Home » Kommuri Venugopala Rao » Vugave Uyyaala


    ప్రమీలాదేవి ఉలిక్కిపడింది "ఏమన్నారూ?"

 

    "రా... అదే ఆమె ఉదయ్ ని తన మనసులో రాజాగా ఊహించుకుంటోంది. "నా రాజా! నా ఉదయ్!" అని ఆమె అంతరంగం రోదిస్తోంది."

 

    "ఇంతలో వర్షం. ఎదురుగా ఏం వస్తుందో కనబడటంలేదు. ఉదయ్ అలాగే తడుస్తూ స్కూటర్ మీద వస్తున్నాడు. వర్షం పెద్దదైంది. దారి కనబడటం లేదు. ఇంతలో పెద్ద మెరుపు. అనూరాధ కళ్ళు జిగేల్ మన్నాయి. ఆ వెలుగులో కనబడింది మీదకు దూసుకువస్తున్న స్కూటర్. బ్రేకు నొక్కుదామని ప్రయత్నించింది కానీ అప్పటికే ఆలశ్యమైపోయింది. 'ఉదయ్!' అనుకుంటూ ఆమె స్పృహను కోల్పోయింది. ఈ ఏక్సిడెంట్ కు కారణమైన స్కూటర్ మీద ఉదయ్ వున్నాడనీ, అతనూ ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాడనీ ఆ క్షణంలో ఆమెకు తెలీదు.

 

    అనూరాధకు తెలివొచ్చింది. హాస్పిటల్లో వున్నట్లు తెలిసింది. తను బ్రతికింది. ఒళ్లంతా గాయాలు. తలనిండా కట్లు. కానీ ఏదో తేడా వున్నట్లు తెలుస్తోంది.

 

    డాక్టర్లు వస్తున్నారు, ఆమెను అభినందించారు కానీ తనని పలకరించడానికి వచ్చినవారి చూపుల్లో ఏదో అసహ్యం....మొదట ఆమెకు అర్థం కాలేదు.

 

    'ఏదో వుంది' ఒకరోజు సిస్టర్నడిగి అద్దంసంపాదించి ముఖం చూసుకుంది.

 

    ఒక్కగావుకేకవేసింది. ఎవరు? ఎవరది? తనుకాదు. తనుకాదు, అంతేగాక తన ముఖం గాయాలతో వికృతంగా మారిపోయివుంది.

 

    ఆ షాక్ కు తట్లుకోలేక స్పృహ కోల్పోయింది.

 

    ఒక్క క్షణంపాటు నిశ్శబ్దం....

 

    "ఏమండీ!" అని పిలిచింది ప్రమీలాదేవి.

 

    "ఆఁ వున్నాను. ఉదయ్ తలకి గాయం తగలడంవలన కోమాలో వున్నాడు. అనూరాధ అందాన్ని కోల్పోయింది. అర్థమయింది కదూ? ఇహ మీరు రాయగలరు. ఉంటాను..."

 

    ఫోన్ డిస్కనెక్ట్ అయింది.


                                                             * * *


    రాజా వున్న గదిలోంచి పెద్ద గావుకేక. వరండాలో అటుకేసి నడుస్తున్న డాక్టర్లూ, సిస్టర్లూ హడావుడిగా గదిలోకి పరిగెత్తారు.

 

    రాజా బెడ్ మీద స్పృహలేని స్థితిలో పడివున్నాడు. నోట్లోంచి కొద్దిగా నురగ వస్తోంది.

 

    ప్రక్కనే ఓ వారపత్రిక పడివుంది. పైన తిరుగుతోన్న ఫ్యాన్ గాలికి పేజీలు టపటపకొట్టుకుంటూ "పాడవే కోయిలా!" అన్న అక్షరాలు తిరగబడుతున్నాయి.


                                       17


    డాక్టర్ నరేంద్రకు ఎమర్జెన్సీ ఫోన్ వెళ్ళింది.. అతను హడావుడిగా వచ్చిచూసి న్యూరోఫిజిషియన్ కి అర్జంటుగా రమ్మని కారు పంపించాడు. పదిహేను నిముషాల్లో న్యూరోఫిజిషియన్ అటెండయాడు. మొదట ట్రీట్ మెంట్ మీద ఏకాగ్రత ప్రదర్శించాడు. మనిషి డేంజర్ జోన్ లోంచి యివతలకు వచ్చాక గబగబ ఇ.ఇ.బి, రేడియోగ్రఫీ టెస్ట్ లన్నీ పూర్తిచేశాడు. మొట్టమొదట కనిపించిన ఆదుర్దా తొలగిపోయి, అతని ముఖంలో సంతృప్తి గోచరించింది. నరేంద్ర, ఆయనా కలిసి ప్రయివేట్ రూంలోకి వెళ్ళారు.

 

    నరేంద్ర ఆయన ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.

 

    "హి ఈజ్ ఆల్ రైట్! కానీ రికవరీ ఫేజ్ లో వున్నప్పుడు మళ్లీ ఈ దశ ఎందుకొచ్చి వుంటుంది? బహుశా ఏదన్నా షాక్ కి గురయివుంటాడు. అతనికి షాక్ కలిగించే సంఘటనలేమన్నా జరిగివుంటాయా?"

 

    "తెలీదు. అంత షాక్ కలిగించే సన్నివేశం ఏదీ వుండదనే నా ఉద్దేశం. అయినా మాలతిని పిలిచి అడుగుతాను. అతనికి దగ్గరగా వుండే డ్యూటీ ఆమెకే అప్పగించాను" అని బజర్ నొక్కి ఆఫీస్ బాయ్ రాగానే మాలతిని పిలుచుకురమ్మన్నాడు నరేంద్ర.

 

    రెండు నిముషాల్లో మాలతి వచ్చింది.

 

    "మాలతీ! రాజాకి అలజడిగానీ, ఉద్రిక్తతగానీ కలిగించే సంఘటనలేమన్నా జరిగాయా?" అనడిగాడు నరేంద్ర.

 

    ఆమె జవాబు చెప్పడానికి సందేహిస్తున్నట్లు ఒక్క నిముషం ఊరుకుంది.

 

    "నీకు సరిగ్గా తెలీకపోయినా-ఏదన్నా అనుమానముంటే చెప్పు?"

 

    మాలతి ఇద్దరు డాక్టర్లవంకా ఒకసారి చూసి అన్నది "అతని జీవితంలో విషాద ప్రణయగాధ వున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. కొన్ని వారాలక్రితం ప్రమీలాదేవి అన్న రచయిత్రి అతని దగ్గరకొచ్చింది. అతని కథనంతా ఆమెకు చెప్పాడు. ఆమె సీరియల్ గా రాయడం మొదలుపెట్టింది. అతనత్యంతాసక్తితో ఆ సీరియల్ చదువుతుండేవాడు. బహుశా ఈ వారం వచ్చిన సీరియల్ లోని సంఘటన అతన్లో ఉద్రిక్తతను కలిగించి వుంటుంది. ఎందుకంటే అతని ప్రక్కనే ఈ వారం వచ్చిన వీక్లీ పడివుండటం చూశాను."

 

    "ఆ సీరియల్ ఏ పత్రికలో వస్తుంది?"

 

    మాలతి చెప్పింది.

 

    "రాసేది ఎవరన్నావు?"

 

    "ప్రమీలాదేవి. ఆమెకూడా డాక్టరే!"

 

    "అయితే నేనెప్పుడో చూసి వుండాలే" అన్నాడు నరేంద్ర తనలో తాను అనుకుంటున్నట్లుగా.

 

    "మనం ఒకసారి రాడ్నిస్మిత్ తో మాట్లాడితే బాగుంటుంది" అన్నాడు న్యూరోఫిజిషియన్ జయచంద్ర సాలోచనగా.

 

    "లండన్ కి కాల్ బుక్ చెయ్యనా?" అని అప్పటికప్పుడు అర్జంట్ కాల్ బుక్ చేశాడు.

 

    "నేనోసారి ప్రమీలాదేవితో కూడా మాట్లాడాలి" అన్నాడు జయచంద్ర.

 

    టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఆమె పేరు వెదికి నంబర్ డయల్ చేశాడు నరేంద్ర.

 

    "హలో!" అంది అవతలినుంచి ఓ గొంతు.

 

    "డాక్టర్ ప్రమీలాదేవిగారు కావాలి."

 

    "మాట్లాడుతున్నాను."

 

    "నేను డాక్టర్ నరేంద్రని. న్యూరోఫిజిషియన్ జయచంద్ర మీతో మాట్లాడతారు..." అంటూ రిసీవర్ అతని చేతికిచ్చాడు.


Related Novels


Ayinavaallu Pakkavaallu

Rajahamsa

Kadile Megham

Suryudu Digipoyadu

More