Home » Lalladevi » Ardha Manavudu



    "దారి చూపగలవా!" సిన్హాను ఉద్దేశించి అడిగాడు గోయెల్.
    "ప్చ్. నాకు తెలియదు" అంటూ నాలుక చప్పరించేశాడు సిన్హా. టీ కెటిల్ ఎత్తి అతడి నెత్తిమీద కొట్టాలనిపించింది. ముఖర్జీకి కాని అందువలన ప్రయోజనం శూన్యం. ఇలా పిరికిమందు తిన్న మనుషులు చేరితే ఈ టీములు దెబ్బతింటాయి. అతడివల్లనే ఇంత జరగరాని సంఘటనజరిగిపోయింది. తిరిగి ఫిజోని, మాలతిని వెదికి తీసుకురావడం ఎలాగ?
    ముఖర్జీ అప్పటికప్పుడు టీము నాయకత్వాన్ని స్వయంగా చేపట్టాడు. జరుప వలసిన అన్వేషణ కార్యక్రమాన్ని క్షణాలమీద ప్రారంభించారు. అవసరమైన వస్తుసామగ్రి అంతటినీ సిద్దం చేసుకుని బయలుదేరారు.
    కొందఱు విజిల్స్ మరికొందరు సెర్చిలైట్లు. త్రాళ్ళు ఏవయినా ఊహించని ప్రమాదాలు ఎదురు అయితే ఎదుర్కొనేందుకు ఛురికలలాంటివన్నీ వీరిదగ్గర సిద్దంగా వున్నాయి.
    అవి హిమ సానువులు కావటంవలన చలి వణికించేస్తోంది. రాత్రి సమయం కూడా కావడంనుంచి గాలి రవంత విసురుగా వీస్తోంది. అక్కడక్కడ పొదలున్నాయి. చాలా అరుదుగా ఎత్తయిన చెట్లు కూడా వున్నాయి సెర్చిలైట్ల సాయంతో వారు దూరానికి కాంతిని ప్రసరింపచేయగలుగుతున్నాడు.
    తాము ఎక్కడ ఉన్నదీ తమవారికి తెలుస్తుంది. కాని మాలతి వారి సంకేతలను అందుకోగల స్థితినుంచి దూరమయిపోయింది. ఫిజో తన వారిని తెలుసుకున్నాడు. నా వనానికి అతడు అప్పుడు గుడారానికి మరో వైపుగాపోతున్నాడు. అలా వెళ్ళిపోయి వుంటే ఎప్పటికీ గుడారం చేరుకోలేడు.
    దూరంనుంచి దీపకాంతులు కన్పించడంతో అతడు తన ప్రయాణం దిక్కును మార్చుకున్నాడు. ఒకవేళ అది సంకేతం కాకపోయి వుండవచ్చు అన్న అనుమానం అతనికి కలిగింది! కాని శ్రద్దగా వింటే ఆ వైపునుంచే విజిల్స్ కూడా వినిపిస్తున్నాయని అందునుంచి అతడు తన వారు అన్వేషణ కార్యక్రమం ప్రారంభించారని నిర్దారించుకున్నాడు.
    పావుగంట గుర్తుతెలియని కొండదారుల వెంట పురోగమించినాడు. వారికి మరింత చేరువయినాడు. అక్కడ నిలచిపోయి తన ప్రక్కనుంచి ఒక సంకేతాన్ని వారికీ అందించాడు.
    వారిలో ఉత్సాహం ఇనుమడించింది. తమ వారిని చేరుకోగలిగామన్న ఆనందంతో వారు తన్మయులయినారు. ఈలలు వేస్తూ పాటలు పాడుతూ సంకేతం వినిపించిన దిక్కుకు కొన్ని అడుగులు వేశారు.
    ఇప్పుడు సెర్చిలైటు కాంతిలో విస్పష్టంగా కనిపిస్తున్నాడు ఫిజో. అనుచరులంతా వచ్చి ప్రమాదంనుంచి బయటపడినందుకు అతడిని అభినందించారు. కౌగిలించుకున్నారు. అతడి చేతుల్ని లాగేసుకుని ముద్దులు పెట్టుకున్నారు.
    అయినా అతడిలో ఉత్సాహం ఇనుమడించలేదు. స్తబ్దమూర్తిలా అలా నిలుచుండిపోయాడు. సంతోషం తాలూకు విలువ శత్వనినించే ముందుగా తేరుకున్నాడు గోయెల్.
    "కెప్టెన్ మాలతి ఎక్కడ?" అనే ప్రశ్నించాడు. ఫిజో ముఖంలో కత్తిగాటుకు నెత్తురు చుక్కలేకుండా పాలిపోయింది. అతని కన్నులు చెమరించినాయి. చెంపలు చిత్తడి ఆవుతున్నాయి. మనసులోని కల్లోలం తాలూకు చిహ్నాలు పెదవుల మీద నుంచి పొంగి వస్తున్నాయి. దుఃఖం మూర్తి భవించినట్లు అయ్యాడు.
    "సారీ బ్రదర్స్-మాలతిని రక్షించలేక పోయినాను. ఆమె ఇక ఎన్నటికి మనకు కన్పించదనుకుంటాను." అన్నాడు. గద్దమయిపోతున్న కంఠస్వరాన పిడుగుపాటు లాంటి ఆ వార్తవిని అందరూ చలించలేకపోయినారు.
    అక్కడ చలి శరీరాన్ని తినివేస్తోంది. రక్తం గడ్డ కట్టి పోతుందేమో అన్నంత భయంకరంగా ఉంది.
    "మనం ముందుగా గుడారం చేరుకోవాలి. ఆ తరువాత మిగిలిన విషయాలు చర్చించుకోగలుగుతాం. రండి వెళ్ళిపోదాం. అన్నాడు ముఖర్జీ అందరూ అతడి మాటను అనుసరించి తిరుగు ముఖం పట్టారు. అరగంట తరువాత గుడారం చేరుకున్నారు. ఈ లోపుగా ఎవరూ పెదవి కదపలేక పోయారు. మౌనంగా నడిచి చేరవలసిన చోటుకి చేరుకున్నారు.
    ఒక వంక శరీరాన్ని కలచి వేస్తోన్నచలి! మరొక వంక మనసుల్ని దొలిచివేస్తున్న బాధ? అందరి హృదయాలలోనూ స్పందిస్తున్న ఒకే ఒక్కప్రశ్న అది.
    "మాలతికి ఏమయింది?"
    టెంట్ లోకి వెళ్ళాక సిన్హావంక అందరూ గుర్రుగా జూడటం ప్ర్రారంభించారు. దారిలో అతడు భయపడిపోయి "కిట్" చాటున ముఖం దాచుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు.
    "ఫిజో! కెప్టెన్ మాలతికి ఏమయింది. ఇప్పుడెక్కడ ఉంది" అని ప్రశ్నించాడు ముఖర్జీ! అందరి హృదయాలలోనూ స్పందిస్తున్న ప్రశ్న అది. కావడంనించి ఎటువంటిసమాదానం వొస్తుందో వినేందుకు అందరూ చెవులు రిక్కించారు. తమ చూపుల్ని ఒకే కేంద్ర బిందువుమీద నిలిపారు.
    ఆ కేంద్ర బిందువు పేరు ఫిజో!
    అతని పెదవులు నెమ్మదిగా విచ్చుకున్నాయి. దీర్ఘంగా నిట్టూర్చాడు.
    "మీకు ఎలా చెప్పాలో తెలియటల్లేదు. మాలతి ఎత్తుకు పోబడింది" అన్నాడతడు.
    "తీసుకు పోయింది ఎవరు?" ముఖర్జీ అడిగాడు. రవంత సేపు మౌనం వహించాడు ఫిజో! కేవలం అయిదారు సెకన్ల మౌనం అతి భయంకరంగా భరించరానిదిగా అయింది.
    "ఎవరు అంటే నేనెలా చెప్పగలను. నేనేమీ చెప్పగల స్థితిలో లేను" అంటూ బదులు చెప్పాడు ఫిజో! వింటున్న వారికే చాల నిరుత్సాహం కలిగింది.
    "అది ఏనుగు అయి వుండవచ్చా:" అని అడిగాడు కుట్టి.
    "కాదను కుంటాను" ఫిజో సమాధానం.
    "పులి అయివుండవచ్చా" మరొకరు.
    "కాదను కుంటాను" ఫిజో:
    "సింహమా."
    "కానేకాదు"
    "మరేమిటి-?"
    "ఏమో చెప్పలేను. కాని అది చాలా బలమయిన ప్రాణి దానికి గోళ్ళున్నాయి మనిషి లాగే రెండు కాళ్ళ మీద నడుస్తోంది. మనం దిగి పోలేని లోయల్లోకి ఆ ప్రాణి సులభంగా దిగిపోవడం నేను చూచానని. అంతేనాకు తెలుసు మరేమీ చెప్పలేను" అంటూ నిట్టూర్చాడు ఫిజో!




Related Novels


Kalaniki Nilichina Katha

Kougitlo Krishnamma

Black Tiger

Ardha Manavudu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.