Home » Yandamuri veerendranath » Anaithikam


    "చిన్న పొరపాటా? ఒకే ఇంట్లో వుంటూ తండ్రిలాంటి బావగారితో సంబంధం ఏర్పరచుకోవడం..." నా మాటలు పూర్తికాకుండానే అతడు బల్లమీద బలంగా పిడికిలితో గుద్దాడు-

 

    "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే... అదే నేను చెప్పే ద్వంద్వ ప్రవృత్తి. ఏమన్నావ్? తండ్రి లాంటి బావగారితోటా అన్నావు కదూ? అంటే తండ్రిలాంటి బావగారు కాకుండా, వరసైన బావ అయితే ఫరవాలేదన్నమాట".  

 

    నేను స్తబ్దురాలినై - "మీరు లాయర్ అయితే బాగుండేది" అన్నాను ఏం మాట్లాడాలో తెలియక.

 

    "ఒక విషయం తార్కికంగా మాట్లాడడానికి లాయరే అవక్కర్లేదు. రక్షణకోసం భర్తతో సంసారం చేస్తూ, ఆనందం కోసం చాటుగా సంబంధాలు పెట్టుకోవడం తప్పే. కానీ అప్పటి నీ తల్లి మానసికస్థాయి గురించి ఆలోచించు. ఆ స్థితిలో వున్న మిగతా స్త్రీలు ఏం చేస్తున్నారు? నిర్లిప్తత అలవాటు చేసుకుంటున్నారు. లేదా, భగవంతుడు, పూజలు అంటూ మరో ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఆ వలయం నుంచి బయటపడ్డాక నీ తల్లి అంతకన్నా మంచి వ్యాపకానే కల్పించుకుందిగా! జీవితంలో స్వంతంగా కష్టపడి పైకొచ్చి నిన్ను చదివించింది. ఒంటరిగా బతికింది. అది చాలదా? అదే తప్పు నీ తండ్రి కూడా చేశాడు. పురుషుడికో న్యాయం, స్త్రీకో న్యాయం వుండకూడదని మీరేగా వాదించేది? దీనికి నువ్వేం సమాధానం చెప్తావ్?"

 

    అతడి చివరి వాక్యాలు నేను వినలేదు. తలమునకలయ్యేటంత ఆశ్చర్యంతో- "నా తండ్రి తప్పు చేయడమేమిటి?" అనడిగాను. అప్పుడు చెప్పాడు నా తల్లి తాలూకు జరిగిన కథ.

 

    చాలా క్లుప్తంగా....కానీ స్పష్టంగా.

 

    చాలాసేపటివరకు నేను మాట్లాడలేకపోయాను. మనసంతా అస్పష్టమైన గజిబిజి ఆలోచనలు కలచివేయసాగాయి. నా మనఃస్థితిని అర్థం చేసుకున్నట్లు అతడు కూడా మౌనం వహించాడు. కొంతసేపటికి నేను తేరుకుని అన్నాను- "నా కిదంతా చాలా అయోమయంగా వుంది. మానవ సంబంధాల పట్ల...ముఖ్యంగా భార్యాభర్తల సంబంధంపట్లే అనుమానం వేస్తోంది. మరోలా చెప్పాలంటే అసహ్యం వేస్తోంది".

 

    "రోగాన్ని నయం చేయాలంటే కొన్ని సార్లు శస్త్ర చికిత్స తప్పదు. మనల్ని మనం విశ్లేషించుకోవడం మొదలు పెడితే ఎన్నో లొసుగులు కనపడతాయి. అందుకే భయపడి ఆ పని చెయ్యం. సాహిత్యంలో కూడా అంతే. హీరోలు, హీరోయిన్లు అందరూ మంచివాళ్ళు. విలన్లందరూ విడిగా వేరే వుంటారు. వారితో మనల్ని మనం ఎప్పుడూ పోల్చుకోం. ఆ రెండు కోణాలూ మనలోనే వున్నాయన్న విషయాన్ని ఒప్పుకోలేం. నిజజీవితంలో హీరో, హీరోయిన్, విలన్ అని విడి విడిగా వుండరు. చలంలాంటి ఏ రచయితో అన్ని గాథలూ ఒకర్లోనే వున్న అలాటి పాత్రలను ప్రవేశపెడితే దాన్ని జీర్ణించుకోలేని పాఠకులు విరుచుకుపడతారు. ఈ కథలో నీ తల్లి హీరోయిన్ కాదు, ఒక పాత్ర మాత్రమే. ఒకప్పటి మానసిక బలహీనత, ఆ తర్వాత దాన్ని అధిగమించగలిగే మానసిక స్థాయి వున్న ఒక స్త్రీ". "సంసార జీవితంలో అసంతృప్తి వున్న ఏ స్త్రీ అయినా ఇటువంటి అనైతికమైన దారి ఎన్నుకుంటే అందులో తప్పు లేదని మీరు వాదిస్తున్నారా?"

 

    "ప్రస్తుతం సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయని వివరిస్తున్నాను. తర్వాతి పరిణామాల్ని ముందే ఊహించకపోతే జరిగే ప్రమాదాల్ని సూచిస్తున్నాను. అసంతృప్తికి పరిష్కారం ఇదికాదని విన్నవిస్తున్నాను. నువ్వొక చేదు నిజాన్ని ఒప్పుకోగలవా శ్యామలా? సైన్స్ అభివృద్ధి చెందాక, మెట్రోపాలిటన్ సంస్కృతికి అలవాటుపడ్డాక, టెలిఫోన్ నెట్ వర్క్ పెరిగాక 'నైతికం' అన్న పదానికి అర్థం మారిపోయిందనీ, స్త్రీ పురుషుల మధ్య 'అక్రమ మానసిక సంబంధాలు' పెరుగుతున్నాయనీ, దాన్ని గుర్తించలేకపోతే మనం 'కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లుల' మవుతామనీ ఒప్పుకోగలవా?"

 

    "ఒకప్పుడు స్త్రీ చదువు, దానివల్ల వచ్చే జ్ఞానమూ వుండేది కాదు. పురుషాహంకారాన్ని భరించడం కూడా తనజీవితంలో ఒక భాగమని మనస్పూర్తిగా నమ్మేది. జ్ఞానం పెరిగేకొద్దీ అసంతృప్తి పెరగడం సహజం. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసంతృప్తికి పరిష్కారం స్త్రీ వాదం కాదా?"  

 

    అతడు నవ్వి, "నువ్వు తిరిగి వెళ్ళిపోవడానికి రెండు రోజులు టైము ఎలాగూ వుంది. ఈ హోటల్ లో ఎందుకు? నీ విదేశీ సంస్కృతిని కాసేపు మరిచిపోయి మా ఇంటికి వచ్చి వుండు. ఆఫ్టరాల్ మీ మావయ్య ఇల్లేగా!" అన్నాడు.

 

                                       *    *    *

 

    శ్రీకాంత్ మావయ్య ఇల్లు నాకు బాగా నచ్చింది. ఇల్లంటే 'హౌస్' కాదు 'హోమ్' ...ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది. అబ్బాయి ఫాషన్ డిజైనింగ్ చేస్తున్నాడు. తాతగారికి భగవంతుడూ, పూజలూ లోకం. అమ్మమ్మ ఆరోగ్యం అంత బాగా లేదు. కానీ సాయంత్రాలు ఇద్దరూ కలిసి పురాణకాలక్షేపాలకి వెళ్ళడం నాకు చాలా ఆనందంగానూ, ఆహ్లాదంగానూ అనిపించింది. పిల్లలిద్దరూ 'వదినా' అంటూ నన్ను వదలకుండా తిరిగారు. లండన్ గురించీ, పేపర్లలో వచ్చిన కోర్టు వార్తల గురించీ ఎన్నో ప్రశ్నలు అడిగారు.

 

    మావయ్య కన్నా అత్తయ్య జీతం ఐదారువేలు ఎక్కువ. అయితే అటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మావయ్యలో నాకేమీ కనపడలేదు. ఇండియా నుంచి మా స్నేహితులు తీసుకొచ్చిన పుస్తకాలన్నీ చదివి నాకో అభిప్రాయం ఏర్పడిపోయింది. ముఖ్యంగా స్త్రీ వాదులు రాసిన తెలుగు రచనలు.

 

    ఇక్కడి మగాళ్ళందరూ రెండు మూడు వివాహాలు చేసుకుంటారనీ, అసలు వంటింట్లోకి అడుగుపెట్టడమే నామోషీగా ఫీలవుతారనీ, స్త్రీ శ్రమ దోపిడియే వారి జీవితాశయమనీ, రకరకాల రచనలు చదివిన నాకు, ఆ ఇల్లు చాలా రిలీఫ్ గా తోచింది. ఈ ఇల్లూ, నా తండ్రి ఇల్లూ రెండు వ్యతిరేక సిద్ధాంతాలకి ప్రతీకలుగా తోచాయి. భర్త బయటి గదిలో స్నేహితులతో కూర్చుని 'కాఫీ తీసుకురా' అంటే ఆఫీసునుంచి అలసిపోయిన వచ్చిన అత్తయ్య విసుక్కోవడం నేను చూడలేదు. ఆదివారంనాడు తండ్రీకూతుళ్ళు బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి, వాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు శుభ్రం చేస్తుంటే, తల్లీ కొడుకులు నాకోసం వంటింట్లో చేరి లంచ్ తయారుచేయడం కోసం ఉపక్రమించారు. శ్రీకాంత్ కూతురికి ఇరవై రెండేళ్ళు. వివాహం పట్ల ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను- "నేను ఉద్యోగం చెయ్యను. పదినుంచీ అయిదువరకూ ఎవరి కిందో పనిచేయడం పెద్ద బోర్!" అంది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More