Home » Yandamuri veerendranath » Anaithikam
"మరేం చేస్తావ్? మీ ఆయనకోసం ఐదునుంచీ గుమ్మంలో నిలబడతావా?" అని అడిగాను.
"అవును. మా ఆయనకి వండి పెట్టడం. నా పిల్లలకి పాఠాలు చెప్పుకోవడం- ఇలాంటివే ఆలోచించుకోడానికి నాకు బావుంటుంది".
"నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? ఇంత చదువూ చదివేది వంటింట్లో మగ్గిపోవడానికా?"
"చదువుకీ, విజ్ఞానానికీ కొలమానం ఉద్యోగం చేయడం కాదు. ఇంకెవరికిందో రోజుకి అయిదారు గంటలు పని చెయ్యడం కన్నా నా ఇంటికోసం నేను పని చేసుకోవటం నా కెక్కువ తృప్తి".
"పది సంవత్సరాల తర్వాత ఏవో కారణాలవల్ల నీ భర్త నిన్ను వదిలేస్తే?" అని అడిగాను. ఇదే ప్రశ్న సూర్యాన్నీ అడిగాను. అయితే సమాధానం ఆ అమ్మాయి చెప్పింది. అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి అంత నిర్దుష్టమైన అభిప్రాయాలుండటం నాకు చిత్రంగా తోచింది. అయితే అవి మంచికి దారి తీస్తాయో, దురదృష్టంవైపు తోస్తాయో తెలియలేదు. ఆ అమ్మాయి చెప్పింది మాత్రం ఇది-
"...నా మొదటి ప్రిఫరెన్స్ ఒక భార్యగా ఇల్లు తీర్చిదిద్దుకోవడం. పోతే ఖాళీ టైమ్ ని సద్వినియోగపరచుకోడానికి కంప్యూటర్ నుంచి రెడీమేడ్ బట్టలు తయారుచేయడం వరకూ ఎన్నో చేయవచ్చు. సమయాన్ని నా చేతిలో వుంచుకోవడమనేది ముఖ్యం. పెళ్ళయిన రెండు సంవత్సరాల్లో నా భర్త ఎలాంటివాడో తెలుస్తుంది. కాబట్టి నన్ను చెరుకు పిప్పిని చేసేవరకు నలిగిపోతూవుండను. స్వంత కాళ్ళమీద నిలబడతాను. అయితే అది నా రెండవ ప్రిఫరెన్స్ మాత్రమే! తిరిగి మళ్ళీ ఎవరైనా కుర్రవాడు వివాహం చేసుకుంటానంటే నిశ్చయంగా ఒప్పుకుంటాను. అంతే తప్ప, మగవాళ్ళమీద కసి పెంచుకుని, నా సమస్య లన్నింటికీ వారినే బాధ్యులని చేయను. నా మీద నేను నమ్మకం పెంచుకోవడమే నా సమస్యకి పరిష్కారమని నాకు బాగా తెలుసు".
"నువ్వు చాలా ఊహల్లో బతుకుతున్నావు. వాస్తవం ఇంత అందంగా వుండదు".
"వాస్తవాన్ని ఎదుర్కొనే ధైర్యం వున్నప్పుడు, ఊహ నాకు ఆనందం ఇస్తున్నప్పుడు- అలా బతకడంలో తప్పేముంది?"
ఆ అమ్మాయి చెప్పింది కన్విన్సింగ్ గా వున్నా ఒప్పుకోబుద్ధి కాలేదు.
"నీకెంత చదువు, వ్యక్తిత్వం, అందం అయినా వుండనీ! ఒక మగవాడిని నమ్మి సర్వస్వం అర్పించాక, ముఖ్యంగా ఫ్రెష్ నెస్ కోల్పోయాక తిరిగి అంత ఆహ్లాదకరమైన- ముఖ్యంగా నువ్వూహించే జీవితాన్ని పొందగలడం అసాధ్యమని నా ఉద్దేశ్యం" అన్నాను.
"అలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేయడం కోసమే ప్రతి స్త్రీ చదువుకోవాలి. చదువంటేనే వ్యక్తిత్వం. 'ఇంజనీరింగ్ చదివింది వంటింట్లో మగ్గిపోవటానికా' అన్న మీ ప్రశ్నకి అదే సమాధానం. జీవితాన్ని ఫ్రెష్ గా మొదలుపెట్టడానికి స్త్రీ జన్మే పెద్ద అడ్డంకి అన్న మీ వాదనని నేను ఒప్పుకోలేను".
"ఎందుకని ఒప్పుకోవు?" అడిగాను.
"నా తల్లి కథ నాకు తెలుసు కాబట్టి" అన్నదా అమ్మాయి.
* * *
ఉపసంహారం
విమానాశ్రయం రష్ గా వుంది. నేనూ, ఆంటీ కాఫీ తాగుతూ నిలబడ్డాం. అత్తయ్య కూతురు బుక్ స్టాల్ దగ్గర నిలబడి పుస్తకాలు చూస్తోంది.
"నీ కూతురి భావాలు వింటుంటే నాగరికత ఒక వృత్తం లాంటిదన్నమాట నిజమనిపిస్తోంది. పెళ్ళి చేసుకుని సుఖంగా గడపటం తన మొదటి ప్రిఫరెన్స్ అని చెప్పింది. ఇవన్నీ నువ్వే నూరిపోశావా?"
ఆంటీ నవ్వి, "అది కాకుండా వేరే ప్రిఫరెన్స్ ఎవరికైనా వుందంటే, వాళ్ళు ప్రేమలో తాత్కాలికంగా దెబ్బతిన్న వాళ్ళయి వుంటారు. లేదా వైవాహిక జీవితంలో దెబ్బతిని, తన కసినంతా సిద్ధాంతాల రూపంలో కొందరు ప్రపంచం మీదకు తోస్తే, అదే వాస్తవమని ఆ భ్రమల్ని వంట పట్టించుకున్న వాళ్ళయి వుంటారు. అది సరేగానీ, ఏమిటీ- రాత్రంతా కూర్చుని ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టున్నావ్? వెళ్ళగానే నువ్వు వాదిస్తున్న కేస్ విషయమై పై కోర్టుకి అపీల్ చెయ్యబోతున్నావా?"
"లేదు. ఆ కేసు నేనింక వాదించబోవడంలేదు".
ఆంటీ ఆశ్చర్యంగా- "ఏమిటీ?" అంది.
"...అంటే ఆ పుస్తకంలో రాయబడినదంతా కరక్టేనన్న అవగాహన నీ కొచ్చిందా?"
నేను నవ్వాను. "లేదు. ఆ పుస్తకంలో రాసినదానికన్నా చాలా ఎక్కువ ఈనాటి స్త్రీలు తెలుసుకోవాలన్న విషయం నా కర్థమైంది. నేను ఏదో కారణంతో భారతదేశం వచ్చాను. అదెంత చిన్న కారణమో నా కిప్పుడర్థమైంది. అయితే దీనివల్ల నేనేమీ నిరుత్సాహపడటంలేదు. నా ఆలోచనా పరిధిని విస్తృతం చేయగల రెండు విభిన్న జీవితాల గురించి ఈ పర్యటనలో తెలుసుకున్నాను".
"జీవితాలా? ఎవరివి?"



