఫార్మర్లు వుండడంవల్ల దాదాకి ఈ విషయం ముందే తెలిసింది.
ఒకసారి సలీంశంకర్ ప్రయాణీకుల లోపలి లాంజిలోకి వెళ్ళగానే సుగ్రీవ్ తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.
అంతా అనుకున్నట్టే జరగటంతో అతడు వెనుదిరిగాడు.
ఇది జరిగిన అయిదు నిమిషాలకి అతడికి పిస్తోలు పేలిన శబ్దం వినిపించింది. మామూలు ప్రయాణికులకి అదేదో మామూలు శబ్దంలా వినిపించింది కానీ, అతడి పోలీసు చెవులు దాన్ని వెంటనే గ్రహించాయి.
గేటు దగ్గిర గార్డులకి తన ఐడెంటిటీ కార్డు చూపించి వేగంగా లోపలికి పరుగెత్తాడు.
* * *
అనూష ఇంకా అ ద్వారంవైపే చూస్తూంది. అప్పటికి దాదా, బిల్లూ అటు వెళ్ళి పది నిముషాలయింది.
క్షణక్షణానికీ ఆమెలో టెన్షన్ ఎక్కువైంది. లోపల్నించి ఏ అలికిడీ లేదు.
ఆమె అరచేతులు చెమటలు పట్టసాగాయి.
తనువేసిన ప్లానంతా విఫలమయిందేమో అన్న అనుమానం కలిగింది ఆమెకి.
అదేగానీ అవుతే......?
ఆమె సన్నగా వణికింది.
అంతలో కారు వెనుక చప్పుడయింది. ఆమె తల తిప్పి చూసింది.
గుండప్ప!!!
ఆమె కెవ్వున అరవబోయి అతికష్టం మీద తమాయించుకుంది.
'నీ గురించి చాలా వెతికాను చిన్నమ్మా! పద'
'ఎక్కడికి' అని అడగటానికి కూడా ఆమెకి నోరురాలేదు.
గుండప్ప చొరవగా కారు వెనుక తలుపు తీసుకుని కూర్చుని 'పోనియ్' అనబోయేడు. అంతలో వెనుక నుంచి ఒక మెరుపులా వచ్చి తాకింది పిడిఘాతం. శ్రీకాంత్ ఎక్కడ కొడుతున్నానని కూడా చూసుకోకుండా కొట్టాడు. పోలీసు దెబ్బ అది! ఆ దెబ్బకి గుండప్ప మొహం వెళ్ళి కారు అద్దానికి తగిలి, అది భళ్ళున బద్దలయింది.
ఆ శబ్దంతోపాటు వినిపించింది పిస్తోలు పేలిన ధ్వని. ముందొకసారి......
అది సరిగ్గా వినిపించలేదు వాళ్ళకి.
ఆ తరువాత నిముషానికి మళ్ళీ వినిపించింది -ఒకదాని తరువాత ఒకటి వరుసగా!
ఈసారి అయిదుగుళ్ళ పేలిన శబ్దం......
* * *
యమిన్ సున్ ని స్పృహతప్పించి సలీంశంకర్ వెనుకవైపు ప్రయాణించగానే- పేపరు మడతపెట్టి జానీ కూడా అతడి వెనుకే నడిచాడు. అతడు వెనుకవైపు హాలులోకి అడుగు పెడుతూ వుండగా పిస్తోలు శబ్దం వినిపించింది. పరుగెత్తటం ప్రారంభించాడు. అప్పటికే బిల్హణుడి చేతినుంచి రక్తం స్రవించసాగింది.
అక్కడే జానీ తెలివైన పనిచేశాడు.
వెంటనే లోపలికి ప్రవేశించకుండా చేతిలోని బ్రీఫ్ కేస్ విసిరేసాడు. అది వెళ్ళి ఆ ముగ్గురికీ దూరంగా ఎడమపక్కన శబ్దం చేస్తూ పడింది. ఆ ధ్వనికి సలీంశంకర్ అటు చూశాడు. ఆ కొద్దిపాటి సమయంలో బిల్హణుడు మెరుపుకన్నా వేగంగా అతడి చేతిని కొట్టాడు. పిస్తోలు జారి పడింది.
జానీ ఆలస్యం చేయలేదు. ఒక్క అంగలో అక్కడికి చేరుకుని, పిస్టల్ అందుకుని వరుసగా అయిదుసార్లు పేల్చేడు. నిర్దాక్షిణ్యంగా, మరేమీ ఆలోచించకుండా క్లోజ్ రేంజిలో..... అయిదు గుళ్ళూ సలీంశంకర్ శరీరంలోకి చొచ్చుకుపోయాయి. నిలువెత్తు మనిషి, విరిగిన తాటిచెట్టులా క్రింద పడ్డాడు.
బ్రతికినంత కాలం మానవత్వాన్ని మరిచి, ఎందరో స్త్రీలను చెరిచి, మరెందరినో చంపినా ఆ మనిషి అయిదు క్షణాలపాటు గిలగిలలాడి ప్రాణం వదిలాడు. అయిదు డాలర్ల డబ్బు కోసం అమాయక టూరిస్టుల ప్రాణాల్ని అతి దారుణంగా అపహరించిన ఆ నరరూప దానవుడు ఆ క్షణం తన పాపాలకు అంత సులువుగా ప్రాణాలు పోగొట్టుకోవటం అతడికి దేముడిచ్చిన ఆఖరి వరం. భారతదేశపు అందాల్నీ పవిత్రతని ఆపాదించుకున్న దేవాలయల్నీ సందర్శిద్దామని వచ్చి, ఈ కిరాతకుడి చర్యలకి బలైపోయిన విదేశీయుల ఆత్మలు ఒక్కసారిగా సంతృప్తితో జయజయధ్వానాలు చేసినట్టు ఆ గది అయిదు సార్లు మార్మోగింది.
జానీ ఆలస్యం చేయకుండా బిల్హణుడివైపు తిరిగి "పద క్విక్" అన్నాడు బిల్హణుడు దాదా మొహం మీద బలంగా చరిచి ద్వారంవైపు పరుగెత్తాడు.
సరిగ్గా అదే సమయానికి, విమానాశ్రయం బయట ఎదురు చూస్తున్న అధికారి గది బయట తాళం తీశాడు. దూరంగా నిలబడి, దాదా, శంకర్ తో కలిసి ఎప్పుడు బయటకు వస్తాడా అని చూస్తున్న ఆ అధికారికి లోపల్నుంచి వినబడిన శబ్దాలు సరిగ్గా అర్థం కాలేదు. తాళం తీయగానే లోపల్నుంచి తలుపులు తెరుచుకున్నాయి.
దాదా లేచి, ఈ లోపులో, జానీ క్రింద పడేసిన పిస్టల్ ని అందుకున్నాడు. ద్వారం దగ్గిరకి చేరుకున్న జానీ వైపు పేల్చాడు. కానీ అప్పటికే దాన్లో గుళ్ళు అయిపోయాయి. అతడు కూడా ద్వారం వైపు పరుగెత్తాడు. కానీ, ఇద్దరూ బయటకి రాగానే అధికారి తాళం వేసేశాడు. ఏమీ ఎరగనట్టు, తనకి ముందు చెప్పిన విధంగా అక్కణ్ణుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.
జానీ బిల్లూలు జనంలో కలిసిపోయారు. ఎంతో జాగ్రత్తగా వింటే తప్ప జనానికి ఈ శబ్దాలు దేనికి సంబంధించినవో తెలీదు. అందుకే బయట వాతావరణం మామూలుగా వుంది.
దాదాకి తను చేసిన తప్పు గుర్తొచ్చింది. బట్టలకి పిస్టల్ ని తుడిచి, వేలిముద్రలు లేకుండా చేసి బయట పడదామని ఆశించాడు. అతడు పిస్టల్ ని తుడుస్తూ వుండగా సుగ్రీవ్ లోపలికి ప్రవేశించాడు.
"సి.బి.ఐ.......డోన్ట్ మూవ్...... ఆ పిస్టల్ అలాగే క్రింద పెట్టు" అన్నాడు అధికార స్వరంతో.
దాదా తల పైకెత్తాడు.
ఈ లోపులో సుగ్రీవ్ శంకర్ ని పరీక్షించాడు. అప్పటికే అతడి ప్రాణం పోయింది.
"సో..... నీ మీద వ్యాసాలు వ్రాసింది ఇతడు అన్న భ్రమతో, నీ గుట్టు ప్రజలకి చెప్పింది ఇతడు అన్న ఆగ్రహంతో ఇతడు జపాను వెళ్ళకముందే ఈ విధంగా పగ తీర్చుకున్నావన్నమాట. ఇలా లోపలికి రావటానికి ఎవరు నీకు సాయం చేసింది?..... పోన్లే. అదంతా కోర్టులో చెప్పుకుందువుగాని..... నౌ యు ఆర్ అండర్ అరెస్ట్" అన్నాడు.
* * *
అయిదు సార్లు పిస్తోలు శబ్దం వినగానే శ్రీకాంత్ కారులోంచి బయటికి రాబోయాడు. అనూష చప్పున అతడి చేతిమీద చేయి వేసింది. "ఇక్కడ నా మీద ఎవడో రౌడి చేయి చేసుకుంటూంటే నన్నొదిలేసి ఎక్కడి కన్నయ్యా వెళ్ళబోతున్నావ్?" అంది.
"వదులు. లోపల ఏదో గొడవ జరగబోతూంది."
"లోపలికి వెళ్ళటానికి ఎన్నో ఫార్మాలిటీస్ వుంటాయి. అవన్నీ పూర్తిచేసుకుని నువ్వు వెళ్ళేలోపులో ఏం జరిగిందో బయట వాళ్ళే చెపుతారు".
"నీకేమైనా మతి పోయిందా. చెయ్యి వదులు. లోపల ఎవడో టెర్రరిస్టు హత్యాకాండ చేస్తున్నట్టున్నాడు".
"పోలీసు గుణం పోనిచ్చుకున్నావుకాదు. అవేం చప్పుళ్ళో".
శ్రీకాంత్ మొహం ఎర్రబడింది. "నీకు మతిపోయింది. ఆ మాత్రం తేడా గుర్తించలేని వాణ్ణికాదు" అన్నాడు.
అనూష అతడి చెయ్యి వదిలేసింది. ఈ సంభాషణలో ఆమెకి కావలసిన సమయం దొరికింది. ఆమె వైపు తిరిగి వుండటంవల్ల అతడు గమనించలేదు కానీ లేకపోతే తనకు ఎడమ పక్క దూరంగా గోడవున్ లా వున్న భవంతిలోంచి బిల్లూ, జానీలు బయటికొచ్చి కార్లవైపు పరుగెత్తటం, ఆ తరువాత విమానాశ్రయపు అధికారి తలుపు వేసేయటం గమనించి వుండేవాడే! అతడి దృష్టినుంచి ఆ దృశ్యం తప్పించుకుందని గ్రహించగానే, ఇక తన పని అయిపోయినట్టు అనూష అతడి చెయ్యి వదిలేసింది.
అతడు ప్రవేశ ద్వారం వైపు పరుగెత్తాడు.
* * *
యమిన్ సున్ కళ్ళు విప్పాడు. ఒక క్షణం అతడికి తనెక్కడున్నదీ అర్థం కాలేదు. చుట్టూ వున్న ప్రయాణీకుల్ని చూసి అర్థమయింది. పక్కకి చూస్తే సలీంశంకర్ లేడు.
మొట్టమొదటిసారి తన పోలీసు సామర్థ్యం మీద అనుమానం కలిగింది.
కుర్చీలోంచి లేవబోతూండగా
సెక్యూరిటీ గార్డుల మధ్య వస్తూ కనిపించాడు వసంత్ దాదా!
తల వంచుకుని- అడుగులో అడుగు నెమ్మదిగా వేస్తూ!!
ఈ వలయంనుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ!!!
తనని ఎవరు తప్పించగలరా అని ఆలోచిస్తూ!!!
ఎవరెవరు తనకి సాక్ష్యం ఇవ్వగలరా అని యోచిస్తూ!!!!!
* * *
అనూష కారు దిగింది.
పోలీసు కారులోకి దాదాని ఎక్కిస్తున్నాడు సుగ్రీవ్. పక్కనే శ్రీకాంత్ నిలబడి వున్నాడు. జనం వలయంలా దూరంగా వున్నారు.
తాపీగా అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమెని అక్కడ చూసిన సుగ్రీవ్ చెలరేగిన ఆశ్చర్యాన్ని అతి కష్టం మీద దాచుకున్నాడు.
"ఒక్క క్షణం దాదాతో మాట్లాడవచ్చా?" మర్యాదగా అడిగింది. వారి జవాబు కోసం ఆశించకుండా దాదా దగ్గరికి వెళ్ళింది. దూరంగా జనాన్ని పోలీసులు సర్దుతున్నారు.
"దాదా" అంది. దాదా తలెత్తాడు. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
"నేన్నీకు ముందే చెప్పాను. నువ్వు నన్ను వదిలేస్తే నేను నిన్ను వదిలేస్తానని అన్నాను. విన్లేదు నువ్వు. వినుంటే, అసెంబ్లీ వేదికమీద నన్ను పాడుచేస్తానన్న సలీంశంకర్ కీ నాకూ మధ్యే వుండేది వైరం. ఎనీవే- అతడిని చంపి నన్ను రక్షించినందుకు నీకు నా కృతజ్ఞతలు".
దాదాని కారెక్కించారు.
ఆమె అలాగే నిలబడింది.
సుగ్రీవ్ కారెక్కగానే అది కదిలింది.
శ్రీకాంత్ ఆమె చేతిమీద చెయ్యి వేస్తూ 'పద' అన్నాడు.
దూరంగా సలీంశంకర్ శవాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నారు. ఆమె అటువైపు ఓ క్షణంపాటు కన్నార్పకుండా చూసి అన్నయ్యతో కలిసి తమ కారువేపు నడిచింది.



