Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

2.    అగ్ని స్వర్గమున మీ దేహమును రచించినపుడు ఇంధనమున పక్వమైన ఈ ఒదనము వలన ఇటువంటి రూపములచే ఏర్పరచుచున్నాడు. ఇప్పటివంటి దృష్టి, తేజస్సు, బలము, యజ్ఞ యాగాదులు కలుగుచున్నవి.
   
3.    దంపతులారా! ఈ ఓదన ప్రభావమున ఈ లోకమున కలసి ఉండండి. దేవయానమున కలసి ఉండండి. యమరాజ్యమున కలసి ఉండండి.
   
    మీరు ఈ యజ్ఞముల వలన పవిత్రులైనారు. మీరు చేసిన పుణ్యముల ఫలితములను ఆహ్వానించండి.
   
4.    మీరు జలములకు పుత్రులగుచున్నారు. ధన్యులై ఈ జీవలోకమున ప్రవేశించండి. మిమ్ము పుట్టించిన ఒదనము ఉడుకుటకు కారణమగు జలమునందలి అమృత భాగమును సేవించండి.
   
5.    పాపము నుండియు, వాక్పాపము నుండియు ముక్తి కొరకు తల్లి లేక తండ్రి ఓ దనమును వండిన చో అది స్వర్గమందును, ద్యావాపృథ్వులందును నూరింతలై వారికి లభించుచున్నది.
   
6.    యజ్ఞము చేసినవాడు ద్యావాపృథ్వులు, స్వర్గమును సాధించుచున్నాడు, ఆ లోకములు జ్యోతిష్మంతములు, మధుమంతములు వానియందు మీరు పుత్రసహితులై వార్ధక్యము వరకు వర్ధిల్లండి.
   
7.    దంపతులారా! మీరు తూర్పునకు అడుగు వేయండి. అది స్వర్గము. దానియందు శ్రద్దాళువులే ప్రవేశించుచున్నారు. మీరు ఓదనమును అగ్నికి సమర్పించినారు. రక్షించుటకు అగ్నిని సేవించండి.
   
8.    మీరు దక్షిణమునకు సాగండి, ఈ పాత్రకు ప్రదక్షిణ చేసి మరలండి. అపుడు యముడు పితరులతో ఏక మనస్కుడై ఈ పాత్రయందలి ఓదనమున మీ కొరకు బహుశుభములను కలిగించునుగాక.
   
9.    పశ్చిమ దిశ శ్రేష్ఠమగుచున్నది. దానికి రక్షకుడగు సోమము అధిపతియై ఉన్నాడు. ఆ దిశన వండిన అన్నమును పెట్టండి. పుణ్య ఫలమును అనుభవించండి. అందువలన మీకు భూలోక, స్వర్గలోకములు లభించునుగాక.
   
10.    ఉత్తర దిశయందలి రాజ్యము ప్రజా సంపన్నమై ఉన్నది. అది మమ్ము వరిష్టులను చేయునుగాక. పాంక్త ఛందము ఓదన రూపమున వ్యక్తమైనది. మేము సర్వాంగ సమృద్దులమై లోకములందు వసింతుముగాక.
   
11.    స్థిరము విస్తారమగు భూమికి నమః ఆమె నాకు, నా సంతానమునకు శుభంకరి అగునుగాక. అఖండనీయ, విశ్వవరి యగు భూదేవి - వండిన ఈ అన్నమును - రక్షించునుగాక.
   
12.    భూమాతా! తండ్రి కొడుకును వలె ఈ ఓదనమును ఆలింగనము చేసికొనుము. మేము వండుచున్నఅన్నమును ఉడికించుము. మా సత్సంకల్పములను గుర్తింపుము.
   
13.    కాకి పొరపాటున దూరి గూడు కట్టినను, పనికత్తె తడిచేత రోలును, రోకలిని తాకినను అవి శుభప్రదములు అగునుగాక.
   
14.    ఇది కదలనట్టి గట్టి శిల. ఇది పవిత్రములచే పావనమైనది. హవిని ధరించినది. ఇది రాక్షసులను హతమార్చునుగాక.
   
    ఓదనమా! రమ్ము ఈ చర్మము మీద నిలువుము. ఈ దంపతులను, వారి పౌత్రులను పాపము అంటకుండునుగాక.
   
15.    వనస్పతులు దేవతల సహితులై విచ్చేసినారు. వారు రాక్షస, పిశాచాదులను తరిమినారు. వారు చేయు గొప్ప ధ్వని వలన మేము లోకములను జయింతుము గాక.
   
16.    జ్యోతిష్మంతములు, కృశములగు ఏడు విధముల ధాన్యములను పశువులు తినుచున్నవి. ముప్పది ముగ్గురు దేవతలు వానినే సేవించుచున్నారు. అట్టి ఒదనము మమ్ము స్వర్గలోకమునకు చేర్చును గాక.
   
17.    ఓదనమా! నీవు మమ్ము స్వర్గమునకు తోడ్కొని పోవుచున్నావు. అచట మేము భార్యా పుత్రుల సహితముగ ఆవిర్భవింతుము గాక. నేను నీ చేతిని పట్టుకున్నాను. నీ వెంట నడిపించుము. నిర్రుతి, శత్రువులు మమ్ము జయించాకుందురు గాక.
   
18.    మమ్ము పట్టి పీడించు పాపములను దాటుదుము గాక. వానస్పత్యమా! నీవు పాపము వలన కలుగు శోకమును, అంధకారమును తొలగించుచున్నావు. తీయని మాటలు పలుకుచున్నావు. వానస్పత్యము ఉద్యమించి నన్ను, నన్ను దేవతలకు చేర్చు తండులములను బాధించ కుండును గాక.
   
19.    ఓదనమా! నీవు విశ్వవ్యచవు. ఘ్రుత పృష్ఠమవు. పరలోకమున మా సహితముగ ప్రాదుర్భవించుటకు గాను ఇప్పుడు ఈ లోకమున మా వద్దకు చేరుము. గింజలు చేటలో చేరి పొత్తును పోగొట్టు కొనును గాక.
   
20.    బ్రాహ్మణుని వలన ద్యావా పృథ్వ్యంతరిక్షములు లభించుచున్నవి. ధాన్యమును దంచండి. అది వర్ధిల్లును గాక. ధాన్యము చేటకు చేరును గాక.
   
21.    పశువులు బహురూపములవి అయినను ధాన్యమా! నీవు సమృద్దమగు ఏక రూపవు. రాతిచే నలిగిన దానవై నీపై పొట్టును విడువుము.
   
22.    రాతిరోకలీ! నీవు భూమి నుంచి వచ్చినందున భూమివే అగుచున్నావు. అట్లగుట నేను భూమితోనే భూమిని దంచుచున్నాను. నీవు భూమికి వికృతివి అగుచున్నావు.
   
    ఓదనమా! రోకలి దంపుడు వలన నీకు కలిగిన బాధను మంత్రముచే నివారించుచున్నాను.
   
23.    తల్లి బిడ్డ వద్దకు వెళ్ళినట్లు రాతిరోటిని భూమికి చేర్చుచున్నాను. వేదిమీద రోలే కుంభియగుచున్నది. ఘ్రుత పూత యగును గావున రోలు రోకటి బాధపడకుండును గాక.
   
24.    అగ్ని పచనము చేయుచు నిన్ను రక్షించును గాక. ఇంద్రుడు తూర్పున మరుత్తులు దక్షిణమున - వరుణుడు పశ్చిమమున రక్షింతురు గాక. ఉత్తరమున సోముడు అన్నము ప్రసాదించును గాక.
   
25.    పావన జలములు పవిత్రము చేయుచున్నవి. జలములు మేఘములై స్వర్గమునకు చేరి, వర్షము నేలకు దిగి మానవులకు అందుచున్నది. అవి జీవము నిచ్చు జలములు పాత్రయందు చేరినవి. అగ్ని వానిని దీప్తము చేయును గాక.
   
26.    దివి నుండి వచ్చి భూమిని సేవించుచున్నవి. భూమి నుంచి అంతరిక్షమును ఆశ్రయించుచున్నవి. ఈ జలము పవిత్రము. పావనము చేయునది. అది మమ్ము స్వర్గమునకు చేర్చును గాక.
   
27.    జలము ప్రభువు. సమ్మిత. శుక్రము. శుచిది. అమృతము.
    జలమా! దంపతులు వండుచున్న ఓదనమును చక్కగా ఉడికించుము.
   
28.    జలము ప్రాణాపాన సమము. అది ఓషధులతో కలసి భూమిని సేవించుచున్నది. అసంఖ్యాక జలము అందమగు ప్రాణులందు చేరి, వారికి శుచిత్వము ప్రసాదించి, సమస్తమందు వ్యాపించుచున్నది.
   
29.    నీరు కాగినంత యుద్దము వంటిది చేయును. ధ్వని చేయును. పొంగును. చుక్కలను ఎగురును.
    జలమా! ఋతుయజ్ఞమున భర్తను చూచిన భార్య వలె బియ్యముతో కలసి పొమ్ము.
   
30.    ఓదనమా! రోకలి చుట్టున దుఃఖించి బియ్యమును ఎత్తుము. జలమున చేర్చుము.
    యజమానీ! నీటిని, బియ్యమును కొలిచినావు. నీటిలో బియ్యము వేయుటకు ఆజ్ఞాపించుము.
   
31.    పరశును త్వరత్వరగ నడిపించండి. పక్వమైన వానిని గ్రహించండి. అవి పర్వమున హింసించకుండును గాక. ఓషధీ రూప ఫలములనిచ్చును గాక. ఇది సోమ రాజ్యము. లతలు క్రోధ రహితములగును గాక.
   
32.    కొత్త కుశలను ఓదనము కొరకు పరచండి. ఆ కుశాసనము హృదయమునకు, నేత్రములకు ఆహ్లాదకరమగును గాక. దాని మీద దేవతలు తమ దైవీశక్తి చేత ఆసీనులు అగుదురు గాక. వారు ఋతువుననుసరించి లభించు వానితో కూడ ఈ ఓదనము భక్షింతురు గాక.
   
33.    వనస్పతీ! కుశలు పరచబడినవి. కూర్చొనండి. దేవతలు మిమ్ము అగ్నిష్టోమ సమముగ పరిగణించినారు. త్వష్టవలె స్వధితి దీనిని చక్కగ చేసినాడు. అది పాత్ర యందు కనిపించుచున్నది.
   
34.    యజమాని ఈ నిధిని పాలించువాడు అగుచున్నాడు. అతడు ఓదనమును భుజించిన అరువది సంవత్సరముల పిదప స్వర్గఫలమును అభిలషించును గాక.
   
    అగ్నిదేవా! ఇతని జీవితము ముగిసినంత ఇతనిని స్వర్గమునకు పంపుము. అతని పితా, పుత్రాదులను సహితము ఇతని వెంట ఉంచండి.
   
35.    ఓదనమా! నీవు ధర్తవు. కావున పృథివి యొక్క ధారక స్థానమున స్థిరపడుము. నీవు అచ్యుతవు. దేవతలు నిన్ను చ్యవితను చేయుదురు గాక. నిన్ను జీవించు పుత్రులు గల జీవించు దంపతులు అగ్ని ధానమున నిలుపుదురు గాక.
   
36.    ఓదనమా! నీవు జగములను గెలువుము. సమస్త కోరికలను ఫలింప చేయుము. దంపతులు ఆయనమును, దర్విని త్రిప్పుదురు గాక. నీవు వానిలో ఒక దానిలో నిలువుము.
   
37.    ఓదనమును వడ్డించండి. పేర్చండి. ఘ్రుతముచే అభిఘారితము చేయండి. దేవతలారా! గోవు పాలిచ్చుటకు తన దూడను పిలిచినట్లు - మీరు ఈ ఓదనమును ఆశించండి.
   
38.    యజమానీ! నీవు ఒదనము అర్పించినావు. ఈ లోకమును సఫలము చేసికొన్నావు. స్వర్గమున ఇది ఇంతకు మించి లభించును గాక. దంపతులారా! చక్కని, మహిమాన్వితమగు ఓదనము మిమ్ము స్వర్గమున నిలుపును గాక. దేవతలు మిమ్ము దేవతలకు వప్పగింతురు గాక.
   
39.    ఓదనమును వండిన పత్నీ! నీవు గాని నీ భర్త గాని ముందు పోయినచో స్వర్గమున మీరిద్దరు కలిసి కొందురు గాక. ఈ ఓదనము మీ వెంట ఉండును గాక. మీ రిద్దరు ఒకే లోకమును సంపాదింతురు గాక.
   
40.    ఈ మహిళ యొక్క జీవించి ఉన్న పుత్రులందరు ఈ ఓదనము చుట్టు చేరుదురు గాక. తన తల్లిని గుర్తించు శిశువులందరు చేరుదురు గాక.
   
41.    ఓదనము మధుధారా యుక్తము, ఘ్రుతమి శ్రితము, అమృతమయము అగుచున్నది. స్వర్గము వానిని నిలిపి ఉంచుచున్నది. అరవై ఏళ్లవయసు తరువాత యజమాని దానిని ఆశించును గాక.
   
42.    యజమాని నిధిపతి అగును గాక. అన్యులునిధి లేని వారలు అగుదురు గాక. యజమాని ఇచ్చిన ఓదనము మూడు కాండములచే మూడు స్వర్గములను ఎక్కును గాక.
   
43.    అగ్నీ! రక్షింపుము. క్రవ్యాద, పిశాచాదులను మా దరికి చేరనీకుము. మమ్ము బాధించనీకుము. మేము వారిని రానీయకున్నాము. గెంటి వేయుచున్నాము.
   
    ఆదిత్యులు, ఆంగిరసులు ఈ ఓదనమును సేవింతురు గాక.
   
44.    ఘ్రుత, మధుమంత్ర ఓదనమును ఆదిత్యులకు, అంగిరసులకు సమర్పించుచున్నాను. బ్రాహ్మణుల పవిత్ర హస్తము దీనిని నివారించ కుండును గాక. ఇది స్వర్గమును చేరును గాక.
   
45.    దేని వలన పరమేష్టి లోకములను పొందినాడో అట్టి కాండము మాకు లభించినది. దానిని ఘ్రుత, మధు మంతము చేసి అంగిరసులకు అర్పించుచున్నాము.
   
46.    సత్యము తపము కొరకు ఓదన పాత్రను అలంకరించి దేవతలకు అర్పించుచున్నాము. ఇది మమ్ము జూదమందునను, సభలందునను విడువ కుండును గాక. అన్యులకు లభించకుండును గాక.
   
47.    నేనే వండుచున్నాను. నేనే దానము చేయుచున్నాను. ఈ పనిలో నా భార్య నాకు తోడు అగుచున్నది. మాకు కుమారావస్థ పుత్రులున్నారు. వారితో కలిసి దానాదులు ఆరంభించుచున్నాము.
   
48.    దీని యందు కిల్భిషము లేదు. ఆధారము లేదు. మిత్రులతో పోటీ పడుట లేదు. ఇది కొరత ఎరుగని పరిపూర్ణ పాత్ర. వండిన వానికి ఇట్లే మరల లభించుచున్నది.
   
49.    యజమానీ! నీకు ప్రియతమములందలి ప్రియతమములను కలిగించుచున్నాము. నీ శత్రువులు తమస్సున పడుదురు గాక. నీకు ధేనువులు, ఎద్దులు, వయస్సు, పురుషార్ధము కలుగును గాక. అపమృత్యువు కలుగ కుండును గాక.
   
50.    అనగ్నమున ఉన్న పశువుల చర్మము తొలుత మానవుల కుండెను. దంపతులు క్షాత్రమున తమను ఆచ్చాదించుకుని ఓదన ముఖమును వస్త్రముచే ఆచ్చాదింతురు గాక.
   
51.    ధనము కొరకు గాని, జూదమందు గాని, అసత్య మాడినచో నూలు బట్టలో కప్పి ఆ కశ్మలమును అందు కప్పి ఉంచుము.
   
52.    ఓదనమా! వరమును వరింపుము. దేవతలను చేరుము. నీ త్వచాధూమ గంధమును ఎగురుము. విశ్వ వ్యచవు, ఘ్రుత పృష్టవగుము. సృష్టికి మూలమగు లోకములకు చేరుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.