Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                    

                                         మూడవ అనువాకము
                                         మొదటి సూక్తము -12


వినియోగము :-
   
1.    వాతపిత్త కఫ వ్యాధులందు మేద, తేనె, నేయి, నూనె త్రాగించునపుడు పఠించదగినది.
   
2.    దుర్దినము, అతివృష్టి నివారకము.
   
3.    వ్యాధులందు మూడవ మంత్రముచే సంపాతాభిమంత్రణ ద్వారమున సంస్కరించబడిన కుండలోని జలమును     వ్యాధి గ్రస్తుని మీద చల్లవలెను.
   
1.    సూర్యుడు జరాయుజుడు. తొలుత పుట్టిన వాడు. వర్షము కలిగించువాడు. వాయు వేగవంతుడు. ఉరిమి ఉరిమి వర్షించువాడు. అతడు వాత, పిత్త, కఫముల వలన కలిగిన రోగములు నివారించి దేహమునకు సుఖము కలిగించును గాక.
   
మరొక అర్ధము
   
    సూర్యుడు అకుటిల భావమున నడుచువాడు. అతడే అగ్ని, వాయువు, చంద్రులందు ఉన్నాడు. అతడు తన తేజమున వాత, పిత్త, కఫముల వలన కలిగిన వ్యాధులను నివారించి దేహమునకు సుఖము కలిగించును గాక.
   
2.    అంగాంగములందు ప్రాణరూపమున ఉన్న సూర్యదేవా! వ్యాధులను నివారించుమని నీకు నమస్కరించుచున్నాము. హవిస్సు అర్పించుచున్నాము. నీకు అనుచరులు, నీకు సమీప వర్తులకు కూడ హవిస్సులు అర్పించి సేవించుచున్నాము.
   
3.    సూర్యదేవా! ఇతనిని "శీర్షక్తి" అను శిరోవ్యాధి బాధించుచున్నది. దానినుండి విముక్తి కలిగించుము. ఇతని హృదయమున, కంఠమున కఫము చేరి దగ్గు కలిగించుచున్నది. ఇది సకల సంధులందు దూరినది. దీనినుండి విముక్తి కలిగించుము.
   
    దేవా! వాత, పిత్త, శ్లేష్మ వ్యాధుల నుండి నరులకు విముక్తి కలిగించుము. ఆ వ్యాధులను నరసంచారము లేని అరణ్యములకు, పర్వతములకు పంపుము.

4.    శంమే పరస్మైగాత్రాయ శమస్త్య వరాయ మే |
    శంమే చతుర్బ్యో అంగేభ్యః శమస్తు తన్వే౩మమ ||

   
    నా శరీరపు పై భాగమునకు సుఖము కలుగును గాక. క్రింది భాగమునకు సుఖము కలుగును గాక. నా యొక్క నాలుగు అవయవములకు - 2కాళ్ళు + చేతులు - సుఖము కలుగును గాక. నా తనువునకు సుఖము కలుగును గాక.
   
                                          రెండవ సూక్తము - 13
   
1.    పర్జన్యా! నీ మెరుపునకు నమస్కారము. నీ ఉరుములకు నమస్కారము. నష్టము కలిగించవలదని పిడుగులకు నమస్కారము.
   
2.    పర్జన్యా! నిన్ను స్తుతించని వారిని పిడుగుచే భయపెట్టుచున్నావు. అకాలవర్షము కలుగకుండ చేయుచున్నావు. నీకు నమస్కారము. నీవు మాకు, మా పుత్ర, పౌత్రాదులకు సుఖము కలిగించుము.
   
3.    పర్జన్యా! నీకు నమస్కరించుచున్నాము. నీ ఆశని ఆయుధమునకు నమస్కరించుచున్నాము. నీవు నివసించు గుహ్య స్థానమును మేము తెలుసుకున్నాము. "సముద్రే అంతర్నిహితాసినాభిః" అంతరిక్షము నందలి జలధిలో నీవు నాభిస్థానమవై ఉన్నావు.
   
వ్యాఖ్య -    అంతరిక్షమందలి జలమును కూడ యాస్కుడు సముద్రము అన్నాడు.
   
    సమస్త నాడులకు 'నాభి' కేంద్రమగును. అట్లే పర్జన్యుడు సమస్త మేఘములకు నాభి స్థానమగుచున్నాడు.
   
4.    ఆశనీ! దేవతలు దానాది గుణవంతులు. వారు తమ శత్రువులను హింసించుటకు నిన్ను బాణ రూపమున రచించినారు. నీవు మా యజ్ఞములకు రమ్ము మా స్తుతులు వినుము. మాకు సుఖములు కలిగించుము. ఆకసమున ఉరిమి మా భయము పోగొట్టుము. "నమో అస్తు దివే" దివ్యఆశనీ నీకు నమస్సులు.
   
                                            మూడవ సూక్తము - 14
   
వినియోగము :-

   
    దౌర్భాగ్యము కలిగించుటకు స్త్రీ పురుషుల మాల్యాదులను ఖననము చేయు పద్దతి.
   
1.    జనులు పూసిన చెట్ల పూలు త్రెంచుకుందురు. అట్లే నేను ఇష్టపడని స్త్రీ యొక్క భాగ్యము ఆమె శరీర సౌందర్యమును ఈ మంత్ర ప్రభావమున గ్రహించుచున్నాను. నేలలోన మూలము కలిగి కదలని పర్వతము వలె ఆమె పుట్టింట ఉండును గాక.
   
2.    సోమరాజా! ఈ కన్యను ముందు నీవు గ్రహించినావు. ఇప్పుడు ఈమె దౌర్భాగ్యురాలు అయినది. ఈమె తల్లిదగ్గర గాని, తండ్రి దగ్గర గాని, సోదరుని దగ్గర గాని ఉండి పోవును గాక.
   
3.    సోమరాజా! ఈమె నీ వధువు. కులమును కాపాడునది. ఈమెను తిరిగి నీకు వప్పగించుచున్నాము. ఈమె తల నెల రాలునంత వరకు పిత్రుగృహమున నివసించును గాక.
   
4.    అబలా! అసిత, గయ, కశ్యప ఋషుల మంత్రములచే నీ భాగ్యమును - ఆడవారు ఇంట ధన వస్త్రాదులను భద్ర పరచినట్లు - భద్రపరచుచున్నాను.
   
                                         నాలుగవ సూక్తము - 15
   
వినియోగము:-
   
    సర్వపుష్టి కర్మయందు మిశ్ర ధాన్యపు చారు భక్షణమున, తేనె కలిపిన సత్తు భక్షణమున, లక్ష్మీ కరణమున     వినియోగము.
   
1.    మందగమనలగు నదులు మాకు అనుకూలముగ ప్రవహించును గాక. వేగవంత వాయువు మాకు అనుకూలముగ వీచును గాక. పక్షులు మాకు అనుకూలముగ ప్రవర్తించును గాక. నదులు, వాయువు పక్షులు మా కోరికలు తీర్చును గాక. ఘ్రుత దుగ్దాదులను ప్రవహింపచేసి దేవతల కొరకు అగ్నిలో ఆహుతి చేయుచున్నాను. దేవతలు ప్రత్యక్షముగా స్వీకరింతురు గాక.
   
2.    దేవతలారా! విచ్చేయండి. ఇచట పాలు, నేయి పారుచున్నవి. స్తుతులు గానము చేయబడుచున్నవి. ఈ యజమానికి పశుసమృద్ది, ధన సమృద్ధి కలిగించండి.
   
3.    నేలమీద పారు నదులు, నిరంతరము ప్రవహించు జీవనదులు కలిసి ప్రవహించుచున్నవి. ఈ జలప్రవాహములు మాకు గోవులను, హిరణ్యములను కలిగించును గాక.
   
వ్యాఖ్య:- సంపదలు జలము, జలప్రవాహముల వలననే కలుగుచున్నవి.
   
4.    ప్రవాహములందు క్షీరము, ఘ్రుతము ప్రవహించును గాక. అవి మాకు గోవులను, హిరణ్యములను కలిగించును గాక.
   
                                               ఐదవ సూక్తము - 16
   
వినియోగము:-
   
    శత్రువునకు మరణము కలుగుటకు అభిమంత్రితమైన సీసపు పొడి కలిపిన అన్నమును తినిపించవలెను.     ఆభరణములను తాకవలెను. విరిగిన - విరిచిన కాదు - వెదురు కర్రతో కొట్టవలెను.
   
1.    భక్షించుటయే స్వభావముగ ఆగల రాక్షసపిశాచాదులు మనుష్యులను చంపుటకు అమావాస్య నాటి రాత్రి తిరుగుచుందురు. కావున రాక్షసులను వధించు తురీయ అగ్ని మాకు అభయము ఇచ్చును గాక. రాక్షస పిశాచాదులను వధించును గాక.
   
వ్యాఖ్య -    "అమా సహ వసతః అస్యాం తిథౌ సూర్య చంద్రమసౌ ఇతి అమావాస్య" - సూర్య చంద్రులు ఒకే రాశి యందు ఉండు రాత్రి అమావాస్య అగును. అమావాస్య మాసాంతపు తిథి. వెన్నెల ఏ మాత్రము ఉండనట్టి రాత్రి.
   
2.    సీసము నాకు సంబంధించినది అనుచున్నాడు వరుణుడు. అగ్ని సీసమును కాపాడుచున్నాడు. ఇంద్రుడు సీసమును నాకు ప్రసాదించినాడు. సాధకులారా! సీసము రాక్షస సంహారమగు చున్నది.
   
3.    ఈ సీసము రాక్షస పిశాచాదుల కదలికను నిర్భంధించును. అడ్డుకొనుటయే కాదు వారిని తొలగించును. కావున ఈ సీసముతో పిశాచాదుల వలన కలుగు బాధలను తొలగించుచున్నాను.
   
4.    నీవు మా గోవులను హింసించుట, మా అశ్వములను హింసించుట, మా ప్రజను హింసించుట వలన మాకు శత్రువవు అయినావు. అట్టి నిన్ను మా సంతానమునకు హింసించ కుండుటకు సీసముతో కొట్టుచున్నాము.
   
                                         నాలుగవ అనువాకము.
                                            మొదటి సూక్తము - 17

   
వినియోగము:-
   
    కత్తి మున్నగు వానితో తెగి రక్త స్రావము జరుగుచున్నపుడు - స్త్రీకి రజస్సు అధికముగ స్రవించునపుడు.
   
    5గణుపుల కర్రను రక్తస్రావము జరుగుచోట అభిమంత్రించవలెను. దారిదుమ్ము, తడి ఇసుక చల్లవలెను.     ఎండిన బురద కట్టవలెను.
   
1.    స్త్రీ యొక్క రక్తస్థానము నుండి వ్యాధి కారణముగ రక్తము నిరంతరము స్రవించుచున్నది. మేము చేసిన చికిత్స వలన ఆ వ్యాధి యొక్క బీజము నష్టపడును గాక. సోదరులు లేని యువతి తండ్రి ఇంటనే ఉన్నట్లు రక్తము తన స్థానమున నిలుచును గాక.
   
వ్యాఖ్య:-    తోబుట్టువులగు అన్నదమ్ములు లేని ఆడపిల్లలు పుట్టింటనే ఉండి పుత్రవతులై పితరులకు పిండ ప్రదానము చేయుదురని యాస్కుని నిరుక్తము. అతడు "దాక్షిణాజీ" అన్నాడు. దక్షిణ దేశపు స్త్రీ అని అర్ధము. ఇది ఇల్లరికము. నేడు సోదరులు లేని ఆడ వారికి పిత్రుపిండ ప్రదాన అర్హత లేకున్నది.
   
2.    దేహపు దిగువ భాగపు ధమనులారా! రక్తస్రావము కట్టించండి. పై భాగపు ధమనులారా! రక్తస్రావము కట్టించండి. చిన్న ధమనులు, పెద్ద ధమనులు సహితము రక్తస్రావము అరికట్టును గాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.