Home » Yandamuri veerendranath » Anaithikam


    "మీవే! నీదీ, అమ్మదీ!"

 

    ఆంటీ మందహాసంతో- "అంత విభిన్నత మా జీవితాల్లో ఏముందబ్బా?" అంది.

 

    "చాలా వుంది. అసలా మాటకొస్తే స్త్రీ సమస్యకి సంబంధించిన మైక్రో, మాక్రో దృక్పథాలకి మీ ఇద్దరి కథలే సజీవ ఉదాహరణలు".

 

    "నాకు సరిగ్గా అర్థంకావడంలేదు".

 

    "సమస్య రెండు రకాలు. ఒకటి తన ఆలోచనవల్ల వచ్చేది. రెండోది బయటి పరిస్థితులవల్ల కలిగేది! కొంతమంది స్త్రీలు తమ కష్టాల్ని భూతద్దంలో చూసుకుని కృంగిపోయి, ఒంటరితనంతో, నిర్లిప్తతతో, నిరాశతో, నిరుత్సాహంతో తమలో తామే కుమిలి పోతుంటారు. పరిష్కారం వెతుక్కోలేరు. ఒకవేళ అక్రమ సంబంధంలాంటి ఓదార్పు మార్గాన్ని వెతుక్కున్నా దాని పరిణామాలు ఆలోచించరు. ఎవరో ఏదో చెయ్యాలని ఆశిస్తూంటారు. దిగులుపడటం వేరు, ఆలోచన వేరు. ఈ జాతికి చెందినవారు 'దిగులుపడుతూ', దాన్నే 'ఆలోచన' అనుకుంటారు. ఏ 'స్త్రీ విమోచన సంస్థ' కూడా వీళ్ళ బాధల్ని తీర్చలేదు. స్త్రీ వాదులు ఊహించే కొత్త ప్రపంచం వచ్చినా సరే ఇటువంటి స్త్రీల సమస్యలేవీ తీరవనేది నిర్వివాదాంశం. ఒకవేళ అటువంటి ప్రపంచం వచ్చినా కూడా మరోరకం కష్టాలు, ఇంకో కొత్త ప్యాకేజీలో ఇలాంటి వ్యక్తుల కోసం సిద్ధంగా వుంటాయి!" ఆగి అన్నాను.

 

    "అవును, నేను నా తల్లి గురించే చెప్తున్నాను. ఒకప్పటి ఆమె ఆలోచనా దృక్పథంలోని లొసుగుల్ని వివరిస్తున్నాను. స్త్రీని తన కట్టడిలో వుంచుకోవడం కోసం పురుషుడు కొన్ని కట్టుబాట్లనీ, సామాజిక నిబద్ధతల్నీ, నైతికసూత్రాల్ని ఏర్పాటు చేశాడు. తాను మాత్రం ఆ పరిధిలో వుండకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఆ సమస్యకి పరిష్కారం వివాహ వ్యవస్థని రద్దు చేయమనడం కాదు. ఆ వ్యవస్థని గౌరవిస్తూనే రహస్య సంబంధాలు పెట్టుకోవడం అసలే కాదు. తనకేది ఆనందం యిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోగలగడం. అటువంటి ఆనందాన్ని ఆరోగ్యకరమైన రీతిలో నిర్భయంగా పొందడం. దాన్ని పొందడానికి కష్టపడాలే తప్ప దేవుడు కూడా స్త్రీకి అన్యాయం చేశాడని ఏడిస్తే ఏం లాభం?"

 

    "నీ తల్లి అలా ఎప్పుడూ బాధపడలేదే!"

 

    "బయటి ప్రపంచంలోకి వచ్చాక బాధపడి వుండకపోవచ్చు. కానీ సంసారం చేస్తున్నంతకాలం బాధపడింది. అంతకన్నా దురదృష్టకరమైన స్థితి ఏమిటంటే, తన బాధలన్నిటికీ కారణం పురుషాధిక్య సమాజమే అనుకుంది. మళ్ళీ ఇంకో పురుషుడి దగ్గరే ఓదార్పు పొందడానికి ప్రయత్నించింది. నేను చెప్పేదదే. స్త్రీ పురుషులు ఇండిపెండెంట్ కాదు. ఇంటర్ డిపెండెంట్. దాన్ని కాదని, వివాహ వ్యవస్థే వద్దని, లేదా, 'పైటల్ని కాల్చేయాలని' స్లోగన్స్ ఇస్తే ఏం లాభం?" ఆగి కొనసాగించాను.

 

    "దీనికి పూర్తిగా వ్యతిరేకం నీ కథ ఆంటీ! నీ సమస్యలన్నీ బయటి ప్రపంచం వల్ల సృష్టించబడ్డవే... ఒక స్త్రీగా పుట్టినందుకు చిన్నప్పటినుంచీ ఎన్నో కష్టాలను భరించావు. చదువు దగ్గరనుంచీ నీకు సమస్యే అయింది. ఒక పురుషుడితో నీకు సంబంధం వుందేమోనన్న అనుమానంతో నిన్ను ఇంట్లోవాళ్ళు అర్థరాత్రి బయటకు గెంటేశారు. ఆ పురుషుడే నీ అమాయకత్వంతో ఆడుకున్నాడు. వివాహమే అవసరం లేదని కన్విన్స్ చేశాడు. చదువు మధ్యలో మానేశావు. అంతవరకూ ఎందుకూ? చివరికి 'ఉమన్ ప్రొటెక్షన్ సెల్' కూడా నీకు సహాయపడలేదు. ఏ న్యాయశాస్త్రమూ నిన్ను రక్షించలేకపోయింది. నా తల్లి బాధలన్నీ తన ఆలోచనల వల్ల వచ్చినవి. నీ బాధలన్నీ బైటి ప్రపంచం వల్ల వచ్చినవి. పోరాటం జరపవలసింది ఈ కోణంలో అంటే! ఈ అంశంలో!! ఈ రంగంలో!!!"

 

    "అవును, దురదృష్టవశాత్తూ ఈ స్త్రీ వాదులందరూ పురుషుణ్ణి తమ శత్రువుగా పరిగణిస్తున్నారు. సమాజం వేరు. పురుషుడు వేరు. సమాజంలో పురుషుడు ఒక భాగం మాత్రమే. ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన భార్యకి కాఫీ కలిపి ఇచ్చే భర్తలు కనీసం కొంతమందైనా వుండొచ్చు. ఒక తండ్రిగా తన కూతుర్ని కూడా కొడుకుతో సమానంగా చదివించాలన్న భావ విప్లవం చాలా మంది తండ్రుల్లో ఎప్పుడో వచ్చింది. కానీ స్త్రీలలో వచ్చిందా? ఆడపడుచుల్లో, అత్తలల్లో వచ్చిందా? సమస్యనంతా కేవలం పురుషాధిక్యతకే ఆపాదించడం ఎంత నిర్హేతుకం? ఆధిక్యత అనేది స్థానంవల్ల వస్తుంది. అత్తగారి స్థానం, ఆడపడుచు స్థానం వగైరా...వగైరా..." అంది ఆంటీ.

 

    "నీ కూతురి మీద మీ ఇద్దరి ప్రభావం బాగా పడినట్టుంది" అన్నాను మాట మారుస్తూ.

 

    "అవును. అందులో తప్పుందంటావా?"

 

    "లేదు నిశ్చయంగా లేదు!" మనస్పూర్తిగా అన్నాను.

 

    "... రాత్రంతా కూర్చుని ఏం రాసుకున్నావని అడిగావు కదా? ఇదే రాశాను ఆంటీ! లేని కష్టాలు ఊహించేసుకుని, దేవుడి భజనల్లో, చీర షాపుల్లో, కిట్టీ పార్టీల్లో, అక్రమ సంబంధాల్లో ఉపశమనం పొందే స్త్రీలకోసం కాదు, పోరాటం అనేది నిజంగా కష్టాల్లో వున్న స్త్రీల కోసం. ఆ కష్టాలనుంచి బయటపడాలనుకునేవారి కోసం. మొగుడి దౌర్జన్యానికి ప్రతీకలుగా తమ ఒంటిమీద తేలిన గాయాల్ని చూసి రోదించే స్త్రీలకోసం... కొత్త స్కూటర్ తెచ్చివ్వలేక కిరసనాయిలుకి బలైపోయే కొత్త పెళ్ళికూతుళ్ళ కోసం!" ఆవేశంగా అన్నాను.

 

    "ప్రతి అమ్మాయికీ ఇంటర్మీడియట్ స్థాయిల్లో లీగల్ ఎడ్యుకేషన్ వుండాలి. ఆమె హక్కుల గురించి ఆమెకి తెలిసేలా చెయ్యాలి. నీలాటి దళిత వర్గాలకే కాక ప్రతి అమ్మాయి చదువూ ప్రోత్సహించడం కోసం ఉచిత విద్యే కాకుండా హాస్టల్ సౌకర్యం కూడా ఏర్పరచాలి. విడాకులు తీసుకున్న స్త్రీకి భర్త స్వార్జిత, వారసత్వ ఆస్తుల్లో కూడా వాటా కల్పించాలి. తల్లిదండ్రుల అసమర్థత కారణంగానో, ఆర్థిక బలహీనత కారణంగానో వివాహం కాని 35 ఏళ్ళు దాటిన స్త్రీకి జీవనభృతి కల్పించాలి. విడాకులు తీసుకున్న ఆడవాళ్ళకి ప్రభుత్వమే ఏదో విధంగా ఉద్యోగం యిచ్చి ఉపాధి కల్పించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక హీరో ఇద్దరు ఆడవాళ్ళతో నాట్యం చేస్తూ శుభం పలికే సినిమాల్ని 'బాన్' చెయ్యాలి. ఇదంతా నీకు నవ్వుగా కనబడచ్చు ఆంటీ! కానీ ఒక్కక్షణం లోతుగా ఆలోచించు. పది సంవత్సరాలపాటు హింసించి, హింసించి ఒక అర్థరాత్రి భార్యని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు భర్త. విడాకులు తీసుకున్న స్త్రీకి ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తుందన్న రూలే వుందనుకో, అటువంటి స్త్రీలు పది సంవత్సరాలపాటు భర్త చేతిలో బాధలనుభవించకుండా రెండేళ్ళకే బయటపడతారు కదా! కేవలం ఆర్థిక అభద్రతా దృష్ట్యానే చాలామంది అభాగ్యురాళ్ళు అనితరమైన కష్టాలను అనుభవిస్తూ సంసారాలు చేస్తున్నారు అన్న చిన్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పటినుంచీ నేను ఇటువంటి హక్కుల కోసమే పోరాడతాను!".

 

    నా మాటలు పూర్తవుతుండగా విమానం బయలుదేరుతున్న ప్రకటన వినబడింది. నేను విమానంవైపు వెళ్ళబోతుంటే ఆంటీ చివరి ప్రశ్న అడిగింది- "ఇంతకీ సూర్యమ్ సంగతి ఏం చేశావు. పెళ్ళి చేసుకుంటావా?"

 

    వెడుతున్నదాన్నల్లా ఆగి, వెనక్కి తిరిగి నవ్వి, "ప్రస్తుతం అది అప్రస్తుతం అనుకుంటాను" అన్నాను.

 

                                        * THE END *


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More