Home » Yandamuri veerendranath » Prarthana
నా అమాయకత్వాన్ని చూసి జాలిగా నవ్వి, 'నా ఆర్తగీతం అడవిలో ఏ గడ్డి పువ్వునో స్పృశించి దాన్నో ఎర్రమందారం చేస్తుంది' అన్నాడు ధీమాగా. లేచి నిలబడ్డాను. విసుగేసింది. "నీకన్నా సిద్ధాంతం గురించి నేనే కాస్త చదువుకున్నాను అన్న విషయం నాకు తెలుసు. అది చెప్పినా నువ్వు నమ్మవ్. వ్యక్తిగత ఆస్తి, వారసత్వపు హక్కు పోతాయంటే దాన్ని మనస్పూర్తిగా ఆహ్వానించేవారిలో నేనొకడిని. నువ్వు కోరే సమసమాజం నిజంగా వస్తే, అందులో కూడా నేను మొదటి వరుసలోనే వుంటాను. కష్టపడటం నాకెప్పుడూ అలవాటే! కానీ నీ సంగతి అలాకాదే. నీ చేతకానితనానికీ బద్ధకానికీ తప్పంతా వ్యవస్థమీద తోసేసి నినాదాల ముసుగు వేసుకుంటున్నావు! మొత్తం వ్యవస్థే మారాలి అన్నది నీ ఆశయం అయితే అవ్వొచ్చు. కానీ దానికి నువ్వేం చేస్తున్నావో ఆలోచించు".
"సిద్దాంతం పట్ల నీకింత నమ్మకం వుంటే జనంలోకి వెళ్ళి దోపిడి ఎలా జరుగుతుందో వివరించు! అంతేకానీ 'పని' చెయ్యటం మానేసి నాలో అగ్నిపర్వతం వుంది. నా నెత్తిమీద సూర్యుడున్నాడు. వగైరా కుహనా- హెలూసినేషన్స్ లో పడి కొట్టుకుపోకు. చీకటికన్నా చిరుదీపం మంచిదని నువ్వే అన్నావుగా. మరి నీ చేతనయినంతలో దారికడ్డంగా వున్న సమాధిని తవ్వొచ్చుగా! తవ్వవు. కారణం పని చెయ్యటం కంటే, రిస్కు తీసుకోవటం కంటే, వ్యవస్థ మారాలనే భ్రాంతిలో వుండటం సులభం కాబట్టి! నీ నినాదాలకి ఎవరో ఎక్కడో మారి ఓ సీతారామరాజో, భగత్ సింగో పుడతాడనుకుంటున్నావ్ కదూ??"
"నేను చెప్తాను విను! ఏ మాత్రం లాజిక్ వున్న వాడయినా నిన్నుచూసి నవ్వుకుంటాడు. జాలిపడ్తాడు. ఒక గుడ్డిపువ్వు ఎర్రమందరంగా మారదామనుకున్నా కూడా, నీలాంటివాళ్ళని చూసి మనసు మార్చుకుంటుంది" అన్నాను. అతడో క్షణం విస్తుబోయాడు. వెంటనే తేరుకోలేదు. ముఖం కందగడ్డలా మారింది. విసురుగా లేచి నిలబడ్డాడు. "నీ నోట్లోకి అయిదువేళ్ళూ వెళుతున్నాయి కాబట్టే, నీకు చదువూ, డబ్బూ వుంది కాబట్టే ఈజీచైర్లో కూర్చుని ఎన్ని కబుర్లు అయినా చెపుతావు. నీ వాదనని ఎన్ని మాటలతోనయినా సమర్ధించుకుంటావు. మాలాగా నిస్సహాయస్థితిలో వుంటే నీకూ తెలిసొస్తుంది" అనేసి విసురుగా వెళ్ళిపోయాడు.
ఇదిగో ఈ మాటకోసమే ఇదంతా చెప్పవలసి వచ్చింది. అతడిప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఈ మాట అన్న సంగతి కూడా అతడు మర్చిపోయి వుండవచ్చు. కానీ అతడన్న ఈ చివరిమాట ఇంత కాలం నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇంతకాలం నాలో నేనే ఆత్మవిమర్శ చేసుకుంటూ వచ్చాను.నా జీవితం హాయిగా సాగిపోతుంది. కాబట్టి నేనింత ధీమాగా ఈ విషయాల గురించి సిద్ధాంతీకరణం చేయగల్గుతున్నానా? అతడన్నమాట నిజమేనా? నా వెనుక ఇవేమీ లేకపోతే నేనూ సినిక్ ని అవుతానా? ఇలా మధనపడుతూ వచ్చాను. అతడే ముహూర్తాన ఈ మాట అన్నాడో గానీ అది నా మనసు దొలిచెయ్యసాగింది.
ఒక రాత్రికి రాత్రి ఏదయినా విపరీతం జరిగి ఒక్కసారిగా నేను వీధిన పడితే?... పరువుపోతే ...ఉద్యోగం పోతే ... ఇలా సాగేవి నా ఆలోచన్లు. విధి నా ఆలోచన్లు పసిగట్టింది కాబోలు, చాలా సరదాగా నా మీద కసి తీర్చుకుంది. నాకు కలిగిన మొట్టమొదటి ఆలోచన - ఆత్మహత్య! కానీ ఆలోచిస్తే నాకే నవ్వొచ్చింది. నా సిద్ధాంతీకరణా, నా యీ అంధకార బంధురమైన జీవితంలోంచి ఒక కొత్త మలుపుని పునర్ నిర్మించుకోవాలనుకున్నాను. నేను అనుకున్నట్లే శంకర్ లాల్ వచ్చాడు.
గుడ్డీ, చెవిటీ, మూగా చీఫ్ అకౌంటెంట్ తమకి అక్కరలేదని అతడు అనకముందే రాజీనామా ఇచ్చేసేను. మనిషి బ్రతకటానికి కమ్యూనికేషన్ ముఖ్యమని, బ్రెయిలీ నేర్చుకున్నాను. చిన్న కుర్రాళ్ళకి ఆర్నెల్లు పట్టే లిపి, నాలాటి అర్థంతరపు అంధులకి ఒక్కరోజులో ఎందుకు రాదో అని ప్రయోగం చేసేను. అది నేర్చుకాగానే డబ్ల్యూ.బి.ఓ.కి ఉత్తరం వ్రాసేను. ఇప్పటివరకూ అంధులకి మామూలు చదువూ, చిత్రలేఖనమూ ఇవే వున్నాయి. అకౌంటింగ్ లేదు. అది నేర్పితే చిన్న చిన్న లెక్కలు వారుకూడా చేసుకోవచ్చు కదా అని సూచించాను. డెబిట్టూ క్రెడిట్టూ కూడా ఒక కొత్త పద్ధతిలో బ్రెయిలీలో రాయవచ్చని నాకో ఆలోచన వచ్చింది. అది వివరించాను.
డబ్ల్యూ.బి.ఓ. నా సూచనని అంగీకరిస్తే ఇంకా నా పరిశోధన కొనసాగిస్తాను. వాళ్ళు వప్పుకోకపోతే, ఇదిగో ఈ వూళ్ళోనే బ్లయిండ్ స్కూల్ కి టీచరుగా అప్లయి చేశాను. బాగా చదువుకున్నాను కాబట్టి, అంధుణ్ని కాబట్టి నాకు ఉద్యోగం వచ్చే ఛాన్సులున్నాయి. ఈ ఉద్యోగం కూడా రాకపోతే ఇదిగో నా అసిస్టెంటు- ఈ అమ్మాయి ద్వారా ఓ పుస్తకం వ్రాయిస్తాను. 'నిశ్శబ్దపు చీకటిలో మౌనంగా నా భావాలు- 'THE DUMB IDEAS OF MINE IN SILENCE AND DARKNESS' అన్న పుస్తకాన్ని బ్రెయిలీలో వ్రాసి, ఇంగ్లీషులో తర్జుమా చేయిస్తాను. నా రచన అంత బావుండకపోవచ్చు. కానీ ప్రపంచపు మొట్టమొదటీ మూగ-చెవిటి-గుడ్డి రచయితగా నాకు పేరు వస్తుంది. అది చాలు. ఒకవేళ ఇదికూడా ఫెయిలయితే అప్పుడు మరోమార్గం ఆలోచిస్తాను..... ఇవీ ఈ కొద్దిరోజుల్లో నేను ఎన్నుకున్న జీవితపంథాలో నా కొచ్చిన కొత్త మార్గాల ఆలోచన్లు- ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే- ఓటమి వప్పుకోవటం చాలా సులభం, పోరాటం కష్టం. నేను రెండోదాన్నే ఎన్నుకున్నాను".
చదవటం పూర్తిచేసి భార్గవ అలాగే అచేతనంగా వుండిపోయాడు. మనసంతా అదోలా అయిపోయింది. ఏదో దీప్తి. నల్లటి ఆకాశంలో చిన్న చుక్కగా ప్రారంభమయి, దగ్గిరకొచ్చేకొద్దీ అఖండజ్యోతిగా మారుతుంది. తలెత్తి శేఖరం వైపు చూశాడు. అతడి ముఖం నిర్మలంగా చిన్నపాపలా వుంది. కానీ అందులో ఒక ధీమా వుంది! వెళ్లిపోయిన తుఫాన్ను నిలదొక్కుకుని ఎదుర్కొన్న ప్రశాంతత వుంది!! అమ్మాయిల్ని అల్లరి పెట్టిన చిరునవ్వు స్థానే పెదవుల వెనుక బిగిసిన పట్టుదల వుంది.
భార్గవ లేచి నిలబడ్డాడు.
ప్రియ అతడివైపు చూసి, "మీరేదైనా చెప్పదల్చుకుంటే చెప్పండి, వ్రాసి అందిస్తాను" అంది.
"నేనే స్వయంగా వ్రాస్తాను. నాకొకసారి ఆ 'లిపి' చూపిస్తారా" అని అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయినా, దాన్ని ప్రకటించకుండా అందించింది. శేఖరంలాంటి ఛార్టెర్డ్ అకౌంటెంట్ కి అది నేర్చుకోవటానికి ఆరుగంటలు పడితే, భార్గవలాంటి సైంటిస్టుకి ఆరునిముషాలు పట్టింది. ఒకసారి 26 అక్షరాల వంకా కాసేపు చూసి మనసులోనే వాటిని ముద్రించుకున్నాడు. తరువాత బ్రెయిలీ - స్కేలు తీసుకుని అక్షరాలు వ్రాసేడు - (గుచ్చేడు)
"మిత్రమా! దేముడనే రచయిత సీరియస్ జీవితంలోకి ఆడుతూ పాడుతూ తిరిగే నీ పాత్రని ఎందుకు తీసుకొచ్చాడా అని యింతకాలం ఆలోచిస్తూ వచ్చాను, ఇప్పుడు నాకు బోధపడింది. శలవు. మళ్లీ ఎల్లుండి కలుస్తాను. రేపు నాకో ముఖ్యమయిన పని వుంది".
అతడు వ్రాసిన అక్షరాల్ని తడిమిచూసి గ్రహించి, శేఖరం నవ్వాడు. "రేపు నాకూ ఒక ముఖ్యమయిన పని వుంది" అని వ్రాసేడు.
"ఏమిటి?"
"బాల్కనీగోడ పట్టుకుని వేలాడుతూ వుంటే తాపీగా బీరు తాగుతూ ఆనందించాడో పెద్దమనిషి. మనిషిగా పుట్టాక దెబ్బకి దెబ్బ తీయాలి కదా".
"అవును. దెబ్బతీయాలి. నన్ను అణగదొక్కిన వారిమీద, ఈ ప్రజల అజ్ఞానం మీద మనిషిగా పుట్టినందుకు నేనూ పగ తీర్చుకోవాలి" అనుకున్నాడు భార్గవ.
అతని చేతిని తన చేతిలోకి తీసుకుని "వెళ్ళొస్తాను" అన్నట్టు స్పృశించాడు.
"మంచిది" తలూపాడు శేఖరం. "నేను కనుక్కున్న విషయం మీకు ఎల్లుండి చెపుతాను".
"అక్కరలేదు. ఇక దాని అవసరం నాకు లేదు" అని వ్రాసి భార్గవ బయటకొచ్చేసేడు. విశాలమైన వరండాలో నడుస్తూ వుంటే జేబులో ఏదో అడ్డుకున్నట్టు అయింది. తీసి చూసేడు. సైనేడ్ సీసా.
దాన్ని తుప్పల్లోకి విసిరేసేడు.
అతడిప్పుడు భార్గవలా లేడు. "భార్గవుడి" లా వున్నాడు.
* * *



