Home » Yandamuri veerendranath » Prarthana


                                      నాలుగు

 

    ఆ గది గోడలు నల్లగా మసి పట్టినట్టున్నాయి. ఎక్కడా మనుష్యుల అలికిడి లేదు. గదిలో పెద్దగా వస్తువులు కూడా ఏమీలేవు. ఒక మూల రెండు పెట్టెలు, చిన్న కూజా, మరో మూల ఒక బల్ల, దాని కిరువైపులా రెండు కుర్చీలు ఉన్నాయి. చెరో కుర్చీలోనూ కూర్చొని ఉన్నారు...భార్గవ, జనార్ధన్ పాత్రో.     

 

    పాత్రో భార్గవకంటే దృఢంగా బలంగా వున్నాడు. అడవుల్లో తరుచు తిరుగుతూ ఉండటంవల్ల అతడి శరీరం నల్లగా మొద్దు బారింది. అతడూ భార్గవా ఒకే కాలేజిలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ బ్రిలియెంట్సే - తరువాత దార్లు వేరయ్యాయి.

 

    భార్గవ చెప్పినదంతా పాత్రో శ్రద్ధగా విన్నాడు. మొదట్లో ఆశ్చర్యపోయినా, క్రమక్రమంగా అతడి ముఖంలో భావాలు మారినయ్. భార్గవ చెప్పిందంతా పూర్తికాగానే ఓ అయిదు నిముషాలు మవునంగా వుండి- "బాంబులేసి ఇన్ స్టిట్యూట్ ని ఎవరో పేల్చేసేరనగానే మొట్టమొదటి అనుమానం నీ మీదకే వస్తుంది" అన్నాడు.

 

    "రానీ" అన్నాడు భార్గవ. "రాజకీయాల్తో కుళ్ళిపోయిన, స్వార్థముతో పుచ్చిపోయిన ఈ ఇన్ స్టిట్యూట్ ని బద్దలు కొట్టేస్తే ఆ తరువాత నేను ఏమైనా ఫర్లేదు. నన్ను కాదనకు".

 

    "కాదనడమా? మంచి ఆశయాన్ని.... కేవలం పేపర్ లో పేరు చూసుకోవటం కోసం నమ్మినట్టు నటించే చాలామందికన్నా నీలాంటి ఒక్క ప్రాక్టికల్ మనిషి మాకెంతో సాయం చేసినవాడౌతాడు" అంటూ పాత్రో లేచి "ఒక్క నిముషం కూర్చో" ని బయటకి వెళ్లి నాలుగు నిముషాల్లో తిరిగి వచ్చాడు. భార్గవ అతడివైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

 

    "ఇంకో అరగంటలో వస్తాయి. మొత్తం ఆరు చాలుగా".

 

    "చాలు" అన్నాడు భార్గవ. "ఓ గంట తర్వాత రమ్మంటావా?"  

 

    "వద్దు. నువ్వు బయటకి లోపలికి తిరగటం ఎవరికయినా అనుమానం కలిగినా కష్టం".

 

    ఆ మాటకి భార్గవ స్థిమితంగా కూర్చుంటూ- "నిన్ను కల్సుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఎక్కడుంటావో తెలీదు. కల్సినా పని అవుతుందో లేదో తెలీదు" అన్నాడు.

 

    "అదృష్టవశాత్తు నేనింకా పోలీసుల రికార్టుల్లోకి ఎక్కలేదులే. ముందు నిన్ను చూసి, ట్రాప్ చెయ్యటానికి వచ్చిన సి.ఐ.డి. ఆఫీసర్ అనుకున్నాను. అందుకే ఇన్ని ప్రశ్నలు వేయవలసి వచ్చింది".

 

    భార్గవ మాట మారుస్తూ, "మనం కలుసుకొని పది సంవత్సరాలు అవలేదూ?" అనడిగాడు.

 

    "అంతకన్నా ఎక్కువే".

 

    భార్గవ పూర్వపు రోజులు జ్ఞాపకం చేసుకుంటూ, "ఆ రోజులలో ఆర్గానిక్ కెమిస్ట్రీమీద అథారిటీవి గుర్తుందా?" అనడిగాడు.

 

    "ఆథారిటీని అవునో కాదో తెలియదుకానీ, బయోకెమిస్ట్ నో, లేకపోతే నీలాగా సైంటిస్టునో అవ్వాలని కోర్కె కాస్త వుండేది" అంటూ నవ్వి...

 

    "బయోకెమిస్ట్రీ సంగతి వచ్చింది కాబట్టి నీకూ ఇందులో ఇంటరెస్టు వుండవచ్చు".

 

    అతడికింక ఆసక్తి ఏమీలేదు. అయినా వచ్చినపని అయ్యేవరకు సమయం గడపాలి కాబట్టి అనాసక్తితోనే "ఏమిటి?" అన్నాడు.

 

    "కాశ్మీర్ లో 'హుంజా' అని ఒక తెగ వుంది. ఆ జాతివాళ్ళకు కేన్సర్ రాదట".

 

    "అవును. ప్రపంచం మొత్తానికే ఒక ఆశ్చర్యకరమైన విషయం. అమెరికా నుంచి కొందరు శాస్త్రజ్ఞులు అక్కడకు వెళ్లి కొన్ని నెలల తరబడి వుండి ప్రయోగాలు చేశారు. అయినా ఆ రహస్యం శోధించబడలేదు".

 

    "కారణం ఏమై వుంటుంది?"

 

    "ఇంటర్ ఫెరాన్" అన్నాడు భార్గవ... "వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీస్ వాళ్ళ శరీరంలో ఆటోమేటిక్ గా తయారవుతూ వుండవచ్చు... కేన్సర్ కి కారణం వైరస్సే అనుకునే పక్షంలో..."

 

    "వాళ్ళ శరీరంలో తయారయ్యే యాంటీబాడీస్ మనందరి శరీరాలలో ఎందుకు తయారవ్వవు?"

 

    "కారణం ఏదయినా అయుండవచ్చు. చుట్టూ వుండే వాతావరణము, పీల్చేగాలి, తాగేనీరు, జెనెటిక్స్... వీటిలో ఏదో! ఎలా కనుక్కోవటం? దీనిమీదే శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కి కొందరు హుంజాల్ని పంపే విషయం భారత ప్రభుత్వం ఆలోచిస్తూ వుందికూడా".

 

    "మొన్న మొన్నటివరకూ మేము వెంకటాపురంలో వుండేవాళ్ళం. ఆ పక్క అడవుల్లో కోయల్ని "మరిశ" అనేవాళ్ళు. కొన్ని తరాలక్రితం ఎప్పుడో వాళ్ళకో ఆధారం వుండేదట, నాకు చెప్పాడు. యుద్ధంలోగానీ వారు జయిస్తే శత్రువుల తలలు తీసుకొచ్చి విజయ సూచకంగా తమ గుమ్మాలకి వేలాడగట్టుకునేవారట".

 

    ఏదో గుర్తు వచ్చి, భార్గవ ఆసక్తిగా "అయితే..." అన్నాడు.

 

    "ఆ రాత్రి వాళ్ళు విజయోత్సాహంతో పండగ జరుపుకునేవారట. పెద్ద డేగిసలాంటిది మధ్యలో పెట్టి కొన్ని మూలికల కషాయం అందులో పోసి ... వీటిమధ్య విప్పసారా తాగి నృత్యం చేసి చేసి స్పృహతప్పి పడిపోయేవారట. ప్రొద్దున్న లేచి చూసేసరికి ఆ తలలు చిన్న చిన్న బంతుల్లా అయ్యేవట. జీవకళ మాత్రం పోయేది కాదట".

 

    "నేనూ ఒక సైన్స్ మాగజైన్ లో చదివాను. అయితే నేను చదివింది ఆఫ్రికాలోని బుష్ మెన్ ల గురించి... వాళ్ళూ ఇలానే చేసేవారట. అ మూలికలు ఏమిటో నీకేమైనా తెలుసా?"

 

    పాత్రో నవ్వాడు. "నేను వదిలి పెట్టలేదు. మనుష్యుల్లో మూఢాచారాన్ని పారద్రోలటం కూడా కర్తవ్యమే కదా! చాలా కష్టపడి ఆ తండా వృద్ధుల్ని పట్టుకుని పురాతన పత్రాల్లోంచి ఆ మూలికల పేర్లు సంపాదించాను. ఒకరోజు ముహూర్తం పెట్టి ఆ కషాయం తయారుచేసేము, మనిషి తల వేయలేదుగానీ, ఓ కుందేలుని వేసేము".

 

    "చిన్నదయిందా?"

 

    "లేదు".

 

    భార్గవ కూడా నవ్వేడు. పాత్రో అన్నాడు,"అప్పుడే నాకు అనుమానం వచ్చింది, హేతువు లేకుండా ఏదీ వుండదు".

 

    "మనకు తెలిసి వుండకపోవచ్చు. అంతమాత్రాన లేదనం కదా! హుంజా జాతివాళ్ళకి కేన్సర్ రాదు. అది మనందరికీ తెలిసిన విషయమే కానీ హేతువు ఇంకా కనుక్కోబడలేదు. ఇది అందరూ వప్పుకునే సత్యమే..."


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More