Home » Dr C ANANDA RAMAM » Nisabdha Sangeetham


 

    ఈ సంబంధం నిశ్చయమయ్యేలా చెయ్యమని తనకు తెలిసన దేవుళ్ళందరికీ మొక్కుకుంది. పెళ్ళికొడుకు అందంగా ఉన్నా ఉండకపోయినా బాధలేదు. అస్తిపాస్తులు అసలే అక్కర్లేదు. తనను ప్రేమగా చూసినా, హింసించినా లక్ష్యం లేదు. తనకు పెళ్ళయితే చాలు. అన్నకు తన బరువు తీరిపోతే చాలు.


                                                          2

    తెల్లవారుజామున పల్లెటూరి ప్రశాంతతలో ఒంటరిగా కాలినడకను బయలుదేరటం ఒక విచిత్రమైన అనుభవం. చీకటి పూర్తిగా చెదరని పల్చని అరుణ కాంతులతో మత్తుగా తూగుతూ ఉంటుంది పకృతి. వంశీమోహనుని దివ్య వేణుగానం ప్రకృతి అంతటా నిండి మారుమోగుతున్నట్లనిపిస్తుంది. కాని, ఆ సంగీతానికి ధ్వని ఉండదు. ఆ నిశ్శబ్ద సంగీతాన్ని హృదయం మాత్రమే ఆస్వాదించగలదు.
    మెడ్రాస్ లో ఉన్నప్పుడు తెల్లగా తెల్లవారాక కాని ఎన్నడూ లేవకపోయినా, స్వగ్రామానికి వచ్చినప్పుడు మాత్రం తెల్లవారుజామునే మెలకువ వస్తుంది మాధవకు. లేచి ముఖం కడుక్కుని సన్నని కాలిబాట వెంట అలా కొంతదూరం తిరిగివస్తాడు.
    సరోజినీ ఇంట్లో కొత్తవల్లనో, మానసిక కల్లోలం వల్లనో రాత్రి చాలాసేపటి వరకూ నిద్రపట్టలేదు మాధవకు. అయినా తెల్లవారుజామునే మెలకువ వచ్చింది. అతి ప్రశాంతంగా ఉన్న ప్రకృతిలో ఎక్కడో మధురంగా కోడికూత - కవ్వం చిలుకుతున్న చప్పుడు.
    లేచి కూచున్నాడు మాధవ. బయటికి పోయి నడవాలనిపించింది. కొత్త చోటని సందేహం కలిగింది క్షణకాలం - అంతలో చిన్న పల్లెటూళ్ళలో తను తప్పిపోయేదేముందని నవ్వుకుని ముఖం కడుక్కుని బయలుదేరాడు.
    యుగాయిగాల మానవత్వపు గాధలు సుకుమారంగా గానం చేస్తున్నాయి. ప్రభాత వాయువులు. ఆ నిశ్శబ్ద భావమయ సంగీతానికి పరవశత్వం చెందుతోన్న మాధవ హృదయంలో రకరకాల ఆలోచనలు అల్లుకుంటున్నాయి.
    ఈ సౌందర్యమయ సృష్టికి అర్ధమేమిటి? ఈ సృష్టిలో మానవుని పాత్ర కెలాంటి ప్రాముఖ్యం? ఒక క్షణం అంతా తన చేతుల్లోనే ఉందనిపిస్తుంది. మరుక్షణం ఏదీ తన వశంలో లేదనిపిస్తుంది. ఇంత విచక్షణా జ్ఞానం ఉంది. దాన్ని వెన్నంటి ఎన్నో బలహీనలున్నాయి. అందుకోవలసిన విలువలు కనబడుతూనే ఉంటాయి. అంతులేని ప్రలోభాలు ఊరిస్తూనే ఉంటాయి. అతి సున్నితంగా మనసు స్పందిస్తూనే ఉంటుంది. అతి కఠినంగా శరీరం ఆచరించేస్తుంది. మానవత్వనికర్ధం ఏమిటి? మానవుడు మానవుడుగా బ్రతకటానికి ఎలాటి సాధన అవసరం? ఆలోచిస్తూ నడుస్తోన్న మాధవ చటుక్కున చిన్న కేక పెట్టాడు. నించున్న చోటనే కూలబడి పోయాడు. ఎదుట ఉన్న బండరాయికి కాలి బొటన వేలు కొట్టుకుని రక్తం చిమ్ముతోంది.
    "ఏం జరిగింది?"
    అత్యంత మధురమయిన స్వరం అతి మెల్లగా పలికింది. బొటనవేలు చేత్తో పట్టుకుని తలెత్తి చూశాడు మాధవ. సూర్యోదయం కాకుండానే వికసించిన కమలంలా ఉన్న ముఖాన్ని, కెరటాల్లా కప్పేస్తూ నొక్కునోక్కుల వెంట్రుకలు వీపు మీద జారుముడిగా వేలాడుతున్నాయి. అతి సాధారణమైన నేతచీర ఒంటికి ఒదిగి ఉంది. చంకలో పెద్ద బిందె, చీర కుచ్చేళ్ళు ఒక పక్కకి కొద్దిగా పైకి దోపుకోవటం వల్ల పసుపురాసిన పదాలు తళతళలాడుతూ కనిపిస్తున్నాయి. కళ్ళల్లో చిరునవ్వులో, నిలుచున్న వైఖరిలో, కంఠస్వరంలో , మాట తీరులో ఏదో నమ్రత.
    అకస్మాత్తుగా వనదేవతలు ప్రత్యక్షమవటం లాంటి జానపద గాధలు నిజమా అనుకున్నాడు ఒక్క క్షణం మాధవ.
    "అరె! బొటనవేలు చితికి రక్తం కారుతోంది. దెబ్బ బాగా తగిలింది"
    చంకనున్న బిందె కిందికి దింపింది. దోసిలితో నీళ్ళు బొటనవేలు మీద పోసింది నాలుగైదు సార్లు.
    "మీకు అనవసరపు శ్రమ......" మొహమాటంగా ఏదో అనబోయాడు మాధవ.
    "ముందు గాయం కడుక్కోండి" తలవంచుకొని గాయం మీద నీళ్ళు పోసింది మళ్ళీ.
    "ఏదైనా పాతగుడ్డ ఉంటే బాగుండును" తన చీర కొంగు చేతిలోకి తీసుకుంటూ అంది.
    "వద్దు, చీర చింపకండి. నా దగ్గర రుమాలుంది."
    "ఇలా ఇయ్యండి. తడిపిస్తాను."
    మాధవ రుమాలు అందించాడు. తడిపి అతనికిచ్చింది.
    "త్వరగా చుట్టుకోండి వెలికి. లేకపోతె రక్తం కట్టదు."
    ఆమె కేసే చూస్తున్న అతడు చటుక్కున తలదించుకుని తడి రుమాలు వెలికి చుట్టుకుని "థాంక్స్ " అన్నాడు. "థాంక్స్ నాకు కాదు. ఈ సమయంలో నన్నిక్కడకు పంపించిన దేవుడికి చెప్పండి. ఈ సందర్భంలో మనిషై పుట్టిన ఎవరైనా ఇంతమాత్రం చేస్తారు. నేను మీకోసం ప్రత్యేకించి చేసిందేమీ లేదు" బిందె చంకనేత్తుకుని ఆమె ముందుకు నడిచింది. తన కన్న పెద్దదిగా ఉన్న బిందెను సన్నని నడుము మీద ఇముడ్చుకుని ఒక పక్కకు ఒరికి నడుస్తున్న ఆమెను చూస్తూ అలాగే కూర్చున్నాడు. నెమ్మదినెమ్మదిగా తోలి సంజలో కలిసిపోయింది ఆ యువతి. ఒక్కసారైనా వెనక్కు తిరిగి చూడలేదు.
    నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ వెనక్కు తిరిగాడు మాధవ.
    ఈడ్చుకుంటూ వస్తున్న మాధవ కాలిని చూసి కాత్యాయనీ గాభరా పడిపోయింది.
    "ఏం జరిగింది మాధవా?"
    "ఏం లేదత్తయ్య! చిన్న ఎదురు దెబ్బ!"
    "ఏదీ చూడనీ!"
    కాత్యాయనీ ముందుకు వంగి దెబ్బ పరిశీలించింది.
    "శుభమా అంటూ పెళ్ళి చూపులకు బయలుదేరబోతుంటే ఈ దెబ్బ ఏమిటి? పోనీ రేపు వెళదామా" ఆ దెబ్బ చూసిన సరోజినీ నొచ్చుకుంటూ అంది. కాత్యాయనీ మాట్లాడలేదు.
    మాధవ నవ్వాడు.
    "మీదంతా చాదస్తం. ఈ దేబ్బకీ ఆ పెళ్ళి చూపులకి సంబంధం ఏమిటి? ఇవాళే వెళదాం - నేను మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోవాలి"
    సరోజినీ ఆరోజు పెళ్లి చూపులకు వస్తున్నామని ముందుగానే శ్రీనివాసుకు కబురు చేసింది. అంచేత వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ రావటం లేదని కబురు పంపిస్తే కొంత నిరుత్సాహం కలుగుతుంది. అంచేత సరోజినీ ఎక్కువ వాదించకుండా ఊరుకుంది.
    ముగ్గురు వెళ్తే మంచిది కాదని సరోజినీ తను వెళ్ళకుండా కాత్యాయనిని మాధవనూ మాత్రమే పంపింది.
    చిన్న పెంకుటిల్లు. ముందు ఆవరణలో నన్నజాజితీగ పందిరి మీద పాకి ఉంది.
    కాత్యాయనీనీ, మాధవను సంభ్రమంగా సగౌరవంగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెట్టాడు శ్రీనివాసు. పిల్లలు ఆ యిద్దరినీ విచిత్రంగా చూస్తూ నుంచున్నారు. చీర నిండా జరీ పువ్వులున్న బెనారసు పట్టుచీర పెళ్ళినాటిది కట్టుకుని తనకున్న ఒక్క చంద్రహారము వేసుకుని చిరునవ్వుతో కాత్యాయనిని పలకరించింది అలమేలు - ఆమె కాత్యాయనిని ఆస్తిపాస్తుల వివరాలడుగు తుంటే , ఒకటి రెండు సార్లు వారించబోయాడు శ్రీనివాసు.
    ఆ వివరాలన్నీ విన్న అలమేలు కళ్ళు వెడల్పయ్యాయి. లోలోపల ఏదో సన్నని ఈర్ష్య రగిలింది.
    అంతలో జానకి ట్రేలో కాఫీలు పట్టుకొచ్చి వాళ్ళముందు పెట్టింది.
    కాత్యాయనీ జానకిని చూసి చాలా సంతృప్తి పడింది. మాధవ జానకిని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రభాతసమయాన మసక వెలుతురులో స్పష్టంగా కనిపించకపోయినా తన కేక విని తన గాయానికి నీళ్ళందించిన అమ్మాయే
    జానకి ఒక్కసారి కళ్ళెత్తి మాధవ వంక చూసింది. ఉదయం ఆ కళ్ళల్లో నమ్రత మాత్రమే కనిపించింది. ఇప్పటి చూపులు అలా లేవు. ఏదో చెప్పాలను కుంటున్నట్లున్నాయి. దీనంగా అభ్యర్ద్షిస్తూన్నట్లున్నాయి. నీలపు కనుపాపలు చెమ్మగా ఉన్నాయి. బేలగా, జాలిగా, ఏదో మూగ వేదనను వ్యక్తీకరిస్తున్నాయి. అంతకన్న అందమైన కళ్ళను ఎన్నిటినో చూశాడు మాధవ. ఎక్కడిదాకానో ఎందుకు? సరళ కళ్ళ అందాలతో పోలిస్తే ఈ కళ్ళు ఎక్కడ నిలుస్తాయి? అయినా ఆమె కళ్ళ మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోయాడు మాధవ.




Related Novels


Tapasvi

Neeraja

Gullo Velasina Devathalu

Nisabdha Sangeetham

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.