Home » vaddera chandidas » Anukshanikam 2



    మూడురోజులనాడు బహిష్టు అయిన రోజున నళిని డాక్టరు దగ్గిరికి వెళ్ళి తను ప్రెగ్నెంటేమో టెస్ట్ చెయ్యమంది. లక్షణంగా అవుతూనే వున్నావుగా. అవకపోతే సరే ఇంజక్షనిస్తాగా అంటే__ "అట్లా కాదు డాక్టర్ ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా ఒకటి రెండు నెలలు అవుతూనే వుంటారుగా! నేను ప్రెగ్నెంట్ కాదని రూఢీగా తెలవాలి" అంది.
    "ఈ స్టేజీలో అంత రూఢీగా చెప్పాలంటే చాలా టెస్ట్ లు చెయ్యాలి. దేనికి నళినీ ఇట్లా అడుగుతున్నావు?" అంది డాక్టరు.
    "అది సీక్రెట్ ప్లజంట్ సీక్రెట్. తరవాత ఎనౌన్స్ చేస్తాను. టెస్టులు చెయ్యండి" అంది.
    టెస్టులన్నీ చేయించుకుని ప్రెగ్నెంట్ కాదని నిర్ధారణ ఐన మరుసటిరోజున అంకినీడుతో కలిసి కాశ్మీర్ కి బయల్దేరింది.
    మూడు నెలలు అనుక్షణం కలిసి గడపాలని నిర్ణయించుకుంది. ఏ జాగ్రత్తలూ తీసుకోదలచలేదు.
    అంకినీడుకి చాలా సంతోషంగా వుంది. తన ఆస్థి అంతా పోయినా ఆ బాధ మర్చిపోగలుగుతున్నాడు.
    "నళినీ నేనంటే నీకింత ఇదని తెలవదు సుమా ఇంతవరకు!" అన్నాడు ఒకరోజున.
    "బుద్ధి సరిగా వుంటే తెలిసేది. నిజానికి మరీ అంతిదేం లేదు. భార్యాభర్తలం. అంతకంటే ఏముంది!" అంది.
    కాశ్మీర్ వెళ్ళి నలభయ్ రోజులు గడిచాయి. నెల తప్పింది. మూడో నెల వరకూ అక్కడే అలా గడపాలని నిశ్చయించుకుంది నళిని, ఇంటినుంచి ఏప్రిల్ లో బయల్దేరినప్పుడే.

                              112

    ఈ మే నెల వెన్నెల రాత్రి. అనంత్ రెడ్డీ స్వప్నరాగలీనల తొలిరేయి.
    రాత్రి యెనిమిది. మేలురకం కోరారంగు నూరో నంబరు ధోవతి మీగడరంగు సిల్కు జుబ్బా__ అనంత్ రెడ్డి, హరనాధరెడ్డి కాటేజ్ లో ఓ నిమిషంలో యెన్నో నిమిషాలను లెక్కిస్తూ వాలు కుర్చీలో పడుకున్నాడు.
    అటుగా మంచం. "మల్లెలతో నిండిన దుప్పటి. గోడలకి చిత్రలేఖనాలు. అతనికి చిత్రలేఖనం అంతగా తెలియదు. అభిరుచి లాంటిది వుంది. వాటిని చూస్తున్నాడు గానీ అతడి కళ్ళలో స్వప్నరాగలీనే కనిపిస్తోంది. ప్రతి సవ్వడీ ఆమె అడుగుల సవ్వడిగా భ్రమ.
    అంతలో__
    నావలా కదులాడే సరోవరంలా సవ్వడి లేకుండా ఆ పాదాలు లోపలికి__
    ఊదారంగు ఆకులూ పూలూ తీగలూ వున్న తెల్లచీర. తెల్ల బ్లౌజు పొట్టి చేతులు, పెద్ద మెడ. తలంటి ఆరవిడిచిన జుట్టు. నుదుటా పాపిట మొదట్లోనూ కుంకుమ. కళ్ళకి కాటుక. వొంటిన నగలే లేవు. రెండు చేతులకీ రెండు సన్నటి ఊదారంగు గాజులు. నల్లపూసల సూత్రం. చందనం పరిమళం.
    చూడగానే అనంత్ రెడ్డి గుండె జల తరంగిణిలా చలించింది.
    అతను లేవబోతే __ పల్చని నిశ్శబ్దపు నవ్వుతో తడిసిన కళ్ళతో పెదాలతో వద్దన్నట్లు సూచించి; కుర్చీ వెనక ప్రక్కకి వెళ్ళి వంగి అతని నుదుటిమీద పెదవులు అద్దింది__ తమలపాకుమీద మందారపువ్వు రాలినట్లు.
    అతని చెయ్యి అందుకుని పైకి కదిపింది. లేచాడు. అతని చేతికి తన చేతివేళ్ళు కలిపి అవతలి గుమ్మంలోంచి నడిచింది, గుమ్మం అవతల పచ్చిక. పచ్చికకి ఇరువైపులా మొక్కలు చెట్లు__మదుగుగా.
    "అన్నీ మనింట్లోనే ఐతే హరనాధ బాబాయికి కోపం రాదూ, తన కాటేజీ మర్చిపోయామని" అంది, క్రితంరోజు మాటల సందర్భంలో. గ్రహించి ఇక్కడ యేర్పాటు చేశారు. అటు ప్రక్కన బంగళాలో వాళ్ళమ్మా, పిన్ని బాబాయి తదితరులు. వాళ్ళ పిన్ని నగలతో ముస్తాబు చెయ్యబోతే, "లోహపు వస్తువులు గుచ్చుకోవా పిన్నీ!" అంది స్వప్నరాగలీన. "మీ బాబాయి లక్షణాలు అబ్బినట్లున్నాయ్!" అని పకపకా నవ్వింది ఆమె.
    పచ్చికలో కూర్చున్నారు.
    అనంత్ రెడ్డిని కన్నార్పకుండా చూస్తూ "మిమ్మల్నీ బట్టల్లో చూడలేదెప్పుడూ. అచ్చూ శోభనం పెళ్ళికొడుకులా వున్నారు! మనసారా చూస్తూ వుండిపోయానంటే మనసు కొంటెతనానికి పోతుందేమోననిపిస్తోంది" అంది.
    "కానీ నువ్వు శోభనపు పెళ్ళికూతురిలాగా లేవు. నిత్య శోభనపు పెళ్ళికూతురిలాగా వున్నావు ఎప్పటిలాగా__ఆజన్మాంతం యిట్లాగే వుండేలాగా" అన్నాడు అనంత్ రెడ్డి.
    చిన్నగా నవ్వింది. అదే సవ్వడి. సెలయేటి జాలులో ఇసకలో కొట్టుకున్న గులకరాళ్ళ సవ్వడి_ పచ్చికమీదికి, వెన్నెట్లోకి, చెట్లలోకి, అతని గుండెలోకి.
    "స్వప్నా"
    "ముందుకి జరిగాడు ఆమె ప్రక్కకి.
    ఆమె చేతిని అందుకుని అరిచేతిలోనూ వేళ్ళమీదా పెదాలు అద్దాడు. రెండో చెయ్యి, వెన్నెల్లో మెరుస్తున్న ఆమె పాదాలమీద వేశాడు. కాళ్ళు పైకి లాక్కుంది. కదలికకి చీర జరిగి__తెల్లని సాటిన్ లోపావడా పైకి జారి__పిక్కలు, పసిమిరంగు. నూగారులాంటి వెంట్రుకలు.
    "ఈరోజు వెనక యెన్ని రోజుల నిరీక్షణో కదా!" అంది.
    "యెన్నో రోజులు మాత్రమే కాదు. యెన్నో సముద్రాల అవతలి నిరీక్షణ ఒక్కోసారి అనిపించేది. రీసెర్చి వదిలేసి అమాంతం రావాలని" అన్నాడు.
    "మీ స్థితి నయం. నాకు రీసెర్చిలో మునిగిపోవటమూ లేదు. అనుభవం కోసం పరితపించే అనుభూతితో__"
    "రీసెర్చి పూర్తిచెయ్యవా?" అన్నాడు.
    "చెయ్యాలనిపిస్తే ఈపాటికి ఐపోయేదే. ఆసక్తి లేదు" అంది.
    ఆమె కళ్ళు __ మధ్యలో మంచురాలిన కాటుక పువ్వుల్లా, చల్లగా తేటగా స్వచ్చంగా మత్తుగా.
    ఇద్దరూ పచ్చిక మీదకి వొరిగి పడుకున్నారు ప్రక్కప్రక్కన.
    అతని చేతిమీద చేతివేళ్ళతో స్పర్శిస్తోంది. రెండో చేతివేళ్ళు పచ్చని పచ్చికని నిమురుతున్నాయి.
    కనురెప్పలు వాల్చింది. రెప్పల క్రింద నీలం కొండలు, లోయలు, మంచు పర్వత శిఖరాలు, సముద్ర కెరటాలు, నీలం జ్వాలలు.
    "అనంత్" అంది.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.