Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

     అగ్నిలో పడిన ఆహుతి చక్కగా ఆదిత్యుని చేరుచున్నది. ఆదిత్య్హుని నుండి వర్షము కలుగుచున్నది.   
   
6.    జలము దేహమున ప్రవేశించినందుననే నేను చూడగలుగు చున్నాను. వినగలుగుచున్నాను. ఉచ్చరించిన శబ్దము నన్ను చేరుచున్నది. వాణియు నా దగ్గరకు వచ్చుచున్నది. నేను అమృతము సేవించినట్లగు చున్నాను. హిరణ్య వర్ణ జలమా! నిన్ను సేవించి సంతృప్తుడను అయినాను.
   
వ్యాఖ్య-    సద్యోబలకరం త్రీణి వారి, వారిచరః, పయః - వెంటనే బలము నిచ్చునవి మూడు నీరు, చేప, పాలు అన్నాడు.
   
    ఎండకు డస్సిన వానికి, పని వలన అలసిపోయిన వానికి చల్లని నీరు అమృతమగును. అతని ప్రాణములు తిరిగి వచ్చును. మరల చూడగలుగును. విన గలుగును. 'అమృతము సేవించినట్లున్నది' అనుకొనును.
   
                                          నాలుగవ సూక్తము - 14
   
వినియోగము :-

   
    గోవులకు పుష్టి కోరువాడు అప్పుడే ఈనిన ఆవు యొక్క జున్ను పాలలో 'శ్లేష్మమిశ్రితం కృత్వా" సంపాతన,         అభిమంత్రణలు చేసి త్రాగవలెను. ఈ సూక్తముచే గోవును అభిమంత్రించవలెను. జలపూర్ణ పాత్రను             అభిమంత్రించి గోశాల మధ్యన ఉంచవలెను. కుడిచేతితో పిడకను తీసికొని ఎడమ చేతితో సగము పిడకను         గోశాలలో వేయవలెను. ఒకే రూపపు దూడ గల ఆవు పాలతో అన్నము వండి దానిలో గగ్గులు లవణములు        కలిపి అగ్నియందు పూడ్చవలెను. అన్నము బాగున్నచో నాల్గవనాడు తినవలెను. బాగులేకున్న             వదలివేసినను ఫలితము దక్కును.
   
1.    గోవులారా! మీకు సుఖకరమగు కొట్టమును సంపన్నము చేయుచున్నాము. మేత మున్నగు వానిచే సంపంనము చేయుచున్నాము. సమృద్దిచే సంపన్నము చేయుచున్నాము. మిమ్ము పుత్ర పౌత్రులచే సంపన్నము చేయుచున్నాము.
   
2.    గోవులారా! ఆర్యమ మిమ్ము సృష్టించును గాక. పూష, బృహస్పతి, ధనంజయ ఇంద్రుడు మీకు సుఖములు కలిగించును గాక. మీ వద్దనున్న ఘ్రుతాది సంపదలతో మమ్ము పరిపుష్టులను చేయండి.
   
3.    గోవులారా! ఈ గోష్ఠమున మీరు పుత్రపౌత్రులతో వర్ధిల్లండి. చోర, వ్యాఘ్రాది భయ రహితులు కండి. చిరకాలము జీవించుచు, 'రోగ రహితులై' పేడ సహితముగ మధుర క్షీర యుక్తలై పుష్టి కలిగి వర్ధిల్లండి.
   
4.    గోవులారా! మా గోష్ఠమునకే రండి. ఇచటనే ఈగల వలె అసంఖ్యాకములై  వర్ధిల్లండి. ఈ గోష్ఠముననే బిడ్డలు, బిడ్డల బిడ్డలచే వర్ధిల్లండి. మీకు మా యందు ప్రీతి కలుగును గాక. మమ్ము విడువకుందురు గాక.
   
5.    గోవులారా! గోష్ఠములు మీకు శుభప్రధములు అగును గాక. 'శరిశాకముల' వలె వర్ధిల్లుదురు గాక. ఇచటనే పుత్రపౌత్రులతో వర్ధిల్లండి. మేము మీకు సుఖములు కలిగించుచున్నాము.
   
    (ఈగలు, శరిశాకములు క్షణములలో వేలు వేలుగా పెరుగునవి. అట్లే గోవృద్ది కలుగవలెనని.)
   
6.    గోవులారా! నేను మీ పాలకుడను. నన్ను మీ వాడు అనుకొనండి. మేత మున్నగు ధనసమృద్ది కలిగి అసంఖ్యాకములై మాతో పాటు చిరకాలము జీవించండి.
   
                                              ఐదవ సూక్తము - 15
   
వినియోగము :-

   
    వాణిజ్య లాభామునకు విక్రయించు వస్తువును దుకాణమునకు చేర్చునపుడు 'వణిక్ కర్మ' చేయవలెను         అదెట్లనగా :-
    ఈ సూక్తముచే వజ్రము, వస్త్రము, పూగీఫలము, అశ్వము, గజము, రత్నము మున్నగు వాణిలో         ఏదో ఒక దానిని సంపాతన, అభిమంత్రణములు చేసి అందుకొనవలెను. వాణిజ్యము చేయదలచిన వాడు ఈ     సూక్తముచే ఇంద్రయజనము లేక ఉపస్థానము చేయవలెను.
   
      2) క్రవ్యాచ్చమన కర్మమున ఆరవ ఋక్కుచే పూర్ణాహుతి చేయవలెను.
   
1.    నేను వర్తకుడను. ఇంద్రుడు పరమైశ్వర్య వాణిజ్య కర్త. నేను అట్టి ఇంద్రుని ప్రార్దించుచున్నాను. ఇంద్రుడు ఇచటికి విచ్చేయును గాక. వాణిజ్య విఘాత శత్రువులను, మార్గనిరోధకులను హతమార్చుచు విచ్చేయును గాక. "ఈశానో ధనదా అస్తు మహ్యమ్" ఈశానుడగు ఇంద్రుడు మాకు ధనదాత అగును గాక.
   
2.    వ్యాపారము చేయుటకు ద్యావాప్రుథ్వులందు దివ్యములగు అనేక మార్గములున్నవి. ఆ మార్గములందు క్షీర ఘ్రుతములు లభించును గాక. క్రయ విక్రయములందు లాభము ఆర్జించి మేము ఇండ్లకు చేరుదుము గాక. ఆ మార్గములు అట్లు చేయించును గాక.
   
    ("దేవయానా అంతరా ద్యావాపృథివీ" అనునవి వాయు యానములు కావచ్చును.)
   
3.    అగ్నిదేవా! నాకు ధనము, బలము కలిగించుమని నీకు ఆజ్యాహుతులు అర్పించుచున్నాను. నేను ధనవంతుడనగు వరకు నిన్ను స్తుతించుచుందును హోమించుచుందును. ఘ్రుతాహుతులు ఇచ్చుచుందును.
   
4.    అగ్నీ! దారి నడిచి చాల దూరము వచ్చినాము. అందువలన కలిగిన వ్రతలోపములను మన్నించుము. మేము దూర దేశమునకు వచ్చినాము. అందువలన కలుగు బాధలు భరించు శక్తి ప్రసాదించుము.
   
    వ్యాపారము నందు తీసికొని పోవు సరకు, దానిని లాభ సహితముగా విక్రయించుటలను రెండును మాకు సుఖప్రధములు అగును గాక. ఇతరులు ఇచ్చిన సరకునకు వెల చెల్లించుటయు నాకు సుఖప్రదము అగును గాక.
   
    ఇంద్రాగ్నులారా! మీరు ఏకమనస్కులై మా హవిస్సులు స్వీకరించండి. మేము చేసిన అమ్మకము, అందువలన కలిగిన లాభము సుఖప్రదము అగును గాక.
   
5.    అగ్నీ! లాభామునకు ఆటంకము కలిగించు దేవతలున్నారు. వారికి మా ఆహుతులు అందించి, తృప్తులను చేసి త్రిప్పి పంపండి.
   
    దేవతలారా! నేను ధనము పెట్టి ధనము కోరుచున్నాను. నేను చేయు వ్యాపారము వలన లాభము కొద్దిగా కాదు. మరింత వచ్చును గాక.
   
6.    ధనము పెట్టి ధనము కోరు నేను ఏ ధనముతో వ్యాపారము చేయుచున్నానో దానియందు ప్రజాపతి, సవిత, సోముడు, అగ్ని నాకు శ్రద్ద కలిగింతురు గాక.
   
7.    హోత, వైశ్వానర అగ్నీ! నీకు నమస్కరించుచున్నాము. నిన్ను స్తుతించుచున్నాము. నిన్ను సేవించి నీ శరణు కోరిన మేము సమృద్ది గలవారలము. అన్నవంతులము, బలవంతులము అగుదుము గాక.
   
                                            నాలుగవ అనువాకము
                                         మొదటి సూక్తము - 16

   
వినియోగము :-

   
      1) బుద్ది వర్దనము కొరకు నిద్ర లేచిన తరువాత ఈ సూక్తము చదివి, ముఖము తుడుచుకొని చేతులు             కడుగుకొనునది.
   
      2) వర్చస్సు కోరు బ్రాహ్మణుడు పెరుగు, తేనెను సంపాతన అభిమంత్రణలు చేసి తినవలెను. క్షత్రియునకు         పెరుగు, తేనె కలిపిన అన్నము తినిపించునది. వైశ్యాదులకు అన్నము మాత్రము తినిపించునది.             'స్నాతక్' సింహ, శార్దూలాది ఏడింటిలో ఒకదాని నాభిలోమములను లక్క, బంగారపు మణిలో పెట్టి ఈ         సూక్తముచే సంపాతన, అభిమంత్రణలు లక్క, బంగారపు మణిలో పెట్టి ఈ సూక్తముచే సంపాతన,   అభిమంత్రణలు చేసి కట్టవలెను.
   
    క్షత్రియాదుల 'స్నాతకాది సప్తమర్మాణి" ఛేదించి స్థాలీపాకమున వేసి ఈ సూక్తముచే సంపాతన             అభిమంత్రణము చేసి తినవలెను. సంపాతిత, అభిమంత్రిత జలమున మునుగునది.
   
1.    ప్రాతః అగ్నిని, ప్రాతః ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. ప్రాతః మిత్రావరుణలను, ప్రాతః అశ్వినులను ఆహ్వానించుచున్నాను. ప్రాతః భాగుని పూషను, బ్రహ్మణస్పతిని, ప్రాతః సోముని, రుద్రుని ఆహ్వానించుచున్నాము.
   
2.    భగదేవత "ప్రాతర్జితః" ఉదయమును గెలిచినవాడు. అదితి పుత్రుడు. అందరిని భరించువాడు. అట్టి భగుని ఆహ్వానించుచున్నారు. రాజులు సహితము భగుని అర్చించుచున్నారు. అట్టి వానిని మేము ఆహ్వానించుచున్నాము.
   
3.    భగ దేవత సర్వ జగముల జ్ఞాత. సత్య ధన ప్రదాత. అతడు మా స్తుతులను స్వీకరించును గాక. అతడు మాకు గోసమృద్ది, అశ్వసమృద్ది కలిగించును గాక. మాకు పుత్ర, పౌత్ర, భ్రుత్యాదులను సమకూర్చును గాక.
   
4.    ఈ కర్మానుష్టామున మేము సౌభాగ్యవంతులము అగుదుము గాక. ఉదయ, మధ్యాహ్న సాయంకాలములందు మేము సౌభాగ్యవంతులము అగుదుము గాక. మఘవా! సూర్యుడు మున్నగు దేవతలు మా విషయమున మంచి మనసు గలవారలు అగుదురు గాక.
   
5.    భగదేవతయే సంపన్నుడు అగును గాక. అతని వలన మేము సంపన్నులము అగుదుము గాక. భగా! నీవు సంపన్నుడవు కదా! నిన్ను ఎల్లరు ఆహ్వానింతురు. నీవు మా కార్యక్రములందు ముందు ఉందువు గాక.
   
6.    రౌతు ఎక్కిన అశ్వము పయనించుటకు సన్నద్దమైనట్లు మాకు సంపదల నిచ్చు భగదేవతను మా యజ్ఞమునకు తెచ్చుటకు ఉషోదేవి సన్నద్దమగును గాక. అశ్వములు రథమును వలె మా వద్దకు తెచ్చును గాక.
   
7.    ఉషోదేవత అనేక గుర్రములు, ఆవులు పుత్రాదులతో కూడి మాకు శుభములు కలిగించుచు మా ఇంట ఉదయించును గాక. ఉషో దేవతలారా! మీరు జలము నిచ్చువారు. సకల గుణసంపన్నలు. మీరు మాకు నిత్యము శుభములు కలిగింతురు గాక.
   
                                              రెండవ సూక్తము - 17
   
వినియోగము :-

   
      1) వ్యవసాయమందు పొలమునకు చేరి నాగలికి కాడిని కట్టవలెను. ఈ సూక్తముచే వలపలి ఎద్దును కట్టి         దున్నుచు ఈ సూక్తము పూర్తి అయినంత కర్త అరక నడుపువానికి అప్పగించవలెను. మూడు చాళ్ళు పూర్తి         అయినంత అగ్నిని స్థాపించి దీనిచే ఇంద్రునకు పురోడాశము, అశ్వినులకు స్థాలీపాకము సమర్పించి పూజించి         అంతిమ రేఖలోనికి సంపాతములు తేవలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.