Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    పంపర పనస:

 

    `మా తండ్రిగారు మహా విద్వాంసులు. వక్త. మనిషిని వశపరచుకునే వాక్కు ఉంది. కొందరు వారివద్ద వశీకరణ మంత్రం ఏదో ఉన్నది అనేవారు. కాని అది అంత వాస్తవం అనిపించదు. కొద్దిరోజుల్లోనే వారు ఖమ్మంలో ప్రఖ్యాతులు అయినారు. వారిపేరు వేంకటాచార్యులు అని ఎవరికీ తెలియదు. "గూడూరు అయ్యవారు" అంటే అందరికీ తెలుస్తుంది.

 

    మా నాయనమ్మ బుచ్చమ్మగారు పెద్దముత్తైదువు. గూడూరు అయ్యవారి తల్లి. అందువలన ఆమెను తరచు పేరంటానికి పిలుస్తుండేవారు. ఒకసారి ఆకారం నరసింహం ఇంటికి వాయనానికి పిలిచారు. మనిషి వచ్చాడు. వెంట పెట్టుకుపోయాడు. వెంట నేనూ వెళ్లాను. నరసింహంగారి భార్య నాయనమ్మకు బొట్టు పెట్టింది. కాళ్ళకు పసుపు రాసింది. ఒక పెద్ద గంపనిండా పంపర పనస కాయలు తెచ్చారు. ఆ బుట్టను ఇద్దరు చెరొకవైపు లాంఛనంగా పట్టుకున్నారు.    

 

    ఆమె "ఇచ్చుకుంటి వాయనం" అన్నది.

 

    నాయనమ్మ "పుచ్చుకుంటి వాయనం" అన్నది.

 

    అలా ఇద్దరూ మూడుసార్లు అన్నారు. తంతు ముగిసింది. పళ్ళగంప నెత్తిన పెట్టుకొని మనిషి సాగాడు. మేము అతనిని అనుసరించాం.

 

    పంపర పనస నిమ్మజాతి పండు. చిన్న గుమ్మడికాయంత ఉంటుంది. పొట్టు చాల మందం. తొనలు నారింజవలెనే ఉంటాయి. కాని ఎర్రగా పెద్దగా ఉంటాయి.  పంపర పనస పసిడి రంగులో అందంగా ఉంటుంది.

 

    పంపర పనస గోడ అల్మారీలో వరుసగా అమర్చారు. అవి పసిడి బంతుల్లా - కాదు, అంతకంటే అందంగా - అన్ని ఒక చోట చూసినపుడు నేను మురిసిపోయేవాణ్ణి. అవి తిరుగుతుంటే బాధ కలిగేది. కాని తుదకు అల్మారీ ఖాళీ కానే అయింది.

 

    పంపర పనస ఇప్పుడు కనిపించడం లేదు. ఈ అర్ధశాతాబ్ధంలోనే కొన్ని ఫలజాతులు మాయం అయినాయి.

 

    వడ్లపూడి నారింజపండ్లు ఎంతో అందంగా రుచిగా ఆరోగ్యంగా ఉండేవి. నాగపురపు సంత్రాలవలె గుల్లగా ఉండేవి. కాణీకి ఒకటి సమృద్ధిగా వచ్చేవి. వడ్లపూడిలో నారింజతోటలు కొట్టివేశారట. పసుపు పండిస్తున్నారట!

 

    "నారింజ" అనే మాట లేకుండా పోయింది. అలాగే గజ నిమ్మకాయ - తునికి పండ్లు మచ్చుకు కనిపించకుండా మాయం అయినాయి!

 

    సృష్టిలో ఇలాంటివి ఎన్ని పోయినాయో - ఎన్ని వచ్చినాయో!

 

                                            అయిదు

 

    తెలంగీ - బేఢంగీ:

 

    నిజాం రాజ్యంలో మహబూబ్ అలీఖాను వరకు ఫారసీ రాజకీయ భాషగా ఉండేది. అరవ నిజాం ఉర్దూను రాజకీయ భాష చేశాడు.

 

    మొగలులు ఏర్పరచిన భారతీయ భాష ఉర్దూ. మొగల్ సైన్యంలో అనేక ప్రాంతాలవారు ఉండేవారు. వారికి సంధాన భాషగా ఏర్పడిందే ఉర్దూ భాష. "ఉర్దూ"కు అర్థం "సైన్యం."

 

    ఉర్దూ సైన్యంకోసం ఏర్పడిన భాష. అయినా దాని సౌలభ్యంతో అది ప్రజల భాష అయింది. ఉర్దూ సుమారు ఉత్తర భారతంలో మాట్లాడే భాష. కొంత ఫారసీ కలిసి ఉంటుంది. ఉర్దూకు లిపి లేదు. ఫారసీ లిపిని స్వీకరించారు. అది ఎడమ నుండి కుడికి సాగుతుంది.

 

    లోకంలో లిపిలేని భాషలే చాల ఉన్నాయి. ఎంతో సంస్కారం గల భాషకు గాని లిపి ఉండదు. సంస్కృతానికి లిపి దేవనాగరి. ఉత్తర భారత భాషలకు, మరాఠీకి లిపులు లేవు. ఆ భాషలన్నింటికి దేవనాగరియే లిపి.

 

    అత్యంత నాగరకం అనుకుంటున్న యూరోపు భాషలకు రోమను లిపియే!

 

    ఫారసీ లిపితో భారత భాషల్లో ఉర్దూ చాల సుందరమయిన భాష. ఉర్దూలో ఎంతో ఉత్తమ సాహిత్యం వచ్చింది. ఉర్దూ కవిత పసిపాప చిరునవ్వులా ఆహ్లాదంగా ఉంటుంది. ఉర్దూ కవితకు సంప్రదాయాలు ఫారసీవి. షమాపర్వానాగుల్ గులిస్తాఁ - మహబూబ్ - మహబూబా - మై, మైఖానా - సాఖీ - హరాబ్ - ఇవన్నీ ఫారసీ సంప్రదాయాలు. వారి వలపు ఫలించదు.

 

    ఫారసీక దేశం అంటే ఇరాన్ లో, ఒకరకం గులాబీ ఉంటుంది. దానికి మధ్యన నిటారుగా ఒక ముల్లు ఉంటుందట. ఒక ప్రత్యేకమయిన పక్షి ఆ గులాబీని ప్రేమిస్తుందట. ఆ పక్షులు ఆ గులాబీ తోటను విడవవు. వాటిమీదనే తిరుగుతుంటాయట. సాయంకాలం అవుతుంటే ఇహ విరహం భరించలేవట. వేగంగా వచ్చి గులాబిముల్లుమీద పడ్తాయట. గులాబీ ముల్లు పక్షి గుండెలో గుచ్చుకుంటుంది.

 

    విలవిల తన్నుకొని ప్రాణం వదులుతుంది.
    కాని గులాబీని ప్రేమించడం మానదు!

 

    ఉర్దూ కవితలో లతాంగి వర్ణన మెడ దిగదు.

 

    వక్షోజాల వర్ణన నిషిద్ధం.

 

    గాలిబ్ - మీర్ - జఫర్ - జవుఖ్ వంటి ఎందరో కవులు ఉర్దూ కవితను అమృతమయం చేశారు.

 

    మా అన్నయ్య, కీర్తిశేషులు డాక్టర్ దాశరథి (కృష్ణమాచార్య) గాలిబ్ గీతాలపేర గాలిబ్ ను తెనిగించారు. వాటికి బాపుగారు కూర్చిన చిత్రాలు సువర్ణానికి సుగంధం కలిగించాయి.

 

    నేను జవుఖ్ - జాఫర్ - ఇక్బాల్ కవితలు తెలిగించాను. తెలుగు కథలను "తెలుగుకే అఫ్సానే" అని ఉర్దూలోనికి అనువందించాను. "జిలానీ బానూ" ఉర్దూ కథలను, తెలిగించాను. "ఉమ్రావ్ ఖాన్ అదా" అనే కవితామయం అయిన ఉర్దూ నవలను తెనిగించాను.

 

    ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, భాషగా ఉర్దూమీద మాకు ఆదరం - అభిమానం, వలపు ఉన్నాయి. కాని చివరి నిజాం మీర్ ఉస్మానలీఖాన్ ఉర్దూ భాషను మతానికి అంటకట్టి - ఆ మతపు ఆయుదంతో ఒక జాతి సంస్కృతిని సాంతం అవమానించడానికి, కాలరాయడానికి, సమాప్తం చేయడానికి ప్రయత్నించాడు. ఒక జాతి వేష భాషలను అణగదొక్కడానికి కంకణం కట్టుకున్న కర్కోటకుడు, చరిత్రలో ఉస్మాన్ తప్ప - మరొకడు కనిపించడు.

 

    ప్రజల ఉద్యమం నిజాం నవాబు నియంతృత్వానికి  - నిరంకుశత్వానికి - రాక్షసత్వానికి వ్యతిరేకంగానే కాని, ఏ మతానికి, ఏ భాషకు వ్యతిరేకంగా కాదు.

 

    మీర్ ఉస్మానలీఖాను 1911లో గద్దె ఎక్కాడు. అప్పటినుంచీ ఒక పథకం ప్రకారం తెలుగును తుడిచిపెట్టడానికి ఉర్దూ బావుటాను కరవాలంగా ఉపయోగించాడు. అంతకుముందు ఉండిన ప్రభుత్వాలు సైతం తెలుగును గుర్తించలేదు. ప్రోత్సహించలేదు. కాని ఒక పథకం ప్రకారం తుడిచిపెట్టడానికి ప్రయత్నించలేదు.

 

    ఉస్మాన్ రాజకీయ చతురుడు. అతడు తన భద్రత కోసం ఒక భాషనూ, ఒక మతాన్ని పోషించాడు. అతనికి ప్రజలతోను, ప్రజల భాషతోనూ, ప్రజాభిమతంతోనూ పని లేదు. తాను నిరంకుశంగా పాలించగలననీ - ప్రజా ఉద్యమాలను అణచి వేయగలననీ తన ప్రభువులయిన అంగ్రేజులకు తెలియపరచదలచాడు. అంగ్రేజు సర్కారు సైతం - తమ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా - భారత దేశపు నడి బొడ్డున - నిజాము వల్ల త్రాచును పాలు పోసి పెంచింది. నిజాం దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, మత ఛాందసాన్ని చూచి మందలించకపోగా మిన్నకున్నది.  

 

    ఉత్తరాన మహామ్మదలీ జిన్నాను - దక్షిణాన మీర్ ఉస్మాన్ను - తమ స్వప్రయోజనాల కోసం ఆంగ్లేయులు ప్రోత్సహించారు.

 

    1918లో ఉస్మాన్ - ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించాడు. ఉస్మానియాలో ఉర్దూ బోధనాభాషను చేశాడు. ఇది ఉర్దూ ఉద్ధరణ కోసంకాక తెలుగును, ఇతర దేశీయ భాషలను రూపుమాపటానికి పన్నిన కుట్ర.

 

    బ్రిటిషిండియాలో ప్రజల భాషను బోధనాభాషగా అంగీకరించడం జరిగింది. అంతేకాక తెలుగు సాహిత్య వికాసానికి చార్లెస్ ఫిలి బ్రౌను వంటి ఆంగ్లేయులు చేసిన కృషి చిరస్మరణీయం. తెలుగు సాహిత్యంలో ఆధునిక భావాల ప్రవేశానికి అంగ్రేజుల ప్రభావం ఉందనడంలో వివాదం లేదు.

 

    అలాంటి సమయంలో భారతదేశపు నడి బొడ్డున కేవలం ఉర్దూకు విశ్వవిద్యాలయం స్థాపించడంలోని కుయుక్తిని కప్పిపుచ్చుకొనదలచుకున్నాడు ఉస్మాన్. తాను దేశాభిమానిని అనీ భారతీయ భాష. ఉర్దూ అభివృద్ధికి యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాననీ జాతీయ నాయకులకు తెలియపరచాడు. అలా చేసి వారి మన్ననలు పొందాలని ప్రయత్నించాడు.

 

    ఈ కుట్రను బయలుపరచి, జాతీయోద్యమ నాయకులకు వాస్తవ విషయం తెలియపరచగల ప్రజా ఉద్యమం నిజాం రాజ్యంలో లేదు. అందువలన రవీంద్ర కవీంద్రుడు ఉస్మాన్ విశ్వవిద్యాలయ స్థాపనను ప్రశంసిస్తూ నిజాంకు లేఖ వ్రాశారు. మహాత్ముని వంటివారు ప్రశంసించకున్నా - స్వంత కారణాల వల్ల - నిరసించలేకపోయారు.

 

    నిజాం ఎన్నడూ ఉభయ మతాల తన ప్రజలను నమ్మలేదు. అన్ని విషయాలను ఉర్దూలోనికి అనువదించడానికి లక్నోనుంచి విద్వాంసులను - కవులను వందల కుటుంబాలను రప్పించాడు. హైదరాబాదులో లక్నో ముస్లిముల వీధులు వెలిశాయి. అతి కొద్ది కాలంలోనే మెడిసిన్, ఇంజనీరింగ్ సహితంగా సబ్జక్టులు అన్నీ ఉర్దూలో అనువాదం కావడం - పాఠ్యపుస్తకాలు సిద్ధం కావడం వల్ల - బోధన ప్రారంభం చేయగలిగారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.