Home » Kommuri Venugopala Rao » Vugave Uyyaala


    "అలా వుండిపోయే అవకాశముంది ఉండిపోండి."

 

    మాలతి నవ్వింది "సరే వుంటాను. ఏం చేసుకుంటారు చెప్పండి?"

 

    ఆ నవ్వు ఎంత సుమధురంగా ఉంది? ఆ గొంతు ఎంత మార్దవంగా వుంది? ఆ కళ్ళు.

 

    "ఏమిటలా చూస్తున్నారు.

 

    "మిమ్మల్ని చూస్తుంటే...."

 

    "ఆగిపోయారేంటి?"

 

    "నిజం చెప్పమంటారా?"

 

    "మీరు అబద్ధం చెప్పలేరు లెండి."

 

    "మిమ్మల్ని చూస్తుంటే మాధవి గుర్తొస్తోంది."

 

    ఆమె మళ్ళీ నవ్వింది 'మీరు చాలా అమాయకులు. చాలా అల్ప సంతోషులు కూడా!"

 

    కొంచెంమాగి అతను మాట మారుస్తూ "ఈ వారం సీరియల్ చదివారా?"

 

    "చదివాను. నాకు నచ్చలేదు"

 

    "ఏం?"

 

    "అనూరాధ పాత్ర చిత్రీకరణలో చాలా లోపాలున్నాయి."

 

    "ఆమెలో ప్రేమకన్నా స్వార్థమెక్కువగా కనిపిస్తోంది. అతని జీవితంతో ఆమె ఆడుకుంది. ఆమెను నేను క్షమించలేకపోతున్నాను."

 

    "మొదట్లో నిజమైన కథ విన్నప్పుడూ ఆమెమీద మీరు సదభిప్రాయం వెలిబుచ్చలేదు. ఇప్పుడూ వెలిబుచ్చటంలేదు. ఎందుకంటారు?"

 

    "ఎందుకో చెప్పమంటారా....?" అని మాలతి ఒక్క క్షణం ఆగింది. "ఎందుకంటే...ఎందుకో నాకు సదభిప్రాయం కలగడంలేదు కాబట్టి..."

 

    "నా మాధవిని ఒకసారి చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు."

 

    "మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపుగా ఆ రోజు రావాలని నేనూ కోరుకుంటున్నాను."

 

    "డిశ్చార్జ్ అయినాకయినా సరే...మాధవి నాకు కనిపించాక మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తాను...మా పెళ్లి....కి...మా...పె...ళ్ళి...కి...మిమ్మల్ని...." గొంతు తడబడింది. మాట పూర్తి చెయ్యలేకపోయాడు.


                                    * * *


    ఘోరంగా వర్షం కురుస్తోంది.....

 

    డాక్టర్ నరేంద్ర, మాలతి కూర్చున్న కారు విశాలమైన వీధుల్లో మెల్లగా పరిగెడుతోంది. అద్దంమీద వైపర్స్ పనిచేస్తున్నాయి.

 

    "మాలతీ!" అన్నాడు నరేంద్ర.

 

    "......"

 

    "ఈ రోజు నా మేరేజ్ డే! మధూ, నేనూ పెళ్ళి చేసుకున్న రోజు."

 

    ఆమె అప్పటికీ ఏమీ మాట్లాడలేదు.

 

    వర్షం ఎక్కువ అవుతోంది. ఎంత వైపర్స్ పనిచేస్తోన్నా కిటికీ అద్దాలు ఎత్తి ఉండటంవల్ల లోపల ఆవిరిఏర్పడి ముందున్న అద్దంమీద అలుముకుని దారి కనబడనియ్యకుండా చేస్తోంది. మధ్య మధ్య పాలిష్ క్లాత్ తో క్లీన్ చేస్తున్నాడు.

 

    కారు వేగం బాగా తక్కువయింది.

 

    అతని చెయ్యి ఆమె భుజంమీద పడింది. ఆమె ఒళ్ళు ఝల్లుమంది. కదలకుండా అలాగే కూర్చుంది.

 

    "మధూ!"

 

    "నేను మాలతిని" ఆమె వణికినట్లు హీనస్వరంతో అన్నది.

 

    అతను వినిపించుకున్నట్లు లేదు.

 

    "మధూ!"

 

    "నేను మాలతిని..."

 

    ఆమె భుజంమీద అతని చెయ్యి బిగుసుకుంది.

 

    "కానీ నువ్వు మధువి!"

 

    ఆమెకేం చెప్పాలో తెలియటంలేదు.

 

    దగ్గరకు లాక్కున్నాడు. బొమ్మలా జరిగిపోయింది. ఆమె కుడిచెంప అతని చెంపకు ఆనుతోంది.

 

    "నువ్వు మధువి. నీలో మధు వుంది. శాశ్వతమైన ముద్ర నీలో వుంది."

 

    అస్పష్టంగా ఏదో అంటున్నాడు. ఆమె చెంపమాత్రం అతని చెంపకు ఆనించబడే వుంది.


                                   * * *


    థాట్ అందటంలేదు. ఒక మెలిక కావాలి. గొప్ప మెలిక. ఆ మెలిక నవలకు ప్రాణం కావాలి.

 

    రాత్రి పన్నెండు దాటింది.

 

    ప్రమీలాదేవి నరకయాతనను అనుభవిస్తూనే వుంది.

 

    ఇంతలో ఫోన్ మ్రోగింది.

 

    ప్రమీలాదేవి పోన్ రిసీవ్ చేసుకుంది.

 

    "ప్రమీలాదేవిగారున్నారా?" అవతలినుంచి ఓ తియ్యటి గొంతు.

 

    "నేనే మాట్లాడుతున్నాను."

 

    "నేను మీ ఫ్యాన్స్ లో ఒకదాన్ని. మీతో మాట్లాడాలనిపించి- ఫోన్ చేశాను. ఈ అర్థరాత్రివేళ...సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్."

 

    "ఫర్వాలేదులెండి."

 

    "మీ నవల చదువుతున్నాను"

 

    "థాంక్స్!"

 

    "బాగుంది. చాలా బాగుంది. నిజంగా కోయిల పాడుతున్నట్లే వుంది."

 

    "చాలా సంతోషం. మీరెవరో తెలుసుకోవచ్చా?"

 

    "సారీ! చెప్పకూడదు."

 

    గొంతు గుర్తుపట్టటం కష్టంగా వుంది. జాగ్రత్తగా వింటే నోటికి ఉలిపొర కాగితంలాంటిది అడ్డు పెట్టుకుని మాట్లాడుతుందేమోననిపిస్తుంది. స్పష్టంగా తెలియడంలేదు.

 

    "వచ్చేవారం ఏం రాయబోతున్నారు?" అవతలి వ్యక్తి మళ్ళీ అడిగింది.

 

    "అదే ఆలోచిస్తున్నాను."

 

    "మంచి twist నేను చెప్పనా?"

 

    "చెప్పండి."

 

    "ఉదయ్ అనూరాధకు లొంగిపోయాడు కదా! ఇహ అతను దక్కడేమోననుకుని ఆమె నిరాశ చేసుకుంది. అతనిలో వచ్చిన మార్పు ఆమెకు తెలీదు. జీవితంమీద విరక్తి పుట్టి ఎటయినా వెళ్ళిపోదామని కారులో బయల్దేరింది. ఇలాంటిదే -అర్థరాత్రి సమయం. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా బయల్దేరింది. అదే సమయానికి ఉదయ్ లో అక్కడ జ్ఞానోదయం పోనీ ప్రేమోదయమైంది. అతను ఇన్నాళ్ళూ ఆమెను అర్థం చేసుకోనందుకు పశ్చాత్తాపపడ్డాడు. బాధ భరించలేకపోయాడు. అప్పటికప్పుడు ఆమెను కలుసుకుందామని స్కూటర్ మీద బయల్దేరాడు. అటునుంచి అనూరాధ శరవేగంతో వస్తోంది. రాజా! రాజా! అని అలమటిస్తోందామె హృదయం..."


Related Novels


Ayinavaallu Pakkavaallu

Rajahamsa

Kadile Megham

Suryudu Digipoyadu

More