Home » Kommuri Venugopala Rao » Vugave Uyyaala
ఉహు...అతని పెదవులు ఆమె కుడిచెంపకు దగ్గరగా జరిగాయి. ఆనీ ఆననట్లు....అంటీ అంటనట్లు ఆ చెంపమీద మృదువుగా ముద్దుగొన్నాయి.
ఆమె కదలకుండా అలాగే పడుకుని వుంది.
అతను మామూలుగా నిలబడి, వెనుదిరిగి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు.
16
"పాడవే కోయిలా" అచ్చయిన వారపత్రిక మొదటి సంచిక మార్కెట్ లోకి వచ్చేసింది.
ప్రమీలాదేవి నవలకు పాఠకలోకంలో విశేషమైన ఆదరణ వుంది. పాఠకుల్లో ఆమె రచనలపట్ల క్రేజ్ వుంది. విమర్శకులామెను తీవ్రంగా విమర్శిస్తారు. ఆమె నవ్వి ఊరుకుంటుంది.
మొదటి సంచికకోసం పాఠకులు చాలా ఆదుర్దాగా ఎదురుచూశారు. అందులో ఆ వీక్లీ పబ్లిసిటీ కూడా బాగా యిచ్చింది.
మాలతి వీక్లీ తీసుకొచ్చి రాజాకిచ్చింది.
ఆ నవల్లో హీరోపేరు ఉదయ్! అతను చిన్నతనంనుంచీ చాలా పెంకి స్వభావం కలవాడు. ఒకరి మాట వినే రకంకాదు. బాల్యంలోనే తల్లీ తండ్రీ చనిపోతే అన్నా వదినల ప్రాపకంలో పెరిగాడు. వదినంటే అతనికి పంచప్రాణాలు. అన్నంటే భయం భక్తి వున్నాయిగానీ- అతనికెప్పుడూ దూరదూరంగా జరుగుతాడు. ఉదయ్ ది ఓ రకంగా స్వేచ్చా జీవితం. అంత మొండివాడికి కూడా ఆడపిల్లలంటే భయం. జీవితంలో వాళ్ళకుమాత్రం దూరంగానే వుండేవాడు. ప్రేమంటే అతనికి నమ్మకంలేదు. అంటే గౌరవంలేదని కాదు. దాని పరిధులమీద అతనికి గురి లేదు. అలాంటి అతని జీవితంలోకి అనురాధ ప్రవేశించింది. అనురాధ అతన్ని వెంటాడింది. కవ్వించింది. మొదట్లో చిలిపితనానికే కానీ రాను రాను అతనంటే ఆకర్షణలో పడింది. అతనికి దగ్గరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అతనికి దగ్గరవడానికి ప్రయత్నించిన కొద్దీ అతను దూరంగా జరగసాగాడు. ఆమెలో ఆకర్షణ పెరిగింది. అతన్ని సాధించాలన్న పట్టుదల పెరిగింది. అతన్ని గెలుస్తానని స్నేహితులతో పందాలు కాసింది. అతని జీవితంతో ఆటలాడుకోవద్దని వాళ్ళంతా ఎంతో వారించారు. ఆమె వినలేదు. అతన్తో ఢీ కొంది. అతను అప్రతిభుడయ్యాడు. వణికాడు. చివరకు అతన్లో భూకంపం చెలరేగింది. అతని మనసామెవైపుకు పరుగులు తీసింది. చివరకు.....పడిపోయాడు.
ఇది మొదటి సంచికలోని ఇతివృత్తం మాత్రమేకాదు. నాలుగయిదు వారాలు సాగాక కథ ఈ దారికి వచ్చింది.
రానురానూ పాఠకుల్లో ఉత్కంఠత పెరిగింది. అనురాధ ఉదయ్ ని వెంటాడే సన్నివేశాలు యువతరంలో పులకింతలు రేపాయి. నవలమీద ఉత్తరాలు బాగా రాసాగాయి. పత్రిక సర్క్యులేషన్ బాగా పుంజుకుంది.
ఒక రోజు ప్రమీలాదేవి రాజాని చూడటానికి వచ్చింది.
"మీ సీరియల్ ఎలా వస్తోంది?" అనడిగాడు రాజా.
"మీరే చెప్పాలి."
"కథ కథగానే వుంది. పాత్రల స్వభావాలు మార్చేశారు."
"రచయితలు అలాంటి ట్రిక్కులు చేస్తూవుంటారు. పాత్రల స్వభావాల్లో, మనస్తత్వ చిత్రీకరణలో ఏదో ఒక విపరీతం చూపించకపోతే వాళ్లకు తోచదు."
"కానీ మీరు మాధవికి అన్యాయం చేశారు."
"ఏం?"
"ఆమె దారిన ఆమె జీవిస్తూ వుంటే నేనే ఆమెను వేధించుకుతిన్నాను."
"కానీ-ఇలా అయితే కథ రక్తి కడుతుంది. అందుకని అలా రాశాను."
"కానీ...మాధవి ఈ సీరియల్ చదివితే బాధపడుతుంది...ఒకవేళ ఎక్కడన్నా వుండి చదివితే...?"
"ఆమెకు బాధ కలగాలనే, కోపం రావాలనే అలా చేశాను. ఆవేశం పెరిగి బయటకు వస్తుందని...."
"ఆవేశం పెరిగినా ఆమె వివేకం కోల్పోదు" అన్నాడు రాజా సాలోచనగా.
ఆమె ఏమీ జవాబు చెప్పలేదు.
"ఇప్పుడేం రాస్తారు?"
"తెలీదు"
"మరెలా?"
"ఆలోచించాలి"
"ఎప్పటికి రాయాలి?"
"ఈ రాత్రికే పూర్తి చెయ్యాలి."
"కనీసం ఏం రాద్దామనుకుంటున్నారు?"
"నిజంగా తెలీటంలేదు. చాలా కన్ ఫ్యూజన్ గా వుంది."
ఇద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. "అవసరమొస్తే రేపు మళ్ళీ వస్తాను" అని ప్రమీలాదేవి వెళ్ళిపోయింది.
కొంతసేపటికి మాలతి లోపలకు వచ్చింది.
"సిస్టర్! ఇవేళ ప్రొద్దుటినుంచీ కనబడలేదేం?"
"రెండు మూడు సీరియస్ కేసులున్నాయి సర్! వాటితో బిజీగా వున్నాను."
"సిస్టర్! నాదికూడా సీరియస్ కేసే. నన్ను అలక్ష్యం చేయకండి."
"మిమ్మల్ని అలక్ష్యం చెయ్యలేను సర్!" అని కొంచెమాగి "సర్! మీకు ఇంజక్షన్ చేద్దామని వచ్చాను" అంది.
"సిస్టర్! నెలల తరబడి తెలియని స్థితిలో బెడ్ మీద వుండి మందులూ, ఇంజక్షన్ లూ తీసుకుంటూ విసుగెత్తిపోయాను. ఇహ ట్రీట్ మెంట్ తీసుకోలేను. అయినా ఆరోగ్యం బాగానే వున్నట్లుంది. ఈ విశాల ప్రపంచంలోకి వెళ్లిపోవాలని వుంది" అన్నాడు రాజా బాధగా.
"మీ మాధవిలేకుండా ఈ విశాల ప్రపంచంలోకి వెళ్లి ఏం చేస్తారు?"
"వెదుకుతాను"
"ఎక్కడని? ఎంత కాలమని? అయినా అక్కడ ఒంటరిగా ఎలా జీవిస్తారు?"
"ఇక్కడమాత్రం ఒంటరివాడ్ని కానా?"
"బహుశా పూర్తిగా కాదనుకుంటాను."
"ఎందుకని?"
"మేమంతా వున్నాం కాబట్టి"
"అవును నిజమే!" అంటూ అతను కొంచెంసేపు మెదలకుండా ఊరుకున్నాడు.
"సర్! పోనీ ఇంజక్షన్ యిప్పుడు వద్దులెండి. యిహ వెళ్ళనా?"
"వద్దు"
"వద్దా? ఎప్పటికీ వుండిపోనా?"



