Home » Yandamuri veerendranath » Prarthana


    "పదార్ధం చిన్నదవటానికి కారణం మరేమై వుంటుంది? లోపలి నీరు ఎవాప్ రేట్ (ఆవిరి) అయిపోయి వుంటుందా?"

 

    "అలా అయితే జీవకళ వుండదుగా?"

 

    "మరి?"

 

    "హైబ్రోడోమా సెల్స్ కారణం అయివుండవచ్చు. లేకపోతే యాంటిజెన్ కావొచ్చు. కానీ కత్తిరించబడిన తలలో ఇవన్నీ అభివృద్ధి చెందడం ఎలా సాధ్యమవుతుంది. అది కాకపోతే రేడియేషన్ కూడా కారణం కావచ్చు. కానీ మనకి నిజంగా వుందో లేదో తెలియని విషయం గురించి ఇంత తల బ్రద్దలు కొట్టుకోవటం అనవసరం".

 

    "నువ్వు చెప్పిందీ నిజమేలే" ఆగి సాలోచనగా అన్నాడు పాత్రో! "కానీ ఆ తల కుదించుకు పోవటానికి నువ్వన్నట్లు హైబ్రిడోమా గానీ, రేడియేషన్ గానీ కారణం అయివుంటే..."

 

    "ఊ అయివుంటే-"

 

    "అదే కేన్సర్ కి మందు".

 

    భార్గవ అప్రతిభుడయ్యాడు. పెద్ద తరంగం వచ్చి బలంగా మొహాన్ని కొట్టినట్లయింది. అతడి మొహంలో మారిన భావాల్ని చూసి పాత్రో బిగ్గరగా నవ్వుతూ - "ఏం? రెండో క్లాసువాడు చెప్పిన లాజిక్ లా వుందా?" అన్నాడు.

 

    భార్గవ నవ్వలేదు. స్నేహితుడివైపు కన్నార్పకుండా చూస్తూ అన్నాడు- "కషాయం తలని కుదించటం పౌరాణికాలలో సాధ్యం కావొచ్చు. కోయలు నృత్యం చేస్తూ, చేస్తూ అకస్మాత్తుగా మైకంకమ్మి పడిపోవటం కేవలం జానపదాల్లోంచే సాధ్యం కావొచ్చు. కానీ ఒక తెలివయిన వాడిని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం కేవలం మనదేశంలోనే సాధ్యమైంది".

 

    ఇంతలో బయట చప్పుడయింది. ఏదో అనబోతున్న పాత్రో ఆగి బయటకెళ్ళి నాలుగు నిమిషాలలో తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ప్లాస్టిక్ సంచి వుంది. దాన్ని భార్గవకి అందించాడు.

 

    "వీటి ఖరీదు?"

 

    పాత్రో నవ్వేడు. "మా తరఫునుంచి కాంప్లిమెంట్ గా స్వీకరించు".

 

    "వెళ్ళొస్తాను".

 

    "మంచిది".

 

    భార్గవ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. మనసులో ఏదో సందిగ్ధావస్థ కొట్టు మిట్టాడుతూంది. గుమ్మం దగ్గరే ఆగి, నెమ్మదిగా వెనక్కి తిరిగి అన్నాడు... "నేను... నేను చెపుతున్నది సరయిన దేనంటావా పాత్రో?"

 

    స్నేహితుడి భావాల్నీ తటపటాయింపునీ అర్థం చేసుకున్నట్టు పాత్రో అతడి దగ్గరికి నడిచి భుజంమీద చెయ్యి వేసేడు. వేస్తూ అన్నాడు-

 

    "గరీబీ హటావో- అన్న నినాదం ఆధారంగా ఒక పార్టీ పదవిలోకి వచ్చింది. రెండ్రూపాయలకి బియ్యం అన్న వాగ్దానాల్తో మరొక పార్టీ అధికారం సంపాయించింది. బియ్యంలేకపోతే, మనిషి పస్తుంటాడు. అంతకన్నా కొంప మునిగిపోదు. కానీ దగ్గిరవాళ్ళు జ్వరంతో అల్లల్లాడి పోతూ వుంటే కూలివాడైనా బిచ్చగాడైనా చూస్తూ వూరుకోలేడు. రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన దానికి, ఉన్నది తాకట్టు పెట్టింది కలిపి మందులు కొనటానికి పరుగెడతాడు. ఆ అవసరాల్ని తెలివైనవాడు కాష్ చేసుకుంటున్నాడు. మోసం అన్నిట్లోనూ జరుగుతుంది.

 

    కానీ తిండి, బట్ట, ఇల్లు వీటికన్నా ప్రస్తుతం మనిషికి "మెడిసన్" నిత్యావసర వస్తువు అయిపోయింది. దీనిలో జరిగే మోసాల విషయంలోనూ "ఇంటికి, బియ్యానికి" ఇచ్చినంత ప్రాముఖ్యం ప్రభుత్వం ఇవ్వలేకపోవటం దురదృష్టం. కారణం చాలా చిన్నది. ప్రజలకి బియ్యం ఎంత ధరకి ఉత్పత్తి అవుతుందో తెలుసు. కానీ మందులు ఎంతలో తయారవుతాయో తెలీదు. నువ్వీ నాలుగు బాంబుల్తో కూలగొడుతున్నది ఒక మందుల కంపెనీ కాదు, ఎవ్వరిదృష్టీ వెళ్ళని ఒక చీకటి కోణంలోకి నువ్వు వెళ్ళుతున్నావు. నువ్వు పేల్చే వెలుగుతో అందరి చూపు అటు మళ్ళుతుంది.

 

                                            2

 

    "ఇదే నా ఇల్లు ... " అన్నాడు శేఖరం కుర్చీలో కూర్చుంటూ. "ఈ రూమ్ లోనే కూర్చుని ఇక నా జీవనాధారం గురించి ఆలోచించాలి. అఫ్ కోర్స్. నా జీవనాధారంవల్ల వచ్చే ఆదాయంలో నీ జీతం డబ్బు కూడా మిళితమై వుండాలనుకో..."

 

    బ్రెయిలీ ద్వారా సంభాషించటం అతడికి చాలా సామాన్య విషయం అయిపొయింది. మామూలుగా మాట్లాడినట్టే వ్రాయగల్గుతున్నాడు- అవతలి వాళ్ళు వ్రాసింది తెల్సుకోగలుగుతున్నాడు.

 

    ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అవగానే ఇంటికి తీసుకొచ్చింది ఆమె. కొద్దిగా వెన్నులో నొప్పిగా వున్నా- బాగా నడవగలుగుతున్నాడు.

 

    అతడు క్షణం కూడా వేస్ట్ చెయ్యలేదు. ఇంటినుంచి పాస్ బుక్ తీసుకుని అసిస్టెంటు సాయంతో బ్యాంక్ కి వెళ్ళి, అంధులు ఖాతా ఆపరేట్ చేసే విధానాన్ని తెలుసుకుని, ఆ విధంగా ఏర్పాట్లు చేసేడు.

 

    తన వాహనంతో ఒక అవసరం లేదు కాబట్టి దాన్ని అమ్మేసే ఏర్పాట్లు చేసేడు.

 

    మోహన్ లాల్ ఇన్ స్టిట్యూట్ వాళ్ళు ఉద్యోగంలోంచి తొలగిపోయినప్పుడు ఇచ్చిన డబ్బునంతా రెండ్రూపాయల రిటర్న్ ఇచ్చే కంపెనీల్లో పెట్టాడు.

 

    సెక్రటరీ జీతం, తన యింటి అద్దె, తన నెలసరి ఖర్చు- వీటి మొత్తానికి ... తన ఇన్వెస్ట్ మెంటువల్ల వచ్చే ఆదాయానికి సరిచూసుకొన్నాడు. దాదాపు మూడొందలు తక్కువొచ్చింది.

 

    "మనం నెలకి మూడొందలు ఆదాయం వచ్చే ఉద్యోగం చూసుకుంటే చాలన్నమాట. కాలుమీద కాలు వేసుకుని తినొచ్చు".

 

    "మూడొందలంటే నాజీతం. నన్ను ఉద్యోగంలోంచి తొలగిస్తే మీరిక అసలు కష్టపడక్కరలేదు".

 

    "నిన్ను తీసెయ్యటమా? ప్రేమికులు అంటూంటారే- 'నా సర్వస్వం నువ్వే' అని. అలా ఓ నా సెక్రటరీ! నా చెవి-కన్ను-నోరు అన్నీ నువ్వే".

 

    ప్రియ బుగ్గలు ఎర్రబడ్డాయి. ఏమీ మాట్లాడలేదు.

 

    అతడు చెయ్యిసాచి బల్లమీద కాగితాలు అందుకోబోయాడు. ఏదో తగిలింది. తడిమి చేసేడు. టేప్ రికార్డర్.

 

    "దీన్నికూడా అమ్మెయ్యొచ్చు. దీని అవసరం కూడా లేదు- రాదు కూడా".

 

    ఆమె మాట్లాడలేదు, అకస్మాత్తుగా మూడ్ లో మార్పు వచ్చినట్టు అనిపించింది. ఈ లోపులో అతడు 'ప్లే' బటన్ నొక్కాడు... అంతా నిశ్శబ్దమే.

 

    "ఏం వినిపిస్తూంది?"

 

    ఆమె జవాబు చెప్పలేదు. అతడు రెట్టించాడు. తప్పనిసరి అయి ఆమె కాగితంమీద వ్రాసింది. 'ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్'.

 

    దాన్ని ఆస్వాదిస్తున్నట్టూ అతడు మౌనంగా వుండిపోయాడు. ఈ కీర్తనలన్నీ ఒక క్యాసెట్ మీద రికార్డు చేసుకున్నాడు. ఆ క్యాసెట్టే అది. అతడికి సంబంధించినంతవరకూ నిశ్శబ్దంగా తిరుగుతూంది. అతడి చేతి వేళ్ళు అప్రయత్నంగా బ్రెయిలీ పెన్సిల్ ని తీసుకున్నాయ్. కాగితంమీద చుక్కల్ని పొడవసాగేయి, నిరాసక్తంగా నిర్వేదంగా.  


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More