Home » vaddera chandidas » Anukshanikam 2



    "అసలేం అఘోరించాడు?" అన్నాడు శ్రీపతి.
    "మిసెప్రాప్రియేషన్. డబ్బు మింగి కూర్చున్నాడు కెమికల్స్ కొనుగోలులో. అది దొరికి, ఆ కంపెనీ జనరల్ మేనేజరు వీడికి వుద్వాసన చెప్పాడు. అతను నీకు తెలిసినతను. వీడికి వుద్యోగం ఇచ్చినతను. నిరంజనంగాడు గౌరీపతి గాడి కాళ్ళు_- సాక్షాత్తూ పట్టుకుని__"
    "కాళ్ళేగా?" అని నవ్వాడు శ్రీపతి.
    "అవసరం అయితే ఏదైనా పట్టుకుంటాడు యీ నక్కగాడు. ఆ కంపెనీకి కేంద్ర ప్రభుత్వంతో చాలా పనులున్నాయట. గౌరీపతిగాడు, వాడి బాబు ద్వారా జనసంఘ్ పలుకుబడితో వీణ్ని రక్షించాడు. ఈ నక్కగాణ్ని మింగనివ్వలేదని మీ మిత్రుడో, బంధువో ఆయన మీద అక్కసుని నీ మీదకి మళ్ళించాడు. ఈసారి కనిపిస్తే వాయించు" అన్నాడు రామ్మూర్తి.
    "ఆ మధ్య అతను కనిపించాడు గానీ వీడి సంగతి యిలా అని చెప్పలేదే!" అన్నాడు శ్రీపతి.
    "నీకు చెప్పడానికి మొహమాటపడి వుంటాడు" అన్నాడు రామ్మూర్తి.
    "అన్నట్లు నీ దగ్గిర "ఎక్లిప్స్ ఆఫ్ కమ్యూనిటీ" వుందా?" అని అడిగాడు శ్రీపతి.
    "ఆ పుస్తకం పేరే వినలేదోయ్" అన్నాడు రామ్మూర్తి.
    "సోషియాలజీ వాడివి. ఆ మాట అంటే యెలానోయ్! ఇటీవలి హ్యూమనిస్టిక్ సోషియాలజీ."
    "అదేమిటో నాకు తెలియనే తెలియదు. నా రిసెర్చి గుంటల్లో పడి కొట్టుకుంటూ వుండిపోయాను. అదవగానే అ సోషల్ వెల్ ఫేర్ పనిలో పడ్డాను. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరచి నలుదిక్కులా చూస్తున్నాను. అదేమిటో చెప్పు యింతకీ" అన్నాడు రామ్మూర్తి.
    "సైకాలజీలో బిహెవియరిజమూ ఫ్రాయిడియనిజమూ తరవాత వచ్చిన మాస్లో, రోజర్స్ లాంటి వాళ్ళు ఎగ్జిసెన్షి ఎలస్టిక్ పార్టిసిపేషనల్ ఫెనోమెనలిస్టిక్ దెరాప్టిక్ పెర్సనలిజమ్స్ ధోరణిలో మార్టిన్ స్టీయిన్ వంటివాళ్ళు డర్భీం, పార్సన్ వంటి వాళ్ళని దాటి నాన్_ప్రెస్క్రిప్టిన్, నాన్ డెటర్మినిస్టిక్, నాన్ __ అనార్కిక్ పార్టిసిపేషనల్ థెరాస్టిక్ ధోరణిని హ్యూమనిప్టిక్ సోషియాలజీ అనే పేరున పట్టుకొచ్చారు. అల్విన్ గోల్డ్ వర్ రాసిన "ది కమింగ్ క్రైసిస్ ఇన్ సోషియాలజీ"__చూడు" అని అటునుంచి వస్తున్న త్రిపురసుందరి వంక చూసి చిరునవ్వు నవ్వాడు శ్రీపతి, పలకరింపుగా.
    నాలుగు అడుగులు ఇటు వేసి, "నమస్కారమండీ. చాలా కాలానికి చూశాను మిమ్మల్ని లాలో చేరారటగా" అంది త్రిపురసుందరి.
    "మీ రిసెర్చి యెలా వుంది?" అన్నాడు శ్రీపతి.
    "చాలావరకు పూర్తైంది. ప్లెహనోవ్ కోప్ లాన్డ్ క్రోయెబర్ లను కలగలిపి చదివితే కొంత గందరగోళంగా అనిపిస్తోంది. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. మీకు వీలున్నప్పుడు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను" అంది.
    "మీ గైడ్ ని అడగకపోయారా?" అన్నాడు శ్రీపతి.
    "అన్నీ తెలిసి ఆ మాట అంటే యేం చెప్పేది! మా గైడూ మా డిపార్టుమెంటూ మీకు బాగా తెలుసుగా!" అంది.
    "అలాగే నే వివరించగలిగితే సంతోషం" అన్నాడు శ్రీపతి.
    వెళుతోంది, సూటిగా నిశ్శబ్దంగా__మెరుపుతీగకి నడవటం వచ్చినట్లుగా.
    బస్సులవైపు వెళుతోంది.
    అవతలి చెట్టు కింద నిలుచున్న నలుగురు__వొకతను, నిలువవే వాలుకనులదానా__అంటే; మరొకతను వయ్యారీ హంస నడకదానా నీ నడకలో హొయలున్నవె__అంటే; ఇంకొకతను, నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తు వుంటే నిలువదె నా మనసు__అని అన్నాడు.
    అందరూ కలిసి పిల్లీ నక్కా కుక్కా కోడీ కూతలు__
    "ఆ మొదటివి అతకలేదుగానీ ఆ చివరి కూతలు మాత్రం వాళ్ళకి సార్ధకంగా వున్నాయి" అన్నాడు శ్రీపతి.
    "యెవరు వాళ్ళు?"
    "అంకినీడులు!" అని చిన్నగా నవ్వాడు శ్రీపతి.
    "అంకినీడు మహాబుద్ధిమంతుడై పోయాడట. ఆ సినిమా ప్లాప్ తో సర్వరోగాలూ వదిలిపోయాయట. ఇప్పుడు అతని పరిథి; మామగారి వ్యాపారం పెళ్ళాం కరుణాదృక్కు__నూరు పైసలా సలక్షణమైన ఇంటల్లుడట__" అన్నాడు రామ్మూర్తి సిగరెట్ వెలిగిస్తూ.
    "యీ మిడిసిపాటు జంతువులూ కొన్నాళ్ళకి అంతకంటే మంచి ఇంటల్లుళ్ళవుతాయి__లేకీసూ జాకీసూ కాకపోతే!" అని నవ్వాడు శ్రీపతి.
    "మర్చిపోయాను అనటం_తార రైలు కిందపడి చచ్చిపోయిందట తెలుసా?" అన్నాడు రామ్మూర్తి.
    "తెలియదే__"
    "పేపర్లో కూడా వచ్చింది."
    "యెలా? దేనికి?"
    "తెలియదు సరిగా. జనం అనుకోవడం__తను చేరిన ఆ చోటు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న మహా సంస్థ అని__మరి తార ఏ గొడవల్లో చిక్కుకుని పోయిందో__ పాపం, చివరికి అట్లా తన జీవితాన్ని తనే సమాప్తం చేసుకుందనుకుంటాను."
    "అలాంటి ఇదైతే, హత్యా కావొచ్చుగా!" అన్నాడు శ్రీపతి.
    "అవును. నాకు ఆ ఆలోచనే రాలేదు. పోలీసులకి ఈ ఐడియా వస్తే__"
    "పోలీసులకి రాణి ఐడియా అంటూ వుండదు. బట్ దె కెనాట్. ఇన్ కేస్ దె కెన్, దె వాంట్!" అని చిన్నగా నవ్వాడు శ్రీపతి.
    "నీలా చదువు మొదలెట్టావా?" అన్నాడు రామ్మూర్తి.
    "అదేమిటోనోయ్ రామ్మూర్తీ! నేను యే సబ్జక్టులో చేరతానో ఆ సబ్జక్టు చదవ బుద్ధవదు, దాన్లో వున్నన్నాళ్ళూ. కానీ యీ లా చదవకుండా లాగించటానికి వీలయ్యేలా లేదు. చదివి పరీక్ష రాయటం అలవాటుప్పుడూ! పరీక్షలు ఐపోయాక చదవాలనిపిస్తుంది__"
    మధ్యలోనే అందుకుని, "ఐనా నీకెప్పుడూ ఫస్టు క్లాసులే వచ్చినాయ్ గా!" అన్నాడు రామ్మూర్తి.
    "సబ్జక్టు తెలియకపోబట్టి. తెలిస్తే ఫస్టు క్లాసు రాదు" అని నవ్వాడు శ్రీపతి.
    "మన రామానుజం ఢిల్లీలోసెంట్రల్ స్టాటిస్టిక్స్ బ్యూరోలోనో దేన్లోనో వున్నాడట. నిన్ను యెప్పుడూ తలుస్తుంటాడట" అన్నాడు రామ్మూర్తి.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.