Home » Sree Sree » Srisri Kathalu



                                                   సీతయ్య
    
                                         (ఒక ఆలాపన)
    
    దారి చెయ్యండి కథానాయకుడికి దారి చెయ్యండి
    సీతయ్య వస్తున్నాడు దారి చెయ్యండి అమ్మయ్య! ఇక
    ప్రపంచం తనకు సీతయ్య కథ తెలియదనడానికి వీలులేదు.
    అనేక ప్రయాసల కోర్చి ఎన్నో సంవత్సరాలు ఏక దీక్షగా
    సీతయ్య జీవితం గురించి పరిశోధనలు చేసి తుదకు
    అసలు కత చెప్పగల్గుతున్నాను. ఇదివరకు పుకారుగా
    చూచాయగా ఇక్కడో విన్న సంగతి అక్కడో చిన్న రహస్యం.
    ఎవరో అనుకున్న మాటలూ ఎక్కడో చదివిన వార్తలూ
    మాత్రమే లోకానికి తెలుసును ఇక మరి భయం లేదు.
    సీతయ్యను గురించిన భోగట్టా యావత్తూ పోగుచేశాను.
    సరే కొంత కష్టపడవలసి వస్తేనేం? అదో లెక్కలోనిది
    కాదు. లోకానికి నిజం తెలియజెయ్యగలుగుతున్నాను కదా!
    అందుకు లోకం హర్షిస్తే అదే నా బహుమానం.
    ఈ సీతయ్య! ఇతగాడి సంగతి నాకు తప్ప మరెవ్వరికీ పూర్తిగా తెలియదన్న కారణంవల్ల నాకు కాస్త గర్వం కలగడం సహజమే ఇన్నాళ్ళకు నేనొక విషయం గురించి పరిపూర్ణ జ్ఞానంతో మాట్లాడగల్గుతున్నాను. దీన్నెవరూ కాదనలేరు. నామాట శిలాక్షరం వేదవాక్యం. సీతయ్య సంగతి మాట్లాడుతున్నంతసేపూ నేనొక్కడినే జ్ఞానిని. మిగిలిన వాళ్ళంతా నా దగ్గరకు రావాలి.
    సీతయ్యను గురించి నాకంటే ఎక్కువ తెలిసినవాళ్ళెవరూ లేకపోవడంచేత నేనేమిచెప్పినా కిక్కురుమనకుండా మీరు నమ్మితీరాలి. అయితే మీరు నమ్ముతాడు కదా అని నా యిష్టం వచ్చినన్ని అబద్దాలు గుచ్చెత్తి మీముందు పొయ్యవలసిన వాణ్ణికాను.
    నేను వ్రాస్తున్నదాంట్లో కాస్తైనా అబద్దం ఉన్నట్లు మీకు ఆచూకీ దొరికిందంటే నా శిల్పమే భగ్నమైపోయిందన్నమాట శిల్పం విషయమై నేను చాలా జాగ్రత్త తీసుకుంటానని మీకు వేరే చెప్పాలా?అందువల్ల నేను త్రాటిమీద నడుస్తున్నట్లుగా అసిధారావ్రతంగా సంచరించాలి.
    ఈ సీతయ్య! వీడి పరిపూర్ణ చిత్రం మీ ముందు ఉంచాలనే ఈ వ్రాత కుపక్రమించాను. నేను చిత్రకారుణ్ణి అయితే వర్ణలేపనంతో కాదు నా ప్రసక్తి. 'వర్ణ'లేపనంతో అనవసరంగా ఒక్క రేఖగాని ఒక ఊర్పుగాని వ్యయంచేస్తే నా శిల్పం ధ్వంసం అవుతుందని నాకు తెలుసు. కాని పాటగాడు సంగీతం అందుకునే ముందు రసావస్థపొలిమేరలలో కూనిరాగంతో తచ్చాడుతూ వుంటాడు ఆత్మహత్య చేసుకొనే వాడు నీళ్ళలో పడడానికి ముందు ఒడ్డున పచారుచేస్తాడు. ప్రేయసీప్రియులు.......హుఁ..... ఉదాహరణలతో మిమ్ములను విసిగించను. అన్నీ మీకు తెలిసినవే కదా!
    సీతయ్య సంగతి ఒక్కటే మీకు తెలియదు. నేనంతాచెప్పిన తర్వాత మాత్రం 'ఓ మాకు తెలుసు. ఫలానాచోట చూశాం-వీడు మాకు పరిచితుడే!'అంటారు. కాని నికరంగా ఏదీ నేను చెప్పనంతసేపూ మీ ఆదుర్దా అరికట్టుకొంటున్నాను. అదీకాక సీరియస్ గా కథ చెప్తున్నాననుకొంటూ పాఠకుడ్ని మరచిపోయే కథకుడు ఎన్నటికీ క్షంతవ్యుడు కాడు. ఎంతసేపూ తన పాత్రల వ్యవహారాలలో మునిగిపోయి ఇతడు తనకు కొందరు పాఠకులుంటారనీ వారిని కొంచెం గిలిగింత పరచడం అవసరమనీ మరచిపోతాడు. అదే నాకిష్టం లేదు. అవసరమైతే ఎంత ముఖ్యపాత్రనైనా వదలి పాఠకుని ఔత్సుక్యాన్ని ఆకర్షించుకోవాలి.
    ఇప్పుడు సీతయ్యను గురించి నిజం మీకు తెలిసిందా? స్వయంగా చెప్పడానికేమీ లేనప్పుడో, బహుశా ఇష్టం లేనప్పుడూ నేను చేసే తంత్రం - సీతయ్య నాచేతిలో యంత్రం సంభాషణలు తిరగడానికి 'కీ' సీతయ్య - సీతయ్య నా హార్మోనియం పెట్టె కేరమ్ బల్ల.
    ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సీతయ్యంటూ ఎవడూ ఒక వ్యక్తి లేడండీ! ఇందాకా పరిశోధనలనీ, ప్రయాసలనీ అన్నానే అవన్నీ కథారచనకు నేను పడ్డ పాట్లు మాత్రమే - ఓ గొప్ప కథానాయకుణ్ణి సృష్టించుధామని నేను చాలా యత్నించిన మాట వాస్తవమే. ఇంతసేపూ సీతయ్య ఒక యదార్ధ వ్యక్తి అనీ వాడినిగురించి యావత్తూ నాకు తెలుసుననీ మీలో ఒక అభిప్రాయం గలిగించాను. మరి నేను సృష్టించే పాత్రగురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఇక వ్యక్తుల యదార్ధం! దీని విషయమై మీరు అట్టే పట్టింపులు చేస్తే మీలో వేదాంతం చాలా తక్కువని ఋజువైపోతుంది.
    ఇది కేవలం మోసం అని మీరు తిరగబడవచ్చును. పైగా సీతయ్యను గురించి తెలుసుకొందామని మేమీపూట త్రిప్పాము గాని నీ ఉపన్యాసము వినడానికా? అని మీరడగవచ్చు -సీతయ్యను గురించి తెలుసుకోకపోతే మీకేలోపం వచ్చిందని నేనడుగుతే?
    కేవలం కుతంత్రాలతో మిమ్మల్ని నిలబెడుతున్నాను కాదూ? పాపం! మీ అమూల్యమైన కాలం వ్యర్ధపుచ్చుతున్నాను. లేకుంటే యీ లోపున మీరు మరేదో చదువుకొని ఉందురు. పద్యం - విమర్శ -తమాషాలు, వార్తలు, ఏవో ఏవో! ఇప్పటికీ మీకు కొంత విసుగుపుట్టి తటాలున తర్వాత పుటలకు పోదామని ఉంటుంది. కానీ "సీతయ్యను గురించి పూర్తిగా తెలుసుకొని మరీపోదాం ఎలాగూ రానేవచ్చాం" అనే అవస్థ పీకుతూ ఉంటుంది. కల్పిత వ్యక్తి అయితేనేం కథ బాగుంటే చాలునని నిలబడతారు.
    కానీ ఇంతట్లో సీతయ్యను గురించి చెబుతానని మీరనుకొంటే చాలా పొరపాటుపడ్డ వాళ్లవుతారు. నిజానికి నేను సీతయ్య వ్యవహారం వెనుక పెడుతున్నానంటే దానికి కొంత కారణం లేకపోలేద. కథంతా నాలుగు ముక్కల్లో తెమిల్చి 'అయిపోయింది' అని నేను ఆఫీసు మూసివేయవచ్చును.అదో కష్టమైన పనికాదు కూడా! కాని నేనలాచేయను కాని నాకథకు నాయక పదవికి నోచుకొన్నవాడు చాలా అదృష్టవంతుడు. ఒకంతకుగాని బయటపడడు. అలా, అలా నా పాఠకులలో ఔత్సుక్యం పెంపొందించి తంటాలు పెడతాడు. ఈ ఔత్సుక్యం విసుగుదలగా మారి కొందరు పాఠకులు నన్ను తిట్టుకొంటున్నా కొంతమంది మాత్రం తెల్లవార్లూ జాగారం చేసినా ఈ సంగతేదో తేల్చుకుందామని కూర్చొంటారు. వాళ్ళు అసలైన 'ఆంధ్రులు' అలాంటివారే దేశానికి  కావాలి.
    చూచారా! మరి నేనేలాగా మిమ్మల్ని నిలువ గలుగుతున్నానో? ఈ మారు మీ దేశాభిమానం రెచ్చగొట్టుతున్నాను ఇవన్నీ మామూలు పద్దతులే అనుకోండి -కాని వీటికి మీరు లోబడిపోవడం మాత్రం ఆశ్చర్యం కాదూ?
    ఇకనట్టే శాఖాచంక్రమణం చెయ్యక సీతయ్యమాట మొదలుపెడదామా అని వుంది. కాని అతనికి ఆకారం ఇయ్యడంతోనే శాశ్వతంగా ఒక పోతవిగ్రహం అయిపోతాడు. ఆటువంటప్పుడు అన్నివిధాలా యోచించి సృష్టించబోయే బొమ్మకు రూపం కల్పించి ప్రాణం పొయ్యాలి. ఇతగాడు సాహిత్యంలో ప్రసిద్దిపొ౦దిన మహా వ్యక్తులతో తులతూగాలంటే అశ్రద్ధగా వెళ్ళకూడదు. Falstaff, Don Quixoteమొదలైన వాళ్ళలాగు మన సీతయ్యని హాస్యవ్యక్తిని చేద్దామా అని ఒక ఆలోచన. చేసినా చెయ్యొచ్చు. అదేమీ కష్టంలో పనికాదు. అయితే తీరా ప్రారంభిస్తే తర్వాత మనస్సు మారిపోయి Hamlet, othello మొదలైన వాళ్ళలాగు వీడినొక Tragic Hero గా చేశానుకానే అని కించ కలుగుతుంది. అందువల్ల ఎంతమాత్రము తొందరపడి పోకూడదు.
    మరో విశేషం : చెప్పకేం గాని నేను వచనం వ్రాస్తున్నా నా హృదయాంతరంలో మట్టుకు కవిత్వం అంటే మహాభిమానం. అందువల్ల ఈ సీతయ్యను Byron లాగా ఒక కావ్యనాయకుణ్ణి చేస్తే ఎలా వుంటుందో అనిపిస్తుంది. Don Juan Childe Harold, Giaour ల్లాగా, కాళిదాసు యక్షుడూ మిల్టను సైతానూ పెద్దన్నగారి ప్రవరుడూ పాండురంగకవి. నిగమశర్మా వీళ్ళలో యెవరిలాగైనా బతికిపోయి ఉండును. కాని సీతయ్య అని మగపేరు పెట్టకపోతే 'చింతామణి' 'సక్కుబాయి' 'బాలయోగిని' అంటూ ఎంత కల్పన కవకాశం వుండును. తీరాయిక విచారిస్తే లాభమేమిటి? స్త్రీ వాచకం అయివుందా మరి. తిర్యగ్లోకంలోకి, జడ పదార్ధాలలోకి కూడా భావనా విహారంచేస్తే మనం తేలడ మేలాగు?
    అయితే సీతయ్య చాల మొగమాటపు మనిషి గొప్పగొప్పవాళ్ళ పక్క కూచోడానికి తాను అర్హున్ని కానని ఎరుగును. అదీకాక వాళ్ళంతటివాళ్ళు వాళ్ళు. నా అంతటి వాణ్ణి నేను అనే స్వాభిమానం ఉన్నవాడు కూడాను. మరిన్నీ తాను పూనుకుంటే సులువుగా గొప్పవాణ్ణి కాగలననే రకంలోనివాడు. ముఖ్యంగా ఎవడైనా గ్రంధకర్తకు తన జీవితం అప్పగించి నన్ను గొప్పవాణ్ణి చెయ్యవయ్యా అంటే అతనే చేస్తాడు తగుమాత్రం ఫీజుతో గొప్పవాళ్ళు కావడానికి ఈ కాలంలో అట్టే శ్రమపడవలసిన అవసరంకూడా లేదు. ఓ పత్రికకు ఫోటో పంపించడం, మరో పత్రికలో వ్యాసం వ్రాయడం, ఓ ఊళ్ళో ఉపన్యాసం యివ్వడం, ఒక సమావేశానికి వెళ్ళకపోతే జయంకోరుతూ సందేశం పంపడం వెళ్ళి సభకువచ్చిన వారిలో ముఖ్యులు అనిపించుకోవడం ఎన్నో చవక పద్ధతులున్నాయి. సీతయ్య కివేమి ఇష్టంలేక పోబట్టి కాని లేకపోతే అబ్బో! ఇంకా మీకు సీతయ్య సంగతి తెలియదు.
    ఇక వాజ్మయంలో శాశ్వతంగా జ్ఞాపకం ఉండవలసిన వ్యక్తికి ఫలానా లక్షణాలు వుండాలని ఎవ్వరూ నిర్దేశించలేదు.  నాయకులను గురించిన విభాగాలలో మనవాళ్ళు ధీరోదాత్తుడూ, ధీర లలితుడూ అంటూ కొన్ని లక్షణాలు చేసినా victor Hugo సృష్టించిన Quasimodo అందానికీ, Dostoievesky సృజించిన idiot తెలివికీ క్రొత్త జాబితాలు వేసుకోవాలి. నాలుగురోజులు భూమిమీద ఉండి పేరులేకుండా పోయిన వాళ్ళందరికన్నా వీరిని జ్ఞాపకం ఉంచుకొంటామా? లేదా?
    అందువల్ల సీతయ్యకు గొప్ప గుణాలున్నవనీ, గొప్ప కార్యాలు చేశాడనీ మీరు వాడిని స్మరించ నక్కరలేదు. ఎవరెస్టు ఎక్కడం, సముద్రాలు దాటడం, భూప్రదక్షిణం చెయ్యడం గొప్ప కార్యాలె పద్యాలు వ్రాయడం సినిమాలో నటించడం విషవాయువులు కనిపెట్టడం గొప్ప కార్యాలే. ఇవన్నీ మన సీతయ్య చేశాడంటే వెంటనే నేనబద్దాలు వ్రాస్తున్నానని మీరు పోల్చేస్తారు. సీతయ్య కివేమి చాతకావని మీకు తెలుసును.
    అయితే ఎవరయ్యా యీ సీతయ్య? వీడిని మేమెందుకు తెలుసుకోవాలి? అని' మీరడుగుతారు. మీరడుగుతున్న కొద్దీ నాలో డెవిల్రీ హెచ్చి ఏమీ చెప్పడానికి ఇష్టం కలుగదు. ఈ ఆలాపనలో ఇంకా ఎన్నో సంగతులు పడతాయి.
    ఈ సీతయ్యతో నేను ఎంత పనైనా చెయ్యగలను. వీడు నా సృష్టి పూర్తిగా చెప్పు చేతలలో మెలగవలసినవాడు. "సీతయ్యా నీవు ఫలానారకం మనిషివి" అంటే ఔనని  ఒప్పుకొంటాడు. "నిన్ను ఫలానా పరిస్థితులలో పెడుతున్నాను. ఎలా సంచరిస్తావో" అంటే నీ యిష్టం అంటాడు సీతయ్యను ఎలక్షనుకి నిలబెట్టి గెలిపిస్తాను. టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ఆసుపత్రిలో ప్రవేశపెడుతాను. "సీతయ్యా నువ్వు పది రూపాయల టికెట్టుకొని ఆంద్రదేశమంతా తిరగాలి" అంటే 'సరే' అంటాడు. అయితే వీటివల్ల సీతయ్యకు వచ్చిన ప్రత్యేకత ఏమిటి? ఓ అదా! ప్రత్యేకత కూడా కలిగించే సన్నివేశాలు దొర్లించవచ్చు. అదో కష్టంలో పనికాదు.
    ఏమాత్రం నేను సీతయ్యను గురించి స్పష్టంగా చెప్పినా నా ప్రయత్నం పాడవుతుంది. ఇప్పటికే చాలా సంగతులలో సీతయ్య వ్యక్తిత్వం కనబడిపోతున్నది. ఇంకా స్ఫుటవర్ణాలు ఉపయోగించి వీడిని చట్రంలోకి దింపడం అన్యాయం. ఒక నీడగా, మబ్బుగా, దోబూచిగా సీతయ్యను వదిలేస్తున్నాను. వీడికి రూపం యిచ్చి గుణాదులను కల్పించి, సంఘటనలో నిలిపి కథ నడిపించాలన్నా నడిపించవచ్చు. అది కష్టమైన పనికాదు కూడా!
    
                                     --౦౦౦౦-




Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.