Home » History » Diviseema Uppena 1977


   
    బౌర్రాచినగరటయ్య            పెదమళ్ళపాలెం గ్రామము
    
    వయస్సు 45 సం ||

    
    నేను నాభార్య మరో అయిదుగురు పిల్లలు మేమంతా తుఫాను నాడు యింటివద్దనే వున్నాము. పొద్దుయెక్కుతున్నకొలది తుఫాను యెక్కువగుతూ వచ్చింది. వంటచేసుకొనుటకు కూడా పొయ్యి మండటం లేదు, నా భార్య యెట్లో బాధపడి వంటచేస్తోంది నేనూ నా పెద్ద కొడుకు యెగిరిపోయే యింటిని, సావిటిని కప్పుతూ సతమతమైపోతున్నాము. వంటపూర్తయింది, కాని తినే అవకాశం లేకపోయింది ఇంటికప్పు పోవటంచేత వానంతా యింటిలోనే పడుతోంది. గాలివేగం హెచ్చింది. చలికి వణికి పోతున్నాము. పిల్లలు నిలువలేక పోతున్నారు ఇంట్లో వాళ్ళంతా గోలజేసి యేడవటం మొదలు పెట్టారు. వీళ్ళని కాపాడాలనే నా తాపత్రయం, అందుకనే మా వాళ్ళనందరిని సాయంత్రం 4 గంటలకు మాకు దగ్గరలో వున్న పర్శి రామమోహనరావుగారి డాబాలోకి పంపాను. నేను మాత్రం మా యింట్లోనే వున్నా.
    
    చావిడి కప్పంతా పోయింది. గోడలు కూడా వూగుతున్నాయి గొడ్లను తాళ్ళుకోసి బయటకు తోలేశాను నాకు బాతులున్నాయి, వాటిని ఇంటిలోనికి తొలి తలుపులు పెట్టాను. మేకల్ని మాత్రం కిటికీలకు కట్టేశాను. నేను అక్కడ వుంటానికి వీలుపడటం లేదు. అందుకని మెల్లగా బయలుదేరాను. చూస్తుండగానే ఇళ్ళన్నీ యెగిరి పోతున్నాయ్. త్రోవంతా ముళ్ళమయం ముందుకు నడవటం చాలా కష్టంగా వుంది. అప్పటికే నాకు కాళ్ళుచేతులు కొంకర్లు పోతున్నాయి, ఆయాసం వస్తోంది చలివేసి నిలువెల్ల వణికి పోతున్నాను. ఏది యేమయినా మా వాళ్ళున్న డాబాలోకి నేనుకూడా చేరుకొన్నాను. నిలబడలేక చతికిల పడ్డాను. పిల్లలు నన్ను కావిటేసుకొని యేడుస్తున్నారు. నేను వాళ్ళని ఓదారుస్తున్నాను. ఇంతలో యెవరో ఉప్పునీటి వాగ వస్తుందని కేకేశారు. కంగారుతో పైకి లేచాను. కొంచెం ముందుకుపోయి చూశాను. కాలువ వెంట నీరు యెదురు నడుస్తోంది. నురుగులు కక్కుతూ యెర్రగా కనుపించాయి. నా గుండె బ్రద్దలయింది. పిల్లల్ని యెలా బ్రతికించాలో తెలియటం లేదు. నాకొక ఊహా తట్టింది. మావారినంతా వెంటపెట్టుకొని బయలుదేరాను. మాతో నా మరదలు కూడా వుంది. అక్కడ నుండి కొంతదూరము నడిచాము. పర్రచివరి బొండాడ నరసింహారావుగారి రెండంతస్తుల మేడలోకి చేరాలని నా వూహ నా చేతిలో ఒక సూటుకేసు వుంది. ముందుకు నడువలేక పోతున్నాను పిల్లలు నా ముందు పడుతూలేస్తూ పరుగెత్తుచున్నారు. నా భార్య, మరదలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వెనుక వస్తున్నారు. నా పెద్దకొడుకు నాతో వస్తూ యెటో తప్పుకపోయాడో తెలియదు.
    
    చేతిలో వున్న సూటుకేసును మోయలేక పోతున్నాను. నేను నడవడమే చాలా కష్టంగా వుంది. నాకు దగ్గరలో వున్న ఒక ఈత చెట్టు మట్టుకు సూటుకేసును కట్టాను. చూస్తుండగానే నీరు పెరిగి పోయింది. వాగా వచ్చి ముందు నడుస్తున్న పిల్లల్ని పల్లానికి పడదోసింది. వాళ్ళు కాలువకట్ట మీదనుంచి క్రిందనున్న చేలలోకి పడిపోయారు. ఒకపిల్ల ఈతచెట్టు మట్టను పట్టుకొని మునుగుతూ లేస్తుంది మరో పిల్ల నాన్నా! నాన్నా! నేను కొట్టుకుపోతున్నాను నన్ను పట్టుకొనాన్నారా! అంటూ నీళ్ళలో కొట్టుకపోతుంది నా గుండెలు తరుక్కుపోయాయి. ఏమి చేయాలో అర్ధం కావటం లేదు దగ్గరలో వున్న యీ పిల్లను కాపాడటమా? లేక దూరాన పోయె ఆ పిల్లకై పోవటమా? అయోమయంలో పడింది నా పరిస్థితి. ఆలోచించే దానికి వ్యవధిలేదు. అప్రయత్నంగా క్రిందకు దూకాను. ఈదుకొంటూ దగ్గరలో వున్న పిల్లను చేరుకున్నాను. ఆమెను భుజాలపై వేసుకొని కలువగట్టు యెక్కాను. కట్టపై రెండడుగుల నీరు ప్రవహిస్తోంది. వడి మాత్రం చాలా వేగంగా వుంది. అతి కష్టంపై కొంచెము ముందుకు నడిచాను. ఒక యింటిచాటున పెద్ద వేప చెట్టు కనపడింది. దాని మీదకు పిల్లను యెక్కించాను. ఎంత గాలివేసినా కొమ్మను వదిలి పెట్టవద్దని చెప్పి అక్కడనుంచి బయలుదేరాను.
    
    నన్ను కేకలేస్తూ నీళ్ళలో కొట్టుకుపోయిన పిల్ల ఏమయిందో మరల నాకు కనబడలేదు. వెను తిరిగి చూశాను. పెద్దవాగ బిళ్ళ బీటుగా వస్తోంది. ఆ వాగ వేగానికి నాభార్య మరదలు కొట్టుకపోయారు. ముందుకు చూశాను నా మూడవకుమారుడు తూలుతూ పోతున్నాడు. నేను అతన్ని చేరాలని లేని ఓపిక తెచ్చుకొని ముందుకు నడచాను ఒకసారి వెనుకకు చూశాను విపరీతమైన వాగ. ప్రక్కకు చూశాను అటూ వాగే! ముందుకు చూశాను. అటూ వాగే కనబడుతుంది, ఎటుచూస్తే అటు వాగలే కనబడుతున్నాయ్. నేను నా కొడుకు వాగల మయానా చిక్కుకున్నాము. ఒకవాగ వచ్చి మమ్ములను యెత్తి పల్లాన పారేసింది. నీళ్ళు అందటంలేదు. మునకలు వేస్తూ పైకి తేలుతున్నాను. కొంతసేపటికి కొంచెం అందింది. తలెత్తి నకమకాల చూశాను నాకుదగ్గరలో నాకొడుకు ఒక తూములో చిక్కుకపోయాడు. అతికష్టంగా అతని దగ్గరకు చేరాను. నీళ్ళలో మునకలు వేస్తున్నాడు. చేయి పట్టుకు లాగాను. రాలేదు. కారణమేమిటో అర్ధం కాలేదు నీళ్ళలో మునిగి చేత్తో తడిమి చూశాను. ఒక కాలు తూములో యిరుక్కుపోయింది కాలు పట్టుకలాగాను కదలలేదు. నాకు ఊపిరాడటం లేదు పైకి లేచాను మరలా మునిగాను. ఇట్లా నాలుగైదుసార్లు చేశాను ప్రతి దఫా కాలు పట్టుక లాగాను. లాగినప్పుడల్లా కొంచెం కొంచెం కాలు కదిలింది కాని పిల్లవాడు రాలేదు. వాగ నన్ను నెట్టి వేసింది. కొంత దూరం నేను కొట్టుక పోయాను. పోతూ వెనుకకు చూశాను. నా పిల్లవాడు బోది వెంటకొట్టుక పోతున్నాడు. నేను ఆదుర్దాతో అతని వద్దకు చేరాను. అతన్ని గుండెలకు జేర్చుకొన్నాను. అప్పటికే అతను నీళ్ళు బాగా త్రాగాడు. అతన్ని భుజాల పైకి యెత్తుకొనాలనేటప్పటికి మరొక వాగ వచ్చింది మమ్ములను యెత్తి ఒక తాడి కేసి కొట్టింది. పిల్లవాణ్ణి ఆ చెట్టు కరిపించి, నేను నిశ్చేష్టుడనై పోయాను బరువెక్కిన గుండెలతో బ్రతుకు మీద ఆశ వదులుకున్నాను.
    
    వాలుకు తప్ప ఎటు చూసినా వాగలు చెంపలు వాయకొడుతున్నాయి మేమున్న చోట రొమ్ములోతు నీరుంది కళ్ళకు చేతుల్ని అడ్డు పెట్టుకొని తూర్పునకు చూశాను మాకు దగ్గరలో నూయి వుంది. ఆ నూతిలో ఆడవాళ్ళు పడిపోయి కొట్టుకొంటున్నారు. ఒక్కొక్కసారి తలలు, ముఖాలు కనపడుతున్నాయి వాళ్ళెవరో కాదు! మా ఆడవాళ్ళే. ఇంక వీళ్ళు చచ్చిపోయినట్టే అనుకున్నాను. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళే వోపిక లేదు వెళ్ళుదామన్నా వీలుపడటం లేదు. ఇంతలో మరల వాగ వచ్చింది. మేము తాడిని కావిటేసుకున్నాము. నూతిలో వున్న నా భార్యను మరదల్ని యెత్తి యొక దిబ్బమీదనున్న జంట తాళ్ళ మయానా పారేసింది. వాళ్ళిద్దరు చెరొక తాడిని కావిటేసుకొన్నారు. కొద్దిపాటి తాటి దూలం ఒకటి మా వద్దకు వచ్చింది. నేనూ నా కొడుకు దానిమీదకు పడిపోయాము. కాళ్ళతోను, చేతులతోను అదిమిపట్టుకున్నాము. ఆ దూలం కొట్టుకపోవటం మొదలుపెట్టింది మా ఆడవాళ్ళను రమ్మని కేకలేశాను. వాళ్ళు రాలేమన్నారు. వాళ్ళక్కడే వున్నారు. కేక లేసి యేడుస్తున్నారు. మేము మాత్రం వాగల్లో కొట్టుక పోయాము. రెండు ఫర్లాంగులు పోయేటప్పటికి మా కొక వరికుప్ప కనిపించింది. దాన్ని పట్టుకొన్నాము మెల్లగా పైకి పాకాము గాలికి వాటుగా దాని మీద కూర్చున్నాము. అప్పటికి కాగా ప్రొద్దుగూకింది.
    
    మేము కుప్పమీదనే వున్నాము. మా ప్రక్కనుంచే యిళ్ళు కుప్పలు కొట్టుకపోతున్నాయి. మాకు కొంచెం దూరంలో ఒకతను తలుపుపై పడి యేడుస్తూ, కేకలేస్తూ! కొట్టుకుపోతున్నాడు.మా మాటలు విని అతడు దండాలు పెట్టాడు. మేమూ చేతులు జోడించి దండం పెట్టాము. అంతకన్నా మే మేమి చేయలేకపోయాము. అతను కడలి గర్భంలో కలిసిపోయాడు. మేము కూర్చున్న తెప్పకూడా ప్రయాణం కట్టింది గాలి వేగానికి బొంగరంలా గిరగిర తిరుగుతూ పోతోంది. కుప్ప, కుప్ప క్రింద కట్టలన్నీ విడిపోతున్నాయి. మా క్రింద షుమారు పదిమోపులకు మాత్రమే మిగిలింది. అదృష్టవశాత్తు మేమొక మురుగు కాలువ కట్టకు జేరుకొన్నాము మా క్రింద నున్న కాస్త గడ్డిపోయింది. ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. దగ్గరలో ఒక తుమ్మ దొరికింది. దానికి రెండే కొమ్మలున్నాయి చెరొక కొమ్మా పట్టుకొన్నాము. సుమారు అర్ధగంట సేపు వున్నాము. వగలు అక్కడకూడా మమ్ములను నిలువనివ్వడం లేదు. చెట్టు చిన్నదేమో వాగలకు మునిగిపోతోంది. మరలా పైకి లేస్తుంది వాగలు చెంపలు పగులగొడుతున్నాయి. ముళ్ళమండలు వల్లంతా చీల్చేస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాము. తల దిమ్మెత్తి పోతోంది. కడప్రాణంతో వున్నాము.
    
    అదృష్టవశాత్తు మాదగ్గరకు ఒక పెద్ద దూలం కొట్టుకవచ్చింది. ఎంతో వేగంగా పోయే ఆ దూలం నేను పట్టుకోగానే ఆగిపోయింది. నా కొడుకు బాగా నీరసించిపోయాడు. అతన్ని దానిమీదకు యెక్కించాను. నేనుకూడా దానిమీద పడ్డాను. ఎటుచూచినాచీకటి. వాగాల్లో కొట్టుకపోతున్నాము. ఎటు పోతున్నామో! ఎక్కడికి పోతున్నామో! తెలియదు వాగమీద వాగా వస్తోంది. మేమున్న దూలం తలక్రిందులగుతోంది. నీళ్ళలో మునుగుతున్నాము. మరలా లేచి దూలాన్ని కావిటేసుకొంటున్నాము. అక్కడక్కడ వరికంకులు మా కాళ్ళకు తగులుతున్నాయి. మాగాణి చేలమీదుగా పోతున్నాము, కొంతసేపటికి ఒక దట్టమైన యీత పొదల్లో మా దూలం యిరుక్కుపోయింది, నేనూ నా కొడుకు యీత మట్టలపై పడిపోయాము. గాలి వేగానికి యితాకులు మా వల్లంతా బాదేస్తున్నాయి. ముళ్ళు సందులేకుండా విరిగిపోయాయి. ఏమయినప్పటికీ మేము ఆ చెట్టుల్ని వదిలిపెట్టలేదు. మట్టలపైనే కూర్చున్నాము.
    
    చాలా పొద్దుపోయింది. టైమ్ యెంతయిందో తెలియదు. గాలి మాత్రం పడమటగా వీస్తూంది. చూస్తుండగానే నీరు వెనక్కి మళ్ళింది. ఎంత వేగంగా ముందుకు వచ్చిందో! అంత వేగంగా వెనక్కు పోతోంది. మట్టలు మీదనుంచి తప్పించుకొని క్రిందకు దిగాను. నా బిడ్డనుకూడా క్రిందకు దించాను. అక్కడే యెత్తాంటి కాలువ గట్టు కనిపించింది. దగ్గరలో ఒక దిబ్బ దానిమీద ఒక చావిడి కనిపించాయి. అక్కడ యెవరన్నా వున్నారేమోనని కేకలేశాను ఎవరూ పలుకలేదు. ఇప్పుడు మేము అచ్చియ్యగారి చావిళ్ళవద్ద, మొండి కాలువ కట్టపైన పడ్డాము. ఇక్కడికి మా వూరు మూడు కిలోమీటర్ల దూరముంటుంది. మేము నిలబడలేకపోతున్నాము. ఆ గట్టుపై నాకొడుకును పడేశాను నేనుకూడా అక్కడే పడిపోయాను. నా పిల్లవాడు గాలికూడా చాలా కష్టంగా పీలుస్తున్నాడు నాకు అర్ధమయింది. అతను చావుబ్రతుకుల మయానా వున్నాడని కొద్ది సేపట్లోనే నాకుకూడా స్పృహ తప్పింది. ఎంతసేపు అక్కడ పడి వున్నామో తెలియదు కనులు తెరచి చూసేటప్పటికి తూర్పు తెల్లవారుతోంది, దూరాన కోడి కూసింది, గాలివాన పూర్తిగా పోయింది. పొద్దు పొడిచింది. దూరాన యెవరో వస్తున్నారు. మా దగ్గరకే వచ్చాడు. అతను మమ్మల్ని యెరుగున్న అతనే, జూసి నాకు యేడు పాగలేదు. వెక్కి వెక్కి యేడ్చాను అతనూ యేడ్చాడు, నా మొల మీద బట్టలు లేవు. అతను నాచేయి పట్టుక పైకి లేపాడు. వంటి బనీను తీసి గోచి పెట్టుకున్నాను. నా పిల్లవాడు దిగంబరంగానే వున్నాడు అతని పైపంచి తీసి పిల్లవానిమీద కప్పాడు. మా సంగతి యింటికీ తెలియజేయ వలసినదిగా అతన్ని అర్ధించాను. అతను మావూరు కబురు చేశాడు. మా వాళ్ళు వచ్చారు. ఒకళ్ళ నొకళ్ళు కావిటించుకొని యేడ్చాము. ఇంటి వద్ద అంతా బాగున్నారని చెప్పారు. నేను నమ్మలేదు. నా అనుమానం యెక్కువయింది. నేను చూస్తుండగానే నా పిల్ల నీళ్ళలో కొట్టుకపోయింది వీళ్ళు యిట్లాచెపుతారేమా అనిపించింది. తలచుకొన్న కొలది దుఃఖం ఆగటం లేదు. కాళ్ళు పట్టుక పోయినవి. చేతులు కొంకర్లు పోతున్నాయి, కర్ర పోటీతో కొంత వరకు పైకి లేచాను నడుమా సాబీగారావటం లేదు. కాళ్ళు సగం వంచి నడువవలసి వస్తోంది. నా పిల్లవాణ్ణి డోలీ కట్టి దానిలో యెక్కించుకున్నారు. నా కాళ్ళు ముందుకు పడటంలేదు. కాళ్ళనిండా ముళ్ళు విరిగి వళ్ళంతా పచ్చికురుపులాగుంది మెల్ల మెల్లగా నడుస్తూ శవాల్ని ముళ్ళ కంపల్ని దాటుకొంటూ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి జేరుకున్నాము.
    
    ఇల్లంతా పడిపోయింది, బాతులు లేవు. మేకలు మాత్రము కిటికీలకు వేళ్ళాడుతున్నాయి. ఇంట్లో సామానులన్నీ కొట్టుకపోయాయి. ఒక గోడ చాటుగా చెట్టు మీదకు యెక్కించిన పిల్ల పండ బెట్టియుంది వంటినిండా కప్పుకోటానికి సరైన గుడ్డ కూడా లేదు మెల్లగా అక్కడకి పాకాను. బిడ్డను గుండెలకు అదుముకొని బావురుమని యేడ్చాను. ఆ పిల్ల కూడా యేడుస్తూ నా కళ్ళలో నీళ్ళు తుడిసింది, అమ్మా! నీవు యెలా బ్రతకగలిగావని అడిగాను. నా బిడ్డ యిలా చెప్పింది.
    
    చెట్టు పై చాలా సేపు కొమ్మల్ని కావిటేసుకొని నిలుచున్నాను. గాలికి చెట్టంతా వూగిపోతోంది చలి వణుకు పుడుతుంది. కాళ్ళు చేతులు కొంకర్లు పోయాయి. ఒక్కొక్కసారి కాళ్ళు  జారి పోతున్నాయి. నిలబడలేక పోయాను. గాలివేగానికి తట్టుకోలేక క్రింద పడిపోయాను. నీళ్ళు రోడ్డుమీద చాలా యెత్తున వుండుటచేత నాకు దెబ్బతగలలేదు. పడీ పడంగానే వాగ నన్ను పల్లానికి తోసేసింది. నీళ్ళలో మునిగిపోతూ పైకిలేచాను నీళ్ళు రెండు మూడు గుటకలు కూడా వేశాను, ఉప్పుగా వెచ్చగా వున్నవి. కొంచెం సేపట్లోనే వడి యెత్తుకొని వచ్చి నన్నొక చెత్త కుప్పపైన పారేసింది. సొమ్మసిల్లి అక్కడే పడిపోయాను. కొంచెం సేపటికి తెలివి వచ్చింది, నా వంటి మీద బట్టలు లేవు. దగ్గరలో పెద్ద దిబ్బ వున్నది. పాకుతూనే నేనా దిబ్బ ఎక్కాను. కటిక చీకటి ఏమి కనపడుట లేదు. నేను మోకాళ్ళతోను, చేతులతోనూ పాకుతూ ముందుకు పోతున్నాను. దగ్గరలో ఎవరివో మాటలు వినపడుతున్నాయి. ఇంకకొంచెము ముందుకు పోయాను వాళ్ళు మోళ్ళులాగ కనపడుతున్నారు, వాళ్ళ వంటి మీద బట్టలు లేవు వాళ్ళను చూచి నేను భయపడ్డాను. నన్ను చూచి వాళ్ళు కంగారుపడ్డారు. వెర్రిగా కేకలు వేశారు. నేను వులిక్కిపడ్డాను. దయ్యాలేమోనను కొన్నా! వాళ్ళు మళ్ళీ కేకలేశారు. కొంచెము ధైర్యము వచ్చింది. ఆ కేక ఎక్కడో విన్నట్టు వుంది. మరలా కేకలేశారు. ఆ కేక మా  అమ్మది. నేను బోరున యేడ్చాను. నన్ను మా అమ్మ గుర్తుపట్టింది, దగ్గరకు లాగుకొన్నది. నేను అమ్మను కావిటించుకొన్నాను. మా అమ్మ కన్నీరు పెట్టుకొన్నది. ఆ రాత్రంతా చెట్లను కావిటించుకొని అక్కడే వున్నాము: మేము  ఒకరిని ఒకరు కావిటించుకొని అక్కడే నిద్రపోయాము. తెల్లవారింది. మేము యింటికి బయలు దేరాము. త్రోవలో నా స్నేహితురాలు ఘంటసాల సుశీల కనిపించింది ఆమె పడిపోయిన ఒక చావిటి మీద పడి వుంది. ఆమె కూడా మాతో బయలుదేరింది. అదృష్టవశాత్తు యిక్కడకు చేరుకొన్నది. అమ్మ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది. మేమంతా కలిసి యింటికి చేరుకున్నాము.
    
    నా బిడ్డ కధ విన్న నాకు దుఃఖం ఆగలేదు. నా దుఃఖాన్ని నేను మ్రింగి, బిడ్డను ఓదార్చాను. నేను చూస్తుండగా పోయిన పిల్ల గాక మిగిలిన వాళ్ళంతా బ్రతికేవున్నారు. ఎవరివంటిమీద సరైన బట్టలు లేవు. ఉండటానికి యిల్లు లేదు తింటానికి తిండిలేదు. అన్ని కొట్టుక పోయాయి. సర్వమూ నాశనమయింది. నేను ఎందుకు బ్రతికానో అర్ధము కావటము లేదు నా మనస్సంతా వికలమైంది. నేనొక పిచ్చివాడినయ్యాను.
    
    అప్పటికి తిండి తిని మూడు పూటలయింది. పిల్లలు ఆకలితో తల్లడిల్లి పోతున్నారు. ఎవరిని సాయం కోరేది? అందరు నా స్థితిలోనే వున్నారు. నాతో తీసికొని వచ్చిన పిల్లవాడు కొన వూపిరితో వున్నాడు. బ్రతుకుతాడోమోనని ఆశతో మంచము మీద వేసుకొని, నాగాయలంకకు బయలుదేరాము. కొంతదూరం వెళ్ళేటప్పటికి ఆ ఆశ కూడా నిరాశయింది. పిల్లవాడు మమ్మల్ని వీడి పరలోకం వెళ్ళి పోయాడు. అంతకు ముందే ఒకపిల్ల పోయింది, తక్కిన మేమంతా జీవచ్చవాల్లా మిగిలిపోయాము.




Related Novels


Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.